ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కోట్లు ఖర్చు పెట్టడం కంటే
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడం కీలకం .* భవనాలకే పరిమితమైన ప్రభుత్వ వైద్యరంగంలో ని పుణులున్న చికిత్సకు నిరాకరిస్తున్న వైనం .అధిక వేతనాలతో రాత్రి పగలు సేవలు తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఉక్కు పాదంతో అణిచివేయాలి.*
**************
---- వడ్డేపల్లి మల్లేశం
ప్రభుత్వాలు వైద్య రంగాన్ని తమ పరిధిలో అభివృద్ధి చేయడం ద్వారా పేద వర్గాల నుండి ఉన్నత వర్గాల వరకు అందరికీ ఉచిత నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ప్రయత్నించాలి . ఇది ప్రజల యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు. కానీ ప్రభుత్వాలు తమ సామాజిక బాధ్యత నుండి తప్పుకొని సులభంగా తమ బాధ్యతను ఇతరులపై నెట్టే ప్రయత్నం చేయడం ఇటీవల కాలంలో మామూలు అయిపోయింది. అదే కోవలో విద్యా వైద్య రంగాలను ప్రైవేటు పరం చేస్తూ సులభంగా తప్పించుకునే ప్రయత్నం జరుగుతున్నది ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా రైల్వేలు, ఓ డరేవులు, పరిశ్రమలు, జీవిత బీమా సంస్థలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ పరిపాలన బాధ్యతల నుండి తప్పుకొని రాజకీయాలకు మాత్రమే అలవాటు పడిన వైనాన్ని గమనిస్తే ప్రభుత్వాలు ఎంత బాధ్యతారాహిత్యం గా వ్యవహరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రజలు ప్రభుత్వాన్ని కట్టడి చేయడం ద్వారా తమ బాధ్యతలు నిర్వహించే విధంగా ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యతలు నిర్వహించకుండా తప్పుకుంటే ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టవలసిన బాధ్యత ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులది అందుకు సహకరించవలసిన బాధ్యత రాజ్యాంగబద్ధ సంస్థలతో పాటు న్యాయ వ్యవస్థకు ప్రధానంగా ఉన్నది . మొత్తం వైద్య రంగాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించే క్రమము లోపల సిబ్బందిని నియమించడంతోపాటు రాత్రి పగలు పనిచేయించుకునే క్రమంలోపల అధిక వేతనాలను ఇవ్వడం ద్వారా వైద్య రంగాన్ని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాలు కూడా ఈ బాధ్యత నుండి తప్పుకొని నామ మాత్రపు వేతనాలు, కాంట్రాక్టు ఉద్యోగాలతో కాలం గడపడం మామూలు అయిపోయింది ఈ క్రమంలోనే ప్రభుత్వం యొక్క బలహీనతను ఆసరా చేసుకున్నటువంటి పెట్టుబడుదారి వర్గాలు ప్రైవేట్ రంగంలో వైద్యాన్ని ముమ్మరం చేసే ప్రయత్నం చేయడం ద్వారా ప్రభుత్వానికి ఏదో సహకారం చేస్తున్నట్లుగా నటిస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతూ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి పథకాల ద్వారా ప్రజలకు తాము వైద్యం చేస్తున్నట్లు నటించడం ఇక్కడ ప్రభుత్వం మాత్రం బాధ్యతనుండి తప్పుకోవడం చాలా సిగ్గుచేటు అనే విషయం . సమర్థత ,ప్రతిభ, బాధ్యత కలిగిన ప్రభుత్వాలు అయితే వైద్య రంగాన్ని మొత్తాన్ని ప్రైవేటు నుండి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా ప్రభుత్వ వైద్య రంగాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు అవసరమైన మేరకు వైద్యశాలలు భవనాలు సిబ్బంది నిపుణులు యంత్ర పరికరాలు సామాగ్రిని సమకూర్చుకోవడం ద్వారా తన ప్రతిభను తన స్వయం ప్రతిపత్తిని చాటుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది .ఈ విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలతో సంప్రదించి దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలోనే వైద్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మాత్రమే రాజ్యాంగబద్ధ మైన హక్కుగా భావించవచ్చు.
నిపుణులు ఉన్న నిరాకరిస్తున్న వైనం :-
******
క్రింది స్థాయి ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాలలో అత్యవసరంగా చికిత్స సందర్భంలో అక్కడ సౌకర్యాలు లేని కారణంగా జిల్లాస్థాయి లేదా వరంగల్లోని ఎంజీఎం లాంటి ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలకు సిఫారసు చేసిన సందర్భంలో అక్కడ ఉన్న సిబ్బంది సీరియస్గా పట్టించుకోకుండా ఇక రాత్రి వేళల్లోనైతే నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏమాత్రం చికిత్స చేయకుండా అవసరమైనటువంటి సేటిస్కాన్ ఎమ్మారై మిగతా పరీక్షలను పట్టించుకోకుండా తూ తూ మంత్రంగా చిన్నపాటి పరీక్షలు చేసి ప్రమాదం లేదు అని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇచ్చే మామూలు మందులను ఇచ్చి సాగ నంపుతున్న వైనాన్ని కూడా గమనిస్తే ప్రభుత్వం యొక్క అజమాయేసి వైద్య శాఖ మీద ఏ పాటి గా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అందుకోసమే ప్రభుత్వ వైద్యశాలల మీద విశ్వాసం లేకపోవడంతో ప్రైవేట్ వైద్యశాల వైపు ప్రజలు మో గ్గుచూపుతున్నారు ఇది ప్రభుత్వం యొక్క బలహీనత, బాధ్యతారాహిత్యం అని చెప్పక తప్పదు . ఇక ప్రభుత్వ వైద్యశాలల్లో గ్రామీణ స్థాయి ఉపకేంద్రం నుండి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి ఉస్మానియా గాంధీ ఆసుపత్రి వరకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం, ఆక్సిజన్, ఈసీజీ ,సీటీ స్కాన్, ఎమ్మారై లాంటి వాటిని అవసరం ఉన్నప్పటికీ సిబ్బంది సహకరించకపోవడం వైద్యులు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రొఫెసర్లు పెద్దపెద్ద వైద్యులు ఉన్నప్పటికీ నామమాత్రపు చికిత్స కూడా అందించనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ప్రభుత్వ వైద్యశాలలో దర్శనమిస్తున్నాయి. ప్రజలు కిందిస్థాయిలో ప్రైవేటు వైద్యశాలకు వెళితే వాళ్లు రాసినటువంటి చికిత్స ట్రీట్మెంటు సిఫారసులు లేదా సలహాలను పై స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలు పాటించని కారణంగా అయోమయంలో పడుతున్నటువంటి పేషంట్ల యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటే ఎవరితో చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో విధిలేక అనివార్యంగా తిరిగి ప్రైవేటు వైద్యశాల వైపే మొగ్గు చూపుతున్న విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ప్రభుత్వ వైద్యశాఖ మీద పూర్తి అజమాయిషి లేని ప్రభుత్వం, మంత్రి, మంత్రిత్వ శాఖ నిపుణులు లేకుండానే ఆసుపత్రి నడవడం, భవనాలు లేకుండానే ఆసుపత్రి కొనసాగడం, భవనాలకు మాత్రమే పరిమితమై సిబ్బంది యంత్ర పరికరాలు లేకుండా అలంకారప్రాయంగా భవనాలు కనపడడం వంటి దౌర్భాగ్య పరిస్థితులను తెలంగాణ రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాలలోనూ వైద్య శాఖలో మనం చూడవచ్చు . గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం భవనాల నిర్మాణానికి మాత్రమే పాల్పడి కాంట్రాక్టర్లు ప్రభుత్వ కమిషన్ల కోసం భవనాలు నిర్మించిన స్థాయిలో డాక్టర్లు, సిబ్బంది, పరికరాలు, యంత్ర సామాగ్రి, మందులు, అవకాశాలను కల్పించకపోవడంతో ఇప్పటికీ తూతూ మంత్రంగానే వ్యవహారం నడుస్తున్న విషయాన్ని గమనించకుండా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి, ఆరోగ్యశ్రీ కింద కోటానుకోట్ల రూపాయలను ఖర్చు చేయడం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కదా! ఈ కోట్ల రూపాయలను ప్రజా వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి గనుక ఖర్చు చేస్తే ప్రైవేటు వైద్యరంగం మీద ఆధార పడవలసిన అవసరం లేకపోగా అన్ని వర్గాలకు ప్రభుత్వం ఉచిత నాణ్యమైన వైద్యాన్ని అందించే అవకాశం ఉంటుంది ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలి .
ఇక ఇటీవల గత నాలుగైదు సంవత్సరాలుగా వెల్నెస్ సెంటర్ల పేరుతో ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, జర్నలిస్టులకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి వెల్నెస్ సెంటర్లలో నిపుణులైన వైద్యులు లేకపోవడం జూనియర్ డాక్టర్లు మాత్రమే పనిచేయడం అనుభవం లేని కారణంగా కేవలం ప్రైవేటు వైద్యుల వద్ద పొందిన చికిత్సను తీసుకువచ్చి చూపిస్తే అవే మందులు రాసి ఈ సెంటర్లో ఉచితంగా ఇవ్వడానికి మాత్రమే ఉపయోగిస్తే ఫలితం ఏమున్నది? వెల్నెస్ సెంటర్లలో కూడా నిపుణులైన అనుభవం కలిగినటువంటి వైద్యులను అన్ని రకాల పరికరాలు ప్రయోగశా లతో గనుక పూర్తిస్థాయిలో అమలు చేసినట్లయితే అవకాశం మరింత మెండుగా ఉంటుంది . వెల్నెస్ సెంటర్లో కేవలం జనరల్ ఫిజీషియన్ ఆర్తో అక్కడక్కడ ఫిజియోథెరపీ డెంటల్ మాత్రమే ఉంటున్నాయి అక్కడ కూడా అర్హులైన వైద్యులు లేకపోవడం, చికిత్స లేకపోవడం, డెంటల్ విభాగంలో దంతాలను తీసివేయడం వరకే కానీ పెట్టే సౌకర్యం లేకపోవడం, న్యూరో , ఆర్తో, హార్ట్ డాక్టర్లు లేకపోవడం చేత మామూలు ఎంబిబిఎస్ డాక్టర్ తోనే సేవలు పొందడంతో సంతృప్తి చెందని ఉద్యోగులు పోలీసులు జర్నలిస్టులు తిరిగి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించక తప్పడం లేదు. ప్రభుత్వం ఏ వైద్యపరమైన అవకాశాన్ని కల్పించడానికి పూనుకున్నప్పుడు అక్కడ భవనాలతో ప్రారంభిస్తే వైద్యులు నిపుణులు యంత్ర పరికరాలు సౌకర్యాలు అన్ని స్థాయిలలో ఉన్నప్పుడు మాత్రమే అది పూర్తిస్థాయిలో ప్రజలకు మేలు చేస్తుంది అట్లా కాకుండా ప్రైవేటు ఆసుపత్రులు ప్రైవేటు భవనాలు ప్రైవేటు వైద్యుల మీద ఆధారపడి కేవలం ప్రభుత్వం ప్రజాధనాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అప్పనంగా కట్టబెట్టే సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాల వల్ల ప్రయోజనం నిర్వీర్యం ప్రజాధనం వృధా అవుతున్న ప్రజలకు సరైన వైద్యం అందనటువంటి దౌర్భాగ్య పరిస్థితులకు ఈ విధానం అద్దం పడుతుంది. ఈ పరిస్థితులను వెంటనే ప్రభుత్వం చక్కదిద్ది ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేయడం ద్వారా కోట్లాది రూపాయలతో కూడుకున్న అన్ని యంత్ర పరికరాలను కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో సమకూర్చడము ద్వారా ఎంతటి చికిత్స నైనా ఉచితంగా అందించడానికి పూనుకున్నప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శమవుతుంది. గత ప్రభుత్వం విస్మరించినటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రస్తుత ప్రభుత్వమైన బలోపేతం చేయడం ద్వారా ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ వంటి అవకాశాలకు కాకుండా ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేయడం కీలకంగా భావించాలి. మరికొన్ని సందర్భాలలో ప్రభుత్వ రంగంలో లేనటువంటి ప్రైవేటు వైద్యశాలలో ఉన్న చికిత్సలు ఇప్పటికీ అక్కడక్కడ లక్షలాది రూపాయలతో ఖర్చవుతుంది అలాంటి వాటికి ప్రభుత్వం రియంబర్స్మెంట్ గాని క్యాష్లెస్ ట్రీట్మెంట్ గాని అవకాశం లేదు ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వం క్యాష్ సమకూర్చడం కానీ లేకుంటే ఆ వైద్యశాలకు అనుమతి ఇవ్వడం గానీ లేదా ఆ వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించడం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటీవల కాలంలో ముఖ్యంగా మోకాళ్లు భుజాల నొప్పికి సంబంధించి పిఆర్పి చికిత్స కేవలం కొన్ని ప్రైవేటు వైద్యశాలలోనే అనుమతించబడుతున్నందున లక్షలాది రూపాయలు ఖర్చు చేయవలసి వస్తున్నది కానీ వాటికి ప్రభుత్వ గుర్తింపు లేని కారణంగా పేద వర్గాలకు చెందినటువంటి రోగులు నష్టపోతున్నందున దానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వ రంగంలో నిజమైనటువంటి వైద్యం పేద ప్రజానీకానికి అందినట్టుగా భావించవచ్చు .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )