టీవీ ప్రసారాలలోని నిజాయితీ, సామాజిక దృక్పథం పై చర్చించుకోవడం అవసరం

Apr 7, 2024 - 19:20
Jul 1, 2024 - 20:53
 0  19
టీవీ ప్రసారాలలోని నిజాయితీ, సామాజిక దృక్పథం పై చర్చించుకోవడం అవసరం

 ప్రభుత్వాలు కూడా  సమాజం పైన  పడుతున్న దుష్ప్రభావాన్ని  నిఘా వేయవలసి ఉంటుంది. 

అనేక సామాజిక రుగ్మతలకు,  సాంఘిక విచ్చిత్తికి   టీవీ సీరియల్స్  హేతువులు గామారాయి  అనడాన్ని ఎలా చూడాలి? 

----వడ్డేపల్లి మల్లేషము 

సినిమాలు టీవీ ప్రసారాలలోని  సామాజిక ధర్మానికి  వ్యతిరేకమైన అంశాలను  మనం ఒక్కసారి పరిశీలించవలసిన అవసరం ఉంటుంది.   ఆలోచన కోణాన్ని సామాజిక దృక్పథాలను బట్టి  కథాంశాలను రచయితలు ఎంపిక చేసుకుంటారు  .అదే సందర్భంలో ప్రజలు ఎక్కువగా  ఇష్టపడే అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వడం కారణంగా కూడా  ఈ ప్రసారాల ద్వారా తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నది.  అబూత కల్పనలు, ఊహలు,  వాస్తవ జీవితానికి సుదూరంగా  అతిగా అంచనా వేసే  అంశాలను కథావస్తులుగా తీసుకోవడం కారణంగా కూడా  సినిమాలు టీవీ ప్రసారాలు సీరియలు ఇతర  ప్రక్రియల పైన వ్యతిరేకత కొట్టవచ్చినట్లుగా కనిపిస్తున్నది.  ఆసక్తిని కలిగించే విధంగా  శీర్షికలు,  కలర్  ఫోటోగ్రఫీ,  భారీ అంచనాలతో  ఆధునిక సెట్టింగులతో నిర్మాణం  కారణంగా  ప్రజలను  టీవీ ప్రసారాలు సీరియల్ వైపు ఆకర్షిస్తున్నప్పటికీ  లోతుగా పరిశీలించినప్పుడు  కుటుంబ జీవితానికి మానవ సంబంధాల విచ్చిన్నా నికి  ఏ రకంగా దారితీస్తున్నాయో అవగతం చేసుకోవచ్చు.

       సంభాషణల తీరు డైలాగుల జోరు ముసుగులో  కసిని పెంచి, విద్వేషాన్ని లేపి,  మానవ సంబంధాలను నిర్వీర్యపరిచి,  ప్రేమానురాగాలకు విఘాతం కలిగించే  అనేక సన్నివేశాలను సీరియల్లో మనం చూడవచ్చు.  గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాలలోనూ రెగ్యులర్గా వచ్చే సీరియల్ లను ప్రజలు  ఆసక్తిగా పరిశీలించడం,  వాటిపైన ఇష్టాన్ని పెంచుకోవడం , ఒకరోజు మిస్ అయితే ఏదో కోల్పోయినట్లు  ఆవేదన చెందడం  వంటి లక్షణాలను గమనించినప్పుడు  ఆడంబరాలు ఆకర్షణలకే తప్ప  సమాజం పై పడుతున్న ప్రభావాన్ని  గుర్తించడం లేదని తేలిపోతున్నది.  ఈ ప్రవాహంలో నిరక్షరాస్యులు  పేదలతో  పాటు  విద్యావంతులు  ధనవంతులు  సమాజాన్ని ఓ స్థాయిలో అంచనా వేయగలిగిన వాళ్లు కూడా  కొట్టుకుపోవడమే అత్యంత విచారకరం.  ఆటవిడుపుగా కొందరికి,  అలవాటుగా మరికొందరికి,  తృప్తి కోసం , తోడు లేని లోటును తీర్చుకోవడం కోసం  టీవీ ప్రసారాలు అలవాటు  మితిమీరిపోయిన విషయాన్ని గమనించినప్పుడు  అందులో ఉండే సాధకబాధకాలు,  హేతుబద్ధత, నీతి నిజాయితీ, క్రమశిక్షణ, మానవ విలువలు,  ప్రజా సంబంధాలు , జీవన అనుభవాలు  వీటిని  పట్టించుకోకుండా మొక్కుబడిగానే  ప్రసారమవుతున్నాయి .అందువల్ల కూడా  చెడును ప్రశ్నించే  వాళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ  చూచి తరించే వాళ్లు, తల ఊపే వాళ్లు,  రేపటి  ఘ ట్టాలను తలచుకుంటూ నిదిరించే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగిపోవడం  మెరుగైన సమాజానికి  సంకేతం ఏ మాత్రం కాదు .

    తెలంగాణ ఉద్యమ కాలంలో  ఆనాటి సినిమా  సంభాషణలు, పాటలు ,వికృత ధోరణులు,  సంబంధాల విచ్ఛిన్నానికి  కారణమవుతున్న సన్నివేశాలపై,  టీవీ ప్రసారాలలోని అమానవీయ సంఘటనలపై  ధూమ్ ధాం వంటి ప్రజా కార్యక్రమాలలో  విస్తృతంగా చర్చ జరిగిన విషయం అందరికీ తెలిసిందే . ఆనాడు ఉద్యమ పార్టీగా చెప్పుకున్న టిఆర్ఎస్  అధికారానికి వచ్చిన తర్వాత  సినిమాలను టీవీ ప్రసారాలను అందులోని  అనైతిక  అమానవీయ అంశాలను  సమీక్షించి  ప్రజా కోణంలో నిర్ణయం తీసుకుంటామని  భాషలోనూ భావములోనూ  ప్రదర్శనలోనూ  జీవితం పైన పడే ప్రభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని  ప్రభుత్వపరంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది . ఆ తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం  ఆ తర్వాత ఏనాడు కూడా ఆ అంశాన్ని  దృష్టిలో పెట్టుకో ని కారణంగా  ప్రజలు కూడా డిమాండ్ చేయకపోవడంతో    సినిమాలు సీరియళ్లు ఇతర ప్రసారాలన్నీ కూడా  సారాన్ని కోల్పోయినట్లు  లక్ష్యాన్ని మరిచి  కేవలం వినోదం కోసమే అన్నట్లుగా  ప్రజలు తిలకించడాన్ని మనం గమనిస్తే  హామీ ఇచ్చిన ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడం గమనార్హం.  విద్యావంతులు, మేధావులు ,సాంకేతిక నిపుణులు, శాస్త్రీయ అవగాహన  కలవాళ్ళు కూడా  ప్రసారాల యొక్క దుర్మార్గ పాత్రను  మానవ సమాజం పై పడుతున్న  చెడు ప్రభావాన్ని  ఆలోచించకపోవడంతో అనేక సామాజిక రుగ్మతలు ఈనాడు సమాజం నిండా  నిరంతరం కొనసాగుతున్నాయి.  అరాచకాలు, అత్యాచారాలు, స్త్రీల పట్ల లైంగిక వేధింపులు,  మద్యపానం, ధూమపానం, మత్తు పానీయాలు, డ్రగ్స్  వంటి అంశాలు  టీవీ ప్రసారాలలో ప్రధాన పాత్ర పోషిస్తుంటే  కుటుంబ మానవ సంబంధాల విషయంలో కూడా  హింస ప్రవృత్తిని ప్రేరేపించే విధంగా  కుటుంబ బంధాలను ధ్వంసం చేసే స్థాయిలో  సంబంధాలు సన్నివేశాలు ప్రదర్శనలు ఉండడాన్ని మనం కల్లారా చూడవచ్చు.  పెళ్లయిన భార్యాభర్తలు సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటే  స్వయంగా అబ్బాయి తల్లి " నా కోడలు ఎలా కాపురం చేస్తుందో చూస్తా  తనంతట తాను ఇల్లు  విడిచి వెళ్లిపోయేలా  ప్రయత్నాలు ముమ్మరం చేస్తా"  అనే అటువంటి సన్నివేశాలు సంభాషణలు సిగ్గుచేటు.  తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారాన్ని  పెంపొందించడం ద్వారా మానవీయ విలువలను సమాజం నిండా  ప రి వ్యాప్తి చేయవలసిన  సందర్భంలో   అసూయ ద్వేషాలు,  వెటకారపు మాటలు,  హింస ప్రవృత్తి,  కక్ష సాధింపు చర్యలు , హత్యా రాజకీయాలు,  ఆత్మహత్యలకు పూరికొల్పే  బెదిరింపులు,  స్త్రీలను  గుండాయిజం వైపు  నడిపించే సన్నివేశాలను  అనేకం చూడవచ్చు.  ఇక చాలా సినిమాలలో  సామాజిక అంశాలు,  పేదరికం, నిరుద్యోగం,  మానవ విలువలు, కుటుంబ బంధాలు , మానవ మనుగడ,  మనుగడ కోసం పోరాటం,  ప్రేమానుబంధాలు , ఆత్మీయత అనురాగాలు , పెద్దలను గౌరవించడం, చిన్నలను ప్రేమించడం , తల్లిదండ్రులను ఆదరించడం  వంటి అంశాలు ఎక్కడా కనిపించకపోగా  మద్యపానం ధూమపానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ  అశ్లీల దృశ్యాలను  మెదడులోకి చొప్పి స్తూ  ఆనందపడే  ఈ ప్రసారాల వెనుక ఉన్న   శక్తి ఏమిటి?  ఎందుకు ప్రభుత్వాలు అంగీకరిస్తున్నాయో,  ప్రజలు ఎందుకు ఇంతగా ఆదరిస్తున్నారో అర్థం కాకపోవడం  అర్థం చేసుకోకపోవడం  పైన సమాజం చర్చించవలసిన అవసరం చాలా ఉన్నది.

 "కయ్యం పెట్టింది రో కలర్ టీవీ ఇంట్లోకి వచ్చి " అన్న పాట  20 ఏళ్లకు ముందే మనం  గమనించి ఉన్నాం.  కుటుంబ సంబంధాలకు విగాథం కలిగించి  భార్యాభర్తలను ఘర్షణకు  పురికోలిపే  విధంగా  టీవీలలోని సన్నివేశాలతో పాటు  పరస్పర అవగాహనలో లోపం కారణంగా  ఎన్నో ఇండ్లలో ఘర్షణ  వాతావరణాన్ని మనం గమనించవచ్చు . టీవీ చూస్తూనే భోజనం చేయడం,  ఇతర పనులు చేయడం, వంట చేయడం,  ఆలోచించడం,  ఆదేశాలు జారీ చేయడం  వంటి అనాగరిక అసంబద్ధ విధానాలు నిర్ణయాల కారణంగా

ఆనందక్షణాలు  ఏ రకంగా మనిషిని  బలహీనుడిని చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు .

అయితే టీవీ ప్రసారాలలో సైద్దాంతిక , శాస్త్రీయ, విజ్ఞానదాయక,  మేధోపరమైన అంశాలు  లేవని చెప్పడానికి వీలు లేదు. కానీ  ఈ అంశాలను తలదన్నే స్థాయిలో  నిరంతరము  సీరియల్  సంభాషణలు దృశ్యాలు ప్రసంగాలు  అశ్లీల మాటలు  అశ్లీల సాహిత్యం  నిరంతరం వేధిస్తూ ఉంటే  కుటుంబాలలోని తల్లిదండ్రులు పిల్లలు  వాళ్ల మధ్య సంబంధాలు  ఏ రకంగా నిర్మాణాత్మకంగా ఉంటాయో మనం ఆలోచించుకోవాలి . సినిమాల్లో, సీరియల్లో జరిగినటువంటి సన్నివేశాల ఆధారంగా నిజజీవితంలో కొంతమంది  హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీ , దొంగతనాలు,  హింసకు  ప్రేరేపించబడినామని స్వయంగా చెప్పిన సందర్భాలను గమనిస్తే  అనేక అసాంఘిక కార్యక్రమాలకు సామాజిక రుగ్మతలకు  టీవీ ప్రసారాలు వేదిక కావడం బాధాకరమైన విషయం కాదా!  నాగరిక సమాజం  ప్రభుత్వాలు  బుద్ధి జీవులు కూడా  టీవీ ప్రసారాలు సినిమాలు ఇతరత్రా  సమాజాన్ని  తప్పు త్రోవ పట్టించే అసాంఘిక  మీడియా అంశాల పైన  ఉక్కు పాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది . ప్రజా జీవితాన్ని మరింత స్ఫూర్తివంతంగా తీర్చిదిద్దగలిగే అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా  తప్పుడు విధానాలకు  చరమగీతం పాడి  సమాజాన్ని మేల్కొల్పే సన్నివేశాలు   అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో  పౌర సమాజంతో పాటు ప్రభుత్వాలు కూడా క్రియాశీలక పాత్ర పోషించాలి . నాడు  టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని  నెరవేర్చని కారణంగా   హింస ప్రవృత్తీ ,అత్యాచారాలు, అరాచకాలు  కొనసాగిన విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం గమనించి  వెంటనే టీవీ ప్రసారాలు సినిమాల పైన సమీక్షించి  బుద్ధి జీవులు మేధావులతో సమాలోచన జరిపి  మానవీయ విలువలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని  ప్రజల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దాం.  ప్రజలు కూడా మంచి చెడు విచక్షణను  ప్రదర్శించి  తమ సూచనలు చేయడం ద్వారా  మహిళా యువజన సంఘాల పక్షాన  వ్యతిరేకతను నిరసనలను తెలపడం ద్వారా కూడా  మరింత మెరుగైనటువంటి ప్రసారాలు సినిమాలను  పొందడానికి అవకాశం ఉన్నది.  ప్రభుత్వం తన క్రియాశీలక పాత్రను పోషించడం తప్పనిసరి.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333