వృద్ధాప్యం ఇంత  ఇంత భారమా  ?

Jul 13, 2024 - 22:29
Jul 13, 2024 - 22:55
 0  9

తమవరకు వస్తే కానీ తెలియని మూర్ఖత్వం  ఇంకెంతకాలం?

తల్లిదండ్రుల జీవితాలను  పంచుకోవడమే సిగ్గుచేటు  

అందులో లెక్కలు హద్దులు  .కుమిలి పోతుంటే  ఆనంద పడడం

మీ సంస్కృతి అనుకుంటున్నారా?

అంతకంటే హీనమైన పరిస్థితులు రావచ్చు  జాగ్రత్త.!

పశ్చాత్తాపము కంటే ఆలోచన ,సోయి  మనుషులుగా నిలబెడుతుంది.

--వడ్డేపల్లి మల్లేశం

అభాగ్యులు వృద్ధులు మతిస్థిమితం లేని వాళ్ళు పేదలు కుమిలిపోతూ  ఇబ్బందులు పడుతూ  యాతన అనుభవిస్తుంటే చూసి ఆనందపడే వాళ్ళు ఈ లోకంలో  కోకోళ్లలు . అంతెందుకు తమ కుటుంబంలోని సభ్యులు తమ బంధుమిత్రులు స్నేహితులు  ఇరుగుపొరుగువారు కూడా సుఖంగా సంతోషంగా జీవిస్తే తట్టుకోలేని  మూర్ఖత్వంతో కుళ్ళు రాజకీయాలకు పాల్పడుతున్న మానవాళిని  తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.  ఎంతసేపు తమ ఆధిపత్యం కొనసాగాలని , సంపద తమకే చెందాలని,  అవకాశాలు కలిసి రావాలని  ఆశిస్తూనే ఎదుటి వాళ్లను  అల్పులుగా అవకాశవాదులుగా బలహీనులుగా  దయాదాక్షిణ్య మీద  ఆధారపడి   బ్రతకాలని ఆశించేవాళ్లు మనలో  అనేకమంది.
  సమాజం పట్ల ఈ రకమైనటువంటి  దుర్బుద్ధి ఉన్నప్పుడు తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారం ఎలా అలబడుతుంది? .  అన్నం పెట్టకపోయినా పెట్టేవాళ్లను పదిమందిని చూపించాలనే సామెత ఈ లోకంలో ఉంది  కానీ దానికి భిన్నంగా తాను పెట్టడు ఇతరులు పెడితే సహించడు  పొరపాటున  ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు ఏదైనా  మంచి పదార్థము దొరుకుతే తినేటప్పుడు కూడా ఈర్ష పడే దుర్మార్గ ప్రవృత్తి ఈనాడు మన తోటి మనుషుల్లో ఉన్నది అంటే అతిశయోక్తి కాదు.  పుట్టే డు ఉన్నవాడు తట్టెడు ఉన్న వాడి కోసం ఏడ్చినట్లు  ఎంతసేపు  తన సుఖమే కోరుకోవడం అనేది  ఆధునిక కాలపు  వింత ధోరణిగా మారిపోయినది . ఈ రకమైన మానవ ప్రవృత్తిని ప్రక్షాళన చేయకుండా,  తనను తాను సంస్కరించుకోకుండా,  తన బాధ్యతలను గుర్తించకుండా  మూర్ఖత్వంతో ఆలోచించే వాళ్లను ఎక్కడికక్కడ  సమాజమే వీలైన మేరకు శిక్షించవలసిన అవసరం చాలా ఉన్నది. 
     ఆస్తి,  ఆదాయము ,చదువు ,అభివృద్ధి  వంటి అనేక విషయాలలో  అసూయ ద్వేషాలు ఈనాడు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి  తాను బ్రతకకపోయినా మంచిదే కానీ తోటివాడికి అవకాశాలు వస్తే సహించలేనటువంటి దుర్బుద్ధి  సామాజిక సంబంధాల బలహీనతకు కారణం అవుతుంటే  అంతరాలు లేని అసమానతలు కానరాని సమసమాజాన్ని కావాలని ఆశించడం అత్యాశే అవుతుంది. అందుకే మనుషులు మారాలి  ఈ సందర్భంగా  ప్రముఖ అంబేద్కరి స్ట్ సామాజికవేత్త  కత్తి పద్మారావు గారు  ఈనాడు దున్నాల్సింది భూములను మాత్రమే కాదు మనుషుల మెదళ్లను కూడా అంటూ కుట్ర కుతంత్రాలు అసూయా ద్వేషాల తో కూడిన మనుషుల మానవ చిత్త ప్రవృత్తిని  వీలున్న మేరకు సంస్కరించాలని  శిక్షించాలని  తగిన విధంగా సంస్కారం అలవాడేలా  పశ్చాత్తాప పడేలా  చూడాల్సిన బాధ్యత ఈ సమాజంలోని బుద్ధిమంతుల పైన ఉన్నది అని చెప్పిన తీరు మనకు  ఎంతో ఉపకరిస్తుంది  .

తల్లిదండ్రులు కుమిలిపోతుంటే  ఆనంద పడడం మీ సంస్కృతి అనుకుంటున్నారా:-

సాంకేతిక రంగం  అభివృద్ధి చెందిన ఈ కాలంలో మనిషిని మనిషిగా చూడలేని  మానవతా విలువలను  విషంతో నింపుతున్న దుర్మార్గపు ప్రవృత్తిని కట్టడి చేయాల్సిన అవసరం చాలా ఉన్నది  లేకుంటే  అభివృద్ధి  వక్రమార్గం పట్టే అవకాశం ఉంటుంది  .కన్న తల్లిదండ్రులు వృద్ధాప్యంలో కుమిలిపోతూ  అచేతనావస్థలో అనారోగ్యముతో ఆదరణ లేక నిస్సహాయులుగా  చేయి సాచవలసిన దౌర్భాగ్య పరిస్థితులకు  మనం కారణము కాదా ? మన తల్లిదండ్రులు అవమానంతో  కుంగిపోతూ పిడికెడు మెతుకులకు నోచుకోక  నిరాదరణకు గురవుతుంటే దానికి మనం  తలవంచి సిగ్గుపడాల్సిo దే. సమాజంలోని భిన్న వర్గాలు కూడా అలాంటి సందర్భాలను  ఎత్తిచూపుతూ నిక్కచ్చిగా మాట్లాడి  కఠినంగా వ్యవహరించడం కూడా సమాజ సంస్కరణకు తొలిమెట్టు కాగలదు  .తల్లిదండ్రులను కన్న కొడుకులు పెంచి పోషించడానికి  వృద్ధాప్యంలో  ఆదరించడానికి  నూట ఒక్క పంచాయతీలు, అన్నదమ్ముల మధ్యన వనస్పర్ధలు,  భార్యాభర్తల మధ్య విభేదాలు...  ఈ సన్నివేశాలను చూడలేక వృద్ధులైన తల్లిదండ్రులు  ఇక  మనం ఇంత భారమై బ్రతకడం అవసరమా  అనుకోని  కన్నీరు కార్చడం  కడదాకా బ్రతకకుండా మధ్యలోనే కాటికి కాళ్లు చాపడం  ఈ మధ్యలో మనం కొన్ని సందర్భాలను  విని ఉన్నాము.  తల్లిదండ్రులను అన్నదమ్ములు  పంచుకొని పోషించడమే సిగ్గుచేటు  అక్కడ కూడా రోజులు లెక్కపెట్టుకొని,  ఖర్చుకు వెనకడుగు వేసి, వైద్య సౌకర్యాలను పట్టించుకోక,  పిడికెడు మెతుకుల కోసం  ఇబ్బంది పెడుతూ,  నోటి మాట లేకుండానే సైగతో  దూరం నుండి పల్లెములో మెతుకులు వేస్తున్నటువంటి దుర్మార్గురాండ్లను కూడా మనం చూడవచ్చు.  రేపు మాపో కాటికి పోయే తల్లిదండ్రులను   ఏం సంపాదించినారు?  చావడమే మేలని , బాధ్యత తీసుకొని  సానుకూలంగా ఉంటే అట్లే అంటిపెట్టు ఉంటారని,  మాట్లాడకుండా ఉండడం , తలుపులు బిగించి బయటికి నెట్టడం,  సూటిపోటి మాటలతో మెడలు బట్టి బయటకు   గెంటడాన్ని కూడా మనం గమనిస్తున్నాం.  ఇలాంటి సందర్భాలు మన కుటుంబాలలో ఉంటే ముందుగా మనం సిగ్గుతో తలవంచుకోవాలి...  పదిమంది ముందు క్షమాపణ కోరుకోవాలి ... మన కుటుంబ సభ్యులలో భార్యాభర్తలుగా  అవగాహన పెంచుకోవడం ద్వారా మన గతి కూడా అంతే భవిష్యత్తులో మనకు మరింత దుర్భరమైన పరిస్థితులు రావచ్చు తన దాకా వస్తే కానీ పరిస్థితులు తెలియవు అనే సోయి తెచ్చుకోవడం చాలా  అవసరం  .

పశ్చాత్తాపము కంటే  నేటి ఆదరణ గొప్పది - శవానికి అలంకరణ కాదు - పిడికెడు మెతుకులు ప్రేమతో పెట్టు:-

సూటిపోటి మాటలతో బ్రతికినంతకాలం ఇబ్బందులకు గురిచేసి  ఎంతమంది చెప్పినా వినకుండా మనసు మార్చుకోకుండా  అవమానించి మృత్యు ఒడిలో చేరిన తర్వాత  పదిమంది నిందిస్తేనో  మనకు జ్ఞానోదయం  అయితేనో మనం పశ్చాత్తాప పడితే ప్రయోజనం లేదు. ఎందుకంటే అప్పటికే జీవం  గాలిలో కలిసిపోయింది  బ్రతికున్న నాడు పంచభక్ష పరమాన్నం గానీ  చికెన్ బిర్యానీ గాని  వాళ్లు కోరిన కోరికలు కాకపోయినా  ఆత్మీయంగా ప్రేమతో నో టికి రుచికరంగా పిడికెడు మెతుకులు పెట్టి ఓదార్చి కన్నీరు తుడిచి ఆత్మీయతను పంచితే అదే చాలు.  కానీ చాలాచోట్ల బతికున్న నాడు   బే ఖాతరు చేసి చనిపోయిన తర్వాత వగలమారి భ్రమలు కురిపించి,  శవానికి గొప్పగా అలంకరించి,  టపాసులతో  ఊరంతా దద్దరిల్లిపోయేలా ఫలానా వాళ్ళ తల్లి లేదా తండ్రి అని ప్రచారం చేసుకోవడానికి మాత్రమే నేడు  తమ వల్ల మాలిన చేష్టలతో  దోషులుగా మిగిలిపోతున్నారు.  చనిపోయిన నుండి 11వ రోజు వరకు ఏదో సందర్భాన్ని పురస్కరించుకొని  వాళ్ల పేరు చెప్పుకొని మందు విందు  ఎగబడి థి 0టూ తాగుతూ  చిత్రపటం ముందు మాత్రం  మందు మటన్ పెట్టి  తన ప్రేమ వ్యక్తం చేస్తే ప్రయోజనం ఏముంటుంది? ఈ విషయంలో కోడలు మాత్రమే కాదు కొడుకులు కూడా దాదాపుగా ఇదే దుర్మార్గపు ఆలోచనలో ఉన్న విషయాలను పెద్ద మొత్తంలో మనం గమనించవచ్చు. అయితే  ఇంటి కోడలు తన తల్లిదండ్రులు తన పుట్టింట్లో బాగుండాలని , చనిపోయే వరకు వాళ్లను బాగా చూసుకోవాలని , తన అన్నదమ్ములు మరదలు వదినలు  మరింత శ్రద్ధ చూపాలని కోరుకుంటుంది. కానీ తన ఇంట్లో మాత్రం తన అత్తమామలకు  మొక్కుబడి ప్రేమతో  నటించిన సందర్భాలు ఎక్కువ. అయితే  ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టిన కొడుకు కూడా అంతకుమించిన  దుర్మార్గుడు, మోసగాడు, నేరగాడు, అవినీతిపరుడు,  మూర్ఖునిగా మారి తల్లిదండ్రుల పైన ప్రేమ లేకుండా  జీవించడం నటించడమే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం . తమ వరకు వస్తే కానీ తెలియని ఈ భయంకరమైన  అనుభవాన్ని ఊహించుకుంటేనే చాలా భయం  అప్పుడు కానీ తెలియదు  తమ తల్లిదండ్రులకు విధించిన శిక్ష స్థాయి.  అప్పుడు ప్రయోజనం ఏమిటి కనీసం పలకరించడానికి నీ  కడుపున పుట్టిన వాళ్లు  నీ దగ్గర ఎవరూ ఉండరు...  నీళ్లు ఇవ్వడానికి గోలీలు వేయడానికి పలకరించడానికి  చేపట్టి లేపడానికి కూడా  ఎవరు నీకు అందుబాటులో ఉండకపోవచ్చు... జాగ్రత్త!  అంత దుస్థితి రాకుండా ఉండాలంటే మనం నేడు సోయి తో,  బాధ్యతతో,  పరోపకారంతో  బ్రతికితే మన మంచితనం  మన  అంత్య దశలో మనలను కాపాడవచ్చు. కన్నవాళ్ళు అందుబాటులో లేకున్నా తోటి వాళ్ళయినా సహకరించే అవకాశం ఉంటుందో ఏమో! కనీసం  అంతవరకైనా  పరిమిత స్థాయిలో నీకు  సేవలు అందాలంటే నేడు నీ తల్లిదండ్రులను  నిండు మనసుతో  ఆరాధించు ఆదరించు !.   దిక్కరించినా,  నిరాకరించినా, నిర్లక్ష్యం చేసినా  అంతకుమించిన వేల రెట్లు  మూల్యం చెల్లించుకోక తప్పదు జాగ్రత్త ! ఈ హెచ్చరిక నాకు మీకు  సమాజంలోని ప్రతి ఒక్కరికి  సుమా!
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333