నత్తనడకన సాగుతున్న నకిరేకల్ కడపర్తి రహదారి విస్తరణ పనులు
నకిరేకల్, 13 మార్చి తెలంగాణ వార్త ప్రతినిధి :- నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణం నుండి కడపర్తి గ్రామానికి వెళ్లే రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండటంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి ప్రధాన పట్టణమైన నకిరేకల్ నుండి 165 నంబర్ జాతీయ రహదారికి వెళ్లే ఈ ప్రధాన రహదారి అత్యంత రద్దీగా ఉండే మార్గంగా గుర్తింపు పొందింది.
పన్నాలగూడ వద్ద కడపర్తి క్రాస్ రోడ్ నుండి మెయిన్ రోడ్ మూలమలుపు వరకు రహదారి అత్యంత ఇరుకుగా ఉండటంతో పాటు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా భారీ వాహనాలు వచ్చినప్పుడు రహదారి పూర్తిగా బంద్ అయ్యే పరిస్థితి నెలకొంటోంది. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించినప్పటికీ పూర్తిస్థాయిలో చేయకుండా మధ్యలోనే వదిలేయడం, కిలోమీటరు మేర మాత్రమే విస్తరణ చేసి మిగిలిన పనులను కొనసాగించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెబుతూ ఫోటోలకు పోజులు ఇస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఈ ముఖ్యమైన రహదారి సమస్యపై పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత కాంట్రాక్టర్ మరియు అధికారులను సంప్రదించి ఆలస్యంగా కొనసాగుతున్న రహదారి విస్తరణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.