తడిసిన ధాన్యం కొనేదెప్పుడు ?
సీఎం చెప్పినా ముందుకు సాగని కాంటా.. తడిసిన ధాన్యం కొనే దిక్కులేదు!
- అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యం
- చాలా ప్రాంతాల్లో కొనుగోలు కానీ ధాన్యం
- కొనుగోలు చేసిన చోట మిల్లర్ల కొర్రీలు
- అకాల వర్షాలతో రైతులు ఆగమాగం
- తడిసిన ధాన్యంతో అన్నదాతల ఆందోళన
- మంత్రులు, అధికారులు పోలింగ్‌లో నిమగ్నం
- రైతులను పట్టించుకునే నాథుడే కరువు
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. మళ్లీ ఆరబెట్టి తీసుకురావాలని చెప్తున్నారు. ఎక్కడో ఒక చోట రైతుల ఒత్తిడి తట్టుకోలేక కొనుగోలు చేస్తే.. ఆ ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. ఈ తడిసిన ధాన్యం తామేం చేసుకుంటామని, తిరిగి బియ్యం ఏ విధంగా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మాటకే దిక్కులేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అకాల వర్షాలు .. ప్రభుత్వ నిర్లక్ష్యం !
ఓవైపు అకాల వర్షాలు రైతులపై పగబడితే.. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారికి మరింత నష్టం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండాముంచాయి. చేతికొచ్చిన మిగిలిన పంటతోనైనా పెట్టుబడి వస్తుందనుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి నిరాశే ఎదురవుతున్నది. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల కష్టాలను, నష్టాలను మరింత పెంచుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రంలోకి ధాన్యం తీసుకొచ్చి వారం పది రోజులవుతున్నా.. కాంట పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓసారి ధాన్యం తడిసిందని, మరోసారి ధాన్యం ఎండలేదని, ఇంకోసారి తాలు ఉందని ఇలా ఎప్పటికప్పుడు సాకులు చెబుతూ వాయిదాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలు కూడా రైతుల నష్టాన్ని మరింత పెంచాయి. అధికారులంతా పోలింగ్‌లో నిమగ్నంకావడంతో కొనుగోళ్లు మరింత ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
2వేల కోట్ల బకాయిలు ఎప్పుడో ?
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం… రైతులకు డబ్బులు చెల్లింపుల్లోనూ ఇదే తరహా నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 26 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి రైతులకు సుమారు రూ. 5700 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా రూ. 3700 కోట్ల వరకు చెల్లించినట్టు తెలిసింది. అంటే ఇంకా రైతులకు రూ. 2వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఆలస్యంగా ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం అమ్ముకున్న డబ్బులు కూడా ఆలస్యంగా ఇస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం విక్రయించిన వారం పది రోజులకు కూడా డబ్బులు పడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.