అప్పుల ఊబిలో కూరుకు పోకుండా సన్నచిన్న కారు రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిందే.

Nov 1, 2024 - 18:39
Nov 11, 2024 - 20:48
 0  4
అప్పుల ఊబిలో కూరుకు పోకుండా సన్నచిన్న కారు రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిందే.

 రైతులు స్వావలంబన సాధించేదిగా ఉండాలి కానీ  ఎదురుచూసి నిరసనకు దిగేలా రెచ్చగొట్టడం సరైనది కాదు

 భూమిలేని నిరుపేదల కడగండ్లు  దృష్టిలో ఉంచుకొని  రైతు విధానాన్ని,  కార్మిక పాలసీని ప్రకటించాలి.

---వడ్డేపల్లి మల్లేశం

దేశానికి తిండి పెట్టే రైతన్న అప్పుల ఊబిలో కూరుకుపోవడం కానీ  ఆత్మహత్యలకు  పాల్పడడం కానీ వాంఛనీయం కాదు.  దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుద న్నుగా నిలుస్తున్న  వ్యవసాయ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తున్న రైతాంగంకు  స్వాతంత్రం సాధించి 77 సంవత్సరాలు ముగిసినప్పటికీ జాతీయస్థాయిలోనూ రాష్ట్రాల స్థాయిలోనూ స్పష్టమైన జాతీయ విధానం, భూమిలేని కార్మికులకు సంబంధించినటువంటి  పాలసీ  లేకపోవడం విచారకరం.  దానివల్ల రైతులు  పెట్టుబడి కోసం  ప్రభుత్వ ప్రైవేటు అప్పుల పైన ఆధార పడాల్సిన రావడం  అతివృష్టి అనావృష్టి వంటి కారణాలు ఏమైతేనేమి  ఉత్పత్తి  తగ్గిపోవడం  గిట్టుబాటు ధర లేకపోవడం  ఇతరత్రా మార్కెట్ మాయాజాలం వలన  దేశ ప్రజలందరికీ అన్నం పెడుతున్న రైతు మాత్రం  ఆ వేదనతో  చిక్కిపోవడం  దేశ ప్రజలకు ఒక సవాల్ వంటిది.  పాలకవర్గాలు  అవకాశవాద రాజకీయాల కారణంగా  సమర్ధించుకునే ప్రయత్నం చేస్తాయి కానీ  ఈ దేశంలో  రైతు సంక్షేమాన్ని  అభివృద్ధిని కోరే పౌర సమాజం గా  మనము స్పందించకపోతే ఎలా?  అంతేకాదు పాలకుల పైన కూడా పౌర సమాజం నుండి అనేక  సవాళ్లు విసరాల్సిన అవసరం కూడా ఉన్నది.  అయితే  రైతులకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేసే క్రమంలోపల కేంద్ర ప్రభుత్వం 2014 ముందు  రుణమాఫీ చేసినట్టు  అలాగే 2014 నుండి 23 మధ్యకాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం  లక్ష లోపు రుణమాఫీకి  కొంత చొరవ చూపినప్పటికీ అర్ధాంతరంగానే ఆగిపోయిన విషయం గమనించవచ్చు.  ఇక దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలలో అంత పెద్దగా  ఈ రకమైనటువంటి మాఫీ ప్రక్రియ కొనసాగలేదు.  అదే సందర్భంలో రైతులకు పెట్టుబడి సాయంగా  అందించడానికి సంబంధించిన కృషి లో  తెలంగాణ రాష్ట్రం  బి ఆర్ ఎస్ హయాంలో రైతుబందు పేరుతో  తీసుకున్నటువంటి అసంబద్ధమైన నిర్ణయాలు,  రైతులను ఎంపిక చేసిన విధానం,  భూస్వాములకు ప్రజాధనాన్ని దోచిపెట్టిన తీరు  ఆక్షేపణీయంగా ఉన్నది.  గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ బోనస్ ఇవ్వడంలో కానీ  పెట్టుబడి సాయం  నిజమైన రైతులకు అందించడంలో కానీ  పురుగు మందులు విత్తనాలు ఎరువులు  సకాలంలో ఇస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు అది పాలకుల యొక్క  సామాజిక బాధ్యత కూడా. కానీ  ఒక శాస్త్రీయ పద్ధతిని ఆచరించకుండా  ఒక్క రైతు వర్గానికే నిరంతరముఏదో రకంగా మాఫీలు చేయడం సాయం చేయడం ఆదుకోవడం వంటి  పేరుతో కొనసాగుతున్నటువంటి పథకాలు  మిగతా భూమి అసలే లేని,  రికార్డితే కాని డొక్కాడని కూలి వ్యవస్థ పైన  పెద్ద ప్రభావాన్ని కలిగిస్తున్న ఈ విషయంలో పాలకవర్గాలు  జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది.  అన్ని వర్గాలకు ప్రజాధనాన్ని సమానంగా పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వాలు భుజానికి ఎత్తుకున్నప్పుడు  ఏ ప్రభుత్వం కూడా బదినాము కాదు కానీ  నిరంతరం ఒకే వర్గాన్ని గురించి ఆలోచించినప్పుడే  మిగతా వర్గాలతో పెద్ద చెక్కు వస్తుంది .

