ఘర్షణ బెదిరింపులతో  చీత్కారాలకు గురవుతున్నది నేటి  బాట

Apr 5, 2024 - 14:59
 0  1

ప్రభుత్వంతో నిత్యం ఘర్షణతో  పంతానికి పాకులాడుతున్నది  టిఆర్ఎస్ కాదా ?

మేడిగడ్డ కేంద్రంగా  నిత్యం  ఘర్షణలేనా  ?

నోరున్న వాడిదే న్యాయం ఎలా?. 

నిగ్గుదెల్చడానికి  మేధావులు ఇంజనీర్లు  సామాజికవేత్తలు  మీకు కనిపించడం లేదా

---  వడ్డేపల్లి మల్లేశం

నోరున్న వాడిదే  రాజ్యం దుడ్డు ఉన్నవాడిదే బర్రె అనే  అక్రమ  విధానం ఇంకా నా ఇకపై సాగదు అని నిలదీయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.  ప్రజాస్వామ్య దేశంలో కూడా  ప్రజలను  యజమానులుగా  చూడవలసినది పోయి బానిసలుగా చిత్రించడంతోపాటు  ప్రభుత్వ ప్రతిపక్షాలు పరస్పరం   తమ ఆధిపత్యాన్ని చలాయించుకోవడానికి ప్రయత్నం చేయడం  ఈ దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అందులో తెలంగాణలో  గత ఐదు సంవత్సరాలుగా తారాస్థాయికి చేరిన విషయం గమనించదగినదే.   అందుకు భిన్నంగా ఇటీవల తెలంగాణలో  ఎన్నికల తర్వాత డిసెంబర్ 2023లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీని  హామీలు ఎప్పుడూ అమలు చేస్తారు?  ఎలా చేస్తారు? నిధులేవి? అని  పొంతన లేని ప్రశ్నలతో  టిఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం బెదిరించడం శాపనార్థాలు పెట్టడం అందరు ప్రజలు గమనించి ఉన్నారు.  గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన కొత్తలో 4 సంవత్సరాల వరకు కూడా ఎవరూ ప్రశ్నించలేదు .కొంత అవకాశం ఇచ్చి  గమ్యము గమనము వేరువేరుగా ఉన్నప్పుడు మాత్రమే ప్రశ్నించడం ఆరంభమైనది. అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి  కనీసం ఒక సంవత్సరం కూడా సమయం ఇవ్వకుండా, నిర్మాణాత్మక సూచనలు చేయకుండా  దాడులకు పాల్పడే వికృత చర్యలకు  బి ఆర్ ఎస్ పూనుకోవడం  ప్రజల్లో మరింత  చులకన కా వడానికి తప్ప  ఎందుకు పనికిరాదు.

         2023 అక్టోబర్ మాసంలో మేడిగడ్డ బరాజుకు సంబంధించి  7 బ్లాక్ లోని 20వ పిల్లర్  కృంగిపోయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అదే అంశం  ఆయుధంగా ప్రజల్లోకి విస్తృత ప్రచారంతో  కాంగ్రెస్ పూనుకోవడం, మేధావులు బుద్ధి జీవులు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయమని  ప్రజలను కోరడం,  టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా ఆగ్రహించి అసహనముతో ఉన్నటువంటి ప్రజలు  గత ప్రభుత్వాన్ని చీత్క రించిన విషయం తెలిసిందే.  ఏది ఏమైనా అధికారానికి వచ్చిన ప్రభుత్వంకు  వనరుల సద్వినియోగంతో పాటు లోపాలు సరి చేయవలసిన బాధ్యత ఉంటుంది కనుక  అదే సందర్భంలో కాలేశ్వరం ప్రాజెక్టులోని వివిధ బారాజ్లా  స్థితిగతుల పైన విచారణకు ఆదేశించడం,  శాసనసభలో శ్వేత పత్రం విడుదల చేయడం , చర్చించడం మేధావులు చర్చలో పాల్గొనడం, ప్రజా బా హుల్యo లోకి ఈ చర్చలు తీసుకువెళ్లడం క్రమంగా కొనసాగుతున్నది.  సుమారు లక్ష కోట్లతో నిర్మాణం చేసి ఇంకా 50 వేల కోట్ల వరకు  నిర్మాణానికి అవసరమున్న పరిస్థితులలో అంచనావేసినటువంటి 36 లక్షల ఎకరాలకు బదులు 97,ooo ఎకరాలు మాత్రమే   పారుతున్నట్లు  అంచనా .259పేజీల నివేదికలో అనేక కోట్ల నిధులదుర్వినియోగం,లోపాలు  ఉన్నట్లు  కాగ్,  విజిలెన్స్ కమిటీ తో పాటు  కేంద్ర  డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఆ ప్రాజెక్టు యొక్క వైఫల్యాన్ని ఎత్తిచూపడం జరిగింది.  ప్రస్తుతము ప్రభుత్వం కూడా ఈ మూడింటి నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమై  అదే సందర్భంలో వీలున్న మేరకు మరమ్మత్ చేయడానికి సిద్ధపడుతున్నప్పటికీ  ప్రతిపక్షం మాత్రం  నేరాన్ని అంగీకరించకుండా   నివేదికలను కూడా ఆమోదించకుండా  ఎప్పుడు రిపేరు చేస్తారు?  వర్షాకాలంలో గా నీళ్లు నింపి రైతులకు ఇవ్వాలి  అని హెచ్చరించడమే తప్ప జరిగిన పొరపాటులో తమ భాగస్వామ్యం ఉన్నదని ఇప్పటికీ అంగీకరించకపోవడం,  నేరాన్ని  ఒప్పుకోకపోవదాన్ని  ప్రజలు గమనిస్తున్నారు.

       ఘర్షణ వైఖరి మంచిది- కాదు మేధావుల సహకారం తీసుకోవాలి:-

*******

  ప్రభుత్వం ప్రాజెక్టు లో లోపాలు ఉన్నట్లు, దానిని నివారించడానికి తగిన విధానాన్ని అవలంబిస్తున్నట్లు, అదే సందర్భంలో ప్రతిపక్షం నేరాన్ని  అంగీకరించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంటే  బిఆర్ఎస్ తమకేమీ పట్టనట్లు, తామేదో పెద్ద నిర్మాణం చేసినట్లు, అది ప్రపంచంలోనే విజయవంతమైనట్లు పెద్దగా ప్రచారం చేసుకుంటూ ఇప్పటికీ తప్పును అంగీకరించకపోవడం  పైగా ప్రభుత్వాన్ని ఎత్తిచూపడం బెదిరించడం  వంటి అంశాలు ప్రజలకు జుగుప్స కలిగిస్తున్న విషయం అందరికీ తెలుసు.  పైగా  1 మార్చి 2024 వ తేదీన టిఆర్ఎస్ పార్టీ పక్షాన శ్రేణులు నాయకులు  మేడిగడ్డ ఇతర బారాజులను సందర్శించినట్లు  ఇలాగే ప్రాజెక్టులన్నింటినీ సందర్శిస్తామని తెలియజేస్తూ  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ప్రభుత్వాన్ని  తప్పు పట్టడం అంటే  నోరున్న వాడిదే రాజ్యం అన్నట్లుగా లేదా?  కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆనాటి ప్రతిపక్షాలు,  మేధావులు, బుద్ధి జీవులు, పౌరహక్కుల సంఘాలు కనీసం నాలుగు సంవత్సరాల పాటు వెసులుబాటు కల్పించిన తర్వాత తన విధానాన్ని  మార్చుకొమ్మని ప్రజల పక్షాన పని చేయాలని  ధర్నా చౌక్ ను ఎత్తివేసిన సందర్భంలో ప్రారంభమై చివరి వరకు ఆ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఉక్కు పాదం మోపి వ్యతిరేకించిన విషయం అందరికీ తెలుసు. కానీ  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు మాసాలు కూడా  కాలేదు.  ఏ రకంగా గ్యారెంటీలను అమలు చేస్తారు? నిధులు ఎక్కడ తె స్తారు? ఎప్పుడు చేస్తారు? ఎందుకు చేయడం లేదు? సమాధానం చెప్పాలి అని రోజు ప్రశ్నిస్తే  ప్రభుత్వం ఎలా పరిపాలన చేస్తుంది?  ఈ విషయంలో మేధావులు  కనీసం ఒక సంవత్సరం పాటు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని అప్పుడు కూడా  టిఆర్ఎస్ మాదిరిగానే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రశ్నించడానికి అందరము కలిసికట్టుగా పోరాడుదాం అని  సూచన చేసినప్పటికీ  ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్న తీరు ప్రజాస్వామిక వ్యవస్థలో ఎక్కడా కూడా మనకు ఇంతవరకు కనిపించలేదు.

