మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె సమంజసమా?
మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె సమంజసమా?* కనీస సౌకర్యాలకు నోచని స్థితిలో ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థ అంటే నమ్మాలి కదా !* వెయ్యిండ్ల ప్రణాళిక కేంద్రం వద్ద ఉందంటే నమ్మడం ఎలా?*
**************************************
--- వడ్డేపల్లి మల్లేశం 9014206412 *****
-----24...11...2024******************
గొప్పలు చెప్పుకోవడానికి, పౌరుషాన్ని ప్రకటించుకోవడానికి, ఆదిపత్యాన్ని ప్రదర్శించడానికి కొందరు లేని గొప్పతనాన్ని అరువు తెచ్చుకొని తమదిగా చెప్పుకుంటారు. కనీస అవసరాలకు లేకపోయినా పైకి ఆడంబరంగా జీవించడానికి ఉచ్చుకత చూపుతారు. ఇంట్లో పేదరికం ఇబ్బందులు అనారోగ్యం అనేక సమస్యలు ఉన్నప్పటికీ బయట గొప్పగా చలామణి అవుతూ ఉంటారు. ఈ సందర్భంలోనే తరచుగా జనం నోట్లో నానే మాటలు మనం ప్రస్తావించదలచుకుంటే "ఇంట్లో ఈగలమోత బయట పల్లకి మూత" "మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె" అంటూ ఎగతాళి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే నిజంగా కూడా స్థాయికి మించి మాట్లాడడం ఆ స్థాయిలో తన ప్రవర్తన గాని తన అవసరాలు గాని నేర వేరే పరిస్థితి లేనప్పుడు ఉన్నట్లుగా గొప్పగా చెప్పుకోవడానికి ఈ సామెత సూటిగా సరిపోతుంది. .మింగడానికి మెతుకు, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, పిల్లలను చదివించడానికి వైద్య ఖర్చులకు కుటుంబ పోషణకు ఆదాయం ప్రతి ఒక్కరికి అవసరమే. ఇప్పటికీ అనేకమంది కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుంటే దయనీయ స్థితిలో ఉండడాన్ని మనం గమనించవచ్చు గూడు లేక రోడ్లమీద మురికి కాలువల పక్కన చీకట్లో అడవిలో చెట్ల పొదల మధ్యన జీవిస్తున్న వారిని మనం గమనించవచ్చు. తినడానికి తిండి లేక కుటుంబ సభ్యులంతా తలోదారిలో అడుక్కొని తింటున్న వాళ్లను గమనించవచ్చు. సరైన గుడ్డలు లేక చినిగి మాసిపోయిన వస్త్రాలతో జీవితం వెలదీ స్తున్న వాళ్లను గమనించవచ్చు .ఇప్పటికీ ఈ దేశంలో ఇంకా పేదరికం ఉందా? దినసరి కూలీలు గాని నెల జీతాలు గాని బాగానే ఉన్నాయి కదా! ఇండ్లు పొలాలు గుడ్డలు ఆస్తులు ఉన్నప్పటికీ ఇక కొరతే మిటి? వాళ్లను పేదలు అనడం సరైనది కాదు కదా! అనే వాళ్లకు ఈ దేశంలో కొర తలేదు కానీ ఇప్పటికీ 15% మంది దారిద్ర రేఖకు దిగువన జీవిస్తున్నారనే వాస్తవాన్ని గమనించితే వారి అనుమానాలు పటాపంచలు కాక తప్పదు. ఇటీవల ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం కూడా 25 కోట్ల మందిని పేదరికం నుండి విముక్తి చేసినామని ప్రకటిస్తున్నప్పటికీ 81 కోట్ల మందికి ఈ దేశంలో దొడ్డు బియ్యాన్ని ఉచితంగా ఇస్తూ అదే పౌష్టికాహారం అని నచ్చ చెప్పడాన్ని ఎలా చూడాలి? కరోనా 2020లో ప్రారంభమైన తర్వాత పోషకాహారం ప్రధానంగా లేకపోతే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందని తద్వారా కరోనాతో పాటు అనేక రోగాలు రావడానికి కారణమని పెద్ద ఎత్తున ప్రచారం జరిన మాట వాస్తవమే అయినప్పటికీ ఈ దేశంలో కనీస సౌకర్యాలకు నోచని కొనుగోలు శక్తి లేనటువంటి పేదలకు పౌష్టికాహారాన్ని అందించే బదులు కేవలం దొ దొడ్డు బియ్యంతో సరిపుచ్చుతే అది ఎలా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది?
వెయ్యేళ్ళ ప్రణాళిక తమ వద్ద ఉన్నదని గత సాధారణ ఎన్నికల సందర్భంగా పార్టీ పార్టీ పెద్దలు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అంతేకాదు 2047 వరకు తమ వద్ద స్పష్టమైనటువంటి వ్యూహాలు ఉన్నట్లు, ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే మూడవ స్థానానికి చేరుకుంటుందని గర్వంగా చెప్పుకోవడాన్ని మనం అందరం గమనించి ఉన్నాం. ఈ విషయాల పైన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అనేక సందర్భాలలో ప్రస్తావించడం జరిగింది. గత టర్మ్ లో కేంద్ర ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని మాట ఇచ్చినప్పటికీ అలాంటి ఆచరణ ఏది జరగలేదని అనేకమంది రాజకీయవేత్తలు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు రైతు ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యం అని కూడా ప్రకటించినప్పటికీ రైతులు ఢిల్లీ పరిసర ప్రాంతాలలో సంవత్సరాల తరబడిగా సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు పైగా అనేక రకాల హింసకు గురి చేయడం వాటర్ క్యాన్స్ రబ్బర్ బుల్లెట్లతో దాడి జరిగిన విషయం తెలుసు. అంతే కాదు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసి, రైల్వేలు, ఓడరేవులు, ప్రభుత్వ పరిశ్రమలు, వైమానిక రంగంతో సహా అనేక రంగాలను కూడా ప్రైవేటుకు అప్పజెప్పి చేతులు దులుపుకున్న విషయం మనందరికీ తెలుసు. తద్వారా పేదవాని పైన అనేక రకాల భారం పడే ప్రమాదం లేకపోలేదు .కనీస ఆహారం దొరికిన తర్వాత మిగతా అవసరాల కోసం అవకాశాల కోసం ప్రయత్నం చేస్తే తప్పేమీ లేదు కానీ మౌలిక అవసరాలే తీరనప్పుడు పెద్ద పెద్ద మాటలు ప్రణాళికలు ప్రజల నమ్మించే వ్యూహాలను ప్రకటిస్తే మాత్రం సామాన్యులకు ఒరిగేది ఏమిటి? ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా భారత ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్థ్య సేన్ మాటల్లో కనీస మైనటువంటి అవసరాలను తీర్చుకోగలిగినటువంటి స్థితిని మానవాభివృద్ధిగా నిర్వచించి అలాంటి పరిస్థితులు లేకుంటే ఇక దేశం అభివృద్ధి ఎలా చెందినట్లు? వాళ్ల సమస్యలను పరిష్కరించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం కాదా? ఇప్పటికీ కోట్ల మంది కొట్టుమిట్టాడుతూ అవసరాలను తీర్చుకోలేక కొనుగోలు శక్తి లేక విద్య వైద్య ఖర్చులను భరించలేక ప్రైవేట్ రంగం బారిన పడుతూ ప్రమాదగంటికలు మోగుతూ ఉంటే సామాన్యుడు ఈ దేశంలో బ్రతికేదెలా?
విద్యా వైద్యానికి కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో కనీస మైనటువంటి శాతాన్ని కూడా కేటాయించకుండా మొత్తం ప్రైవేటు పరం చేసిన సందర్భంలో అరకొ ర ఆదాయంతో బతుకుతున్నటువంటి కోట్లాదిమంది శ్రమజీవులు, వలస జీవులు, కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, యాచకులు ఏ రకంగా తమ అవసరాలను తీర్చుకుంటారో ప్రణాళికను అమలుపరిచే ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. తమ ఆదాయంలో విద్యా వైద్యానికి కనీసం 60-- 70% ఖర్చు అవుతూ ఉంటే పిడికెడు మెతుకులకు నోచుకోనటువంటి దుస్థితి లోపల మరింత పేదరికంలోకి నెట్టివేయబడుతున్న కారణంగా భారతదేశం ఎన్ని ప్రణాళికలు చేపట్టిన ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశం గానే మిగిలిపోయింది కానీ ఎదగకపోవడం విడ్డూరం. అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద కూడా కొద్దిమంది చేతిలో మగ్గిపోతూ ఉంటే రాజ్యాంగం ప్రకారంగా దేశ సంపద అందరికీ సమానంగా పంచాలి అని అన్నప్పుడు ఆ వైపుగా ప్రభుత్వ చర్యలు ఎందుకు లేవు ?
---- ఇప్పటికీ అటవీ ఆదివాసి ప్రాంతాలకు సరైనటువంటి రహదారులు కానీ వైద్య విద్యా సౌకర్యం లేక తల్లడిల్లుతున్న విషయం పాలకులకు తెలియదా.?
--- అత్యవసర సమయంలో వైద్యం కోసం కిలోమీటర్ల కొద్ది ధోలీలలో మోసుకెళ్తూ ఉన్నటువంటి సందర్భాలను ఇప్పటికీ అనేక రాష్ట్రాలలో చూస్తున్నాం .సరైన రహదారులు లేక రోడ్లు వంతెనలు వాగులు, కొట్టుకపోయి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్న విషయం పాలకులకు తెలియదా? .
-==అనేక గ్రామీణ పట్టణ ప్రాంతాలకు కూడా ఇప్పటికీ సింగల్ రోడ్డు పైననే రవాణా జరుగుతూ ఉంటే అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అలాంటి రోడ్లను అన్నింటిని డబుల్ రోడ్లుగా మార్చడం ద్వారా రద్దీ తట్టుకోవడానికి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి
అవకాశాలు ఏర్పాటు చేయాలి.
--- నిర్మిస్తున్నటువంటి రోడ్లు వంతెనలు ప్రాజెక్టులు ఇండ్లు నిర్మాణాలు ఏవైనా కూడా నాణ్యతలేని నాశరకం గమనిస్తే ప్రజాధనం ఎంతో దుర్వినియోగం అవుతుంటే కాంట్రాక్టర్లు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల సొమ్మును మెక్కదం ఎంతవరకు సమంజసం ?
---రాజకీయ అవినీతితోపాటు అధికార యంత్రాంగం లోపల కూడా అవినీతి రోజురోజుకు పెరిగిపోతూ ఉంటే సామాన్యులు సమిదలై పోతున్నారు కనీస అవసరాలను తీర్చుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న సందర్భాలను పాలకులు గమనించాలి.
--- వ్యవసాయ పొలాలు పంటచేలు, బావుల వద్దకు రైతులు వెళ్లి తమ వ్యవసాయాన్ని కొనసాగించడానికి వ్యవసాయ పరికరాలను చేర్చడానికి పండిన ధాన్యాన్ని రవాణా చేయడానికి కనీసమైన రోడ్డు సౌకర్యం కావాలి కదా! కానీ ఇప్పటికీ లేకుండానే కష్టపడుతూ చాలా తల పైన మోస్తూ లేదా ఇబ్బంది పడుతూ బురదలో ప్రమాదకరమైన లోయలలోనే రవాణా జరుగుతున్న విషయం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.
-- మధ్యాహ్న భోజనంలో పిల్లలకు పౌష్టికాహారానికి భిన్నంగా మామూలు అన్నము చారు తోనే సరిపుచ్చుతే ఎలా ?సరిపోయే స్థాయిలో వాళ్లకు డబ్బులను పెంచడం ద్వారా ఫుడ్ పాయిజన్ కు అవకాశం లేనటువంటి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం అవసరం లేదా?
--- గ్రామస్థాయి వార్డు సభ్యుల నుండి పార్లమెంటు సభ్యుల వరకు కూడా నేరస్తులు నేరంతో సంబంధం ఉన్నవాళ్లు లైంగిక కేసుల్లో శిక్షలు పడిన వాళ్ళు కొనసాగుతూ ఉంటే ఈ దేశ పాలన ఇంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
-- ఎన్నికల సమయంలో ఖర్చు చేసే పరిమితిని జీరోకు తీసుకు రావడం ద్వారా కనీస మైనటువంటి పేపర్ చార్జెస్ తప్ప ఏ రకంగా ఖర్చు చేయకూడదని ఆంక్షలు విధించినప్పుడు మాత్రమే నైతికంగా గల పేద వర్గాలు కూడా అధికారానికి వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం కోటాను కోట్లు ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే టికెట్ ఇవ్వడం వల్ల పేదలు విద్యావంతులు నీతిమంతులు నష్టపోతున్నారు కదా!.
--- ఇప్పటికీ ఇండ్లు ఉపాధి ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి వాళ్లు కోట్ల సంఖ్యలో ఉంటే వాళ్లకి దారి చూపాల్సినటువంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన యువత ఉపాధి లేక నిర్వీర్యమై అసాంఘిక కార్యక్రమాలకు బానిసలై మద్యం మత్తులో ఊగుతూ ఉంటే అలాంటి కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించడం చట్ట విరుద్ధం బాధ్యతారాహిత్యం కాదా ?
ప్రజలు ఎదుర్కొంటున్న అనేకమైన మౌలిక సమస్యలను పరిష్కరించిన తర్వాత మాత్రమే ప్రజలు పాలకులను విశ్వసిస్తారు లేకుంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకే తానులోని ముక్కలని కేవలం ప్రలోభాలు వాగ్దానాలు హామీలతో కడుపు నింపితే సరిపోదని అవసరమైన సందర్భంలో తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని తెలుసుకోవడం అవసరం. ఏ ప్రభుత్వమైనా పెట్టుబడిదారీ వర్గానికి వంత పాడుతూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడం సమంజసం కాదు విద్యా వైద్యం సామాజిక న్యాయాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని హామీ ఇవ్వలేదు ఏ పార్టీ కూడా ఇచ్చిన దాఖలా అసలే లేదు. కనీసమైన విద్య వైద్యాన్ని నాణ్యమైన స్థాయిలో ప్రజలకు ఇవ్వలేనటువంటి పాలకులు మీసాలకు సంపెంగ నూనె లాగ మూడవ ఆర్థిక వ్యవస్థని, 1000ఏళ్ల ప్రణాళిక అని, దేశం వెలిగిపోతుందని, వికసిత భారత్ అని గొప్పగా చెబితే ఇంకా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు అని తెలుసుకోవడం చాలా అవసరం. అంతేకాదు శాస్త్రీయ హేతువాద దృక్పథాన్ని పెంపొందించే బదులు అంద విశ్వాసాలను పెంచి పోషించే విధానాలను కూడా మానుకోవలసిన అవసరం ఉంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)