సీఐ అత్యుత్సాహం.. బాధితుడిపై దాడి, నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన వైనం

Aug 28, 2026 - 15:28
Aug 28, 2026 - 15:29
 0  1
సీఐ అత్యుత్సాహం.. బాధితుడిపై దాడి, నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన వైనం

సూర్యాపేట, 28 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- న్యాయం కోసం ఆందోళన చేస్తున్న బాధితులపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డబ్బా కొట్టు తొలగింపును నిరసిస్తూ బాధితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.ఘటనాస్థలికి చేరుకున్న కోదాడ టౌన్‌ సీఐ శివశంకర్‌.. ఆందోళన చేస్తున్న మాదాల ఉపేందర్‌పై దాడికి దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

నడిరోడ్డుపై తోసేసి.. ఈడ్చుకెళ్లి..

డబ్బా కొట్టు తొలగించారని ఆరోపిస్తూ బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న సీఐ శివశంకర్‌.. ఆందోళనలో ఉన్న మాదాల ఉపేందర్‌ను ఒక్కసారిగా పట్టుకుని రోడ్డుపైకి నెట్టివేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. అనంతరం అతన్ని ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వాహనంలోకి ఎక్కించినట్లు దృశ్యాలు వైరల్‌గా మారాయి.

అడ్డుకున్న మహిళలపైనా..

ఉపేందర్‌ను పోలీసులు తీసుకెళ్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలతోనూ పోలీసులు దురుసుగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళలను తోసుకుంటూ పోలీసులు ముందుకు వెళ్లిన దృశ్యాలు వీడియోలో కనిపించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు.. బాధితులపై, ముఖ్యంగా మహిళలతో ఇలా వ్యవహరించడం పై స్థానికులు ప్రశ్నలు సంధిస్తున్నారు.

జర్నలిస్టుపై దాడి చేశారంటూ ఆరోపణలు..

ఘటనను వీడియో చిత్రీకరిస్తున్న ఓ జర్నలిస్టుపైనా సీఐ దాడికి దిగినట్లు ఆరోపణలు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో రెండుసార్లు దాడికి ప్రయత్నించినట్లు సంబంధిత దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఘటనలను రికార్డు చేసి ప్రజలకు తెలియజేసే మీడియాపై పోలీసుల తీరు ఇలా ఉండటం పై జర్నలిస్ట్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

30 ఏళ్లుగా ఇదే జీవనాధారం..

డబ్బా కొట్టు తొలగింపుపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఆ డబ్బా కొట్టుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని చెబుతున్నారు. తమ జీవనాధారాన్ని తొలగించి తమకు అన్యాయం చేశారని, న్యాయం చేయాలని కోరుతూ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

రాఖీ పండుగ రోజు.. మహిళలకు ఇదేనా రక్షణ?

రాఖీ పండుగ రోజున మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. ఆందోళనలో ఉన్న మహిళలను నడిరోడ్డుపై తోసేయడం ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. రక్షించాల్సిన పోలీసులే శిక్షిస్తున్నట్టుగా వ్యవహరించడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కోదాడ టౌన్‌ పోలీసుల వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఉన్నతాధికారులు స్పందించాలి..

ఆందోళనకు దారి తీసిన అసలు కారణాలు, డబ్బా కొట్టు తొలగింపు వెనుక ఉన్న పరిస్థితులు, పోలీసుల చర్యలకు కారణాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు. వైరల్‌ అవుతున్న వీడియోలను పరిశీలించి ఘటనపై వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు. న్యాయం అడిగినందుకు దాడి చేయడమే పరిష్కారమా బాధితులను శాంతింపజేయాల్సిన పోలీసులే పరిస్థితిని మరింత ఉద్రిక్తం గా మార్చారా అనే ప్రశ్నలు ప్రస్తుతం కోదాడలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి సదరు సీఐపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333