చావు బాధాకరమైనా చాలా ముచ్చట్లకు  కారణమవుతున్నది

Mar 2, 2024 - 21:15
 0  5

 జీవితమంటే ఏందో సమీక్షకు  వేదికవుతున్నది.

  కుటుంబ సభ్యులు, బంధువులు,  మిత్రులు,  జనం ప్రతిస్పందనకు  రూపమిస్తున్నది .

బాధ్యతలను గుర్తింపచేసి  తప్పులను సవరించుకోవడానికి, అహంకారానికి సమాధి చేసి  సార్థకమైన జీవితానికి  దారితీస్తే మరీ మంచిది.

--వడ్డేపల్లి మల్లేశము .

చావు పుట్టుకల మధ్యన గల  నిడివిని జీవితమని...... సమర్థవంతంగా, నిరర్థకంగా, అజ్ఞానంగా, బాధ్యతారాహిత్యంగా   జీవితాన్ని  గడుపుకోవడం అనేది  వారి వారి చొరవ, పట్టుదల, ప్రతిభ,  మూర్ఖత్వం , అజ్ఞానం పైన ఆధారపడి ఉంటుందనేది  విశాల ప్రపంచాన్ని  పరిశీలించి  జీవితాలను అధ్యయనం చేసి  ఒక అంచనాకు వస్తే కానీ తెలియదు.  "పేదవాళ్లుగా పుట్టడాన్ని  తప్పు పట్టలేము కానీ పేదవారీ గానే  చనిపోవడం మాత్రం  బాధ్యతారాహిత్యమే" అని  బిల్ గేట్స్ అన్నమాట  ఒక్కసారి అవలోకించడం కూడా అవసరమే  .జీవిత సారాన్ని,  జీవనయానాన్ని,  ఎంచుకున్న గమ్యాలు,  ఆ వైపుగా చేసే గమనాలు,  ఆటుపోట్లు, అవాంతరాలు, అడ్డంకులు  వీటన్నింటిపైనా సమగ్రమైన అవగాహన ఉండడం చాలా అవసరం . అక్షరాస్యత నిరక్షరాస్యత అనే అంశాలు పెద్ద ప్రతిబంధకాలు కాకపోవచ్చు కానీ  జీవితాన్ని సమర్థవంతంగా  వ్యూహాత్మకంగా  గడపడానికి కొంతవరకు హేతువు అవుతుందనడంలో సందేహం లేదు.  అయితే నిరక్షరాస్యత  అజ్ఞానానికి  కొలమానమని చెప్పడానికి ఆస్కారం లేదు. వ్యవహారిక జ్ఞానంతో  కుటుంబాలను రాజ్యాలను దేశాలను చక్కదిద్దిన వాళ్ళు కూడా లేకపోలేదు.  కనుక  సామాజిక జీవితానికి అలవాటు పడి, ప్రాపంచిక పరిజ్ఞానాన్ని పునికి  పుచ్చుకొని  మానవుడు సంఘజీవి అనే నానుడిని సార్ధకం చేయడానికి  తన వంతు కృషి చేసే ప్రతి వాళ్లు కూడా  కొంతవరకైనా  సార్థక జీవితాన్ని గ డపడానికి అవకాశం ఉంటుంది.  ఈ సార్థకత అనేది  బ్రతికినంత కాలం  సందర్భోచితంగా దృష్టికి వస్తే  మరణించిన సందర్భంలోనూ ఆ తర్వాత కూడా  వారి యొక్క వ్యక్తిత్వం, ఆచరణ, మానవత్వం,  ఆలోచన సరలి చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.  ఆయా వ్యక్తుల స్థాయిని బట్టి కుటుంబాలలో, బంధువర్గంలో, రాజకీయాల్లో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో  ఒక వ్యక్తి గురించి  చనిపోయిన తర్వాత కూడా చర్చించే అవకాశం ఉంటుంది.  