హామీలను అమలు చేయలేని బిజెపి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయడం ఎందుకు?
పార్టీ అంతర్గత విషయాన్ని ఎత్తిచూపడం అసంబంధం మాటలతో తన గోతిని తానే తవ్వుకోవడమే!
ప్రజా ఎజెండాను ప్రకటించి బిజెపి చిత్తశుద్ధిని చాటుకోవాలి.విమర్శల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పాఠం నేర్చుకోవాలి.
--- వడ్డేపల్లి మల్లేశం
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిజెపి ఒకవైపు టిఆర్ఎస్ మరొకవైపు నిందించడం, లేనిపోని అబాండాలు వేయడం, అబూత కల్పనలు విమర్శించడంతోనే సరిపోతే తమ కార్యాచరణ ఎప్పుడు ప్రకటిస్తారు? ఇప్పటికీ గత పదేళ్లుగా బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోగా పేదరికం ఆకలి చావులు ఆత్మహత్యలు ఉపాధి లేక ఆకృత్యాలు అరాచకాలు పీడనా దోపిడీ వంచనతో దేశం అతలాకుతలం అవుతుంటే ఆ అంశాలను ఒక్కనాడు అయినా ప్రస్తావించినారా?
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని పదేళ్లలో ఎన్ని కోట్లు కల్పించినారో చెప్పాల్సిన అవసరం ఉంది . రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని వాగ్దానం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టి 750 మంది రైతులను హత్య చేసి రైతు వ్యతిరేక చట్టాలతో రైతు జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది నిజం కాదా? ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి ప్రజల కొనుగోలు శక్తిని జీవన ప్రమాణాలను వంచించిన తీరు అందరికీ తెలిసిందే .ప్రజా సంపద కొద్ది మంది చేతుల్లో పోగుపడుతూ ఉంటే 16 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిదారులకు మాఫీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం పేదలకు ఒరగబెట్టింది ఏమిటి అని అడుగుతుంటే సమాధానం చెప్పాలి కదా? దాటవేసే ధోరణితో ఇతర ప్రభుత్వాలను రెచ్చగొట్టి కూల్చే ప్రయత్నం చేయడం సందర్భోచితము కాదు సరైనది కాదు. ఎవరైనా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని తెలుసుకోవడం రాజకీయ పార్టీల యొక్క నైజం కావాలి .
బిజెపి నాయకుల కొన్ని కామెంట్లు:-
రాష్ట్రంలో బిజెపి అత్యధిక సీటు గెలుచుకోబోతుందని కాంగ్రెస్ 14 సీట్లు గెలవకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రాజీనామా చేస్తారా అని బిజెపి పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు సవాలు విసరడం , కాంగ్రెస్ 14 సీట్లు గెలిస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని రెచ్చగొట్టడం ఒకవైపు కొనసాగుతూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రచారానికి ఎలా వెళ్తున్నారో ఆలోచించుకోవాలని ప్రశ్నించే ముందు కేంద్రం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది అనే విషయం తెలుసుకుంటే మంచిదే కదా! రాజనీతి అన్ని పార్టీలకు ఒకటే అయినప్పుడు తమ ఆచరణ గురించి సమీక్షించుకోకపోవడం లో ఔచిత్యం ఏమిటి ? ముఖ్యమంత్రిలో అభద్రత ఆందోళన కనబడుతున్నట్లు లేని ప్రకటనలు ప్రచారాలు చేసే అర్హత ఒక రాజకీయ పార్టీకి ఎక్కడిది ? బిజెపి పార్టీ ఆ వైపుగా కాకుండా ఈ ఎన్నికల్లో తన మేనిఫెస్టో ఏమిటి? ప్రజలకు గతంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసిన తీరు! ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న వాటిని ఎలా చేయగలమో? చెప్పాల్సిన అవసరం మరిచి ఎంతసేపు ఇతర పార్టీలను నిందిస్తే ప్రయోజనం లేకపోగా అసలు విషయం ఏమిటో ప్రజలు ఆలోచించి ఓటు వేస్తారు.
అంతేకాకుండా రేవంత్ రెడ్డికి ఆగస్టు మాసంలో సంక్షోభం ఏర్పడుతుందని ప్రభుత్వం కూలిపోతుందని ప్రకటనలు చేసే అధికారం బిజెపికి లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఒక ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక సూచనలు చేయాలి ప్రజల కోసం పనిచేయాలి తప్ప ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటే ఆ పార్టీకే నష్టం. ఇక ఇటీవల టిఆర్ఎస్ కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడో ఒకనాడు బిజెపిలోకి వెళ్లిపోతాడని పదే పదే ప్రచారం చేసిన మాదిరిగానే ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు సీఎం రేవంత్ రేపో మాపో బిజెపిలోకి రావచ్చు అని ప్రకటన చేయడం కాంగ్రెస్ నుంచి ముఖ్య నాయకులు బిజెపికి రావడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటనలు చేయడం కంటే తాను ఇచ్చినటువంటి పసుపు బోర్డు ఏమైంది? విభజన చట్టంలోని హామీల అమలు సంగతి ఏమిటి? దేశవ్యాప్తంగా ఇచ్చిన హామీలు అమలుకు ఎందుకు నోచుకోలేదు? పెట్టుబడిదారుల పక్షాన బిజెపి ప్రభుత్వం ఎందుకు మద్దతుగా వ్యవహరిస్తున్నది? అనే అంశాలకు ఇప్పటికీ సమాధానం వెతుక్కోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు లేదని అందుకే మహిళలు రైతులు కాంగ్రెస్కు ఓటు వేయర ని బిజెపి నిర్ణయం తీసుకుంటే ఎలా? అది ఆలోచించాల్సింది సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సింది ఉన్న ప్రభుత్వం యొక్క సమర్థత నిర్ణయించవలసింది ప్రజలు ఓటర్లు కదా ! అలా అని ఏదో మేలు చేసిందని ఓటు వేయడానికి అంత ఆత్రుతగా ఉన్నారని ఎలా నమ్ముతుంది బిజెపి. రాష్ట్రంలోకి సిబిఐ ప్రవేశాన్ని అడ్డుకునే ఆంక్షలను ఎత్తివేస్తే కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతి పైన విచారణ జరిపిస్తామని ప్రకటించడం మంచిది కానీ అనేక సందర్భాలలో ప్రధాని బిజెపి జాతీయ అధ్యక్షులు కూడా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపైన ప్రకటనలు చేసి అవినీతిని సహించమని హెచ్చరించినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు?
