సన్న వడ్ల సాగుకు ప్రోత్సాహం – రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్
సెప్టెంబర్ 10లోగా సన్న వరి పంట నమోదు తప్పనిసరి
అన్ని పంటలకు పంట నమోదు, రైతు రిజిస్ట్రీ పూర్తి చేసుకోవాలి
తెలంగాణ ప్రభుత్వం 2026 వానాకాలం (ఖరీఫ్) సీజన్లో సన్న వరి సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న వరి రకాలు అయిన BPT-5204, RNR-15048, HMT సోనా, జై శ్రీరామ్, KNM-1638, WGL-44, JNM-7715 రకాలను సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. సన్న వరి సాగు చేస్తున్న రైతులు సెప్టెంబర్ 10వ తేదీలోగా తమ పంట వివరాలను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు.
AEOలను సంప్రదించి పంట నమోదు చేసుకోవాలి
సన్న వరి సాగు చేస్తున్న రైతులందరూ తమ గ్రామ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారు (AEO)లను సంప్రదించి, సాగు చేస్తున్న సన్న వరి రకం, విస్తీర్ణం, తదితర పంట వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు.
పంట నమోదు చేసుకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన సందర్భంలో బోనస్ ప్రయోజనం పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, రైతులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే పంట నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
అన్ని పంటలకు పంట నమోదు తప్పనిసరి
రైతులు కేవలం సన్న వరి పంటకే కాకుండా తాము సాగు చేస్తున్న అన్ని పంటల వివరాలను పంట నమోదు ప్రక్రియలో నమోదు చేయించుకోవాలని తెలిపారు. పంటల సాగు వివరాలు ఖచ్చితంగా నమోదు కావడం ద్వారా రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ వ్యవసాయ పథకాలు, ఇన్పుట్ సబ్సిడీలు, పంట కొనుగోలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు సక్రమంగా అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రైతు రిజిస్ట్రీని కూడా పూర్తి చేసుకోవాలి
అదే విధంగా జిల్లాలోని రైతులందరూ రైతు రిజిస్ట్రీ (Farmer Registry) నమోదు ప్రక్రియను కూడా పూర్తి చేసుకోవాలని సూచించారు. రైతు కుటుంబం, భూమి, సాగు వివరాలు, తదితర సంబంధిత సమాచారం సక్రమంగా నమోదు కావడం భవిష్యత్తులో రైతులకు వివిధ ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సంబంధిత సేవలు అందించడంలో కీలకంగా ఉంటుందని తెలిపారు.
రైతులు తమ వివరాలను సంబంధిత అధికారుల వద్ద ధృవీకరించుకుని, అవసరమైన పత్రాలు సమర్పించి రైతు రిజిస్ట్రీని పూర్తి చేసుకోవాలని కోరారు.