పండుగ పూట విషాదం యువకుడు మృతి

Aug 16, 2026 - 21:06
 0  723
పండుగ పూట విషాదం యువకుడు మృతి

 అడ్డగూడూరు 16 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌల్ల రామారం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ దేవతలకు బోనాల పండుగ నిర్వహించి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి చెరువు కట్ట కిందకు బోల్తా పడటంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చౌల్ల రామారం గ్రామంలో ఆదివారం బోనాల పండుగను  నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కట్ట మైసమ్మ ఆలయం చుట్టూ వాహనాలతో ప్రదర్శనలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎల్లబోయిన సాయి, ఎల్లబోయిన అజయ్  ట్రాక్టర్‌ను కట్ట మైసమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం తిరిగి వస్తుండగా చెరువు కట్టపై ట్రాక్టర్ అదుపుతప్పి కట్ట కిందకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎల్లబోయిన సాయి 23, ఎల్లబోయిన అజయ్ 20 తీవ్రంగా గాయపడ్డారు. సాయి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అజయ్‌కు కూడా తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు మెరుగైన చికిత్స కోసం తరలించారు. మృతుడు సాయి, గాయపడిన అజయ్ ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. వీరి తండ్రి రామచంద్రు ది వ్యవసాయ కుటుంబం. అతనికి ముగ్గురు సంతానం కాగా, ఒకరు ప్రమాదంలో మృతి చెందడం, మరో కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బోనాల పండుగ వేళ జరిగిన ఈ విషాద ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న అడ్డగూడూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై వెంకటరెడ్డి  తెలిపారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి