వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం గా నిర్వహిస్తే కఠిన చర్యలు కలెక్టర్.

జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- వైద్య సేవల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వైద్యాధికారులతో మాతృ మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ధరూర్ మండలం ఉప్పెర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంభవించిన మాతృ మరణాల పట్ల సంబంధిత వైద్యాధికాలతో సమీక్షించారు. ఉప్పెర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంభవించిన మాతృ మరణాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా జాగ్రత్తలు వహించాలని హెచ్చరించారు. ఉప్పెర వైద్యాధికారికి షోకాస్ నోటీస్ జారీ చేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు. మరణాలకు ముఖ్య కారణం రక్తహీనత, రవాణా సదుపాయం లేకపోవడం వల్ల సంభవించినట్లు డాక్టర్లు కలెక్టర్ కు తెలియజేశారు. హైరిస్క్ కేసులను నిర్లక్ష్యం వహించకుండా వెంటనే ఉన్నత ఆసుపత్రికి రెఫర్ చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఎంబిబిఎస్ డాక్టర్ల కొరత కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయని, ఇందుకు అవసరమైన వైద్య అధికారుల నియామకాలు వెంటనే చేపట్టాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర సమయాలలో అంబులెన్స్ లు అందుబాటులో ఉండే విధంగా చూడాలని, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి సమయానుకూలంగా వైద్య సలహాలతో పాటు మంచి పౌష్టికాహారం అందించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి సిద్ధప్ప, ప్రోగ్రాం ఆఫీసర్లు ప్రసన్న రాణి, గైనకాలజిస్ట్ దమయంతి, ప్రైవేటు ఆసుపత్రిలో ఘనకాలజిస్ట్ లు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.