అందుకు ఎన్నో ఉదాహరణలను మనం చెప్పుకోవచ్చు.  చావు పుట్టుకలు సహజమని కొందరు అనుకుంటే  చావును బాధాకరంగా  అంగీకరించడానికి సిద్ధంగా లేక  మనసొప్పక  ఆవేదనతో  ప్రశ్నించే వాళ్లు కూడా దుఃఖ సాగరంలో మునిగినప్పుడు ఏడుపులో స్పష్టంగా ఆ భావాలను చూడవచ్చు.  నిండు జీవితం గడిపిన వారి విషయంలో  కొంత మినహాయింపు  ఉండవచ్చు కానీ  బాల్య, యవ్వన, మద్యస్థ వయసులో  మృత్యువు కబలించు కపోతే మాత్రం  కుటుంబ సభ్యులు బంధువుల  రోదనలు మిన్నoటె అవకాశం ఉన్నది . చారిత్రక వ్యక్తుల  ఫోటోలు విగ్రహాలు  స్మారక కేంద్రాలుగా  మనకు దర్శనమిస్తుంటే   ప్రజలను ప్రభావితం చేసిన వాళ్ల విగ్రహాలు  చరిత్రలు మాత్రం  నిరంతరం ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉన్నవి.  అందం,  కులం,  సంపదలను బట్టి కాక వారి యొక్క వ్యక్తిత్వాన్ని , పోషించిన పాత్ర, సమాజానికి చేసిన సేవ ఆధారంగా ఈ గుర్తింపు ఉంటుందనేది  నగ్నసత్యం.  .సామాజికంగా ఎదిగి  మెరుగైన సమాజం కోసం త్యాగాలను చేసిన వాళ్లు  కొందరైతే , అత్యంత నికృష్ట పరిస్థితుల్లో జీవించి కూడా  తమ కుటుంబాలను చక్కదిద్దుకుంటూ దేశ ఉత్పత్తిలో భాగస్వాములవుతున్నటువంటి సామాన్య పేద వర్గాలను కూడా  నిజంగా  ప్రజా సేవకులుగానే భావించాలి.  ఉత్పత్తి లేకుండా సంపద లేదు, సంపద లేకుండా జీవనం లేదు, జీవనం లేకుండా ప్రజలు లేరు, ప్రజలు లేకుంటే దేశమే లేదు . అందుకే సామాన్యుడు,  ప్రశ్నించేవాడు, ఆలోచించే వాడే నాకు ఆరాధ్యుడని కాలోజీ చెప్పినట్టు  దేశ ఉత్పత్తిలో భాగస్వాములై  సామాన్య జీవితం గడిపి  జీవిత విలువలను సార్థకం చేయగలిగినటువంటి సామాన్య వ్యక్తుల కూడా ఈ దేశంలో చారిత్రక వ్యక్తులు గానే గుర్తించవలసిన అవసరం ఉన్నది .
      ఇక చావు పుట్టుకల గురించి ప్రధానంగా చర్చ జరుగుతున్న సందర్భంలో  మన చేతిలో ఉన్న జీవితాన్ని సమర్థవంతంగా  ముగించుకోవడానికి  ఎత్తుగడలు, ప్రయత్నాలు, పట్టుదల, కార్యసిద్ధి  వంటి అంశాలను  ఆచరించవలసిన అవసరం ఉన్నది.  చనిపోయిన సందర్భంలో కొనసాగుతున్న తంతును  ముఖ్యంగా గ్రామీణ  చిన్న పట్టణాలు  మధ్యతరగతి కార్మిక రైతు కుటుంబాల వ్యక్తులను  పరిశీలనలోకి తీసుకుంటే  అనేక రకాలైన సన్నివేశాలు, సందర్భాలు, సమీక్షలు, చర్చలను మనం చూడవచ్చు.  