పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగిన తండ్రి

Aug 5, 2026 - 22:49
Aug 5, 2026 - 23:39
 0  165
పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగిన తండ్రి

మోత్కూరు 06 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- మోత్కూర్ మున్సిపాలిటీ ఇంద్రానగర్‌కు చెందిన గజ్జెల్లి మనోహర్ బుధవారం మోత్కూర్ పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తమకు సమాచారం ఇవ్వకుండా పిల్లలను పోలీసులు తీసుకెళ్లారనే ఆవేదనతో మనోహర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బంధువులు తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, మనోహర్‌కు అతని భార్య ప్రభావతితో గత కొంతకాలంగా కుటుంబ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా తమ ఇద్దరు చిన్నారులను భర్త తన వద్దకు రానివ్వకుండా మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని, తన పిల్లలకు పాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం పిల్లలను మనోహర్ బంధువుల ఇంటి నుంచి తీసుకొచ్చి, అనంతరం తల్లికి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని మనోహర్ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసినట్లు తెలిపారు. అయితే, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పిల్లలను తీసుకెళ్లడం ఏమిటని ఆగ్రహించిన మనోహర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి అతడిని అదుపులోకి తీసుకుని మోత్కూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మోత్కూర్ ఇన్‌స్పెక్టర్ సి. వెంకటేశ్వర్ల ను వివరణ కోరగా, ఆగస్టు 5న ప్రభావతి చేసిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు చేపట్టామని చెప్పారు. భర్త పిల్లలను తన వద్ద ఉంచి, తల్లికి ఇవ్వకుండా దాచిపెట్టాడని ఫిర్యాదు రావడంతో, ఇద్దరు చిన్నారులను తీసుకువచ్చి వారి తల్లికి అప్పగించినట్లు వివరించారు. అనంతరం మనోహర్ స్టేషన్ ఎదుటకు వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగే ప్రయత్నం చేయగా, పోలీసులు వెంటనే అడ్డుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.ఈ ఘటనతో కొంతసేపు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి దారితీయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి