అసంతృప్తితో ఆగమవుతున్న భారత్

Mar 30, 2024 - 23:25
 0  6

సంతోషానికి దూరం అవుతున్న సామాన్య ప్రజానీకం.

బిజెపి 10 ఏళ్ల పాలనలో మరింత దారుణం.

సంతోషకర జాబితాలో 126 స్థానంలో  భారత్ అంటే  అభివృద్ధికి దూరమే కదా !

అతి చిన్న దేశాలు మనకంటే నయం.

---  వడ్డేపల్లి మల్లేశం

ప్రజల సంక్షేమం, అభివృద్ధి , ప్రజా ప్రయోజనాల కోసం పాలకులు పనిచేయడం  పౌర సమాజం తమ హక్కులతో పాటు  ప్రజాస్వామిక పాలనలో భాగస్వాములు కావడం సమాంతరంగా కొనసాగినాడు  ఒక దేశం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది . అదే సందర్భంలో  పాలకులు  పెట్టుబడిదారులు సంపన్నుల కోసం కాకుండా  సామాన్య ప్రజానీకం కోసం  బడ్జెట్, ప్రణాళికలను రూపకల్పన చేసిన నాడు  దేశ సంపదను సామాన్య జనానికి  పంపిణీ చేసిన నాడు  ప్రజలు సుఖ సంతోషాలతో  ఉంటారు..  దానికి సూచిక సంతృప్తి.  భారత  నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ ప్రకారం  కనీస అవసరాలను తీర్చగలిగిన మానవాభివృద్ధియే నిజమైన అభివృద్ధి అని  పాలకులకు చేసిన హెచ్చరికను పాటించని కారణంగా  ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో  40.1% సంపద  కేంద్రీకృతమైనట్లు"  ది రైస్ ఆఫ్ ద బిలియనీర్ రాజ్" అనే పేరుతో ఏర్పడిన అంతర్జాతీయ  ఆర్థిక సంస్థ  విడుదల చేసిన నివేదిక  భారతదేశంలో ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉన్నదో  తెలుసుకోవడానికి ఇటోరికంగా పనిచేస్తుంది.  "సంపద  ఒకరిదైతే చాకిరి ఒకరిది " "అన్నపురాసులు ఒకచోట ఆకలి కేకలు మరొక చోట"  "సకల సంపదలతో తులతూగుతుంటుంది కానీ దరిద్రం అంతకు మించిన స్థాయిలో ఉంటుంది"  ఈ మూడు రకాల స్థితిగతులకు భారతదేశ కేంద్రం కావడం ఆందోళన కలిగించే విషయం.  అందుకే భారతదేశాన్ని  సంపన్నులు, సంపద ఉన్న పేదల దేశం అని అంటారు.  మెజారిటీ ప్రజానీకం పేదలు కావడం , అదే దేశ ఉత్పత్తిలో సంపద  సృష్టించే క్రమంలో ఈ పేదలే భాగస్వాములు కావడాన్ని  కనీసం గా అవగాహన చేసుకో ని పాలకులు  పేదలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా  పరిపాలన కొనసాగించడం  సంపన్న వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు తీసుకున్న రుణాలను 16 లక్షల కోట్లు  ప్రభుత్వమే మాఫీ చేయడం  పేదల పట్ల వివక్షత కాక మరేమిటి? అలాంటప్పుడు ఈ దేశంలో ప్రజలకు సంతోషం, సంతృప్తి ఎలా ఉంటుంది?
         అభివృద్ధి విషయంలో భూటాన్ కు ఉన్న సోయి  భారత్కు లేకపోవడం సిగ్గుచేటు  :-
*******
1972లో భూటాన్ రాజు  జిగ్మే సింగే వాంగ్చుక్  తన దేశ అభివృద్ధిని  అంచనా వేయడానికి ప్రజల  స్థితిగతులను సంతోషాన్ని సంతృప్తిని కొలిచే  క్రమంలో  సుదీర్ఘమైన ప్రణాళిక చేపట్టడం జరిగింది . పర్యావరణము, అసమానతలు , విద్యా, వైద్యము, న్యాయము,  పేదరికం వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని 300 ప్రశ్నలను తయారు చేయించి  ఆ ప్రశ్నలను  సంధించడం ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాలను  తెలుసుకొని తన దేశంలో అభివృద్ధిని నిర్ధారించినట్లుగా చరిత్ర తెలియజేస్తున్నది.  సూచికలుగా తీసుకున్న అంశాల ఆధారంగా ఆ దేశంలోని ప్రజలు  సంతృప్తిగా ఉండడానికి  తగిన అవకాశాలను కల్పించే క్రమంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న చొరవ  అవసరమైతే  అసంతృప్తిని కట్టడి చేయడానికి  తీసుకున్న చర్యలు  ఆ దేశ అభివృద్ధికి  ఎంతో ప్రేరణ కల్పించినట్లుగా తెలుస్తున్నది . అదే సందర్భంలో  ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా  రూపుదిద్దుకుంటుంది,  వికసిత భారత్ , భారత్ వెలిగిపోతుంది అనే నినాదాలతో  దేశాన్ని పాలిస్తున్నటువంటి బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం  భూటాన్ రాజు లాగా దేశ అభివృద్ధిని ప్రజల సంతోషాన్ని అంచనా వేయడానికి ఏనాడు  చొరవ తీసుకోలేదు.  అసంబద్ధ విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల వలన  భారతదేశంలో అసమానతలు అంతరాలు పెరిగిపోయి  పేద వర్గాలు వివక్షతకు గురి అయిన సందర్భంగా  ఆందోళనలో ఆసంతృప్తిలో  కొట్టుమిట్టాడుతూ  దుఃఖపూరిత వాతావరణంలో మునిగి తేలుతున్నప్పుడు సంతోషం ఎక్కడి నుండి వస్తుంది?  అందుకే 20,  మార్చి 2024 ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న" వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్"  తాను విడుదల చేసిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో  143 దేశాలకు గాను  భారతదేశం 126వ స్థానంలో నిలిచిందంటే గత పది ఏళ్ల పాలనా పుణ్యమా అని భారత సమాజము సిగ్గుతో తలవంచుకోవలసి వస్తున్నది.
  15 కోట్ల మంది వలస కార్మికులు  అన్నమో రామచంద్రాయని అలమటిస్తుంటే  80 కోట్ల మంది పేద ప్రజానీకానికి  పోషక విలువలు అసలే లేని మొక్కుబడి  ఉచిత బియ్యాన్ని కేంద్రం సరఫరా చేస్తూ  చేతులు దులుపుకుంటే  15% ప్రజలు ఇప్పటికీ దారిద్రరేఖ దిగువన జీవిస్తూ ఉంటే  అమర్త్యసేన్ చెప్పినటువంటి మానవ అభివృద్ధి ఈ దేశంలో లేనట్లే కదా  !విద్యా, వైద్యం, సామాజిక న్యాయం, పోషకాహారం వంటి  విషయాలలో ప్రభుత్వ చొరవ మెరుగ్గా ఉండి  స్వేచ్ఛ సమానత్వం  మానవ హక్కులు  విస్తృతంగా అనుభవించగలిగిన నాడు మాత్రమే ప్రజలు  సంతోషంగా ,సంతృప్తిగా,   ఆరోగ్యంగా జీవించగలుగుతారు.  ఈ లక్ష్య సాధన కోసమే అంతర్జాతీయ స్థాయిలో ఏటా సంతోష దినాన్ని నిర్వహించుకుంటున్నప్పటికీ  అత్యంత వెనుకబడిన  పేద దేశాలు   అయిన  పాకిస్తాన్ నేపాల్ ఇరాక్  భారత్ కంటే ముందు వరుసలో ఉన్నాయన్నప్పుడు  మన పాలకుల వైఫల్యం , పేద వర్గాల పట్ల  నిర్లక్ష్యం,  పెట్టుబడిదారులకు వంత పాడే మనస్తత్వాన్ని  అర్థం చేసుకోలేమా?  