మహిళా దినోత్సవ ప్రాధాన్యతను ఎలా చూడాలి.
మహిళా దినోత్సవ ప్రాధాన్యతను ఎలా చూడాలి.* వర్ణనకే సరిపోతే లక్ష్యాన్ని చేరుకోవడం ఆలస్యం కావచ్చు.* సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో సాధికారత ముఖ్యం కానీ ఉచిత పథకాలు కాదు.*
*********************************
--- వడ్డేపల్లి మల్లేశం 9014206412
----08...03...2025*---**************
అంశాల వారీగా ఆలోచించినప్పుడు దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది ప్రపంచంలో ఏ ఒక్కటి కూడా మరో దానికంటే ఎక్కువ తక్కువ కాదు అనేటువంటి తత్వాన్ని ఆంగ్ల రచయితలు ఏనాడో మనకు అందించినారు. ఉదాహరణకు సూది చేసే పని గడ్డపార చేయదు గడ్డపార చేసే పని సూది చేయదు వాటి పరిమాణాన్ని బట్టి అంచనా వేసి సూది కంటే గడ్డపార గొప్పది అంటే చెల్లుతుందా? అలాగే స్త్రీ పురుషులకు సంబంధించి కూడా జీవన చిత్రంలో ప్రధాన భూమిక మనందరికీ తెలిసినదే. సమన్వయంతో, పరస్పర సహకారంతో, ప్రేమానురాగాలతో, బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా సందర్భోచితంగా ప్రాధాన్యత ఇచ్చుకోవడం ద్వారా సున్నితంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఒక్కొక్క అంశం గురించి ప్రాధాన్యతను మర్చిపోకుండా ఉండడం కోసం గొప్పతనాన్ని జ్ఞాప్తికి చేయడం కోసం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దినోత్సవాలను నిర్ణయించడం జరిగింది. కొన్ని ప్రజల మధ్యన నిర్ణయించబడితే మరికొన్ని ప్రభుత్వాల ద్వారా నిర్ణయించడం జరిగింది అంతర్జాతీయ దినోత్సవాలు సాధారణంగా ఐక్యరాజ్యసమితిలోని అనుబంధ సంస్థల ద్వారా నిర్ణయించడాన్ని మనం గమనించవచ్చు. ఆ రకంగా మే దినోత్సవం, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, అంతర్జాతీయ అక్రమ రవాణా దినోత్సవాల మాదిరిగాగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి ఏటా మార్చి 8వ తేదీన జరుపుకోవడం 1975 నుండి ప్రారంభమైనట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తున్నది. కానీ దానికి సుమారు 150 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న విషయాన్ని కూడా మనం గమనించాలి అది వేరే విషయం. అయితే మహిళా దినోత్సవ పుట్టుకకు సంబంధించి అనేక రంగాలలో మహిళలు వివక్షతకు గురికావడం, పారిశ్రామిక రంగాలలో పనిచేసే కూలీలుగా కార్మికులుగా ఉద్యోగులుగా వివక్షతను ఎదుర్కోవడం, ఎక్కువ పని గంటలు చేయవలసి రావడం వంటి అనేక సమస్యల నుండి పుట్టినటువంటి ఆలోచన ప్రతిఘటనకు ప్రతిరూపమే ఈ మహిళా దినోత్సవం అని చెప్పక తప్పదు. అంటే తమ హక్కుల కోసం వివక్షతను అడ్డుకోవడానికి ఆత్మగౌరవం కోసం మహిళలు స్వా భిమానంతో సాధికార సాధికారంగా పోరాడి సాధించుకున్నదే మహిళా దినోత్సవం అంటేఅతిషయోక్తి కాదు. కానీ దాన్ని వర్ణనకు మహిళల పట్ల అతి ప్రశంసల కు మాత్రమే పరిమితమైతే మహిళా దినోత్సవ ప్రాధాన్యత తగ్గించినట్లే అవుతుంది.
ప్రభుత్వాలు మహిళలను ముందు పెట్టుకుని వడ్డీ లేని డ్వాక్రా రుణాలు మహిళా సంఘాలు స్వయం సహాయక గ్రూపులవంటి అనే పథకాలను ప్రారంభించడం ద్వారా వారి లోపల ఆత్మ గౌరవాన్ని పెంపొందింప చేయడం సమంజసమే కానీ ఇటీవల కర్ణాటక తో పాటు తెలంగాణ మరికొన్ని రాష్ట్రాల లోపల కూడా అమలుకు నోచుకున్నటువంటి పథకాలలో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది వాళ్ల లోపల సృజనాత్మకతను లేదా పొదుపును పెంచేదిగా కాకుండా అది ఒక విస్తృత అవకాశంగా భావించే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే ఈ మధ్యన ఈ పథకాన్ని మిగతా రాష్ట్రాలలో అమలు చేయడానికి అనేక రకాల పరిశీలనలు పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో కోటానుకోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణికులు మహిళలు ప్రజలు ఏ వర్గము కూడా కోరకుండానే దీనిని చట్టబద్ధం చేయడం ద్వారా ప్రభుత్వాలకు వచ్చే కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతున్నది. అంతేకాదు ఇది పేద వర్గాలకు ప్రత్యేకించబడినదా అంటే అది కూడా కాదు అల్పాదాయ వర్గాలు విద్యా వైద్యం కోసం గ్రామీణ పట్ట ప్రాంతాల్లో కొట్టుమిట్టాడుతూ అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటూ తమ పిల్లలకు విద్యను వైద్యాన్ని అందించలేక వ్యవస్థ కునారిల్లి పోతుంటే చూస్తున్న ప్రభుత్వాలు కేవలం ఆకర్షణగా కనపడుతున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని చట్టబద్ధం చేయడాన్ని మహిళలు కూడా అనేక సందర్భాల్లో విమర్శించిన దాఖలాలున్నాయి.
రాజకీయాలలో సామాజికంగా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే విధంగా మహిళలకు వారి వాటా మేరకు రాజకీయాలలో అవకాశాన్ని చట్టబద్ధo గా కల్పించడం కేంద్రం ఇటీవల ప్రయోగాత్మకంగా బిల్లును ఆమోదింప చేసినప్పటికీ వెంటనే అమలు చేయాలని మహిళలు మహిళా సంఘాలు అఖిలపక్షాలు డిమాండ్ చేయడాన్ని కూడా ఆలోచించాలి. పురుషులకు మిన్నగా అనేక రంగాలలో స్త్రీలు రాణిస్తున్న విషయాన్ని కూడా మనం గమనించాలి అదే సందర్భంలో పని ప్రదేశాలలో, కార్యాలయాలలో, ఇంటి పట్ల, ప్రతిచోట, గృహంలో కూడా హింసకు లైంగిక వేధింపులకు అవమానాలకు బలవుతున్న సందర్భాలను పురుషులు ఆలోచించి తమ అమానవీయ సంస్కృతిని ప్రక్షాళన చేసుకోవడం చాలా అవసరం. ఇదే సందర్భంలో మహిళలను ఆట బొమ్మలుగా, అంగడి సరుకుగా, మార్కెట్ వస్తువుగా, అర్థనగ్నంగా టీవీలు సినిమాల్లో చూపిస్తున్న ధోరణి పైన ప్రభుత్వాలకు ఎందుకు అదుపు లేదు? ఆలోచించుకోవాలి. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని మాట ఇస్తున్నటువంటి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు మహిళలపై జరుగుతున్నటువంటి అనేక అఘాయిత్యాలకు కారణాలైనటువంటి మధ్యము, మత్తు పదార్థాలు, ధూమపానము, క్లబ్బులు, పబ్బులు ఈవెంట్లను ఎందుకు అదుపు చేయడం లేదు? ఇవన్నీ కూడా మహిళ పట్ల జరుగుతున్న దాడులకు కారణమని ప్రభుత్వం భావించడం లేదా? ప్రజలు ఆలోచించాలి మహిళలు కూడా ప్రభుత్వ మి స్స్తున్న పథకాలకు లొంగి తమ పైన జరుగుతున్నటువంటి అనేక దాడులను ప్రశ్నించకుండా ఉంటే భవిష్యత్తు మరింత అంధకారం అయ్యే ప్రమాదం లేకపోలేదు. లక్ష మందితో పది లక్షల మందితో సభలు సమావేశాలు పెట్టి మహిళా దినోత్సవాన్ని గొప్పగా జరుపుకోవడం ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో కార్యక్రమాలు నిర్వహించడం ఒక ఎత్తు కానీ అనునిత్యం కూడా అభద్రతకు గురవుతున్న ఆకాశంలో సగమైన మహిళల పట్ల సమాజం యొక్క వైఖరిని మార్చడంలో మాత్రం పాలకులు, చిత్తశుద్ధి కనపరచడం లేదు అనేది నిర్వీవాధాంశం. మహిళా దినోత్సవంవేల జరిగే చర్చలు సభలు సమావేశాలలో మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయం హింస లైంగిక దాడులు వేధింపుల పైన ఉక్కు పాదం మోపడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకొనబడాలి అలాంటిది ఏమైనా జరిగిందా? ఒక్కసారి ప్రభుత్వాలు కేంద్రం నుండి రాష్ట్రాల వరకు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకు రాజకీయంలో వాటా ఇవ్వడానికి దశాబ్దాల కాలం పట్టింది చివరికి దానిని అమలు చేయడానికి ఇప్పటికీ ప్రభుత్వాలకు మనసోప్పడం లేదంటే స్త్రీలను ఏ రకంగా రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రజాప్రతినిధుల కోటాలో మహిళలకు పదవులు ఉంటే వారికి బదులు వారి భర్తలే రాజ్యమేలి న సందర్భాలు మనం చూడలేదా? అది ఏ రకంగా సబబు అవుతుంది? అది సాధికారతకు చిహ్నమా? స్వావలంబనకు సంకేతమా?
