మైనర్ డ్రైవింగ్‌పై సూర్యాపేట పోలీసుల ప్రత్యేక నిఘా
వాహనాలు తనిఖీ చేసిన పట్టణ పోలీసులు
సూర్యాపేట 18 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట పట్టణ పోలీస్ పరిధిలోని 60 ఫీట్ల రోడ్డులో ఈరోజు (శుక్రవారం) పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. పట్టణ ఎస్ఐ రత్నం ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రత్నం మాట్లాడుతూ.. పట్టణంలో మైనర్లు (వయసు నిండని పిల్లలు) బైక్‌లు, ఇతర వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లకు, వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం అన్నారు. మైర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు ఉంటాయి అన్నారు. పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఎస్ఐ రత్నం హెచ్చరించారు.