అత్యంత చిన్న దేశమైన ఫిన్లాండ్ ఏడవసారి కూడా వరుసగా 1ర్యాంకు  సాధించి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా  తన స్థానాన్ని పదులపరుచుకుంటే  అనేక వనరులు ఉండి కూడా  ప్రజా విచ్ఛిన్నకులైన తాలిబండ్ల  పాలనలో సంక్షోభాన్ని ఎదుర్కొన్న కారణంగా ఆఫ్గనిస్తాన్  ఈ జాబితాలో 143 వ ర్యాంకుతో చివరి స్థానంలో నిలిచిపోవడం  పరిశీలించ తగినది.  సంక్షోభ పాలనలో ఉన్న  ఆఫ్ఘనిస్తాన్ 143 వ ర్యాంకులో ఉంటే   వికసిత భారత్ పేరుతో  విస్తృత ప్రచారం చేసుకుంటున్న  భారతదేశము 126వ స్థానంలో నిలవడం  ఏమంత చెప్పుకోదగ్గ విషయం కాకపోగా  ఆందోళన కలిగించే అంశమే !
     నివేదికకు ప్రాతిపదిక అంశాలు-  దశాబ్ద కాలంలో భారత్  స్థానాలు :-
********"" ప్రపంచంలోని ఆయా దేశాలలో ప్రజల తలసరి  స్థూల జాతీయోత్పత్తి , సామాజిక మద్దతు,  జీవితకాలం , స్వేచ్ఛ,  అవినీతి రేటు , ఆత్మ సంతృప్తి , మానవాభివృద్ధి , పేదరికం, నిరుద్యోగం , ఆరోగ్యం వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని  ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా ఈ నివేదిక విడుదల చేస్తున్నట్టు తెలుస్తున్నది  .ఏది ఏమైనా పాలకుల దక్షతకు  అసమానతలు అంతరాల నిర్మూలన,  సంపద ఉత్పత్తి పంపిణీ వంటి అంశాలు  ఇందులో క్రియాశీలక పాత్ర పోషిస్తుంటే  2014లో   ప్రధానమంత్రిగా మోడీ  అధికారంలోకి వచ్చిన నాడు హ్యాపీనెస్ జాబితాలో  భారత ర్యాంకు 111 గా ఉండేది  క్రమంగా పదేళ్లలో  126 కు అంటే 15 ర్యాంకులను భారత్ కోల్పోవడం  అసమర్థ పాలనకు నిదర్శనం కాక మరి ఏమిటి  ?ఇక ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే  2018 లో 133, 2019లో 140, 2020లో 144  స్థానానికి దిగజారినది అంటే  గత పదేళ్ల కాలంలో   మరింత హీనమైన స్థితిలోకి అప్పుడప్పుడు జారుకున్నట్లే కదా ! మన పొరుగున ఉండి వివిధ రాజకీయ ఆర్థిక కారణాలతో సంక్షోభాలను ఎదుర్కొంటున్న  నేపాల్ 93  ఇరాక్ 92 ఇరాన్ 100 నైజీరియా 102 పాకిస్తాన్ 108 ఉగాండా 117  స్థానాలలో నిలబడి భారతదేశాన్ని  వెక్కిరిస్తున్నాయి అంటే  మన పాలన సమర్థత ఏ పాటిదో  అర్థం చేసుకోవచ్చు.  ఈ పరిస్థితులలో భారతదేశాన్ని రాబోయే వెయ్యి ఏండ్ల  ప్రాతిపదికగా బలవత్తర  శక్తిగా మార్చడానికి తమ వద్ద ప్రణాళికలు ఉన్నట్లు ఇటీవల ప్రధాని బిజెపి ప్రకటించడం  ఏ వర్గ ప్రయోజనం కోసమో, ఎవరి సంతోషం కోసమో,! 
సంపదను మరింత కొద్ది మంది చేతుల్లో పోగు చేయడo కోసమే అని అర్థం చేసుకోవచ్చు.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ (చౌటపల్లి )జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333