రక్తసంబంధమైన మనసున్న యువత సామాజిక ఆలోచన.

Oct 17, 2025 - 19:26
 0  1

కన్న కడుపున పుట్టిన వాళ్లనే కాటికి పంపుతున్న వేళ రక్తదానంతో చేస్తున్న త్యాగం గొప్పది. సమాజ హితానికి యువతను ప్రేరేపించాలీ బంధం.

--- వడ్డేపల్లి మల్లేశం 

నేటి యువతలో ఆధునిక ధోరణులున్నప్పటికి నిశ్శత్తువ, నిర్లక్ష్యం, అకృత్యాలు కనిపించడం, చాలా చోట్ల పెడదారి పట్టినట్లుగా దృష్టికి రావడం వంటి సంఘటనల వలన మొత్తం యావత్ యువతను తప్పుబట్టే ధోరణిలో సమాజం ఘాటుగానే స్పందిస్తున్నది. దీనికి పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు.కానీ గుడ్డిలో లో మెల్ల లాగా సమాజాన్ని మేల్కొల్పే దిశగా పనిచేస్తున్న యువతను కూడా గుర్తించవలసిన బాధ్యత ఈ సమాజానిదే. ఆ క్రమంలోనే వారికి కనువిప్పు కలిగించే చర్యలను దృష్టికి తీసుకు వెళ్లడం ద్వారా మెజారిటీ యువతను సన్మార్గం వైపు తీసుకు వెళ్ళవలసిన బాధ్యత కూడా మన పైన ఉన్నది. నేరస్తులని దురభిప్రాయాన్ని మోపి పూర్తిగా నేరగాళ్లు గానే మార్చడం సరైన పద్ధతి కాదు. వారిని సక్రమమైన దారిలో పెట్టడానికి ప్రభుత్వ చర్యలతో పాటు తల్లిదండ్రులు ప్రజల యొక్క ఆలోచన, బుజ్జగింపు, ప్రేరేపణ కూడా చాలా అవసరం. ఆ వైపుగా అనేక సంఘటనలను మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం.కచ్చితంగా అలాంటి సంఘటనలను సమాజం దృష్టికి తీసుకురావడం ద్వారా వారిని మరింతగా గుర్తించడానికి ప్రోత్సహించడానికి వాళ్ల లోపల మానవత్వాన్ని చిగురింప చేయడానికి ఆస్కారం ఉంటుంది.అలాంటి సన్నివేశానికి సంబంధించి రక్తదాతలుగా యువత వేలాది మందికి ఏరకంగా సేవ చేస్తున్నారో తెలిపే "రక్తసంబంధం" శీర్షిక న అక్టోబర్ 5, 2025న ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం పైన మనమంతా దృష్టి సారించవలసిన అవసరం చాలా ఉన్నది. ఇటీవల కాలంలో గమనించినప్పుడు ముఖ్యంగా కడుపులో పుట్టిన వాళ్లే తల్లిదండ్రులను వృద్ధులను కాటికి పంపుతూ, ఇబ్బందులకు గురిచేస్తూ, పీడిస్తూ, ఆందోళనకు గురి చేస్తున్నటువంటి సంఘటనలు అనేకం మనకు సమాజంలో కనబడుతున్నాయి. కానీ వాటికి భిన్నంగా ఎలాంటి సంబంధం లేకపోయినా మానవ సంబంధాన్ని ప్రాతిపదికగా చేసుకుని యువత తమ రక్తాన్ని అవసరం ఉన్నటువంటి, గాయాలపాలై ఆసుపత్రిలో చేరి చావుకు చేరువలో ఉన్న వారికి దానం చేసేటువంటి బృహత్తర సన్నివేశాన్ని మనం ప్రధానంగా చర్చించాల్సిన అవసరం వుంది. వారిని ప్రశంసించవలసిన బాధ్యత కూడా మనపై ఉన్నదని గుర్తించడానికే ఈ వ్యాసం.

       ఎంతో ఆనందం అంటున్న బ్లడ్ డోనర్స్ గ్రూప్ :-

**********&******************************

కొన్ని సమస్యలకు పరిష్కారాలను సమయం తీసుకొని నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రాణం గాలిలో కలిసిపోతున్న తరణం, అత్యవసరమైన పరిస్థితులలో ఆలోచించే నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేని సందర్భంలో సహాయం చేసే వాళ్లే నిజమైనటువంటి రక్తసంబంధీకులని మనం గమనించవలసిన అవసరం ఉంది. ఆపదలో ఉన్న వాళ్లకు తమ బంధువులు కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు రక్తసంబంధం ఉన్న వాళ్ళు కూడా స్పందించి తమ రక్తాన్ని దానం చేయడానికి ముందుకు రారు. కానీ ఏ సంబంధం లేని ఈ బృందం నిర్వహిస్తున్నటువంటి రక్త దానం రక్తసంబంధం అనే శీర్షికతో పత్రికల్లో వెలువడ డం చాలా ఆనందించదగినది, ఎందరికో స్ఫూర్తిదాయకమైనది. 8 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ వాట్సాప్ గ్రూప్ నారాయణఖేడ్ కేంద్రంగా పనిచేస్తూ మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు కూడా తమ సేవలు అందిస్తున్నట్లు తెలియజేయడం నిజంగా సంతోషించదగిన పరిణామం. రక్తం దొరకక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆదుకోవడానికి ఈ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపకులలో ఒకరైన ముజ్జు పేర్కొంటే, మరో వ్యవస్థాపకుడు అయినటువంటి మునీర్ ఇప్పటివరకు 46 సార్లు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కు వెళ్లి సొంత ఖర్చులతో రక్తదానం చేసినట్లు చెబుతూ ఉంటే, మరో సభ్యుడు అయినటువంటి సంతోష్ పాటిల్ ఇప్పటివరకు 36 సార్లు దానం చేసినట్లు, ఏడేళ్లలో 143 మంది సభ్యులుగా ఎదిగినటువంటి తమ గ్రూప్ సభ్యుల సహకారం వల్ల నే దీనిని నిరంతరం కొనసాగించగలుగుతున్నట్లు చెప్పడం సంతోషించదగినటువంటి పరిణామం. ఇది ఎ o దరికొ స్ఫూర్తిదాయకమైనది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన ముగ్గురు స్నేహితులు ముజ్జు, మునీర్, సంతోష్ అనే వాళ్ళు ఎనిమిదేళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నంతో కూడినటువంటి గ్రూప్ మొత్తము 143 మంది సభ్యులతో ఇప్పటివరకు 5500 మందికి అత్యవసర సమయాలలో రక్తాన్ని అందించడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుండి కాపాడినట్లు పేర్కొనడం నిజంగా హర్షనీయం. అంతేకాదు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని కాపాడడానికి పైస ఖర్చు లేకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనే అంశాన్ని కూడా ఈ బ్లడ్ డోనర్స్ గ్రూప్ నిరూపించినదని మనం ఆ బృందం మిత్రులను ప్రోత్సహించవలసిన అవసరం కూడా చాలా ఉన్నది. ప్రాంతము, హద్దులు లేకుండా ఎక్కడ అవసరం ఉన్నదని తెలిస్తే సొంత ఖర్చులతో వెళ్లి రక్త దానం చేయడం మానవీయ అలవాటు. 2017లో ఏర్పాటు అయిన ఈ గ్రూప్ కరోనా మహమ్మారి సమయములోనూ ఏమాత్రం బెదరకుండా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తమ లక్ష్యాన్ని చేరుకున్నట్టు వేలాది మందికి రక్తదానం చేయడం ద్వారా తమ ప్రయత్నం కొనసాగుతున్నట్లు సవినయంగా తెలియజేయడం ఆనందించదగినటువంటి సామాజిక అంశం. కేవలం ముగ్గురిలో వచ్చిన ఒక ఆలోచన రక్తదాతలుగా మారి వందలాది మందిని ఆ గ్రూపులో చేరడానికి ప్రోత్సహించడమే కాకుండా వేలాది మందికి నిత్యం ప్రాణదానం చేస్తున్నటువంటి ఈ బృందాన్ని అభినందించడం ఒక ఎత్తు అయితే ఏ బంధము లేనటువంటి వీళ్లు కుటుంబ సభ్యులకు మిన్నగా రక్త సంబంధాన్ని కొనసాగిస్తూ రక్తాన్ని దానం చేయడం ద్వారా ఎంతో మందికి కొనఊపిరితో ఉన్న ప్రాణాలకు ఊపిరి పోస్తున్న విషయం ఎన్నిసార్లు ప్రశంసించినా తనివి తీరదు. అందులో ఉన్నటువంటి తాత్వికత, పరిస్థితి, ప్రాణ రక్షణ, యువతలోని సామాజిక కోణాన్ని మనం ఇక్కడ ప్రస్తావించడం చాలా అవసరం.

      యువత ఈ వైపు దృష్టి సారించాలి:-

************************** యువతలో వచ్చిన ఒకానొక నూతన మానవీయ విలువలతో కూడినటువంటి ఆలోచన ప్రాణాలకు జీవం పోస్తుంటే మరో రకంగా వైద్య రంగానికి ఛాలెంజ్ వేసిన సందర్భంగా వీరి త్యాగాన్ని కృషిని అభినందించడం మన అందరి యొక్క సామాజిక బాధ్యత. తమ తమ కుటుంబ సమస్యలు, సందర్భాలు అవసరాలకు మాత్రమే పరిమితమైన వాళ్ళు ఎక్కువగా ఈ వ్యవస్థలో ఉంటారు. కానీ తమతో పాటు ఈ వ్యవస్థలోని ఆపన్నులు, కష్టసుఖాల్లో ఉన్నవాళ్లు, పేదరికంలో మగ్గుతున్న వాళ్లు, బాధితులు, పీ డుతులను ఆదుకోవాలనే దృఢ సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటి కోవకు చెందినటువంటి ఈ యువత లాంటి కోట్లాదిమంది భారతదేశంలో ఒక నిశ్చితమైనటువంటి ఆలోచనతో ఉన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. కాకపోతే అన్ని సందర్భాలు దృష్టికి రాకపోవచ్చు కానీ అలాంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ల లోపల కూడా కుటుంబ బంధాలకు అతీతంగా మానవ సంబంధాలను పరిరక్షించే దిశగా ఇలాంటి రక్తదాన శిబిరాలతో పాటు యువతకు సంబంధించినటువంటి పలు కార్యక్రమాలను మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. యువజన సంఘాలుగా ఏర్పడి సామాజిక అణచివేత, ఇబ్బందులు, దోపిడీ పిడిన వంటి అంశాల పైన ప్రతిఘ టించే విధంగా సిద్ధం చేయడం ప్రభుత్వాలకు ప్రకృతి బీభత్సాల సందర్భంగా సహకరించే విధంగా యువతను ప్రోత్సహించడం ,ఆయా రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు స్వచ్ఛందంగా సమాజంలో అవసరం ఉన్నప్పుడు సహకరించే విధంగా మేలుకోల్పడం ద్వారా కూడా మనం యువత యొక్క సేవలను పొందడానికి ఆస్కారం ఉంది. నారాయణఖేడ్లో జరుగుతున్నటువంటి ఈ రక్తసంబంధం కార్యక్రమంలోని అంతరార్తాన్ని యువతకు మనం అందించడం ద్వారా వాళ్ల లోపల నిగూఢమైనటువంటి ఆలోచనలను మేల్కొల్పడానికి నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టడానికి దేశవ్యాప్తంగా అవసరమైనటువంటి వర్గాలకు స్వచ్ఛందంగా సహకరించడానికి యువతను సన్నద్ధం చేయడం సాధ్యమవుతుంది. ఆ రకమైన బాధ్యత మనందరి పైన ఉన్నది. ఒక కుగ్రామంలో పుట్టిన చిన్న ఆలోచన విశాలమైనటువంటి భారతదేశానికి ఆ తర్వాత ప్రపంచానికే దారి చూపినట్లుగా నారాయణఖేడ్ యువతలో వచ్చినటువంటి రక్తదాన ఆలోచన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమంది ఉత్సాహవంతులైన యువతకు కనువిప్పు కలిగిస్తుందని నూతన ఆలోచనలకు మార్గం సుగమం చేస్తుందని ఆశిద్దాం. ఇటీవల కాలంలో యువతలో భక్తి మార్గం, వినాయక దుర్గాదేవి విగ్రహాల ప్రతిష్ట ఉత్సవాలలో పాల్గొనడం, నిత్యం ఏదో రకంగా ఖర్చులు చేయడం, ఆధ్యాత్మిక భావనకు కమిట్మెంట్ కాకపోయినా తమ సమయాన్ని కేటాయిస్తున్నటువంటి యువత ఆ కార్యక్రమాలతో పాటుగా మానవీయ కోణంలో ఆలోచిస్తుందని అవసరమున్న వర్గాలకు సహకరించడం ద్వారా తమ సామాజిక బాధ్యతను నిర్వహించడానికి ఆదర్శంగా నిలబడుతుందని ఆశిద్దాం. ప్రధానంగా యువజన సంఘాల యొక్క కార్యకలాపాలు కూడా గతంలో ఉన్న మాదిరిగా లేవు. ఒకవేళ పేరుకు యువజన సంఘాలుగా కొనసాగుతున్నా బోర్డులకు మాత్రమే పరిమితమైనటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఆ రకంగా బోర్డులకు పరిమితం కావడము లేదా ఎలాంటి మార్పుకు ఉపయోగపడని పనులకు పూనుకోవడం కంటే ప్రజల యొక్క అవసరాలు, పేద వర్గాల యొక్క ఇబ్బందులు, ఆ పన్నుల యొక్క అత్యవసర పరిస్థితిని గమనించడం ద్వారా నూతన విలువలకు శ్రీకారం చుట్టే విధంగా యువతను ప్రేరేపించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం అని గ్రహిస్తారని ఆశిస్తూ ....

(ఈ వ్యాస కర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333