ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పనులకు అవసరమైన ఇసుక మట్టిని అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలి కలెక్టర్

జోగులాంబ గద్వాల 18 జూలై 2025 తెలంగాణ వార్తా వార్తా ప్రతినిధి : గద్వాల ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, మట్టిని అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా స్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ గృహాల నిర్మాణం కొరకు కావలసిన ఇసుక మట్టి లభ్యతపై కమిటీ సభ్యులతో చర్చించడం జరిగినది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు అవసరమైన ఎనిమిది ట్రాక్టర్ల ఇసుకను, ఎనిమిది ట్రాక్టర్ల మట్టిని అందించి పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ట్రాక్టర్ ఇసుకకు రూ. 100/-, మట్టికి రూ. 400/- చొప్పున వసూలు చేయాలన్నారు. వినియోగదారులు సంబంధిత తహసిల్దార్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే పరిశీలించి మంజూరు చేయాలని సూచించారు. ఇసుక తవ్వకాలు పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సరఫరా వ్యవస్థను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సరఫరా ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాల్సిందిగా, ప్రతి ట్రాక్టర్ పంపిణీకి సంబంధించిన సమాచారం ఖచ్చితంగా నమోదు చేసి,తగిన రికార్డులను సమగ్రంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అవసరమైన ఇసుక, మట్టి వంటి నిర్మాణ సామాగ్రిని లబ్ధిదారులకు కనిష్ట ధరలకు అందజేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు ఈ వనరులను వినియోగించుకొని, త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, ఏ.డి. మైన్స్ వెంకట రమణ, డిపిఓ నాగేంద్రం, ఇరిగేషన్ ఈ.ఈ శ్రీనివాస్,మిషన్ భగీరథ ఈ ఈ శ్రీధర్ రెడ్డి, భూగర్భ జల శాఖ అధికారి మోహన్ రావు, ఉద్యాన శాఖ అధికారి అక్బర్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.