స్థానం మారితే మాటలకు తెగబడుతున్న రాజకీయ పార్టీలు.
స్థానం మారితే మాటలకు తెగబడుతున్న రాజకీయ పార్టీలు.
ప్రజల పక్షాన ఉండాల్సిన అధికారులు కూడా అవకాశవాదులుగా మారితే ఎలా ?
పరస్పర విమర్శలే కానీ ప్రజా ప్రయోజనం పట్టని రాజకీయ పార్టీల కుటిల నీతిని ఎండగట్టాలి.
ప్రజలు బానిస మనస్తత్వాన్ని విడనాడి ప్రభువులుగా స్వారీ చేయడానికి తెగించిపోరాడాలి.
వడ్డేపల్లి మల్లేశం
09..10..2024
రాజకీయ పార్టీలు అవకాశాలను ఉపయోగించుకొని అధికారానికి రావడానికి ఎన్ని ఎత్తుగడలు వేసి అయినా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆలోచనే కానీ ప్రజా ప్రయోజనం మాత్రం విస్మరించడం రోజురోజుకు ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం గూర్చి గొప్పగా చెప్పుకోవడానికి అభ్యంతరం లేదు కానీ వాటి అమలులోనే ఉంది రాజకీయ పార్టీలు అధికారానికి వచ్చిన ప్రభుత్వాల ధమన నీతి .రాజ్యాంగ పీఠికలో రాయబడినటువంటి సౌమ్యవాద గణతంత్ర ప్రజాస్వామ్య లౌకిక భావజాలం సౌబ్రాతృత్వ ధోరణి న్యాయాన్ని సమానత్వాన్ని సాధించి పెట్టడం లక్ష్యంగా పేర్కొన్న కీలక అంశాలు ఆచరణలో సామాన్యుని గడప దాటకపోవడం భారత ప్రజాస్వామ్యం అపహాస్యం కావడానికి కారణమవుతుంటే దానికి బాధ్యత వహించవలసినటువంటి రాజకీయ పార్టీలు ప్రభుత్వ అధికార పక్షాలు దాటవేత ధోరణితో పరస్పరం విమర్శించుకుంటూ బెదిరింపు శాపనార్థాలు రెచ్చగొట్టి వెంటపడే ధోరణులు సిగ్గుచేటు. ప్రజా చైతన్యంతో హక్కులను కోల్పోతున్న విభిన్న వర్గాలు రాజ్యాధికారంలో వాటా కోల్పోతున్నటువంటి బహుజనులు అందరినీ కలుపుకొని రాజ్యాంగ పరిధిలోనే ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడటానికి నిరంతరం కార్యాచరణ కొనసాగాలి .ఆహారం నిద్ర ఏరకంగా సహజమైనటువంటి కార్యకలాపాలో అదే రకంగా ఉత్పత్తిలో భాగస్వాములు కావడం, పరిపాలన చేయడం, హక్కులు కోల్పోతున్న వాళ్లు పోరాడడం , చట్టసభల్లో ప్రజల పక్షాన ప్రశ్నించడం కూడా అంతే సహజమైన అంశాలుగా గుర్తించాలి. ఆ రకంగా చూసుకున్నప్పుడు ప్రస్తుతం భారతదేశంలో రాజకీయ పార్టీల యొక్క బెదిరింపు లేదా లొంగదీసుకునే రాజకీయాలు రెండు కూడా ప్రజాస్వామ్య సౌధాన్ని విచ్ఛిన్నం చేసేవే .
కుళ్ళు బోతు రాజకీయాలు :-
ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటించడంతోపాటు ప్రజల కోసమే పని చేస్తామని ప్రజల తీర్పు శిరోధార్యం అని ఓటమి అయినా గెలుపైనా ప్రజల వైపే ఉంటామని హామీ ఇచ్చి బహిరంగంగా ప్రకటించి ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన పార్టీని ఎలా నిందించడం అని ఆలోచిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అందుకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా విభిన్న అంశాల పైన తన పాలనా విధానాలను ప్రకటించక ముందే పరిపాలన బాగాలేదని, రాక్షస పరిపాలనని ,ప్రజల హక్కులను హరించి వేస్తున్నారని, ప్రజల పక్షాన పని చేయడం లేదని, స్వార్థ చింతనతో లాభాపేక్షతోనే పనిచేస్తే వెంటపడి తరిమికొడతామని మరొక పార్టీ హెచ్చరిస్తూ శాపం పెడుతూ నిందిస్తూ ఉంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాన్ని మీరు అధికారంలో కొనసాగినప్పుడు కొన్ని ఏళ్ల వరకు మందలించలేదని ఏ ప్రభుత్వానికైనా సర్దుకోవడానికి సమయం పడుతుందని ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కనీసం ఐదు సంవత్సరాల వరకు ప్రతిపక్షాలు మేధావులు ప్రజాసంఘాలు కూడా విమర్శించలేదని పాలక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు సర్ది చెప్పినా బెదిరింపులు మాత్రం తగ్గడం లేదు. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు దేశవ్యాప్తంగా కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ ఇదే తంతు .పరస్పరం విమర్శించుకుంటూ చట్టసభల సమయాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పబ్బం గడుపుకోవడం ఏ రకంగా ప్రజా పాలన ప్రజాస్వామ్యం అవుతుందో రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి . అధికారానికి వచ్చిన కొత్తలో ప్రజల పౌర మానవ హక్కులను పరిరక్షిస్తామని, స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడుతామని , ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తామని చెప్పిన రాజకీయ పార్టీలు అధికారానికి రాగానే అసహనా నికి గురికావడం , నిర్బంధం అణచివేత రాజ్య హింసకు పాల్పడడం, హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఉద్యోగ కార్మిక శ్రామిక ప్రజా సంఘాలు విభిన్న వర్గాలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి చిత్రవధకు గురిచేసి పోరాటాన్ని అణిచివేయడం ఇదేనా ప్రజా పాలన అని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ప్రశ్నించుకునే రోజులు రావడం ఇచ్చిన మాటకు కట్టుబడనీ పాలకవర్గాలకు ప్రమాదకరమే కదా !అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రజల దృష్టిలో ఉండాలని ఆలోచించిన రాజకీయ పార్టీలు ఒకే ఒక్కసారి ప్రభుత్వంలోకి రాగానే తీరును మార్చుకోవడం కొనసాగుతుంటే మరొకవైపు అధికారంలో కొనసాగి ఓడిపోయినటువంటి రాజకీయ పార్టీలు తమ ఓటమికి కారణం తమ పరిపాలన లోపం కాదని ప్రజల తొందరపాటు అని కొంతమంది ప్రజాసంఘాలు లేదా మేధావులు యొక్క కుట్ర అని మాత్రమే ప్రకటిస్తారు. కానీ తమ తప్పును స్వీకరించడానికి అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవడం కూడా తాము తవ్వుకున్న గోతిలో తామే పడడానికి ఏర్పరచుకున్నటువంటి వేదికగా భావిస్తే మంచిది. అంతేకాదు ప్రజల తీర్పును కూడా తప్పు పట్టడం మరింత ముర్కత్వం.
ఇక అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కార్యనిర్వహణలో అండదండలుగా ఉండాల్సినటువంటి అధికార యంత్రాంగం కూడా ప్రజా కోణాన్ని పక్కనపెట్టి పాలకులు ఏది చెప్పితే అది తూచా తప్పకుండా చేస్తూ స్వామి భక్తిని ప్రదర్శిస్తుంటే ఇటీవల కాలంలో హైకోర్టులు భారత సర్వోన్నత న్యాయస్థానం కూడా అనేకసార్లు అటువంటి అధికారులను మందలించిన సందర్భాలు అనేకం . ఒక దశలో కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు ఆ ఉద్యోగులను సస్పెండ్ చేస్తే కోర్టుకు వెళ్లిన సందర్భంలో న్యాయస్థానం కూడా ప్రజల పక్షాన పని చేయాలి కానీ ప్రభుత్వానికి మద్దతుగా పనిచేయడం అంటే బాధ్యతను విస్మరించడమే చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే అని ఇచ్చిన తీర్పు తోని ఇకనైనా అధికారులు గుణపాఠం తెచ్చుకోవాలి. ప్రజల పక్షాన నిక్కచ్చిగా పనిచేయడానికి సిద్ధపడాలి. గత కొంతకాలంగా మారిన ప్రభుత్వాల కాలంలో గతంలో ఐఏఎస్ ఐపీఎస్ ఇతర అధికారులుగా పనిచేసిన వాళ్ల నేర ప్రవృత్తి కేసులను తిరగదొడిన సందర్భంలో జైలుకు వెళ్లిన సందర్భాలు కూడా అనేకం ఇది ప్రజాస్వామ్యం పలుచబడడానికి పెద్ద సూచికగా భావించవలసిన అవసరం ఉంది. ఇలాంటి అప్రజా స్వామీక ఆలోచనలు సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలంటే ప్రజా చైతన్యం కీలకం. అంతేకాదు...
కొన్ని సూచనలు:-
వ్యక్తి వాదం భావవాదం ఎక్కువై భౌతిక వాదం తగ్గి ప్రజా ప్రయోజనాలు ఆకాంక్షలు విస్మరించి అధికారం కోసమే అర్రు లు చా స్తున్న ఈ కాలంలో పార్టీల పేరుతో ప్రభుత్వాలు , ముఖ్యమంత్రి పేరుతో ప్రభుత్వాలు కొనసాగడం సిగ్గుచేటు . గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని హుందాగా చెప్పుకునే వాళ్ళo . కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలంగా ఉండడానికి గతంలో సర్కారియా కమిషన్ వంటి అనేక కమిషన్లు చేసిన సూచనలను పాటించడం ద్వారా తమ రాజ్యాంగ సామాజిక బాధ్యతలను నిర్వహించడానికి రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వాలు కూడా పరస్పరం గౌరవించుకోవడమే కాదు ప్రజలు కూడా ప్రభుత్వాన్ని గౌరవించడం ప్రభుత్వాలు ప్రజలను ప్రభువులుగా చూడడం నేర్చుకోవాలి . ఓటు హక్కు కల్పించిన సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ " ఓటు హక్కు ద్వారా ఈ దేశంలో సమున్నతమైనటువంటి స్థాయికి ప్రతి వ్యక్తి చేరుకోవడానికి అవకాశం వచ్చింది ఓటు హక్కును వినియోగించుకొని పాలకునిగా యజమానిగా మారుతావో లేదా బానిసగా మిగిలిపోతారవో తేల్చుకో" అంటూ చేసిన హెచ్చరికను తూచా తప్పకుండా పాటించి ప్రజలను ప్రభువులు గా చూడడానికి అంగీకరించని పాలకులను ఆలోచింపజేసే విధంగా తమ హక్కులకై పోరాడుతూ రాజ్యాధికారంలో వాటా కోసం డిమాండ్ చేయడం మాత్రమే కాదు చట్టసభలను స్తంభింపజేయడం, రాజ్యాధికారం పట్ల ప్రధానమైన ప్రభలమైన కాంక్ష కలిగి ఉండడం, సర్వరోగ నివారిణి లాగా అట్టడుగు పేద వర్గాలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు అధికారమే ప్రధానమనే భావనను విశ్వవ్యాప్తం చేయడం ద్వారా మాత్రమే రాజకీయ పార్టీల కుట్రలు కుతంత్రాలు చిలిపి వేషాలు చులకన భావజాలం ప్రజాస్వామిక విలువలను హరించి వేసే దుష్ట సంస్కృతికి చరమగీతం పాడవచ్చు. అధికారానికి వచ్చిన ప్రభుత్వం రాబోయే 10 ఏళ్ల కాలమంతా మాదే అంటూ విర్రవీగుతుంటే సంవత్సరంలో ప్రభుత్వాన్ని పడగొడతాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మొత్తం సీట్లు మావే అంటూ చిల్లర వేషాలతో చిలిపి మాటలతో బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నటువంటి అపరిపక్వ నాయకుల కూటిల నీతిని ఎండ కట్టాల్సిన అవసరం చాలా ఉన్నది. రెండు పార్టీల మధ్యన సమస్య కాదు పరిపాలన అంటే ప్రజలను విస్మరించి రాజకీయ పార్టీలు స్వార్థం మనుగడ కోసం యుద్ధం చేస్తుంటే ఊరుకుందామా ?ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మాట్లాడకుండా ప్రశ్నించకుండా మౌనంగా ఉంటే తలవంచి మెడ వంచి మనపై స్వారీ చేయడానికి ప్రతివాడు సిద్ధపడతాడు. తల ఎత్తుకొని గలమెత్తి వీలైతే కలమెత్తి పిడికిలి బిగించి నిలదీస్తే రాజ్యాంగం కొంతవరకైనా అమలు కావడానికి అవకాశం ఉంటుంది. సమగ్ర శాసనంగా రాసుకున్న రాజ్యాంగం పైన ప్రమాణం చేసి అధికారానికి వస్తున్న పాలకులు రాజ్యాంగాన్ని పక్కనపెట్టి వ్యక్తి వాదాన్ని భావవాదాన్ని మూడవిశ్వాసాలను ఊహ లోకాన్ని ప్రజల ముందు పెడితే అంగీకరించినంత కాలం ప్రజలకు అవమానమే! బ్రతకాల్సింది బానిసలు గానే!. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నిర్మాణాత్మక ఆలోచన లేదు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడదామని సోయి లేదు. గత ప్రభుత్వానికి భిన్నంగా మౌలిక సమస్యలను ఏ లా పరిష్కరించవచ్చు, బుద్ధి జీవులు మేధావులతో చర్చించాలని చొ రవలేదు, మాటవరసకు అప్పుడప్పుడు సమావేశం నిర్వహించినా పరిపాలనలో మాత్రం సర్వత్ర ఉల్లంఘనలే. ఎన్నికల సందర్భంలో కొందరు బుద్ధి జీవులు ప్రజాసంఘాల వాళ్ళు తప్పుడు విధానాలకు పాల్పడుతున్నటువంటి పార్టీలను ఎండగడుతూ ప్రచారం చేసిన సందర్భాలను ఇటీవలి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనం చూడవచ్చు. ప్రజలు విసిగి వేసారి అవకాశాన్ని ఉపయోగించుకొని మార్పును కోరిన సందర్భంలో కొత్త ప్రభుత్వం వచ్చిన మాట వాస్తవం అయితే గత ప్రభుత్వానికి భిన్నంగా కొంతవరకైనా పాలన లేకుంటే మూస పరిపాలన విధానాలే కొనసాగినట్లయితే ప్రజలు మళ్ళీ మళ్ళీ గత ప్రభుత్వాలకు పట్టం కట్టే అవకాశం ఉన్నది . దానివల్ల ప్రజల జీవితాలు మారవు కానీ రాజకీయ పార్టీ నాయకుల యొక్క అవకాశాలను అందలమెక్కించడానికి మాత్రమే తోడ్పడతాయి. ఇది సమస్యకు పరిష్కారం కానే కాదు. వ్యక్తులు మారితే ప్రయోజనం లేదు పాలన నియమాలు నిబంధనలు మరింత కటిన తరం కావాలి. అంటే ప్రజల ఒత్తిడి పెరగాలి, పాలకుల పైన నిఘా వేయాలి , రాజ్యాంగం సరిగా అమలు అయ్యే విధంగా పోరుబాట సాగాలి. నిబంధనలు మారకుండా ఆటగాళ్లే మారితే మళ్లీ మళ్లీ తెరమీద కనపడేది పాత ముఖాలే.ప్రగతి మాత్రం శూన్యం, ప్రజాధనం పాలకుల భోజ్యం. ప్రజలను విస్మరించిన వాళ్లను బండ కేసి కొట్టాలంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన ఓటు హక్కు ఆయుధమని మేధావులు నిపుణులు హెచ్చరిస్తూ ఉంటే ఆ హెచ్చరికలను ఖాతరు చేయనంత కాలం ప్రజలు ఈ దుష్ట రాజకీయాల పరిణామాలకు బలి కావాల్సిందే.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అలసం రాష్ట్ర కమిటీ సభ్యులు (చౌటపల్లి) హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)