సినిమాలు టీవీ ప్రసారాలు సెల్ఫోన్ వ్యవస్థ లోపల మహిళలను ఏ రకంగా ఆట బొమ్మగా చూపిస్తున్నారో అందరం చూస్తున్నాము. పసిపిల్ల వాడితో సహా పండు ముసలి వరకు చూస్తూ ఆనందిస్తూ కాలయాపన చేస్తున్నారు కానీ దానివల్ల సమాజానికి జరుగుతున్న నష్టాన్ని ఎక్కడ కూడా మహిళా సంఘాలు ప్రశ్నించకపోవడం చాలా విచారకరం. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలు ఉక్కు పిడికిలి బిగించి శపధం చేయాలి ఎక్కడ కూడా స్త్రీలను అవమానంగా చూపిస్తే సహించేది లేదని అనగలరా? ఆ వైపుగా కవులు రచయితలు మేధావులు చేస్తున్న కృషి ఏ పాటిది? మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. మహిళా రచయిత్రులు కూడా అనేక ప్రక్రియలో రచనలు చేస్తున్నారు కానీ స్త్రీని ఆట బొమ్మగా చూపిస్తున్నటువంటి మార్కెట్ మాయాజాలం పైన ప్రశ్నించకపోవడం, నామమాత్రంగా ప్రశ్నించిన ప్రజా ఉద్యమాలు లేకపోవడం విచారకరం. అంతెందుకు మద్యపానం ధూమపానం అసాంఘిక కార్యక్రమాలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం ఏ రకంగా మహిళలకు ద్రోహం తలపెడుతున్నదో తెలిసి కూడా స్త్రీలు మహిళా సంఘాలు సమాజము రచయితలు మౌనంగా ఉండడం మార్చి ఎనిమిదవ తేదీన మాత్రమే మహిళలను గొప్పగా వర్ణించి దేవతలు అని పొగడడంలో అర్థం ఏమున్నది? ఆనాడు తమ వేతనాల పెంపు కోసం, పని దినాల పని గంటల తగ్గింపు, కోసం వివక్షతను నిర్మూలించడం కోసం చేసిన పోరాటం ఫలితంగా ఏర్పడ్డ మహిళా దినోత్సవం తన రూపాన్ని మార్చుకుంటూ వస్తున్న క్రమంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని చూపగలిగే చర్చలు లేకుండా ఈ మహిళా దినోత్సవానికి అర్థం ఏమున్నది? ఎక్కడైనా ఏ వర్గం అన్యాయానికి అవమానాలకు గురవుతుందో ఆ వర్గం ముందు వరసలో పోరాటానికి సిద్ధపడాలి అప్పుడు మిగతా సమాజం వారి వెంట నడుస్తుంది నడవాలి కూడా! కానీ అవమానాలకు గురవుతూ అమానవీయంగా చూపించబడుతున్నటువంటి మహిళలు ఎక్కడ కూడా ఈ విషయంలో పోరాటం చేసిన దాఖలాలు కనిపించడం లేదు. అక్కడక్కడ మహిళలకు సంబంధించిన కొన్ని పత్రికల్లో వ్యాసాలు కథలు రచనలు వస్తున్నాయి తప్ప ప్రజా ఉద్యమాలు మాత్రం రావడం లేదు ఆ పరంగా మహిళా సంఘాలు తమ బాధ్యతను విస్మరించినట్లుగా భావించవలసి వస్తుంది. ఇదే సందర్భంలో మానవత్వంతో ఆలోచించగల పురుషులు స్త్రీల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఉద్యమం చేపడితే తప్పేమీ లేదు, కానీ ఆ వైపుగా ఆలోచించే వాళ్ళు బహు తక్కువ. ఇప్పటికీ కళారూపాలలో రచయితలు కవులు మేధావులు తమ ఆలోచనలు సమావేశాలు చర్చల సందర్భంగా మహిళా సాధికారతను ప్రధాన అంశంగా తీసుకొని ప్రశ్నించడం నేర్పాలి నేర్చుకోవాలి. మహిళలను ఆ పరంగా సమాయత్తం చేయాలి ఇవన్నీ పక్కనపెట్టి ప్రభుత్వాలు కోట్లాది రూపాలు వాళ్లకు కట్టబెడుతున్నట్లు, ఉచిత పథకాల ద్వారా వాళ్లను కోటీశ్వరులను చేస్తున్నట్లు ప్రకటించినంత మాత్రాన మహిళల్లో సాధికారత సాధ్యమవుతుందా? ఆత్మగౌరవం పెరుగుతుందా? అగౌరవంపాలు అవుతున్నటువంటి మహిళలకు గౌరవం చేకూరుతుందా? ఆలోచించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. ఈ అంశం కేవలం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున చర్చించేది మాత్రమే కాదు. జీవన క్రమంలో అనునిత్యం కూడా వేదనకు గురవుతున్నటువంటి మహిళల గురించి యావత్ సమాజము ఆలోచించాలి, ప్రశ్నించుకోవాలి, కారణాలు వెతకాలి, పోరాటాన్ని ఉదృతం చేయాలి, అప్పుడు మాత్రమే మహిళా దినోత్సవానికి ప్రాధాన్యత సార్థకత చేకూరినట్లు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )