ప్రజాధనాన్ని, సభా సమయాన్ని వృధా చేసే పార్టీలకు జరిమానా విధించాలి .*
ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షానికి కూడా ప్రజలే ప్రభువులని గౌరవం ఉండాలి .* చట్టసభల్లోని తప్పుడు విధానాలను ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకుంటే మంచిది .* వ్యక్తిగత విషయాలకు సభలు వేదిక కాకూడదు .*
-**********
--- వడ్డేపల్లి మల్లేశం
గత వారం రోజులుగా తెలంగాణ చట్టసభల బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జరుగుతున్న చర్చలు పరస్పర విమర్శలు గతంలో అధికారంలో కొనసాగిన ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం టిఆర్ఎస్ చేస్తున్న వాదనలు పొంతన లేనివి కా గా ప్రభుత్వాన్ని బెదిరించి హెచ్చరించి భయపెట్టే ధోరణితో కొనసాగడాన్ని ప్రజలు ప్రజాస్వామికవాదులు జీర్ణించుకోరు. అధికార పార్టీతో సహా ఏ రాజకీయ పార్టీ పైన భ్రమలు ఉండవలసిన అవసరం లేదు కానీ తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు కొనసాగినటువంటి ప్రభుత్వం తన హయాములో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా ప్రస్తుత ప్రభుత్వం వచ్చి రాగానే విమర్శల పర్వాన్ని కొనసాగించడం అర్ధరహితం . అదే సమయంలో ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం టిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు గారలు మీరిచ్చిన హామీలు ఏమైనాయి? గ్యారెంటీ ల సంగతి ఏమిటి? అని నిలదీసి అడగడం శుభపరిణామమే కానీ " ప్రశ్నించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి, హక్కులకై కలబడే ముందు బాధ్యతలు నిర్వహించాలి" అనే సూక్తులను దృష్టిలో ఉంచుకుంటే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరకపోగా అన్ని రకాల పథకాలలోనూ అవినీతి జరిగినట్లుగా వెలుగులోకి వస్తున్న సందర్భంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఏ పార్టీనీ అయినా నిలదీసి అడిగే అధికారం ప్రజలకు ఉంటుంది అని తెలుసుకుంటే మంచిది .ఆ కోణంలో ఆలోచించినప్పుడు టిఆర్ఎస్ పార్టీతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలు ప్రశ్నిస్తారని దీని అర్థం .తుడుపు గుడ్డలకు కూడా పనికిరాన టువంటి చీరలను బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అవి చేనేతవి కావు సిరిసిల్లవి అంతకు కావు అని సభలో చర్చ జరిగిన సందర్భం సూరతులో తూకం పై తెచ్చినటువంటి పాలిస్టర్ గుడ్డలని తెలిసిపోతున్న స ఏ రకంగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించినట్లు? తెలుసుకోవలసిన అవసరం ఉంది.అచీరలను కొన్నిచోట్ల కాలబెడితే మరికొన్ని చోట్ల పంతచెలచుట్టు కట్టినారంటే వాటి ప్రయోజనం అదేనా? అంతేకాదు గతంలో సరఫరా చేసినటువంటి చీరలకు గాను సిరిసిల్ల నేత కార్మికులకు 275 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బకాయి పడినట్లు తెలుస్తుంటే ఏ రకంగా వారి ప్రయోజనాలను టిఆర్ఎస్ కాపాడిందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది . ప్రశ్నిస్తాం, వెంటపడతాం , వేటాడుతాం అనే ధోరణిలో భయపెట్టే పద్ధతి ప్రతిపక్షాలకు తగదు. గమ్మత్తు ఏమిటంటే టిఆర్ఎస్ పార్టీ తరఫున ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేత చట్టసభలకు రాకపోవడం బాధ్యతను విస్మరించడమే కదా అని ప్రభుత్వంతోపాటు ప్రజాస్వామ్యవాదులు విమర్శిస్తున్న వేళ టిఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది . ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష నేతగా చట్టసభలో బాధ్యత నిర్వహించవలసినది పోయి విమర్శకు మాత్రం ఎగబడి చట్టసభలకు రాకపోవడం లోని ఔచిత్యం ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందే. గతంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాములో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి క్రియాశీలకoగా చ ట్టసభల్లో చర్చలో పాల్గొనే బదులు పాదయాత్ర పేరుతో ఐదు సంవత్సరాలు కాలం గడిపి తన బాధ్యతను విస్మరించిన విషయం మనందరికీ తెలుసు . తర్వాత అధికారంలోకి వచ్చినప్పటికీ ఇటీవల ఎన్నికల్లో ఓడిపోవడం వెనుక అనేక కథనాలు దాగి ఉన్నట్లు అవగాహన చేసుకోవలసి ఉంటుంది. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అడపాదడపా జరిగే చట్టసభలకు కూడా హాజరు కాకపోవడం ఏ రకంగా ప్రజలకు దోహదం చేస్తుందో ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. నేరస్తులకు తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు ఆలోచించి ప్రభుత్వం ప్రతిపక్షాల యొక్క పాత్రను సమయోచితంగా హెచ్చ్చరిస్తే కానీ మార్పురాదు.
అసెంబ్లీలో బిజెపి మౌనం ఎందుకోసం:-
********
బి ఆర్ ఎస్ అధికారంలో కొనసాగిన నాడు బిజెపి పార్టీ శ్రేణులు నాయకులు అనేక రకాలుగా అవమానానికి గురై దాడులకు బలైన విషయం తెలిసిందే. అంతేకాదు టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై అనేక రకాల ఆరోపణలు చేసిన సందర్భంలో ప్రత్యారూపణలు చేస్తూనే ప్రధానమంత్రి స్థాయిలో కూడా కెసిఆర్ ప్రభుత్వం యొక్క కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపంతో పాటు అనేక రకాల అవినీతిపైన విచారణ జరిపిస్తామని నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించినప్పటికీ ఏ లాంటి చర్యలు తీసుకోకుండానే ప్రభుత్వం మారింది . పలు సందర్భాలలో కేంద్రమంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐతో విచారణ జరిపిస్తామని ప్రకటనలు చేయడమే తప్ప కేంద్ర ప్రభుత్వం పక్షాన స్వయంగా గత రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం పైన రెండు పార్టీల మధ్యన అంతర్గత ఒప్పందం ఉన్నదని అనేకమంది విశ్లేషకులు రాజకీయ పార్టీల నాయకులు విమర్శించిన సందర్భం మనకు తెలిసినదే . అలాగే ప్రస్తుతం అసెంబ్లీ లోపల టిఆర్ఎస్ పక్షాన గత ప్రభుత్వ హయాములో జరిగినటువంటి విషయాల పైన చర్చ జరిగిన సందర్భంలో టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు, వాదనలు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు పైన ఎలాంటి స్పందన లేకుండా తమకు పట్టనట్లు ప్రధాన ప్రతిపక్షం చేసే ఆరోపణలు విమర్శలపైన దృష్టి సారించకపోవడంలోని ఔచిత్యం కూడా బోధపడడం లేదు. టిఆర్ఎస్ అధికారంలో ఉన్న నాడు అనేక రకాలైన విమర్శలు చేసినటువంటి బిజెపి కేంద్ర రాష్ట్ర నాయకులు శ్రేణులు ప్రస్తుతం చట్టసభలో జరుగుతున్న చర్చలో ప్రభుత్వ పక్షాన గత ప్రభుత్వం యొక్క లోటుపాట్లను అవినీతి కేసులను తప్పుడు విధానాలను ఎండగడుతున్న సందర్భంలో బిజెపి జోక్యం చేసుకోకపోవడం అంటే పరోక్షంగా brs ను సమర్థించినట్లేనా ?రాష్ట్ర ప్రజల ప్రయోజనాల రీత్యా చట్టసభలో తమ పాత్ర పోషించాలి కానీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడితే అన్ని రాజకీయ పార్టీలకు ప్రభువులు అయినటువంటి ప్రజలు కర్రుకాల్చి వాతపెడుతారని గుర్తిస్తే మంచిది. వ్యక్తిగత విమర్శలకు అవకాశమిస్తూ ప్రజల సమస్యల పైన దృష్టి సారించవలసిన సందర్భం.. మరొకవైపు బడ్జెట్ పైన చర్చ జరుగుతూ ద్రవ్య వినియోగ బిల్లు ఆమోదం పొందవలసిన తరుణంలో కూడా సబ్జెక్టును పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలకు పాకులాడుతున్నటువంటి రాజకీయ పార్టీల ముఖచిత్రాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు గమనిస్తున్నారని తెలుసుకోవడం అవసరం . ప్రభుత్వం తాము ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెబుతుంది, ప్రతిపక్ష బిఆర్ఎస్ నాయకులు కూడా ప్రజల కోసం ఎంతటికైనా తెగిస్తామని చెబుతున్నారు . అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు ప్రజలను పిచ్చి వాళ్లను చేస్తున్నారని అనుకోవాలా? ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ నిర్మాణాత్మక పాత్రను పోషిస్తూ ప్రభుత్వం యొక్క మంచి చెడులను బే రీజువేస్తూ ప్రజల ప్రయోజనాల రీత్యా ప్రభుత్వ గమనాన్ని పరిశీలించవలసి ఉంటుంది కానీ వ్యక్తిగత వాదనకు దిగితే ప్రయోజనం లేకపోగా ఇప్పటికే ఓటమిపాలైన ఆ పార్టీ ప్రజల్లో మరింత చులకన అవుతుందేమో! ఇక నిశ్శబ్దంగా తటస్థంగా కొనసాగుతున్నటువంటి బిజెపి పార్టీ నాయకులు శాసనసభ్యులు మౌనంగా ఉండడం కంటే ప్రభుత్వము తీసుకుంటున్న చర్యలు , కొనసాగుతున్నటువంటి పాలన , గత లోపాల పైన సుదీర్ఘంగా చర్చించి నిర్మాణాత్మక సూచనలు చేసి తన ఉనికిని కాపాడుకోవాలి కానీ బి ఆర్ ఎస్ నాయకులు ఘాటుగా మాట్లాడుతుంటే తదేకంగా చూస్తే తమ ఉనికి శూన్యం అవుతుందని తెలుసుకోవడం అవసరం . టిఆర్ఎస్ అధికారంలో కొనసాగిన నాడు చట్టసభల్లో సమయాన్ని మొత్తం అధికార పార్టీ తీసుకుంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వని సందర్భాలు అనేకం .అంతేకాదు ప్రశ్నించిన పాపానికి ,నిలదీసిన నేరానికి మార్షల్స్ తో బయటికి పంపిన సందర్భాలు కూడా లేవా ?ఆ సంప్రదాయానికి స్వస్తి పలికి ప్రజాస్వామ్య బద్ధంగా చర్చ జరగాలని ప్రస్తుతం ప్రభుత్వం ఆశిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజా సమస్యల పైన దృష్టి సారించి పరిష్కరించడానికి కృషి చేయడం అన్ని రాజకీయ పార్టీల యొక్క కీలక బాధ్యత . "చట్టసభల సమయాన్ని వృధాగా గడిపి, వ్యక్తిగత వాదనలకు దిగజారి,ప్రజాధనాన్ని వృదాచేసే ఏ రాజకీయ పార్టీ కైనా జరిమానా విధించాలి. అందుకు సంబంధించిన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం కూడా ఉన్నది. " ఇక ప్రజలే ప్రభువులని ప్రభుత్వంతో సహా అన్ని రాజకీయ పార్టీల సంబంధించినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు అంగీకరించి ప్రజలకు సేవకులుగా పనిచేస్తే ప్రజాస్వామ్యానికి నిజమైన నిర్వచనం ఇచ్చినట్లు అవుతుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ (చౌటపల్లి )