అలంపూర్ ఆలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు

Aug 31, 2026 - 19:21
 0  1

 జోగులాంబ గద్వాల 31 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  అలంపూర్. కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఆలంపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం రాత్రి హరిత హోటల్లో బస చేసిన కేంద్ర మంత్రి ఉదయం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి మొదట బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో, మేళతాళాలతో ముఖ్య అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. మొదట వినాయకుని పూజల్లో పాల్గొన్న అతిధులు తర్వాత స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాల్లో కేంద్ర మంత్రి ఇతర అతిధులతో కలిసి మొక్కను నాటారు. ఆలయ అధికారులు, పూజారులు అతిథులకు స్వామి,అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు క్షేత్ర విశిష్టతను అతిథులకు వివరించారు. ఆలయం నుంచి తిరిగి హరిత హోటల్ కు చేరుకున్న అతిధులకు జిల్లాకు చెందిన పలు రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నేతలు, పలువురు రైతులు, ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అక్కడి నుంచి జోగులాంబ రైల్వే స్టేషన్ కు బయలుదేరే ముందు మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండి గౌతమి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ శ్రీనివాసరాజు, ఈవో పురంధర్, అదనపు కలెక్టర్ మధుమోహన్, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీవో శ్రీనివాసరావు, భాజపా రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333