ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి

Mar 6, 2026 - 20:45
Mar 6, 2026 - 20:51
 0  11
 ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి

పాఠశాలలు, వసతి గృహాలపై నిరంతర పర్యవేక్షణ అవసరం 

 జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.


Suryapet, 06 మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా, సమన్వయంతో అమలు చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్   అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్  సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ సీతారామారావు తో కలిసి ముందుగా జిల్లా అధికారులతో సమగ్ర దిశానిర్దేశం నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వార్డు అధికారులు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 6 నుండి జూన్ 12 వరకు వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. మార్చి 6 నుండి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాలలో ఫైళ్ల పరిష్కరణ అంశంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల వేగవంతమైన పరిష్కారం, రికార్డుల సక్రమ నిర్వహణ, ప్రజలకు సమయానుకూల సేవలందించడం లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో తడి–పొడి చెత్త వేరు సేకరణ, పిచ్చి మొక్కల తొలగింపు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త నిర్మూలన, ప్రభుత్వ భవనాల శుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు ఆరోగ్యం – ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనకమైన భవిష్యత్తులు అంశంపై ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు, వైద్య పరీక్షలు, గర్భిణీలు మరియు చిన్నారులకు ప్రత్యేక పర్యవేక్షణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు.

ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు సురక్షితంగా చేరుకోండి (Arrive Alive) కార్యక్రమం హోం మరియు రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలిపారు. రోడ్డు భద్రతపై అవగాహన, ట్రాఫిక్ నియమాల కఠిన అమలు, హెల్మెట్–సీట్‌బెల్ట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 25 వరకు సంక్షేమం అంశంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు మరియు ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు స్థితిపై సమీక్షలు నిర్వహించి, లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు పిల్లల భద్రత మరియు రక్షణ – డ్రగ్స్‌కు నో కార్యక్రమం పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాల రూపంలో అమలు చేయబడుతుందని చెప్పారు.

మే 4 నుండి మే 9 వరకు రైతులు (వ్యవసాయం( అంశంపై వ్యవసాయ, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్ శాఖలు సమన్వయంతో రైతులకు సాగు సలహాలు, ఎరువులు–విత్తనాల లభ్యత, సాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా అంశాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మే 11 నుండి మే 16 వరకు విద్య అంశంపై పాఠశాలల మౌలిక వసతులు, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, బోధన నాణ్యతపై సమీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు.

మే 18 నుండి మే 23 వరకు యువత మరియు క్రీడలు అంశంపై క్రీడా పోటీలు, యువజనోత్సవాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు చేపట్టాలని సూచించారు.

మే 25 నుండి మే 30 వరకు మహిళలు అంశంపై మహిళా సాధికారత, స్వయం ఉపాధి, స్వయం సహాయక సంఘాల బలోపేతం, రుణాల సద్వినియోగంపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జూన్ 1 నుండి జూన్ 12 వరకు పర్యావరణం అంశంపై వృక్షారోపణ, ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం పెంపు కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు.

ఈ 99 రోజుల కార్యాచరణ గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఐదు దశల్లో అమలు చేయబడుతుందని తెలిపారు. మార్చి 7న ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో కార్యాచరణపై గౌరవ మంత్రుల సమీక్ష సమావేశం నిర్వహించబడుతుందని వెల్లడించారు. సంబంధిత శాఖల అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా హాజరుకావాలని ఆదేశించారు.

మార్చి 6 నుండి 16 వరకు నిర్వహించనున్న పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రత్యేక దిశానిర్దేశం చేస్తూ ప్రతి గ్రామం, మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రహదారుల వెంట పిచ్చి మొక్కల తొలగింపు, చెత్త నిర్మూలన, తడి–పొడి చెత్త వేరు సేకరణను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

మహిళా సంఘాల రుణాల పంపిణీ లక్ష్యాలను పూర్తిగా సాధించాలని, తక్కువ వసూళ్లు ఉన్న మండలాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల స్థాపన, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, శ్రీనిధి రుణాల 100 శాతం వసూళ్లపై కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.

మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను నిరంతర పర్యవేక్షణలో ఉంచి వసతి గృహాల్లో భోజన నాణ్యత, పారిశుద్ధ్య పరిస్థితులను ప్రతిరోజూ తనిఖీ చేయాలని ఆదేశించారు. పాఠశాలల పర్యవేక్షణ పూర్తి బాధ్యత సంబంధిత అధికారులపైనే ఉంటుందని స్పష్టం చేశారు.

 తమ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల మంజూరు స్థితి, గ్రౌండ్ లెవెల్ పురోగతి, పెండింగ్ కారణాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త వాహనాలు, డ్రైనేజీ విస్తరణ వివరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం అత్యంత ముఖ్యమైన అంశమని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతిరోజు నిర్వహించిన కార్యక్రమాల పూర్తి వివరాలను రోజువారీ ప్రగతి నివేదికల రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా పురోగతి, సమస్యలు, తీసుకున్న చర్యలు తదితర వివరాలు సమగ్రంగా నివేదికలో పొందుపరచాలని సూచించారు. కార్యక్రమం అమలుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.

 ఈ సమావేశంలో  జడ్పీ సీఈవో శిరీష, సిపిఓ యాదగిరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్  సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333