మేనిఫెస్టోలు, సంకల్ప పత్రాలకు చట్టబద్ధత లేకపోతే ప్రయోజనం ఏమిటి?

వ్యక్తి పూజ ఆధారిత మేనిఫెస్టోలకు కాలం చెల్లింది.
ప్రజా సమస్యలు, గత పాలన, భవిష్యత్తు సవాళ్లు, ప్రజల దిమాండ్లు,
గీటురాయిగా ఉంటేనే ప్రజలు పరిశీలిస్తారు .
బిజెపి సంకల్ప పత్రం పైన ఒక పరిశీలన .
--- వడ్డేపల్లి మల్లేశం
రాజకీయ పార్టీలు ఏవైనా వస్తువులకు ఇచ్చే గ్యారెంటీ పదాన్ని ఎన్నికల హామీల సందర్భంగా వినియోగించి ప్రజా జీవితాన్ని ఛిద్రం చేస్తూ బానిసలుగా తయారు చేస్తున్నటువంటి మేనిఫెస్టోల విధానాన్ని ఇప్పటికైనా ప్రజలు తిరస్కరించాలి. అదే సందర్భంలో న్యాయవ్యవస్థ కూడా పరిశీలన చేయాలని దేశ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు . మరొక్క వైపు పార్టీలు ప్రకటిస్తున్నటువంటి సంకల్ప పత్రాలు లేదా మేనిఫెస్టోలకు చట్టబద్ధత లేదు తప్పనిసరిగా అమలు చేయాలని చట్టం లేదు కనుక తాత్కాలికంగా లబ్ధి పొంది ఎన్నికల తర్వాత విస్మరించడమే కాదు ప్రజలకు విద్రోహాన్ని తలపెడుతున్న ఈ మ్యానిఫెస్టోల విధానం పైన సుదీర్ఘమైన సమీక్ష చర్చ దేశవ్యాప్తంగా జరగాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇక పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తిని పూజించే పద్ధతిలో మేనిఫెస్టోలు తయారు చేయడం వ్యక్తి ఇమేజ్ పైన మాత్రమే ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చేసే ప్రయత్నం భవిష్యత్తులో చెల్లదు. ప్రజల డిమాండ్లు ఆకాంక్షలతో పాటు గత ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నిజం చేసినాయి?, ప్రజల జీవన ప్రమాణంలో వచ్చిన మార్పు ఏమిటి?, పేదరికం నిరుద్యోగము ఆకలి చావులు ఆత్మహత్యలు సామాజిక భద్రత వంటి అంశాలలో గతంలో సాధించిన పురోగతి ఏమిటి? అనే దాని పైన మాత్రమే ఆధారపడి ఓట్లు వేస్తారు . సరిగ్గా ఈనాడు దేశంలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పదేళ్ల బిజెపి ప్రభుత్వం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నది అంటే అతిశయోక్తి కాదు.
బిజెపి మేనిఫెస్టో కొన్ని పరిశీలన అంశాలు
ఏప్రిల్ 14 ఆదివారం నాడు బిజెపి పార్టీ విడుదల చేసినటువంటి ఎన్నికల ప్రణాళికకు " బిజెపి సంకల్ప పత్ర మోదీకి గ్యారెంటీ" అని ప్రదాని పేరును తగిలించి ప్రకటించినటువంటి ఎజెండా అంశాలు ఏ మేరకు ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తాయో ప్రతిఫలిస్తున్నాయో పరిశీలించాల్సిన అవసరం ఉంది . ఒక అంచనా ప్రకారంగా 2014లో బిజెపి విడుదల చేసిన మేనిఫెస్టోలో ఆనాడు ప్రధానిగా ఆశిస్తున్న మోడీ పేరు కేవలం 3 మాత్రమే ప్రస్తావించినట్లు తెలుస్తుంటే ప్రస్తుతం మేనిఫెస్టోలో ప్రధాని మోడీ పేరు 65 సార్ల ప్రస్తావనకు వచ్చినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రణాళికలోని ప్రజా అంశాలు, ప్రజల డిమాండ్ల కంటే నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి పేరును ఎక్కువగా వాడుకోవడానికి పార్టీ ప్రయత్నించినట్లుగా తెలుస్తూ ఉంటే గతంలో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలైనాయో తెలుసుకున్నప్పుడు మాత్రమే ప్రస్తుతం ఆ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపడానికి ఆస్కారం ఉంటుంది.
అలాంటి పరిస్థితుల్లో గత హామీలను ఒకసారి పరిశీలిస్తే 2019లో ఇచ్చిన హామీ ప్రకారంగా దేశంలోని రైతాంగానికి 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కనీస మద్దతు ధర కోసం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గత రెండేళ్ల క్రితం ఇటీవల కాలంలో కూడా ఢిల్లీ పరిసరాల్లో కేంద్రంపై పోరాడి సుమారు 750 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితులను అర్థం చేసుకుంటే ప్రధాన డిమాండ్ అయినటువంటి కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరినప్పటికీ ప్రభుత్వం మౌనంగా ఉండడాన్నీ బట్టి రైతాంగం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు . ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ కానీ, నల్లధనం రాబట్టి 15 లక్షలు ప్రతి ఖాతాలో వేస్తానని ఇచ్చిన హామీ కానీ నవ్వులాటగా మారిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక 2024 మేనిఫెస్టోలో ఉన్న అంశాలను కనుక పరిశీలించదల్చుకున్నప్పుడు ప్రజల యొక్క ప్రధాన డిమాండ్ అయినటువంటి పేదరికం నిరుద్యోగం ఆకలి చావులు ఆత్మహత్యల నిర్మూలన వంటి కార్యక్రమాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే ప్రైవేటుపరమైన విషయం తెలిసిందే వాటి పునరుద్ధరణకు హామీ లేకపోగా ధరల పెరుగుదలను తగ్గించడం కానీ ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే విషయంలో కానీ స్పష్టమైనటువంటి హామీ లేకపోవడం అత్యంత విచారకరం.
రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ, ఉద్యోగ వర్గాలు ఎదురుచూస్తున్న ఆదాయపన్ను రాయితీ, బీసీలకు రిజర్వేషన్ల పెంపు, జనగణన, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ , వివిధ రాష్ట్రాలలో జాతీయ ప్రాజెక్టుల హోదా ప్రకటించడంతోపాటు విభజన హామీలను అమలు చేసే విషయంలో ఎక్కడా కూడా స్పష్టమైనటువంటి హామీలు ఉన్న దాఖలా లేదు. ఇక మహిళలు, యువత ,రైతులు, పేదలు అనేక రకాలుగా చిత్రవధకు గురవుతూ ఉంటే వారి జీవన కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గి విద్యా వైద్యానికి తమ ఆదాయంలో భారీగా ఖర్చు చేస్తున్న కారణంగా పేదరికం రోజురోజుకు పెరిగిపోతూ ఉంటే "వికసిత భారతాన్ని" ఆవిష్కరిస్తామని ప్రకటిస్తున్నారు కానీ గత పదే ళ్లుగా పై నాలుగు రంగాలు పూర్తి నిర్లక్ష్యానికి గురైన విషయాన్ని మాత్రం బిజెపి ఎక్కడ అంగీకరించిన దాఖలా లేదు. ఉచితాలు తాయిలాలను వ్యతిరేకించినట్లు కనపడుతున్నటువంటి బిజెపి దేశంలోని 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యాన్ని మరో నాలుగు సంవత్సరాలు ఇస్తానని ప్రకటించడం అంటే గత పదేళ్లలో ఈ దేశంలో పేదరికం తగ్గకపోగా మరో నాలుగేళ్ల పాటు కొనసాగిస్తామంటే పేదల ను పేదలుగా కొనసాగించడమే అని అర్థమవుతున్నది. పైగా ఇటీవల ప్రధాని 25 కోట్ల మంది పేదరికం నుండి విముక్తి చెందినారు అని ప్రకటించినప్పటికీ అందుకు సంబంధించిన దాఖలాలు కానీ ఆయా రంగాలు బలోపేతం కావడం కానీ మనకు ఎక్కడా కనిపించడం లేదు.