        ప్రతిపక్ష ఘర్షణ కారణంగా పరిపాలన  స్థిరంగా  ఉండే ఆస్కారం తక్కువ.  అదే సందర్భంలో ప్రజలకు ఇచ్చిన హామీలు వాగ్దానాలతో పాటు ప్రజా  సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజాస్వామిక విలువల పునరుద్ధరణ, పౌర హక్కుల  సంరక్షణ వంటి అంశాలను  పాలనలో చూడాలంటే కచ్చితంగా  ప్రతిపక్షం యొక్క దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిందే ! ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పౌర సంఘాలు మేధావులు బుద్ధి జీవులతో వివిధ రకాల సమస్యల పైన ఆ నునిత్యం చర్చ చేస్తూనే ఉన్నది.  గత ప్రభుత్వ హయాంలో జరిగిన  శాసనసభ్యులు అధికారులు మంత్రులు అందరి అవినీతి పైన విచారణకు ఒకవైపు ఆదేశించడం జరిగింది.మరింత వేగవంతం చేయాలి.  ఇదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు , గవర్నర్  తో పాటు మేధావులు వివిధ రంగాల నిపుణులు సామాజికవేత్తలు  ఈ ఘర్షణ పూరిత వాతావరణానికి , ప్రతిపక్షాల వికృత చేష్టలకు అడ్డుకట్ట వేసే క్రమంలో  నిజాన్ని నీ గ్గు తేల్చవలసిన అవసరం చాలా ఉన్నది .  ఎందుకంటే గతంలో ఏనాడు కూడా,  ఉమ్మడి రాష్ట్రంలో కూడా  ప్రతిపక్షాలు ప్రభుత్వాలకు సూచనలు చేసి సహకరించిన సందర్భాలు...  ఇంకా లోతుకు వెళితే ప్రతిపక్షాలకు చెందినటువంటి బుద్ధి జీవులను పాలక పక్షము మంత్రివర్గంలో చేర్చుకున్న సందర్భాలు....  ఉప సభాపతిగా నియమించుకున్నటువంటి ఆనవాళ్లు ఈ దేశంలో ఉన్నాయి.  కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వాన్ని  నడవకుండా  కాళ్లలో కట్టెలు పెట్టి అడ్డుకునే విధానం చిలిపి చేష్టలతో సమానం . ఆ రకమైన ధోరణి  టిఆర్ఎస్ మానుకోవాలి లేకుంటే  తమ పతనం  త మతోనే ప్రారంభమైనట్లు  తర్వాత కానీ తెలియదు.  ఇప్పటికీ  ఇంజనీర్లు మాజీ ఇంజనీర్లు మేధావులు,ప్రజలు,ప్రజాసంఘాలు  కాలేశ్వరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో నిర్మించినటువంటి ఇతర జల వనరులు,  నిర్మాణాలు, వివిధ ర రంగాలలో  చోటు చేసుకున్న అవినీతి పైన  విచారణ జరిపి దోషులను శిక్షించాలని నిగ్గు తేల్చాలని  డిమాండ్ చేస్తూనే ఉన్నారు .

అవినీతిలో కూరుకుపోయి ప్రజా వ్యతిరేక విధానాలతో పదేళ్లపాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి  న టిఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి  గత వారం క్రితం  ప్రభుత్వ పక్షాన మేడిగడ్డకు పర్యటించినప్పుడు  బొందల గడ్డలో ఏమున్నదని పోతారు? ఏం పీకడానికి పోతారు? అని స్వయంగా కేసీఆర్ అన్న మాటలను పత్రికల్లో చూసివున్నాము.  మరి అలాంటప్పుడు మార్చి 1  శుక్రవారం రోజున మేడిగడ్డకు పోయినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు  కూడా  అందుకే పోయినట్లా?  ప్రజలు గమనిస్తున్నారు, ఎవరి విధానం ఏందో తెలుసుకుంటారు అవసరమైన సమయంలో తగిన బుద్ధి చెబుతారు.,  ప్రజల చేతుల్లో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని  గమనించకుండా ప్రభుత్వమైనా పాలకపక్షమైన ఒంటెద్దు పోకడతో పయనిస్తే  తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు  అని రాజకీయ పార్టీలు గుర్తించాలి. ఇదే సందర్భంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా, పరిపాలన అస్తవ్యస్తం కాకుండా, ప్రజా ఆకాంక్షలు దారిమల్లకుండా ఉండాలంటే గౌరవ న్యాయవ్యవస్థ, గవర్నరుగారు, బుద్ధి జీవులు జోక్యం చేసుకోవడం తప్పనిసరి.  తద్వారా నిజమైన నేరస్తుల చెంప చెల్లుమనిపిస్తే ప్రజలు సంతోషిస్తారు.ఏది  ఏమైనా న్యాయం  గెలవాలి- దోషికి శిక్ష పడాలి.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు  అభ్యుదయ రచయితల  సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333