 టిఆర్ఎస్ హయాంలో రైతుబంధు--  లోపాలు

  పంట పండించే రైతన్నలకు ఏదో రకంగా  పెట్టుబడి సాయాన్ని కల్పించాలని మంచి ఆశయంతో  టిఆర్ఎస్ ప్రభుత్వం 2018 మే 10వ తేదీన హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని  ఇందిరానగర్ శాలపల్లి గ్రామంలో  రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది.  ఇందులో  ఎన్ని ఎకరాల వరకు పరిమితి అంటూ లేకపోవడం,  తో పాటు బీడు భూముల ప్రస్తావన కూడా ఆలోచించని కారణంగా  వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నటువంటి రైతులందరికీ  అవి పండించే భూముల కాదా అనే ప్రమేయం లేకుండా బీడు భూములు, అడవులు, గు ట్టలు, ఇళ్ల స్థలాలకు కూడా  గత ప్రభుత్వం చెల్లించిన కారణంగా సుమారు  12 ధ ఫాలుగా ఇచ్చినటువంటి 70 వేల కోట్ల రూపాయలలో  30 వేల కోట్ల రూపాయలు  భూస్వాములు, పండించని  భూములకే చెల్లించినట్లుగా  రూడీ కావడం కొన్నిచోట్ల  ఇళ్ల స్థలాలకు రైతుబంధు ఇచ్చిన అంశం పైన కోర్టులో కేసులు వేయడం కూడా జరిగింది.  అంత అసంబద్ధమైన శాస్త్రీయత లేని  అవగాహన లేని  పంట పండించని భూములకు కూడా ఇచ్చిన ప్రభుత్వం  కనీసం కౌలుకు చేసుకొని బుక్కడు మెతుకులు తినడానికి కష్టపడినటువంటి  రైతును మాత్రం మరిచిపోయిన విషయం కూడా గుర్తించాలి . రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ చెల్లించే విధంగా ఏర్పాట్లు ఉంటే నిజమైన రైతుకు లాభం దక్కే అవకాశం ఉంటుంది కానీ  పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా  రైతుబంధును అమలు చేయడంతో భూస్వామి జేబుల్లోకి ఇతర దేశాల్లో  ఉన్న పెద్ద రైతులకు కష్టపడకుండానే  లక్షలాది రూపాలు  అందడంలో ఎంత అసంబద్ధత అనాగరికత ఉన్నదొ అర్థం చేసుకోవచ్చు.   నవంబర్ 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతుబంధుకు బదులుగా రైతు భరోసా పేరుతో  పదివేలకు బదులుగా ఎకరానికి 12,,000 చెల్లిస్తామని  భూమిలేని నిరుపేదలకు కూడా 12,000 రూపాయలను  అందిస్తామని  అలాగే కొంత పరిమిత భూమి గల వాళ్లకు మాత్రమే ఈ  పథకాన్ని వర్తింప చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ  ఈ వర్షాకాలపు పంట  కు రైతుబంధు ఇవ్వలేదని టిఆర్ఎస్ శ్రేణులు  రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 2o24, అక్టోబర్20 రోజున  నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయంపై ఆలోచించాలి.
          ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు:-
******
  టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 30 వేల కోట్ల రూపాయలు   రైతుబంధు పేరుతో దుర్వినియోగమైనట్టు తెలుస్తూ ఉంటే  ఇకముందు ఆ రకంగా జరగకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. గత ప్రభుత్వం అమలు చేసినంత మాత్రాన  రైతుబంధును కొనసాగించాలని  కా కుండా దానికి సంబంధించి  ఎప్పుడూ ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వావలoబన సాధించే విధంగా రైతు విధానాన్ని ప్రకటించడం కూడా ప్రభుత్వానికి చాలా అవసరం.  ఇదే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం జూలై 2,2024న  నలుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే . ప్రస్తుతం అమలవుతున్నటువంటి విధానం  ఏ రకంగా పరిమితం చేయాలి?  భవిష్యత్తులో ఏ రకంగా రైతు భరోసా అమలు చేయాలి.?  అనే సిఫార్సుల కోసం కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ 15 రోజుల   వ్యవధి దాటి నాలుగు మాసాలైనా ఇప్పటికీ నివేదిక సమర్పించకపోవడం  వలన వర్షాకాల పంటకు రైతుబంధు రావడంలేదని ఆరోపణ పైన టిఆర్ఎస్ శ్రేణులు  నిరసనగలం విప్పిన మాట నిజమే. అయితే   ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచడంతోపాటు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి, నిధుల దూర్వి నియోగం  పైన ప్రజల మధ్య చర్చ   చేస్తే ప్రజల మద్దతు కూడా లభించే అవకాశం ఉంటుంది. అంతేకాదు  రైతు భరోసా పేరు మీద కూడా  సాయాన్ని ఇచ్చినప్పటికీ  అది పనిచేయని రైతుల జేబుల్లోకి వెళుతుండడం  బాధాకరం కనుక  పండించిన పంటకు గిట్టుబాటు ధర బోనస్ లాంటివి ఇవ్వడం ద్వారా నిజమైన రైతులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచన ప్రభుత్వానికి రావాలి.  ఇదే అంశాన్ని ప్రజల ముందు ఉంచడం  ద్వారా ప్రజల మద్దతును కూడా కట్టుకోవడమే ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏకైక మార్గం.  అంతేకానీ నిరంతరం రైతులకు సాయం పేరుతో  పథకాలను అమలు చేస్తూ ఉంటే పేద వర్గాలు,  భూమిలేని నిరుపేదలు, కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు,  వీధి వ్యాపారుల లాంటి  అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వాళ్లు కూడా  తం సంగతేమిటని ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుంది.  రైతుబంధు లేదా రైతు భరోసా పేరున  నిరంతరం సాయం చేయడం కాకుండా స్వావలంబ న సాధించే విధంగా రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే క్రియాశీలక శాశ్వత చర్యలకు శ్రీకారం చుట్టిన నాడు   రైతులు కూడా ఆధారపడకుండా  జీవించడానికి అవకాశం ఉంటుంది.  కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా రైతు విధానాలను పటిష్టంగా  రూపొందించినప్పుడు  ఎవరికి అభ్యంతరం ఉండదు,  అందరికీ తిండి పట్టే రైతన్న హాయిగా నిశ్చింతగా  ఉండే   పరిస్థితులు ఏర్పడతాయి.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333