ప్రజల వద్దకే పాలన, ప్రజలే కేంద్రం, ప్రజలే చరిత్ర నిర్మాతలు అనే మాటలు ప్రజల కడుపు ఏనాడు నింప లేదు

Mar 30, 2024 - 23:19
 0  2

ప్రజల వద్దకే పాలన, ప్రజలే కేంద్రం, ప్రజలే  చరిత్ర నిర్మాతలు  అనే  మాటలు ప్రజల కడుపు ఏనాడు నింప లేదు .* అయితే  "ప్రజలే గెల వాలి" అన్న   బారాస అధినేత  మాటలను ప్రజలు ఆ పార్టీని ఓడించి  నిజం చేశారేమో !* లోతుగా ఆలోచిస్తే  పాలకులతో ప్రజలే వంచించబడ్డ సందర్భాలే అనేకం................*  అది విచారకరం!  *

----వడ్డేపల్లి మల్లేశం

పూర్వకాలపు రాజ్యాలకైనా ప్రస్తుత దేశాల కైనా  నిర్దేశిత భూ సరిహద్దు, పాలకులు ఎంత ముఖ్యమో అంతకు మించిన స్థాయిలో  ప్రజలు ముఖ్యమని   పాలకులు గుర్తించిన రోజు  ప్రజలకు మేలు జరుగుతుంది . ఆ పాలనలో ప్రజలు ప్రభువులుగా  యజమానులుగా  గుర్తించబడితే పాలకులు సేవకులు   గా  అంగీకరించిన రోజున   మాత్రమే ప్రజలు చరిత్ర నిర్మాతలు అవుతారు.  ఇప్పటికీ  రచనల్లోనూ అక్కడక్కడ రాజకీయ పార్టీలు మాత్రమే ప్రజలను ఆకాశానికి ఎత్తుతూ  ప్రజలే కీలకమని  ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగాలని చెబుతున్నప్పటికీ
ఆచరణలో అమలు కావడం లేదు. ఇటీవల కాలంలో గమనిస్తే పాలకులు నిరంతరము  ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రజలు గెలవాలి అని నినదించడం కొత్త రివాజ్ గా మారిపోయింది . 2023   చివరిలో జరిగిన  తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యంగా  టిఆర్ఎస్ అధినేత  కెసిఆర్ తరచుగా ప్రజలు గెలవాలి  అని ఇచ్చిన పిలుపు  కొత్త రకం నిర్ణయానికి  సూచికగా భావించవచ్చు . అవును ఎన్నికల్లో ప్రజలు  టిఆర్ఎస్ పట్ల అసహనము, ఆగ్రహము, ఆవేశం, అసంతృప్తితో ఉన్న కారణంగా  ప్రభుత్వ నిర్ణయాలను ధిక్కరించి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి  ఓడించినారు." ఇక్కడ మాత్రం నిజంగా  ప్రజలు గెలిచినట్లే లెక్క" .
      ప్రజల ప్రస్తావన వచ్చిన పలు సందర్భాలు:-
************
  కవు లు రచయితలు కళాకారులు మేధావులు  రాజకీయ నాయకులు పాలకులు అధికారులు  అనేక సందర్భాలలో  సామాన్య ప్రజానీకాన్ని ప్రస్తావించకుండా  ఉండలేకపోవడాన్ని బట్టి  అవునన్నా కాదన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలే గీటురాయి అని చెప్పక తప్పదు. అయితే అదే  స్థాయిలో ప్రజలు గుర్తించబడకపోవడం, గౌరవించబడకపోవడం,  పాలకులు పెట్టుబడిదారులు  ఆధిపత్య వర్గాలతో పీడించబడడాన్ని కనుక అర్థం చేసుకుంటే వంచనకు గురైన  సందర్భాలే ఎక్కువ అని చెప్పక తప్పదు.
ప్రజల గురించి పలువురు ప్రస్తావించిన కొన్ని సందర్భాలు  వాటి కొనసాగింపు.....  
--ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజా చరిత్రను  వంచిస్తే ప్రజలు పాలకుల చరిత్రను తిరగరాస్తారు అని విప్లవోద్యమంతో పాటు అనేక మంది మేధావులు రచయితలు పలు   రాజకీయ పార్టీలను పాలకులకు హెచ్చరించిన  సందర్భాలను చూడవచ్చు.  నిజంగా ప్రజలు చరిత్ర నిర్మాతలే కానీ ఆ చరిత్రను  గుర్తించబడకుండా  తిరగరాసే ధోరణి పెట్టుబడిదారీ వర్గానికి ఉంటుంది.