కన్నీరు కార్చినా,  ఆవేదన కన్నీళ్ళ మధ్యన కాటికి చేర్చినా,  చితికి నిప్పంటించి కుండను పగలగొట్టి  కట్టిన తాళ్లను తెంపివేసి  స్మశానములోనే ఒంటరి చేసి వచ్చినా  భౌతికంగా ఆ వ్యక్తి దూరం కావచ్చు కానీ అనుభవాలు జ్ఞాపకాలు  ఆలోచనలు వ్యూహాలు అన్ని చర్చకు వస్తూనే ఉంటాయి  .అందుకే కాబోలు  దుఃఖంలోనూ హాస్యం పరిహాసపు మాటలు,  ధైర్యంతో దుఃఖాన్ని దిగమింగుకొని బాధను మరిచిపోవడానికి  చేసే కొన్ని ఎత్తుగడల సందర్భంగా  జోకులు కూడా  నాలుకల మీద నడయాడుతుంటాయి . గత దశాబ్దానికి పైగా  పట్టణాలలో ప్రారంభమైన ఫ్లెక్సీల ప్రదర్శన  విధానం కు గ్రామాలకు కూడా పాకి  జనావాసాల మధ్యన చర్చకు థా వివ్వడం అనేది జీవితం పైన విస్తృతంగా చర్చ జరగడానికి ఆస్కారం ఇస్తున్నది .   బంధువులు స్నేహితులు  సామాన్య ప్రజానీకం కూడా  స్వేచ్ఛగా  అభిప్రాయాలను వ్యక్తం చేయడాన్నీ మనం గమనిస్తే  వ్యక్తిగత జీవితమైనా ఒక దశలో అది ప్రజలకు పౌర సమాజానికి  సంబంధించినది గానే చూడవలసి ఉంటుంది .
     చారిత్రక వ్యక్తులకు సంబంధించి విశాలమైన  పరిధి ఉండవచ్చు కానీ సామాన్య ప్రజలకు,  రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలకు,  చదువు లేని అమాయకులకు,  లోకం పోకడ తెలవకుండా తమ వృత్తినే నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి  వాళ్లకు కూడా  అందరిలాగే ఉన్నతమైన జీవితం ఉన్నదని  ఆనందంగా గడపాలని  బంధాలు  సంబంధాలు  సజీవంగా కొనసాగాలని  ఆశించడమైతే తప్పు కాదు.  ఆర్థిక పరిస్థితులు, అక్షరాస్యత, నాగరికత కు అతీతంగా  ప్రతి వ్యక్తికి కూడా  ఒక చరిత్ర ఉంటుందని   ప్రజలతో మమేకమైనప్పుడు మాత్రమే సంపూర్ణంగా మిగిలిపోతుందని గుర్తించడం అవసరం.  సమీక్ష ప్రతి వ్యక్తి చనిపోయిన సందర్భంలో చేయాల్సినటువంటి అవసరం ఉంది.  ఇప్పటికీ ముఖ్యంగా పల్లెటూర్లు మధ్యతరగతి గ్రామాలు  చిన్న పట్టణాలు  ఇతరత్రా కొన్ని చోట్ల కూడా  ప్రదర్శించిన ఫ్లెక్సీ ని చూచి కన్నీరు కార్చేవాళ్ళు,  స్మశాన వాటికలో కాలిపోతుంటే  కూలి బూడిద అయిపోతుంటే  తమ వంతుగా ఒక కర్రను చితిపై  పెడుతూ ఉంటే  అవ్యక్తమైన అనుభూతికి లోను కావడాన్నీ మనం  అనుభవపూర్వకంగా గమనించి ఉన్నాం.
    తప్పులను సవరించు కోవడానికి వేదిక అయితే బాగుండు'-

  ఇప్పటికీ కుటుంబ బంధాలను తీక్షణంగా పరిశీలించినప్పుడు  కుటుంబ సభ్యులచే  తీవ్రమైన అణచివేత వివక్షతకు గురవుతున్నటువంటి వృద్ధులైన తల్లిదండ్రులు,  ఒంటరి మహిళలు,  కుటుంబంలో ఒంటరిగా మిగిలిపోయిన అంగవైకల్యం గలవాళ్లు,  అనారోగ్య పీడితులు , మానసిక వికలాంగులు,  ఉత్పత్తిలో భాగస్వాములు కాలేక  కుటుంబానికి భారంగా పరిణమించిన వాళ్లు  ఉన్న ప్రతి చోట  ఘర్షణ  భారీగా కొనసాగుతున్నది.  ఆదాయాలు పరిమితంగా ఉండడం,  నా అనే వాళ్ళు లేకపోవడం,  అహంకారం, స్వార్థం  వంటి అనేక కారణాల వలన కుటుంబ బంధాలకు పగుల్లు ఏర్పడుతున్న విషయం  దాని పర్యవసానం చనిపోయిన నాడు చర్చకు వచ్చే అవకాశం ఉన్నా  అదే చావు   నీతి నిజాయితీకి , ప్రేమకు ,ఆత్మీయతకు నిదర్శనం గా ఉన్న  సందర్భాలు కూడా లేకపోలేదు.  కొన్ని సందర్భాల్లో  సంస్మరణ సభలుగా మార్చుకొని,  మంచి చెడులను బేరీజు వేసుకొని,  వారి గురించి   మనసులో తలుచుకుంటూ ,నాలుగు మాటలు    వ్యక్తం చేయడం అనే సంస్కారపూరితమైనటువంటి సంఘటనలు కూడా ఇటీవల కాలంలో చోటు చేసుకోవడం హర్షించదగినది.  ఇలాంటి సందర్భాలు భవిష్యత్తులో  కుటుంబాలలో ఒత్తిడి వివక్షత లేకుండా,  ప్రేమపూరితంగా వ్యవహరించడానికి,  ఆత్మీయతను విశాల  ప్రేమ తత్వాన్ని పంచడానికి,  కలుపుగోలు తనంతో  బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి  ఉపయోగపడితే బాగుండు .   చనిపోయిన వేల  ఆడబిడ్డలు ఒకరోజు,  ఆత్మీయులు మరొక రోజు , దగ్గరి బంధువులు ఇంకో రోజు , కుటుంబ యజమాని పక్షాన  మిగతా రోజులలో విందు భోజనాలు ఏర్పాటు చేయడం అనేది రివాజు గా మారిపోయింది . తమ ఆత్మీయులను పిలుచుకొని,  ఉన్నంతలో  భోజన సౌకర్యాలను సమకూర్చి,  అదే సందర్భంలో మన నుండి దూరమైన  వాళ్లను ఆరాధించుకోవడం, అర్ధించుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం,  పక్షికి పెట్టే కార్యక్రమం ద్వారా  మననం చేసుకొని స్మృతులను అలవాట్లను  ఇష్టమైన పదార్థాల  పట్టికను  ఉచ్చరించడం కూడా మామూలుగా మారిపోయింది .   మాట్లాడుకోవడం , చర్చించుకోవడం , జ్ఞాపకం చేసుకోవడం ద్వారా  ఒక అవ్యక్తమైన అనుభూతికి లోనయ్యే  అవకాశం మాత్రం ఉంటుంది. దానికి ఎవ్వరూ కూడా అతీతులు కారు.  కన్నీరు కల్ల వెంట కదలాడుతూ ఉంటే , అనుభూతులు ఆత్మీయతలు మదిలో తోనికి సలాడుతూ ఉంటే......  పొరపాట్లూ,తప్పులు ఒకవేళ ఉంటే వాటిని కూడా అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఉన్నవారిలో  కోల్పోయిన వారి  అనుభూతులను చూసుకోవడం ద్వారా  3రోజు, 5 రోజు 9, రోజు, 11వ రోజు,  చివరికి  30 రోజుల తర్వాత మాస ఉత్సవాన్ని నిర్వహించుకొని  ప్రతి మాంసం కూడా  జ్ఞాపకం చేసుకునీ  తిథి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఏడాది పూర్తి అయిన తర్వాత  ప్రథమ వర్ధంతిని  బంధువులు స్నేహితులు మిత్రులు ప్రజల మధ్యన జరుపుకొని  మన నుండి దూరమైన వ్యక్తికి పూర్తిస్థాయిలో నివాళి అర్పించే కార్యక్రమం  పేదరికంలో ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో పెద్దరికంగా  పదిమందిని పిలుసుకొని ఆతిథ్యం  ఇవ్వడం అంటే  ఆర్థికంగా  ఎదగడం కాకపోవచ్చు కానీ ఆత్మీయతను పంచుకోవడానికి ఆమాత్రం అవకాశాన్ని అయినా ఉపయోగించుకోకపోతే ఎలా అని   భావోద్వేగానికి గురి కావడం  జరుగుతున్న మహా తంతు .  చావు తర్వాత కుటుంబంలో కొనసాగించే చర్యలకు శాస్త్రీయ పునాది  పెద్దగా లేకపోవచ్చు కానీ  సంస్కారం, మానవత్వం, ప్రేమ,  అనుభూతులు మాత్రం  నిండుగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . ఈ సందర్భంగా రాబోయే  లోపాలను అరికట్టే విధంగా  పరస్పరం ప్రేమానురాగాలను  పెంపొందించుకునే విధంగా తోడ్పడాలని మాత్రం  అందరం కోరుకుందాం.  అలాంటి చర్చలు చేద్దాం,  ఎవరికి వారిమి బతికున్న నాళ్ళు పొరపాటు చేయకుండా ఉంటే  భవిష్యత్తులో విమర్శకు ఆస్కారం ఉండదు అని గ్రహిస్తే మంచిదే...... అదే సార్థకమైన జీవితం .
( ఈ వ్యాసకర్త  సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటుపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333