కొండా లక్ష్మణ్ బాపూజీ చూపించిన మార్గం ఇప్పటికీ స్ఫూర్తిదాయకం:-జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్
జోగులాంబ గద్వాల 27 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల .ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మూడు తరాల ఉద్యమశీలిని ప్రదర్శిస్తూ, తెలంగాణ ప్రజల హక్కుల కోసం జీవితాంతం కృషి చేశారని, ఆయన చూపించిన మార్గం ఇప్పటికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు. శుక్రవారం ఐ.డి.ఓ.సి అవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమశీలి, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాపూజీ చేసిన ఎనలేని సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, సాయుధ పోరాటం నుంచి రాజకీయ పోరాటం వరకు తన త్యాగస్ఫూర్తిని చాటారని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చూపిన పట్టుదల, విశ్వాసం, తపన తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సాధనే లక్ష్యంగా సమాజంలోని ప్రతి వర్గానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని, ఆయన చూపిన మార్గం, విలువలు అందరికీ స్పూర్తిదాయకం కావాలని అన్నారు. ఆయన సేవలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని, ఆయన ఆశయాలు అనుసరిస్తూ జిల్లా అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగా రావు, ఏ.ఓ. వీర భద్రప్ప,జెడ్పీ సి.ఈ.ఓ కాంతమ్మ ,ఇంచార్జ్ బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ బాబు, ఎస్.సి సంక్షేమ శాఖ అధికారి సరోజమ్మ, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు...