జాతీయ రహదారి (NH-65) పై బ్లాక్ స్పాట్ల తనిఖీ: ప్రమాదాల నివారణకు ఉమ్మడి చర్యలు
చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి (NH-65) పై రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్, సూర్యాపేట ఆర్డీఓ (RDO) లతో కలిసి జాతీయ రహదారుల సంస్థ (NHAI) అధికారులు, ప్రాంతీయ రవాణా శాఖ (RTO) అధికారులు గురువారం ఉమ్మడిగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఈ తనిఖీల్లో భాగంగా రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లను) అధికారులు నిశితంగా పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు భద్రతా ప్రమాణాలను అంచనా వేసి, ప్రమాదాల నివారణకు మరియు సమర్థవంతమైన చట్ట అమలుకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించారు. వాహనాల వేగాన్ని నియంత్రించడం, అవసరమైన చోట సైన్ బోర్డులు, బారికేడ్లను ఏర్పాటు చేయడం వంటి భద్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా, జాతీయ రహదారిని ఆక్రమించి ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న ఆక్రమణదారులపై అధికారులు కఠినంగా వ్యవహరించారు. రహదారిని ఆక్రమించిన వారికి తక్షణమే వాటిని తొలగించాలంటూ అక్కడికక్కడే నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో చివ్వెంల పోలీస్ సిబ్బందితో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు