3 కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్‌’గా హవాలా! 

May 22, 2024 - 20:21
 0  2
3 కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్‌’గా హవాలా! 

 లిక్కర్‌ కేసు అనుబంధ చార్జిషీట్‌లో ఈడీ 

 మరో నలుగురి ప్రమేయంపై వాదనలు 

 అనుబంధ చార్జిషీట్‌ పరిగణనపై తీర్పును 29కి రిజర్వు చేసిన కోర్టు 

 కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణ 24న 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మరో నలుగురి ప్రమేయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలా? లేదా? అనే అంశంపై తీర్పును ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 29కి రిజర్వ్‌ చేసింది. కవితతో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున గోవాలో ప్రచారం నిర్వహించిన ముగ్గురు ఉద్యోగులు (చారియట్‌ ప్రొడక్షన్స్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌) దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, చరణ్‌ప్రీత్‌ సింగ్‌, ఇండియా ఎహెడ్‌ న్యూస్‌ ఛానల్‌ మాజీ ఉద్యోగి అరవింద్‌ సింగ్‌పై అభియోగాలు మోపుతూ ఈడీ ఈ నెల 10న సుమారు 200 పేజీలతో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. దానిని పరిగణనలోకి తీసుకునే అంశంపై మంగళవారం విచారణ జరిగింది. కవితతో పాటు మిగిలిన నలుగురి ప్రమేయంపై ఈడీ బలమైన వాదనలు వినిపించింది. కాల్‌ డేటాతో పాటు కాల్‌ రికార్డులను కూడా ేసకరించామని పేర్కొంది. హవాలా రూపంలో డబ్బులు మళ్లించేందుకు కరెన్సీ నోట్ల సీరియల్‌ నంబర్లను టోకెన్‌గా వాడారని ఈడీ ఆరోపించింది. ‘ప్రిన్స్‌ కుమార్‌ చారియట్‌ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశారు. రూ.100 కోట్ల అక్రమ మళ్లింపులో ఆయన పాత్ర స్పష్టంగా ఉంది. హవాలా ఆపరేటర్‌ కాంతికుమార్‌ ద్వారా మూడు దశల్లో రూ.16 లక్షలు ప్రిన్స్‌ కుమార్‌కు అందాయి. అందులో మూడు కరెన్సీ నోట్ల సీరియల్‌ నంబర్లను టోకెన్‌ నంబర్‌గా ఉపయోగించి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నారు. మరో నిందితుడు అరవింద్‌ సింగ్‌ గోవాకు డబ్బులు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇలా అందరి పాత్రపై బలమైన సాక్ష్యాలు ేసకరించామ’ంటూ ఈడీ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎన్‌కే మట్ట, న్యాయవాది జోహెబ్‌ హుస్సేన్‌ కోర్టు ముందు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును వాయిదా వేశారు. కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కేసులోనే సీఎం కేజ్రీవాల్‌పైనా ఈడీ అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 28న రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333