--  ప్రజలు ఉత్పత్తిలో భాగస్వాములు కావడంతో పాటు ప్రజాస్వామ్యం విజయవంతం కావడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు.  అయితే ప్రజలను  ఓటర్లుగా మాత్రమే వాడుకుంటున్న రాజకీయ వ్యవస్థ  ప్రజాస్వామ్య  పరిపక్వతకు  ప్రజలు మూలమని నమ్మకపోగా  పాలకులుగా తమ చరిత్రని తిరగరాసుకోవడం  అవివేకమే కాదు ప్రజలను వంచించడం కూడా!  సాధారణ ప్రజలు ఉత్పత్తిలో భాగస్వాములు కావడంతో పాటు ప్రజా పోరాటాలలో లీనమై  ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ  విప్లవోద్యమాలలో  త్యాగ దనులుగా మిగిలిన సందర్భాలు కూడా అనేకం . వారితో పోల్చుకున్నప్పుడు  విద్యావంతులు ఉద్యోగులు పెట్టుబడిదారులు రాజకీయ నాయకులు  స్వార్థ చింతన తోని  వ్యక్తిగత లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసిన వారు ఎక్కువ  నిజం కాదా!
--మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ వక్కానిస్తే  సంఘ జీవి అనే నెపంతో   మార్గదర్శకాలు, ఆదేశాలు, నిబంధనలను రూపొందించి ప్రజలను చట్ర 0లో బిగించి  ప్రశ్నించి, ప్రతిఘటించి,  పాలకులను నియంత్రించకుండా చేయడం కోసం  కొత్త చట్టాలను తీసుకువచ్చి   విప్లవోద్యమాలపై  ఉక్కు పాదం మోపుతున్న పాలకవర్గాల తీరు " సంఘజీవి" అనే మహోన్నత భావనకు విఘాతం కలిగించడమే కదా !
భారతదేశంలో బలమైన కుటుంబ వ్యవస్థ ఉన్న కారణంగా  స్వార్థ చింతన, లోటుపాట్లు,  బలహీనతలు, సామాజిక రుగ్మతలు ఎన్ని ఉన్నప్పటికీ  ఆర్థిక వ్యవస్థ అంతో ఇంతో పరిపుష్టిగా ఉండడానికి  ఉమ్మడిగా  ఉత్పత్తి సేవారంగంలో క్రియాశీలక భూమిక సామాన్య ప్రజానీకం పోషించడమేనని  పాలకులు గుర్తిస్తే మంచిది  .కానీ ఇటీవల సర్వే ప్రకారం గా  1 శాతం ఉన్నటువంటి సంపన్న వర్గాల చేతిలో 40.1  శాతం సంపద పోగు పడిందంటే దానికి  బాధ్యత వహించవలసినది  నిరంతరం అక్రమాలు  నేరాలకు పాల్పడుతున్న  నేరపూరిత చరిత్ర కలిగినటువంటి చట్టసభల ప్రతినిధులు పాలకవర్గాలేనని గుర్తించడం అవసరం. అందుకే  లోక్సభలో 83 శాతం రాజ్యసభలో 36% మంది నేర స్వభావం కలిగిన వారు ఉన్నారంటే  వారిని ప్రజలు తరిమికొట్టవలసిన సమయం ఆసన్నమైనది. అదే సందర్భంలో  పాలకులు సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది.
---  బాధ్యతల  నిర్వహణ,  హేతుబద్ధమైన ఆలోచన,  సామూహిక దృక్పథం,  సామాజిక చింతన వంటి అంశాలలో ఇప్పటికీ కొంతమంది ప్రజలు  ముఖ్యంగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికీ చెందిన వాళ్లు  బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న తీరు బాధాకరం.  ఈ పరిస్థితులను ఉద్దేశించి ప్రముఖ అంబేద్కరిస్ట్, రచయిత, మేధావి  కత్తి పద్మారావు  "ఇప్పుడు దున్నాల్సింది భూములను మాత్రమే కాదు మనుషుల మెదళ్లను కూడా" అని  ప్రజల్లో రావలసిన మార్పును కూడా నొక్కి చెప్పడం అంటే  సామాజిక చింతన , చైతన్యము,  కర్తవ్యం నిర్వహణ వైపు ప్రజలను  అవగాహన చేయించడం అనే కదా అర్థం .
--ప్రజల వద్దకు పాలన,   పాలనకు ప్రజలే కేంద్రమని,  భారతదేశ0 వెలిగిపోతుందని, వికసించిపోతుందని గొప్పగా చెప్పుకునే పాలకవర్గాలు  ప్రజల వద్దకు కాదు తమ వద్దనే  అధికారాన్ని ఉంచుకొని నేరాలకు పాల్పడి ప్రజలకు ద్రోహం చేసి అవకాశాలను  ఆటంకపరచి  భూ కబ్జాలు ఆక్రమణలు  అక్రమ సంపాదనకు పాల్పడిన విషయాన్ని గమనిస్తే  ఆ నినాదాలు తీపి మాటలేనా !? బారాస ప్రభుత్వ హయాములో జరిగినటువంటి నేరాల చిట్టా ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటే  ఆ నేరస్తులను పట్టి, చట్టానికి అప్పగించి,  పరిహారాన్ని రాబట్టి, ప్రభుత్వ ఖాతాకు జమ చేయించాలంటే 10 ఏళ్ళు కూడా చాలదు. అంత నేరం జరిగిన మాట వాస్తవం కాదా అందుకే కదా ప్రజలు ఓడించి  అధికారానికి దూరం చేసి  ఎన్నికలకు దూరం వుండాలని ఆదేశించినది.
--  ప్రజల చేత ప్రజల కొరకు  ప్రజలతో ఏర్పడినటువంటి పాలన ప్రజాస్వామ్యం అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటే  ప్రజలు నిమిత్తమాత్రులుగా మిగిలిపోయి  ఓటు బ్యాంకుగా మాత్రమే ప్రజలను పాలకులు రాజకీయ పార్టీలు వాడుకొని  హక్కులను కాలరాచి  బానిసలుగా చేసి  పరిపాలనలో ఎక్కడ కూడా భాగస్వామ్యం లేకుండా చూసి  ప్రజలను నిలువునా ముంచినది రాజకీయ పార్టీలే అనేది భారతదేశంలో  జగమెరిగిన సత్యం.  రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం రాసి ఉన్న, ఆదేశిక సూత్రాలలో  సంపద పోగు పడకూడదు కొద్దిమంది చేతుల్లో అని హెచ్చరించినా  సంపన్నుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంటే దారిద్రరేఖ దిగువన శాతం  మరి పెరుగుతుంటే  దీనికి బాధ్యులు ఎవరు ?
--- దేశంలో రూపొందిస్తున్నటువంటి పంచవర్ష ప్రణాళికలు వార్షిక బడ్జెట్ల  సందర్భంగా సామాన్య ప్రజలను ప్రాతిపదికగా తీసుకోవలసినది పోయి  90% ఉన్నటువంటి అట్టడుగు ఆదివాసి వెనుకబడిన వర్గాలను విస్మరించి  పెట్టుబడిదారుల కోసం మాత్రమే ప్రణాళికలు అమలు చేస్తుంటే  బడ్జెట్లో ప్రణాళికలు అంకెల గారడిగా మిగిలిపోయిన విషయం  మన అనుభవములోనిదే కదా!
       పాలకులు తమ వేతనాలను పెంచుకోవడానికి  అధికారము కలిగి చట్టసభల తీర్మానం మేరకు భారీగా పెంచుకొని  ప్రజల చెమటను  వేతనాల రూపంలో భారీగా మెక్కి  విలాసాల రూపంలో అనుభవిస్తూ ఉంటే  ఆరుగాలము కష్టపడి పండించిన పంటకు  గిట్టుబాటు కావాలని కోరిన నేరానికి  ఖమ్మం హుస్నాబాద్ లో రైతులకు బేడీలు  కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 13 మాసాలు సాగిన పోరాటంలో 750 మంది  తుపాకీ తూటాలకు బలి కావడం అంటే  ప్రజలు ఎక్కడ గెలిచినట్లు? ప్రజలకు జరిగింది మోసం, దగా, వంచన కాక మరేమిటి ? ఈ ప్రజా ఓటమిని  సవాల్ గా తీసుకోవాలి  బుద్ధి జీవులు మేధావులు విప్లవోద్యమాలలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు  చుక్కలు చూపించాలి.  దేశద్రోహ చట్టాన్ని ఈ దేశంలో రూపుమాపే అంతవరకు సామాన్య ప్రజలతో సహా అసా మాన్యు లు కూడా పోరుబాట పట్టాలి , ఎన్నికల్లో  ప్రజల డిమాండ్లకు  మద్దతు పలికిన రాజకీయ పార్టీలకే ఓటు వేసి  పట్టించుకోని రాజకీయ పార్టీలను మట్టికరించాలి.  విద్య వైద్యం సామాజిక న్యాయం  ప్రజల సమస్యలను పట్టించుకోని రాజకీయ పార్టీలకు  బుద్ధి చెప్పడానికి  వ్యతిరేక ఓటు ద్వారా తమ నిరసనను తెలపాలి.  ఏ రాజకీయ పార్టీకి కూడా ఓటు పడనప్పుడు  ప్రజలు  వ్యతిరేకించినట్లే కదా! అప్పటికైనా  రాజకీయ పార్టీలకు సోయి వస్తుందని ఆశిద్దాం!  అంబేద్కర్ ఆలోచనలో  ఓటు హక్కును ఉపయోగించుకుని యజమానులుగా, ప్రభువులుగా మారాలని  రాజకీయ పార్టీల నాయకులను ప్రజాప్రతినిధులను సేవకులుగా మార్చుకోవాలని చేసిన హెచ్చరిక  ప్రజలుగా ఓటర్లు వినియోగించుకోనంతవరకు  ప్రజలు ఓడిపోతూనే ఉంటారు.  కానీ అణచివేత  ప్రజా వ్యతిరేక విధానాలను నిరంతరం తి ప్పికొడుతూనే ఉండాలి.  ఏదో ఒక రాయి తగలక మానదు ఏనాడో పండు కింద పడక తప్పదు  .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333