న్యాయ వ్యవస్థలో జాప్యం తో ఆందోళనలో సామాన్య   ప్రజానీకం

Dec 30, 2024 - 19:26
Feb 13, 2025 - 19:14
 0  3

న్యాయ వ్యవస్థలో జాప్యం తో ఆందోళనలో సామాన్య   ప్రజానీకం.

సుప్రీంకోర్టు  ఆదేశించిన గ్రామ న్యాయాలయాల  ఏర్పాటుతో  అయినా సత్వర న్యాయం సాధ్యమేమో.!  

న్యాయవ్యవస్థలోని సంక్షోభాన్ని పరిష్కరించాలంటే  ప్రత్యామ్నాయాలు  అవసరం  కూడా.

 బడా నేరగాళ్లకు శిక్షలు పడడం కూడా న్యాయవ్యవస్థలో కీలకము.

వడ్డేపల్లి మల్లేశం 
11...10...2024

సిద్ధాంతం ఎంత ఆదర్శంగా ఉన్నా ఆచరణ  దారితప్పినప్పుడు  ఫలితాలు కూడా తారుమారుకాక తప్పవు అనడానికి భారతదేశంలో  న్యాయవ్యవస్థ ద్వారా  సామాన్య ప్రజలకు ఎదురవుతున్న అసౌకర్యాలు పెద్ద ఉదాహరణగా భావించవచ్చు.  బడా నేరగాళ్లు దేశద్రోహులు  పలుకుబడితో శిక్షల నుండి తప్పించుకొని చట్టసభల్లో రాజ్యమేలుతుంటే  చిన్నాచితక  నేరారో పణ పైన  దశాబ్దాలుగా విచారణ ఖైదీల పేరుతో  శిక్షలు అనుభవిస్తున్న పేదవర్గాలు  న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం సత్వరమే లభించక ఆందోళన చెందుతున్న విషయం  నేడు ప్రధాన చర్చనీయాంశం అయినది  .సంస్థాగత లోపాలు, సిబ్బంది కొరత, న్యాయమూర్తుల  బదిలీలు ,   ప్రభుత్వం తెలిపే  కారణాలు ఏవైనా రాజ్యాంగ పీఠికలో రాసుకున్న సత్వర న్యాయం  జరగడంలో మాత్రం  మాట తప్పిన విషయాన్ని అందరూ అంగీకరించి తీరాలి .   21వ అధికరణం ప్రకారంగా గౌరవంగా జీవించే హక్కును కాలరాస్తూ  విచారణ సత్వరం చేయకుండా విచారణ ఖైదీల సంఖ్యను భారీగా పెంచుతూ కిక్కిరిసిన జైల్లో  కుక్కి ద్రోహం తల పెడుతూ ఉంటే  తమ కేసు విచారణకు రావడానికి ఎన్ని దశాబ్దాలోనని ఎదురుచూస్తూ జీవితాలను  కోల్పోతున్న పేద వర్గాలు కోట్లాదిమంది ఈ దేశంలో  సమస్యలకు మూలాలేమిటి పరిష్కారాలు? ఎందుకు తీరడం లేదు?  ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటి?   న్యాయవ్యవస్థ సూచించే సమాధానం ఏమిటి? అని అందోళనచేందుతున్నారు.  ఇవన్నీ ఒకే ఎత్తు అయితే  సత్వర న్యాయాన్ని కోరుకొని  తన దారిలో తాను నమ్మిన సిద్ధాంతం కోసం శ్రమను నమ్ముకుని బతుకుతున్నటువంటి కోట్లాది ప్రజానీకం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం అవసరమా?  ప్రత్యామ్నాయం లేదా? అని ఆలోచిస్తున్న తరుణంలో  ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కూడా ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నదని  రూడీ చేస్తున్నది . ఈ సందర్భంలో ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం  గ్రామీణ ప్రాంతాలలో న్యాయాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా  న్యాయవ్యవస్థ పైన పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడంతోపాటు నిజమైన న్యాయాన్ని ప్రజలకు గడప లోపల అందించవచ్చు కదా! అని చేసిన సూచన కూడా  చర్చించి ఆమోదిస్తే బాగుంటుంది .

సామాజిక బాధ్యత కర్తవ్యాన్ని మరిచి కేసుల చుట్టూ తిరుగుతూ :- 

భూ కబ్జాదారులు, అక్రమ ఆస్తుల  కూడబెట్టేవారు, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న వాళ్లు, దేశద్రోహులు,  బడా నేరగాళ్లు,  ప్రజా సంపదను వివిధ రూపాలలో కొల్లగొట్టే వాళ్ళందరూ ఈనాడు దేశంలో  కటకటాల్లో ఉండాల్సినది చట్టసభల్లో ఉండడం చాలా విడ్డూరం.  పాలకవర్గాలు లేదా రాజకీయ పార్టీల అండతో ఇలాంటి నేరగాళ్లు తప్పించుకు తిరుగుతూ ఉంటే  చిన్నా చితక ఆరోపణలపై  అరెస్ట్ అయిన వాళ్లు చిత్రవధకు గురవుతూ నేరాన్ని  రుజువు చేయకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తుంటే  బలవుతున్న కుటుంబాలు సత్వర న్యాయం కావాలని కోరుతున్న నేపథ్యంలో  ప్రత్యామ్నాయాలను ఆలోచించక తప్పదు . రాజ్యాంగబద్ధమైన, న్యాయపరమైన ,ప్రభుత్వ నిర్వహణకు సంబంధించి కారణాలు ఏవైనా  నేడు భారతదేశంలో  వివిధ న్యాయస్థానాలలో పెండింగ్లో ఉన్న కేసులను  పరిశీలించినప్పుడు ఒక సంవత్సరం నుండి 30 ఏళ్ల పైబడి  పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న కేసుల సంఖ్య 4 కోట్ల 56 లక్షల 10వేల 882  అయితే  అరెస్టై వివిధ జైల్లో ఉన్నటువంటి ఐదు లక్షల 76 వేల మంది నిందితులలో  74 శాతం మంది కేవలం విచారణ ఖైదీలుగా మాత్రమే ఉండడం ఆందోళన కలిగించే విషయం . విచారణ  చేయకుండా  ఖైదీలకు నిరంతరం శిక్షలు  అమలు చేస్తూ న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్నటువంటి పాలకవర్గాల దమననీతిని ఎండ కట్టాల్సిన అవసరాన్ని ఈ పెండింగ్ తెలియజేస్తున్నది కదా!  అంతేకాదు  17వ లోక్సభలో 84శాతం మంది రాజ్యసభలో 36 శాతం మంది  నేరస్తులు నేర చరిత్ర కలిగిన వాళ్లు ఉన్నారని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నప్పుడు  ఇక సామాన్య పేద వర్గాలకు న్యాయం ఎలా జరుగుతుంది?  ఇది నిజంగా భారత సమాజం సిగ్గుతో తలదించుకోవలసిన  సందిగ్ధ సంఘర్షణ  స్థితి అని చెప్పవచ్చు . అక్రమ కేసుల బనాయింపుకు,  నిజమైన నేరస్తులను  విడిచిపెట్టడానికి , నిర్దోషులకు శిక్షలు అమలు చేస్తున్న తీరుకూ  పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  వహించవలసి ఉన్న తరుణంలో  రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు ఇలాంటి కేసుల్లో ఇరుక్కొని తమ జీవితాలను బలి పెడుతూ ఉంటే  రాజ్యాంగ పలాలు పొందకుండా తమ రెక్కల కష్టాన్ని చెమట చుక్కల నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్లకు  ముఖ్యంగా గ్రామీణ పేదలకు  సత్వర న్యాయం కోసం ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన తరు ణం ఆసన్నమైనది .

సుప్రీంకోర్టు సూచన  అమలయితే  కొంత పరిష్కారమే :-

సుదూర ప్రాంతాలకు వెళ్లి,  తమ ఆస్తిపాస్తులను అమ్ముకొని,  న్యాయం కోసం ఆరాటపడుతూ దశాబ్దాలు గడిపే బదులు  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు  సత్వర న్యాయం అందించేందుకు గాను గ్రామ న్యాయాలయాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు అభిప్రాయపడడంతో పాటు  వాటి ఏర్పాటు మౌలిక వసతులకూ సంబంధించి అన్ని రాష్ట్రాలు అఫీడవిట్ దాఖలు చేయాలని  ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని  జూలై 12, 2024న  ఒక కేసు విచారణ సందర్భంగా ఆదేశించడం  స్వాగతించవలసిందే.  కోర్టుల పైన పెండింగు భారాన్ని తగ్గించడానికి , వ్యవస్థ పై ఉన్న  నిందను దూరం చేసుకోవడానికి , ప్రభుత్వ నిర్వహణలోని అలసత్వానికి  ముగింపు పలకడానికి  ముఖ్యంగా గ్రామ న్యాయాలయాలు దోహదపడతాయని  సుప్రీంకోర్టు బెంచి అభిప్రాయ పడినట్లు తెలుస్తుంది.  జస్టిస్ బి ఆర్ గవాయి గారి నేతృత్వంలోని ధర్మాసనంలో  జస్టిస్ పీకే మిశ్రా జస్టిస్ కెవి విశ్వనాథన్ గారలు సభ్యులుగా ఉన్న బెంచ్  సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో  గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేసే విధంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్ పైన విచారణ సందర్భంగా ఈ తీర్పునివ్వడం హర్షించదగినది.  కేంద్ర ప్రభుత్వం 2008లో తీసుకువచ్చినటువంటి చట్టం ప్రకారంగా  గ్రామ న్యాయాలయాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయవలసి ఉన్నప్పటికీ  ప్రభుత్వాల అలసత్వం కారణంగా కేవలం 6 శాతం మాత్రమే గ్రామ న్యాయాలయాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు అయినట్లు తెలుస్తున్నది.  2009 నుండి గ్రామ న్యాయాల ఏర్పాటు పైన హిమాచల్ ప్రదేశ్  హైకోర్టు కేంద్ర చట్టం మేరకు ఆ రాష్ట్రంలో  న్యాయాలయాల ఏర్పాటుకు సూచిo చినప్పటికి ఆ రాష్ట్రం పట్టించుకోవడంలేదని ఒక పిటిషనర్   తరపు న్యాయవాది  ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చినప్పుడు  గ్రామ న్యాయాల ఏర్పాటుకు సంబంధించి థాజా పరిస్థితిని వివరిస్తూ దాఖలు చేయాలని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో సహా  ఇతర రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసిన సందర్భంలో  సర్వోన్నత న్యాయస్థానం  ఈ న్యాయాలయాల ఏర్పాటు తక్షణమే చేయాలని ఆదేశించడం  పట్ల ప్రజలు ప్రజాస్వామిక వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి  ప్రధాన అంశం అవుతున్నది.  ,"పాలకులకు చట్టసభలకు  రాజకీయ పార్టీలకు ప్రజల సమస్యలను పరిష్కరించడం పైన కాకుండా పెండింగ్లో ఉంచడం పైనే ఎక్కువ ఆసక్తి ఉంటుంది అనేది మనకు తెలుసు. అంతే కాదు  ప్రజలను విద్యావంతులను ఆరోగ్యవంతులను చేసి ఉచిత విద్య వైద్యం వంటి  సౌకర్యాలు  ప్రజలకు నాణ్యమైన స్థాయిలో అందించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  సూచించినప్పటికీ ఇప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కూడా ఆ విషయం పైన  స్పష్టమైన ప్రకటన చేయకపోవడాన్ని బట్టి పాలకుల యొక్క నిర్లక్ష్యం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అదే నిర్లక్ష్యాన్ని న్యాయ వ్యవస్థలో కూడా కొనసాగించడం వల్లనే  ఈ గడ్డు పరిస్థితులు దానికి పరిష్కారంగా ఈ గ్రామ న్యాయాలు కొంత ఉపయోగపడితే సంతోషం." వీటి ఏర్పాటుకైన ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రజాసంఘాలు అఖిలపక్షాలు కేంద్రంపై  ఆయా రాష్ట్రాలపై ఒత్తిడి చేయనంతవరకు  ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రతి చోట కూడా హక్కులను సాధించుకోవాలన్నా ,సౌకర్యాలను అనుభవించాలన్న, రాజ్యాంగ  అవకాశాలను సొంతం చేసుకోవాలన్న,  ఎవరి వాటా వారికి దకాలన్న  పాలకులు చట్టసభలు అధికార యంత్రాంగం న్యాయవ్యవస్థ  మన చేతికి అందిస్తుంది అనుకోవడం మూర్ఖత్వమే! పోరాటాలు లేకుండా, ఒత్తిడి లేకుండా, ప్రశ్నించకుండా, ప్రతిఘటించకుండా ఏది సాధ్యం కాదు ముఖ్యంగా భారతదేశంలో.
  (ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333