భూస్వాములు,కార్పొరేట్ శక్తుల కోసమే *చట్టం మార్పు— వామపక్ష పార్టీలు
జోగులాంబ గద్వాల 23 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల భూస్వాములు, కార్పొరేట్ శక్తుల కోసమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేశారని,తక్షణమే చట్టాన్ని పునరుద్దరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి,న్యూ డెమోక్రసి నాయకులు జమ్మిచేడు కార్తీక్ డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక సీపీఎం కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వల్ల గ్రామీణ ప్రాంతాలలో కొంత మేరకు భూస్వాముల ఆధిపత్యం తగ్గిందని,కానీ ఉపాధి చట్టం రద్దుతో కూలీలపై భూస్వాముల పెత్తనం పెరిగే అవకాశం ఉందని అన్నారు.కోట్లాదిమంది ఉపాధి కూలీలకు నష్టం కలిగించే పద్ధతుల్లో చట్టాన్ని మార్చడం జరిగిందన్నారు.ఉపాధి చట్టం వల్ల కూలీలకు పని లభించి కొంతవరకు కూలీల కొనుగోలు శక్తి పెరిగిందని అన్నారు.ఈ చట్టం పట్టణ ప్రాంతాలకు విస్తరించాలనే డిమాండ్ పెరుగుతుండడంతో కార్పొరేట్ శక్తుల మద్దతుతో ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని రద్దు చేశారని విమర్శించారు.కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్న ప్రభుత్వాలు ఉపాధి కూలీలకు ఉన్న చట్టాన్ని ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి చట్టాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించి,పట్టణ ప్రాంత పేదలకు సైతం ఉపాధి కల్పించి,ప్రజల ఆదాయాన్ని పెంచవలసింది పోయి, చట్టాన్ని రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు.ఇప్పటికే కోట్లాది మంది కూలీలకు సాంకేతిక సమస్యల పేరుతో కూలీలు చెల్లించలేదని,ఇప్పుడు నిధుల చెల్లింపులో రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పెంచి, రాష్ట్రలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు.ఆర్థిక లోటు తో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రలపై అదనపు భారాలను మోపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకస్తున్నామని అన్నారు.సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అధికార కేంద్రికరణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు వ్యతిరేకించాలని కోరారు.దేశ స్వాతంత్రం కోసం పోరాడి, జీవితాలను త్యాగం చేసిన మహనీయుల చరిత్రలను చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.చట్టసభలలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం పెరగకపోతే ప్రజలకు,దేశానికి ఎంత నష్టం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని సూచించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్- గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ పథకాన్ని రద్దుచేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో CPM పార్టీ జిల్లా కార్యదర్శి A. వెంకటస్వామి,జిల్లా కమిటీ సభ్యులు వివి. నరసింహ, ఉప్పేరు నరసింహ, CPIML న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు జమ్మిచేడు కార్తీక్, హలీమ్ పాషా,వినోద్, సిపిఎం నాయకులు సీతారాములు,వీరేష్ తదితరులు పాల్గొన్నారు.