జీవించే హక్కును ఎవరు హరించినా రాజ్యాంగ  విరుద్ధమే  

Oct 13, 2024 - 21:15
Oct 14, 2024 - 16:23
 0  3

నిర్బంధముతో పాటు రాజ్య హింస  పై  జీవించే హక్కు పరిధిలో చర్చ జరగాలి.  వ్యక్తులను చంపగలరేమో కానీ  భావాలను చంపలేరు కదా.

వడ్డేపల్లి మల్లేశం

ఆదిమ కాలంలో  నధీ తీరాల వెంట అడవుల్లో వాగులు, వంకల్లో  ఆదిమ మానవుడు  ప్రకృతికి అనుసంధానమై తన అవసరాలను తీర్చుకునే క్రమంలో  భాషను, స్నేహాన్ని, భావాన్ని, ప్రేమను,  సంఘ జీవితాన్ని నేర్చుకొని నాగరికుడైన విషయం  మానవ పరిణామ క్రమాన్ని  అధ్యయనం చేస్తే అర్థమవుతుంది కదా  !అయినప్పటికీ తొలి నుంచి కూడా" మానవుడు తనకు జరిగిన నష్టాన్ని  అంగీకరించడు అదే మాదిరిగా అవసరమైతే ఇతరులకు సహాయం చేయడానికి వెనుకాడడు" అనే నైజాన్ని ప్రదర్శించడం  నిజమైన మానవతా వాదానికి  ఉనికికి దర్పణం పడుతుంది .అదే క్రమంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారంగా  "ప్రతి మనిషికి  జీవించే స్వేచ్ఛ ఉంది అంటే పౌరులతో సహా ప్రతి ఒక్కరికి అని అర్థం.  21వ అధికరణం ప్రకారంగా చట్టం ద్వారా ఏర్పరచబడిన ప్రక్రియ ప్రకారం తప్పితే  ఏ వ్యక్తి తన జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను  కోల్పోవడాన్ని చట్టం అనుమతించదు లేదా  స్వేచ్ఛను వ్యక్తిగత జీవితాన్ని  హరించే అధికారం ఇతరులకు లేదు."
  అని నిర్దేశిస్తుంటే  జీవితం  మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అనే అంశం పైన  భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం  అనేక సందర్భాలలో విస్తృతంగా వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తున్నది .   ఏకపక్షంగా కానీ లేదా చట్ట విరుద్ధమైన నిర్బంధాన్ని  కానీ ఆర్టికల్ 21  అనుమతించదు  అంటే నిషేధిస్తుంది అని అర్థం
రాజ్యాంగంలోని ఈ అధికరణం ప్రకారంగా వ్యక్తులకు ఉన్నటువంటి స్వేచ్ఛ  తనకు వీలున్న ప్రకారంగా జీవించడానికి,  సంచరించడానికి,  నచ్చిన పని చేసుకోవడానికి , మెచ్చిన చోట జీవించడానికి  ఇతరులకు హాని చేయనంతవరకు  చట్టబద్ధమే అని రాజ్యాంగం చెబుతున్నది . అయినప్పటికీ వ్యక్తిగత స్వేచ్ఛను  స్వాతంత్ర్యాలను  తోటి ప్రజలు  చట్టాలు  పోలీసు వ్యవస్థ  అధికారులు  చివరికి ప్రభుత్వం కూడా అనేక సందర్భాలలో  ధిక్కరించి  అణచివేతకు గురి చేసిన సందర్భాలను కూడా మనం గమనించవచ్చు . అలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి 21వ అధికరణం యొక్క ప్రయోజనం ఏముంటుంది ?
    నిర్బంధము,  జీవించే హక్కు పై చర్చ జరగాలి  :-
*"*******
    సాధారణ వ్యక్తుల నుండి అసాధారణ వ్యక్తుల వరకు  పేదవాళ్ల నుండి సంపన్నుల వరకు  అందరికీ కూడా ఈ దేశంలో  సమానమైన జీవించే హక్కును మన భారత రాజ్యాంగం కల్పించింది.  అలాంటి పరిస్థితుల్లో  చట్టాన్ని ఉల్లంఘించి  అధికరణాలను ధిక్కరించి  వ్యక్తి స్వేచ్ఛను హరించడమే కాకుండా  చట్ట విరుద్ధంగా నిర్బంధించిన సందర్భాలను  దేశవ్యాప్తంగా  లక్షల సంఖ్యలో మనం గమనించి ఉంటాము.  ఈ అన్ని సందర్భాలకు తగిన సమాధానం రావాల్సి ఉన్నది కదా! . పాలకులకు లేదా పెట్టుబడిదారీ వ్యవస్థకు  నచ్చనంత మాత్రాన  అభ్యుదయ భావజాలాన్ని కలిగి ఉండే  అర్హత ప్రజలకు ఉంటుంది  అనే విషయాన్ని  చాలా సందర్భాలలో ఈ దేశంలో  ప్రజలు నినదించడం జరిగింది . భగత్ సింగ్ కూడా తన ఉద్యమ కార్యాచరణను ప్రకటించినప్పుడు  వ్యక్తులను చంపగలరేమో కానీ వ్యక్తుల భావాలను భావజాలాన్ని  చంపలేరు అని  
తను నమ్మిన సిద్ధాంతం కోసం  స్వతంత్ర పోరాట కాలంలో ప్రపంచ చరిత్రను ఆకలింపు చేసుకున్న  సారాన్ని బట్టి  ప్రశ్నించి ప్రతిఘటించకపోతే స్వతంత్రం రాదని స్వేచ్ఛ ఈ దేశ ప్రజలకు లభించదని  పోరాటం చేసి ఉరికంబం ఎక్కిన  విషయం మనందరికీ తెలుసు . అయితే ఇక్కడ భగత్ సింగ్  నేరస్తుడని  ఆనాటి ఆంగ్లేయ ప్రభుత్వం  చట్ట పరిధిలో పనిచేసిందని చెప్పడానికి వీలు లేదు.  అశేష పీడిత ప్రజల పక్షాన  ప్రతినిధిగా పనిచేసిన భగత్ సింగ్  ప్రజల హక్కులను సాధించుకోవడానికి  పోరాటాన్ని ఎoచుకోక తప్ప లేదు.  హక్కులను సాధించుకోవాలంటే  జీవిత గమ్యాన్ని చేరుకోవాలంటే లక్ష సాధనకు పోరాటమే మార్గమని  చాటి చెప్పిన సందర్భం  నాటికి నేటికి ఏనాటికైనా  యువతకు ముఖ్యంగా  పాలకవర్గాల నిర్బంధం అణచివేతకు గురయ్యే వారికి చాలా అవసరం.  రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం  ఏ వ్యక్తి యొక్క  జీవితాన్ని వ్యక్తిగత స్వేచ్ఛను  హరించే అధికారం  ఎవరికీ లేదని  అంటే  పాలకవర్గాలకు కూడా లేదని దాని అర్థం . అదే సందర్భంలో జీవితం పైన వ్యక్తిగత స్వేచ్ఛ పైన  అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు  ప్రస్తావించినట్లుగా  మనకు తెలుస్తున్నది  అంటే  పాలకుల కంటే ప్రజలే  గొప్ప మరోరకంగా చెప్పాలంటే ప్రజలే ప్రభువులు  అని అర్థం చేసుకోవలసి ఉంటుంది.  పాలకవర్గాల స్వప్రయోజనం కోసం,  ఉనికి మను గడ కోసం  ప్రజలు ప్రశ్నించే సందర్భంలో  ఆత్మ రక్షణ కోసం  అనేక తప్పుడు విధానాలకు పాల్పడుతుంటారు . నల్ల చట్టాలను  ప్రయోగించి ప్రజల యొక్క  స్వేచ్ఛని అడ్డుకోవడానికి  ప్రశ్నించే ధోరణిని  అణచివేయడానికి సిద్ధపడుతుంటారు . ఆ రకంగా 19 75 లో దేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించి పత్రికల స్వేచ్ఛను ప్రజాస్వామ్య ప్రక్రియను ఖూ నిచేసిన సందర్భం మనదేశంలో ఉండనే ఉన్నది . అయితే దాని పర్యవసానం చదనంతర కాలంలో ఆ పార్టీ నీ ప్రజలు తృణీకరించిన విషయాన్ని కూడా గమనించాలి . ఏకపక్షంగా ప్రజలను నిర్బంధించకూడదని అధికరణం చెపుతుంటే  ప్రజల పక్షాన పని చేసినటువంటి బుద్ధి జీవులు మేధావులు హక్కుల కార్యకర్తలు  ఎంతోమందిని దశాబ్దాల తరబడిగా విచారణ ఖైదీలుగా  అప్రకటిత జైలు శిక్షకు  గురిచేసిన సందర్భాలు ఈ దేశంలో కోకోల్లలు.  ఆ సందర్భంలో  నిందితులు వేసిన ప్రశ్నకు న్యాయస్థానం కానీ ప్రభుత్వం కానీ సమాధానం  ఇవ్వకపోవడాన్ని సమాజం  గుర్తించాల్సిన అవసరం ఉంది . ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు ప్రభుత్వాన్ని నడిపించాలి,  ప్రజల డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలి,  ప్రజలను ప్రభువులు గా చూడాలి,  అంతిమంగా  ప్రజలే చరిత్ర నిర్మాతలని  ప్రపంచ అనుభవాలు ఘోషిస్తుంటే  ప్రజలను  యాచకులుగా బానిసలుగా  ప్రలోభాలకు గురిచేస్తూ  ప్రశ్నించకుండా ప్రతిఘటించకుండా  నిర్బంధించడంతోపాటు  అణచివేతను అనేక రూపాలలో ప్రయోగించి  తమ పబ్బం గ డుపుకుంటున్న పాలకవర్గాల దమన నీతిని  న్యాయ వ్యవస్థ తప్ప మరెవ్వరు ప్రశ్నించలేని పరిస్థితులు ఎదురైనాయి . ఈ సందర్భంలో  చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా 21 వ అధికరణం ప్రకారంగా  వ్యక్తిగత స్వేచ్ఛను హరించే అధికారం  పాలకులకు, ఎవరికి లేదనే అభిప్రాయంతో పాటు  అక్రమంగా నిర్బంధించడాన్ని 21 వ అధికరణం  నిషేధించినది అని చెబుతున్నప్పటికీ  ఆచరణలో దేశవ్యాప్తంగా అనేక సందర్భాలలో  జరుగుతున్న సంఘటనలను పరిశీలించినప్పుడు  మానవ హక్కుల సంఘాలు ప్రభుత్వానికి పోలీసు వర్గాలకు  గవర్నర్లకు చివరికి రాష్ట్రపతి గా రలకు కూడా  విచారణ జరిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడం  ఆ తర్వాత ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం  నిత్య కృత్యమైనది.  సిద్ధాంతాలు వేరువేరుగా ఉండవచ్చు కానీ  ప్రజల సంక్షేమం అభివృద్ధికి సంబంధించి  ప్రజలు చేసే డిమాండ్లను ఆలోచించవలసిన ప్రభుత్వాలు  నిర్బంధంగా అణచివేయడం ద్వారా  వాళ్ల భావజాలాన్ని  కట్టడి చేయాలని ప్రయత్నించడం   రాజ్యo హింసకు పాల్పడడం  అంతిమంగా  మానవ వనరులను ఈ దేశం కోల్పోవడం చాలా విచారకరం.  తోటి మనిషిని సాటి మనిషిగా చూడవలసిన సంస్కారాన్ని అలవర్చుకోవాల్సిన ఈ దేశంలో  దోపిడీ చేసే వాళ్ళు  అకృత్యాలు అత్యాచారాలకు పాల్పడే వాళ్లతో పాటు  ప్రభుత్వంలోని  పెద్దలు రాజకీయ పార్టీల నాయకులు  పారిశ్రామిక  వేత్తలు  పెట్టుబడిదారీ వర్గం లోని అనేకమంది కూడా  కార్మికులు కర్షకులను  ఎదిరించిన ప్రతి వ్యక్తిని కూడా  ఎక్కడికక్కడ అణచివేయడాన్ని  వాళ్ల ఉనికి లేకుండా చేయడాన్నీ మనం నిత్యం గమనిస్తూ ఉన్నాం . అనేకమంది బుద్ధి జీవులు మేధావులు  న్యాయ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తూ  నిర్బంధాన్ని తొలగించాలని  హింస ఆపాలని   ఏకాభిప్రాయాన్ని సాధించాలని  అంతిమంగా మానవ వనరులను ఈ దేశం నష్టపోకూడదని  కోరుతున్నప్పటికీ  జరగవలసిన నష్టం జరిగిపోతూనే ఉన్నది.   ఈ విషయంలో న్యాయవ్యవస్థకు  ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావుల నుండి  అందుతున్న విజ్ఞప్తులను  సానుకూలంగా పరిశీలించి ఈ దేశ మానవ వనరులను  కాపాడుకోవడానికి ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా  సామాన్య ప్రజల పక్షాన  చేస్తున్న విజ్ఞప్తిని  న్యాయ వ్యవస్థ పరిశీలిస్తుందని ఆశిద్దాం.  .హింసకు   వివక్షతకు అణచివేతకు  తావు లేనటువంటి  వ్యక్తిగత స్వేచ్ఛకు 100% పూచి ఇవ్వగలిగిన  మరో ప్రపంచం కావాలని  విప్లవ కవి  శ్రీ శ్రీ మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అంటూ  చేసిన నినాదాన్ని కార్యరూపం దాల్చడానికి  నూతన ఆలోచనలతో కొత్త జీవితాలు ప్రారంభించడానికి  తగిన వాతావరణం ఈ దేశంలో కల్పించడం కోసం దేశవ్యాప్తంగా  21వ అధికరణం పైన చర్చ జరగాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది . "ఒక్క అబద్ధాన్ని నిత్యం వల్లిస్తే నిజమైనట్లు  ఒక వాస్తవాన్ని చట్టబద్ధమైనటువంటి అధికరణంలో తెలియజేసినటువంటి అంశాన్ని  దేశవ్యాప్తంగా చర్చించడం ద్వారా  చట్టాలు  పాలకులు ఏ రకంగా   వ్యక్తిగత స్వేచ్ఛను ధిక్కరిస్తున్నారో , ప్రశ్నిస్తున్నారనే ముసుగు లో  అణచివేతకు పాల్పడుతున్నారో  ప్రజలకు అవగాహన కావాల్సిన అవసరం ఉంది . దేశ సంపద ప్రజలందరికీ చెందవలసినటువంటిది  కొద్దీ మంది సంపన్న వర్గాలకు ప్రభుత్వాలు దోచిపెడుతుంటే,  40 శాతం సంపద కేవలం 1 శాతం  సంపన్న వర్గాల చేతిలో కేంద్రీకృతమైతే  పేదరికం నిరుద్యోగం  ఆకలి చావులు ఆత్మహత్యలు  అసమానతలు అంతరాలు ఈ దేశంలో నిరంతరం కొనసాగుతూ ఉంటే  ఇదేమిటి అని ప్రశ్నించిన పాపానికి  నిర్బంధించడం అణచివేయడం విచారణ ఖైదీగా  శిక్షించడం  చివరికి హత్య చేయడం కూడా ప్రభుత్వాల వంతే అయితే  ఇది స్వతంత్ర భారతదేశ ఎలా అవుతుంది?  గౌరవనీయ స్థాయిలో ఉన్న న్యాయవ్యవస్థకు  సామాన్య ప్రజలు  చేస్తున్న విజ్ఞప్తిని వ్యాస రూపంలో  అందిస్తూ  ప్రభువులు గా కొనసాగవలసినటువంటి ప్రజలను  బలి పశువులను చేస్తున్న పాలకవర్గాల యొక్క  నిరంకుశత్వం, అణచివేత, నిర్బంధాలను,  న్యాయ వ్యవస్థ దృఢ హస్తముతో అణచివేయాలని, తమ రెక్కల   కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నటువంటి  ప్రజలకు ఈ దేశ సంపదలో సరైన వాటా లభించాలని,  ప్రజలు  వినయ పూర్వకంగా అభ్యర్థిస్తున్న విషయాన్ని  భారత సర్వోన్నత న్యాయస్థానం పరిశీలిస్తుందని  ఆదరిస్తుందని  రెక్కాడితే  గాని డొక్కాడని నిరుపేదల గూర్చి  కనికరిస్తుందని ఆశిద్దాం! . మానవ వనరులకు  భరోసానిస్తుందని  విశ్వసిద్దాం !
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయిత ల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333