పెద్దరికాన్ని విస్మరిస్తున్న కుటుంబ పెద్దలు.నాగరికత ముసుగులో అనేక కుటుంబాల చరిత్ర కనుమరుగు

Apr 5, 2024 - 15:03
 0  1

స్వార్థం కోసం  ముఖం చాటేస్తున్న  బంధువులు  .

 బలహీన సంబంధాలు -ఆత్మ న్యూనతలో కోట్ల జనం

మన చరిత్రను మనం రాసుకోవడం మరీ అవసరo.

--  వడ్డేపల్లి మల్లేశం 

  కుటుంబ, మానవ సంబంధాల బలోపేతానికి  ప్రేమానుబంధాలు దిక్సూచిగా పనిచేస్తాయి.  సానుకూల దృక్పథంతో  తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగితే  ఇక కుటుంబ బంధాలు,  బంధుత్వాల బలోపేతానికి డోకా ఉండదు . ప్రాథమికంగా  మనిషి ఆలోచన  సరళి వ్యాపారీకరించబడి,  స్వార్థ ప్రయోజనాల చుట్టూ  ప్రదక్షిణ చేస్తున్న వేళ  కన్న తల్లిదండ్రులను  కుటుంబ సభ్యులను కూడా  కాదని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు  పసి పిల్లలను కట్టుకున్న భార్యను  కడ చేర్చిన సందర్భాలను అనేకం చూడవచ్చు.  ఈ పరిస్థితులలో  అనేక దుస్సంఘటన లు,  ద్వేషపూరిత వాతావరణం , అనుబంధాలలో  ఏర్పడుతున్న పగుళ్లు,  ఎంతకైనా దిగజారి  తాత్కాలిక ప్రయోజనాల కోసమే  జీవితాలను కుదించుకుంటున్న  ఆధునిక మానవుడి  అరాచకత్వాన్ని  అడ్డుకోవడానికి  మెరుగైన వ్యవస్థను నిర్మించడానికి  కృషి జరగాలి. బుద్ధి జీవులు, మానవతావాదులు,  మానసిక నిపుణులు , సానుకూల దృక్పథంలో  శిక్షణ నిచ్చేవాళ్ళు  కూడా  సుదీర్ఘంగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది . కుటుంబ సంబంధాలకు తమకేమీ సంబంధం లేదని  ఈ నిపుణులు గనక ఆలోచిస్తే  వాళ్ల ఉని కే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంటుంది . సామాజిక బాధ్యతను గుర్తించవలసిన నిపుణులు మేధావులు ఆయా రంగాల  పరిశోధకులు  నిరంతరం ఈ సమస్య పైన దృష్టి సారించవలసిన అవసరం ఉన్నది. అదే సందర్భంలో  ప్రాథమికంగా కుటుంబాలలో  కొన్ని చర్యల ద్వారా  సంబంధాలు మెరుగుపడే అవకాశం,  బంధుత్వం బలపడే సందర్భం , మానవత్వం  చిగురించి మొగ్గ తొడిగే  ఉత్కృష్ట పరిస్థితులకు  మనకు మనమే శ్రీకారం చుట్టాలి . ఆలోచనపరులు,  సమాజం యొక్క వికృత రూపం పట్ల అవగాహన ఉన్నవాళ్లు  ఈ దుస్థితిని సవాలుగా తీసుకొని  ఉద్యమం స్థాయిలో  ప్రజల్లోకి తీసుకు వెళ్లవలసిన తరుణం ఇప్పటికే మించిపోయింది.చర్చిస్తే సాధ్యం కానిది లేదు.

      మన చరిత్ర మనమే  రాసుకోవాలి:-

*********

  చరిత్రను అధ్యయనం చేయడం ఎంత ముఖ్యమో  తమ చరిత్రను కూడా నిర్మించుకోవడం అంతే ముఖ్యమని మాజీ ప్రధాని  జవహర్లాల్ నెహ్రూ చేసిన సూచన  జాతి ఐక్యతకు, దేశ ఉన్నత్యానికి,  వ్యక్తుల స్వావలంబ నకు,  కుటుంబాల స్వయం ప్రతిపత్రికి  దిక్సూచిగా నిలబడుతుంది.  అనేక కుటుంబాలలో  కార్మికులు, కర్షకులు, వివిధ రంగాల నిపుణులు, మానవతావాదులు,  శ్ర మైక జీవులుగా  తమ జీవితాలను కొనసాగించి  నైతిక విలువల కోసమే బ్రతికినటువంటి అనేక మందిని మనం చూడవచ్చు. కానీ  వారి చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది.  చరిత్రను  నిలబెట్టేవారు,  నేటి తరానికి విప్పి చెప్పే వాళ్ళు లేకపోవడం వలన  కుటుంబాల వ్యక్తుల యొక్క గొప్పతనం అంతరించిపోతున్నది  .అలా జరగడానికి వీలు లేదు.  మన పిల్లలకు భవిష్యత్ తరాలకు  మన కుటుంబాలు వంశాల గురించి విప్పి చెప్పడంతో పాటు  సంక్షిప్తంగానైనా నిక్షిప్తం చేయడం ద్వారా  శ్రమను గౌరవించే అవకాశం ,విలువలను ప్రేమించే తత్వము,  మనిషిని మనిషిగా చూసే సంస్కారము  నేటి రేపటి తరాలకు అలవాడే అవకాశం ఉంటుంది.  జన్మదినాలు,  వర్ధంతిలు,  సందర్భోత్సంగా కుటుంబాలలో జరిగే కార్యక్రమాల వేల  తమ కుటుంబంలోని  పూర్వీకుల  సంస్కృతి ఆచారాలు సాంప్రదాయాలు విలువలు జీవనాన్ని  విప్పి చెప్పడం  కుటుంబ పెద్దల యొక్క బాధ్యత.  ఇది తరతరాలుగా కొనసాగినట్లయితే  వ్యక్తిని ప్రేమించడం, మనిషిని గౌరవించడం,  అసూయ ద్వేషాలను తరిమికొట్టడం ద్వారా  బంధాలను బలోపేతం చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది . ఇప్పటికీ కొన్ని కుటుంబాలలో కుటుంబ చరిత్రను  నిక్షిప్తం చేయడంతో పాటు   కుటుంబ సభ్యులు బంధువులను ఒక చోట చేర్చి  బంధువుల ప్రేమానురాగాలను పంచుకుంటున్న  సందర్భాలు  మనం కల్లారా చూడవచ్చు. 

అహంకారం  స్వార్థంతో  ముఖం చాటేస్తున్న కుటుంబాలు--  ఆత్మ న్యూ నటలో  జనం  :-

**************

అంతరాలు, అసమానతలు  ,అహంకార ధోరణి,  ఆధిపత్య లక్షణాల కారణంగా  స్వార్థం తోడై  మనిషి ఒంటరితనానికి పాకులాడుతున్నాడు.  ఇతరులను గౌరవించడానికి  ప్రేమించడానికి సిద్ధ పడకపోగా  ద్వేషించి, అగౌరవపరిచి,  క్షణిక  ఆనందం పొందడానికి సిద్ధపడినప్పటికీ  బంధాలకు దూరమై ఒంటరిగా మిగిలిపోతున్నానని మాత్రం ఇప్పటికి గుర్తించడం లేదు.  దానివల్ల అనేక కుటుంబాలు  మాట్లాడే వాళ్లు లేక,  మనుషులను దూరం చేసుకుని,  ఆత్మ న్యూనతలో కొట్టుమిట్టాడుతూ,  ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి,  లేనిపోని రోగాలను  తెచ్చుకొని, మానసిక బలహీనతకు  బలవుతున్నారు  .  పిరికితనం ఆవరించి,  ఒంటరిగా త లచి,  ఇబ్బందులను కొని తెచ్చుకోవడం మనం కలారా చూస్తున్నదే కదా!  కుటుంబ సభ్యులతో పాటు  బంధుత్వాలలో  ముఖ్యంగా ఈ క్రమం నిరంతరం కొనసాగుతున్నది.  ఆర్థిక అసమానతలు కారణం కాగా  వ్యక్తుల యొక్క అహంకార ధోరణి కూడా  మనిషిని నిట్ట నిలువునా దహించి వేస్తున్నది.  సంపద ఉంటేనేమి సహనం లేదు,  చదువు ఉంటేనేమి  సంబంధాలు లేవు , అందచందాలు ఉంటేనేమి  అందరూ మనుషులే అనే  సహనతత్వం లేదు.  కుటుంబ బంధాలలో మొదలైన ఈ చిచ్చు  బంధుత్వాలకు పాకి  రాకపోకలకు  చీడ సోకి  మొత్తం మానవ సమాజానికే కలంకముగా మిగిలిపోతున్నది .

        ఎందరెందరో విద్యావేత్తలు ,తత్వవేత్తలు , సామాజిక సంస్కర్తలు, సంఘసంస్కరణ అభిలాషలు  సామాజిక సంబంధాలు బలపడాలని  మానవ సంబంధాలు విస్తరిల్లాలని  అందుకు కుటుంబ నేపథ్యం  విస్తృత రీతిలో  మానవతా విలువలతో తులతూగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని  ఆశించినప్పటికీ  నాగరికత ముసుగులో రోజురోజుకు  ఈ దౌర్భాగ్య పరిస్థితులు  సమాజాన్ని మానవ సంబంధాలను దహించి వేస్తున్నవి . "మానవుడు సంఘజీవి" అని  అతి తేలిక పదాలతో నిర్వచి0 చిన  తత్వవేత్త అరిస్టాటిల్  సంఘ జీవితం యొక్క ఆవశ్యకత , మానవ సంబంధాల యొక్క ప్రాధాన్యత,  సామాజిక సంస్కరణలో  మెరుగైన సమాజ నిర్మాణంలో  వ్యక్తి ఆచరణ పాత్ర  కీలకమని గుర్తించే కదా  సమాజాన్ని హెచ్చరించినది . "అభివృద్ధి అంటే అద్దాలమేడలు రంగుల గోడలు కాదు నైతిక అభివృద్ధి దేశాభివృద్ధి అని గాంధీ   నిర్వచిస్తే"  "ఇనుప కండరాలు ఉక్కు  నరాలు గల యువత  దేశానికి అవసరమని  వివేకానందుడు  చెప్పిన విషయం తెలిసినదే"  ."వర్గ సంఘర్షణ , పోరాటాలు  చివరికి  సమాజ  అభివృద్ధికి మానవ సంబంధాలకు తోడ్పడాలని  మార్క్స్  బోధించినా,  అసమానతలు విద్వేషాలు  అవమానాలు లేని  సమానత్వ భావన గల సమాజం ఏర్పడాలని  అంబేద్కర్  తన ఇ జాన్ని ప్రతిపాదించినా  అన్నింటిలోనూ అంతరార్థం ఒకటే.  అది మనిషిని మనిషిగా చూడడం,  ప్రేమాను బంధాలను పెంపొందించుకోవడం,  జాతి సంపదను అందరూ సమానంగా పంచుకోవడం , మెరుగైన సమాజాన్ని ఆవిష్కరింప  చేసుకోవడం అని తెలుస్తున్నది.  సమాజ నిర్మాణము , మనుగడ,  మెరుగైన సమాజం వైపు ప్రయాణం  వంటి ఉత్కృష్ట లక్షణాలు కుటుంబ బంధాలకు  లక్ష్యాలుగా ఉన్నప్పటికీ  కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు  మానవ సంబంధాలను ఎక్కడికక్కడే  తునాతున కలు చేయడం వలన  సమ సమాజం అనే మహోన్నత లక్ష్యం నెరవేరడం లేదు.  మాటకు కూడా నోచుకోని కోట్లాది ప్రజలు  బిక్కు బిక్కుమంటూ  ఏదో కోల్పోయి  ఎందుకు ఈ జీవితమని నిరాశ చెంది  సహించలేని పరిస్థితిలో  ఆత్మహత్యలు  హత్యలకు పాల్పడుతూ  నూరేళ్ల నిండు జీవితాన్ని తునాతునకలు చేసుకుంటున్నారు.  తమ ప్రవర్తన వల్ల ఇతరులను కూడా నేరస్తులు,  దొంగలు,  అవినీతిపరులు,  సమాజ విద్రోహులుగా తయారు చేస్తున్న విషయాలను మనం  నిత్యం సమాజంలో జరిగే కోట్ల సంఘటనలను బట్టి అర్థం చేసుకోవచ్చు.  బుద్ధి జీవులు మేధావులు మనసున్న అందరూ  ముందుగా ప్రతిజ్ఞ చేయాలి,  మనతోనే ఆ సంస్కరణ ప్రారంభించాలి,  చెడు ప్రవృత్తి ఉన్న వాళ్లతో  మనం కొంత తగ్గి అయినా  అవగాహన చేయించి  సమాజంలో కలుపుకుపోయే ప్రయత్నం చేయాలి.  అదే సందర్భంలో ధూమపానం ,మద్యపానం , క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లు, అశ్లీల దృశ్యాలు, అశ్లీల సాహిత్యం,  టీ వీ సినీ ప్రసారాలలో  స్వార్థం  పెత్తందారే విధానాలను  జనం నిరసించాలి. ప్రభుత్వాలు కూడా  అలాంటి సామాజిక రుగ్మతల పైన ఉక్కు పాదం మోపాలి.  అప్పుడు మాత్రమే సమాంతరంగా కొనసాగే పోరాటం  మెరుగైన సమాజాన్ని ఆవిష్కరిoచి  మానవ సంబంధాలను పునరుద్ధరిస్తుంది.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు , అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు (చౌటపల్లి)హుస్నాబాద్,జి.సిద్దిపేట)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333