సెప్టెంబర్ 2న మున్సిపల్ కార్మికుల పట్టణ మహాసభను జయప్రదం చేయాలి
సూర్యాపేట, 31 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- సెప్టెంబర్ 2న మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగే మున్సిపల్ కార్మికుల పట్టణ మహాసభను జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గౌరవ అధ్యక్షులు వల్లపు దాసు సాయికుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేటలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో మున్సిపల్ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు పట్టణ ప్రజలకు నిరంతరం పారిశుద్ధ్య సేవలు అందిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు, యూనిఫాం, సౌకర్యాలు కల్పించడంతో పాటు పని ప్రదేశాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ పోరాట కార్యాచరణను రూపొందించేందుకు సెప్టెంబర్ 2న జరిగే పట్టణ మహాసభ కీలకంగా నిలుస్తుందని తెలిపారు. మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చాగంటి వెంకటరమణ, బాలెన్లబాబు, బొజ్జ బాలకృష్ణ, జానపాటి యాదగిరి, రాము, బండారు మమత తదితరులు పాల్గొన్నారు.