ఇక మరో నేత మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు గారు రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే అని మాట్లాడుతూ ఎన్ని గ్యారెంటీలను రాష్ట్రంలో అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేయడం తన పార్టీ దేశవ్యాప్తంగా గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసిందా అని తెలుసుకోకుండానే ప్రశ్నించడం ఇబ్బంది కరం కాదా! వివిధ సభలలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు అన్నీ తప్పుడు మాటలని స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్లు తప్పులు రాసిచ్చినారని అంచనాకు రావడానికి బిజెపి కున్న అధికారం ఏమిటి? ఎవరి పరిధిలో వాళ్లు మాట్లాడతారు నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. ఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు! ఏ ప్రభుత్వం పైన తొందర పెట్టి శాపనార్థాలతో ఇబ్బంది పెడుతున్నారు! అనే విషయాన్ని ప్రజలు ఆలోచిస్తారు కదా ! ప్రభుత్వం వచ్చి నాలుగు మాసాలు కాగానే ఐదేళ్లు పూర్తయినట్లుగా ఆందోళన పడుతూ ఎప్పుడు అమలు చేస్తారు ఎలా చేస్తారు అని లేనిపోని దందరగోళం సృష్టించడం టిఆర్ఎస్ బిజెపికి తగదు. ఆ గలబా గొడవ ఆ పార్టీలకే నష్టం చేకూరుస్తుంది ఎందుకంటే ప్రజలు అన్ని విషయాలను ఆలోచిస్తున్నారు, పరిశీలిస్తున్నారు కనుక. ఇక కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు రైతులకు 500 బోనస్ ఇవ్వలేని ప్రభుత్వం 30 వేల కోట్ల రుణమాఫీ ఎలా చేస్తుందని ప్రశ్నించడం అంటే ముందుకు పోకుండా వెనుకకు రాకుండా ప్రభుత్వాన్ని సంకెళ్లతో అడ్డుకోవడమేనా! ఇతర దేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తెచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని కేంద్రం ఇచ్చిన మాట ఏమైందో ఆలోచించకుండా రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నిస్తే సమాధానం దొరకదు. అది ఆ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి వదిలిపెట్టాలి కొంత సమయం ఇవ్వడం ద్వారా గత ప్రభుత్వాల యొక్క లొసుగులు లోపాలను పరిశీలించి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచన చేయాల్సింది పోయి శాపనార్థాలతో రెచ్చిపోతే ప్రజలు కూడా అదే స్థాయిలో రెచ్చిపోయినప్పుడు విష ఫలితాలు అనుభవించక తప్పదు ఏ రాజకీయ పార్టీ అయినా. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్ల కొనుగోలు కోసం కేంద్రం పైన చేసిన పోరాటం ఎవరికీ తెలియదు. కేంద్రం ఆరోజు పట్టించుకున్న పట్టించుకోకున్నా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయాన్ని గమనించవచ్చు. అదే మాదిరిగా ప్రస్తుతం కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి కూడా పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే మద్దతు ఇవ్వవలసినది పోయి కర్తవ్యాన్ని మరిచి ఇతర ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెడితే సమాధానం దొరకదు .ఆత్మ విమర్శతోనే సమస్యలు పరిష్కరించబడతాయి ఎవరి నిజాయితీ ఎంత? ఎవరి గడువు ఎంత ?ఎవరి యొక్క చిత్తశుద్ధి ఎంతవరకు అమలు జరిగింది? అనేది కాలం, గతం, పరిపాలన, ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పటికైనా బిజెపి పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించి ప్రజా సమస్యల మీద పోరాడితే తప్ప ప్రజాభిమానాన్ని చూర గొనలేరు. విమర్శలు పత్రికల్లో టీవీలో మీడియాలో వచ్చినంత మాత్రాన గెలుపు త మదే అనుకోవడం కళ్ళ . అది ప్రస్తుతం ఉన్న పరిస్థితిని, గత ప్రభుత్వాల యొక్క దోపిడీని, హామీలు నెరవేర్చని పాలకుల యొక్క వికృత చేష్టలను బట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు స్పష్టమైన వైఖరి ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది.కాంగ్రెస్ కూడా చిత్తశుద్ధిని కనబరచాలి.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)