దేశవ్యాప్తంగా ప్రజల నుండి వచ్చిన 15 లక్షల సూచనలతో ఈ మ్యానిఫెస్టోను రూపొందించినట్లుగా బిజెపి నాయకులూ ప్రకటించినప్పటికీ , మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించినప్పటికీ అందులో ఉన్నటువంటి అంశాలు ప్రజలను ప్రభావితం చేసేవిగా లేకపోవడం ప్రజలు ఆలోచించడానికి కారణమవుతున్నది . ఈ సందర్భంలో బిజెపి మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని విపక్షాల ప్రచార నేపథ్యంలో ప్రధాని మోదీ స్వయంగా అలాంటి ప్రస్తావనలేదని అంబేద్కర్ వచ్చిన స్వయంగా ఆ పని సాధ్యం కాదని ప్రకటించినప్పటికీ ఇటీవలి కాలంలో హామీల స్థానంలో గ్యారెంటీ అనే పదాన్ని కాంగ్రెస్ వాడుకలోనికి తెచ్చిన నేపథ్యంలో బిజెపి కూడా గ్యారెంటీ అనే పదాలను తన మేనిఫెస్టోలో వాడి ఆకర్షించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నది. కానీ మౌలిక రంగాలను అభివృద్ధి చేయడంతో పాటు విద్యా వైద్యం సామాజిక న్యాయాన్ని ఉచితంగా దేశ ప్రజలందరికీ అందిస్తామని ఎక్కడా ప్రకటించకపోవడం 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో సిగ్గుపడాల్సిన విషయం. ఇక స్వయంగా ప్రధాని సంకల్ప పత్రం పేరుతో ప్రకటించినప్పటికీ వీటిని కచ్చితంగా అమలు చేయడానికి సంబంధించి ఎటువంటి చట్టం ఈ దేశంలో లేదు అందుకే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సందర్భంలో తాయిలాలను గ్యారంటీలను ప్రకటించి ఆ తర్వాత మాట మార్చడం రివాజుగా మార్చుకున్న నేపథ్యంలో మేనిఫెస్టోలకు చట్టబద్ధతను కల్పించడం పైన దేశవ్యాప్త చర్చ జరగడంతో పాటు న్యాయ వ్యవస్థ కూడా సీరియస్ గా పరిశీలిస్తే కానీ రాజకీయ పార్టీల ఎత్తుగడలను అడ్డుకోలేము.
ముఖ్యంగా వ్యక్తి పేరున కొనసాగేటువంటి వ్యవస్థ కాని ప్రభుత్వం కానీ మన జాలదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏనాడో చేసిన హెచ్చరికను ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం ఆలోచించి ప్రజల ఆకాంక్షలు డిమాండ్లను కేంద్రంగా చేసుకొని మేనిఫెస్టో ప్రకటిస్తే బాగుంటుంది. ఇక ఇటీవల కాలంలో రామాలయము, మతము, ప్రజల విశ్వాసాలను ప్రధానంగా చేసుకొని ఎన్నికల్లో ప్రచారం చేయడం కూడా ప్రజలను ఆకర్షించని అంశంగా భావించవలసి ఉంటుంది. "ఆకలితో అలమటించే వాడికి కడుపు నింపడం, అవమాన భారంతో కృంగిపోయే వాడికి ఆత్మగౌరవాన్ని అందించడం మాత్రమే ఈ దేశ ప్రణాళికల్లో కీలక అంశాలు కావాలి". అవి లేనంతవరకు ఎన్ని మ్యానిఫెస్టోలు ఎంత హుందాగా ప్రదర్శించిన ప్రకటించిన ప్రయోజనం శూన్యం. "అవసరాన్ని బట్టి రాజ్య వ్యవస్థను మార్చుకునే క్రమంలో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు" అని అంబేద్కర్ చేసినటువంటి సూచన ఈ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఓటర్లు ప్రజలు తగిన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ దేశ భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయాల్సినటువంటి అవసరం సమయం ఆసన్నమైనది .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )