కూడు లేని పేదలను,  కోళ్ల దొంగలను  మన చట్టం పట్టుకుంటుంది కానీ  బడా నేరగాళ్లను కాదు.

Oct 13, 2024 - 21:18
Oct 14, 2024 - 16:30
 0  4

అన్యాయాలను అరికట్టే యంత్రాంగం లేకపోవడంతో  దేశద్రోహులు చేసే పెద్ద నేరాలు  మన నాగరికతను అపహాస్యం చేస్తున్నాయి. అంటున్న -ప్రముఖ రచయిత్రి కిరణ్ దేశాయ్. నిజమే కదా!

వడ్డేపల్లి మల్లేశం 

చిన్న నేరాలకే శిక్షలు పడుతూ  నేరస్తులుగా చిత్రీకరించబడుతూ  సమాజం నుండి వెలివేయబడుతున్న సందర్భాలను గమనిస్తే  ఈ దేశంలో బడా నేరగాళ్లకు  ప్రభుత్వ పరంగా ఎంత రక్షణ ఉన్నదో అర్థమవుతున్నది  .పాలకులు రాజకీయ యంత్రాంగం ప్రోత్సాహంతో కొందరికి  ఎన్ని నేరాలు చేసినా చివరికి దేశద్రోహం తలపెట్టినా  రక్షణ ఉంటుంది కానీ పీడితుల పక్షాన పోరాదేవాళ్లపై దేశ ధ్రోహ కేసులు  పెట్టిన  అనేక దృష్టాంతాలు వున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖ రచయిత్రి  కిరణ్ దేశాయ్ చేసిన వ్యాఖ్యలను  సమాజం యావత్తు పరిశీలించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది కిరణ్ దేశాయ్ వ్యాఖ్య

అన్యాయాలను అరికట్టే యంత్రాంగము మనకు లేదు.  చట్టం కోళ్ల దొంగలను పట్టుకుంటుంది కానీ ఎన్నో ముసుగుల్లో జరిగే పెద్ద నేరాలను పట్టించుకోదు  అలాంటి నేరాలు మనం ఘనంగా చెప్పుకునే నాగరికతను అపహాస్యం చేస్తాయి."
          15% ప్రజలు దారిద్ర రేఖ దిగువన జీవిస్తుంటే  కనీస సౌకర్యాలకు నొచని  కోట్లాది ప్రజానీకం  తమ హక్కుల కోసం పోరాటం చేస్తూనే మనుగడ కోసం విధిలేని పరిస్థితిలో కొన్ని చిన్న చిన్న నేరాలకు పాల్పడక తప్పడం లేదు అని  ఈ వ్యాఖ్యను చూస్తే అర్థమవుతుంది . ప్రజా సంపదను సంపన్న వర్గాలకు దోచిపెట్టే పాలకవర్గాలు పేద వర్గాల యొక్క ఆకలిని తీర్చడానికి  కనీస అవసరాలను సమకూర్చడానికి మానవాభివృద్ధిని సాధించి పెట్టడానికి మాత్రం  కృషి చేయడం లేదంటే ముందు  పాలకవర్గాలదే పెద్ద నేరం, దేశద్రోహం అని చెప్పక తప్పదు.  ఆ తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా సంబంధిత శాఖ పోలీసు యంత్రాంగం  ఆకలితో అలమటించి దిక్కుతోచని పరిస్థితిలో దొంగతనానికి పాల్పడితే  అలాంటి వాళ్లను దేశద్రోహులతో సమానంగా  చిత్రీకరించి దొంగలుగా  పట్టుకొని  శిక్షిస్తున్నారు  కానీ  దేశ సంపదను కొల్లగొట్టడం,  భూ కబ్జాలకు పాల్పడడంతో పాటు ప్రజా సంపదను  తమ సంపదగా అక్రమాస్తుల కూడబెట్టి  అంతేకాదు మహిళల పైన లైంగిక వేధింపులు ఇతర అకృత్యాలు అత్యాచారాలకు పాల్పడుతున్నటువంటి బడా నేరగాలను మాత్రం చట్టం కాపాడుతున్నది.  అంతెందుకు వాళ్లే ఈనాడు చట్టసభల్లో ఊరేగుతున్నారంటే ఈ దేశంలో ఉన్న రక్షణ వ్యవస్థ  అన్యాయాలను అరికట్టలేని యంత్రాంగం  గురించి అర్థం చేసుకోవచ్చు.
      పేదరికం నిర్మూలించి కనీస మానవాభివృద్ధిని సాధించి పెట్టడంతో పాటు దారిద్రరేఖ దిగున ఉన్నవాళ్లను పైకి తీసుకురావడానికి కృషి చేయవలసిన కనీస బాధ్యత పాలకవర్గాలపై ఉన్నది కానీ ఆ వైపుగా గత 77 ఏళ్లకు  పైగా  ఈ దేశంలో నెలకొన్న  నిర్లక్ష్యం కారణంగా 
అనాధలు అభాగ్యులు బానిసలు యాచకులు, బిచ్చగాల్లుగా మాత్రమే  సామాన్య జనం యొక్క ఆర్థిక పరిస్థితిని పరిమితం చేసి  పబ్బం గడుపుకోవడం మొదటి నేరం.  ఇక దేశ సంపదను పెట్టుబడిదారీ పారిశ్రామిక సంపన్న వర్గాలకు దోచిపెట్టడం రెండవ నేరం  ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం  బడా పెట్టుబడిదారులు ఎగవేసినటువంటి సుమారు 16 లక్షల కోట్ల రూపాయలను  మాఫీ చేసిన సందర్భాన్ని గమనిస్తే  ఇది నేరం కాదా ? సంపన్న వర్గాలకు అండగా  ఉంటే సరిపోతుందా  మెజారిటీ ప్రజలతో గెలిచిన పాలకవర్గాలు  సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తే అదే పరిపాలన అవుతుందా?  బుద్ధి జీవులు మేధావులు విద్యావంతులు  పౌర సమాజం ఆలోచించవలసిన  అనివార్య పరిస్థితి
     .  నేర సామ్రాజ్యంలో వాస్తవ గణాంకాలు  :-
*********
17వ లోక్సభలో  83 శాతం మంది నేర చరిత్ర ఉన్నవాళ్లు సభ్యులుగా కొనసాగినారు  రాజ్యసభలో 36% సభ్యులు  నేరాలకు పాల్పడి నేరచరిత్ర ఉన్నవాళ్లే  అయినా వారిపై ఎలాంటి చర్యలు లేవు.  సెప్టెంబర్ 9 2024న కలకత్తాలోని అర్జీకర్ ఆసుపత్రిలో  జూనియర్ వైద్యురాలి పైన అత్యాచారం హత్య జరిగిన నేపథ్యంలో  ప్రజాస్వామ్య సంస్కరణల కమిటీ  చేసిన సర్వే ద్వారా మరొక భయంకరమైన వాస్తవం వెలుగు చూసింది.  అదేమిటంటే ఈ దేశంలో 151 యొక్క మంది  ఎంపీలు ఎమ్మెల్యేలు  మహిళల విషయంలో నేరస్తులుగా గుర్తించబడితే  16 మంది పైన లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు నమోదైనట్లు ఆ నివేదిక వెల్లడించడం  ఎవరు నిజమైన నేరస్తులో తెలియజేయడానికి పెద్ద ఉదాహరణ.  ఎన్నికల సమయంలో అఫీడవిట్లో తమ నేర చరిత్రను దాఖలు చేసినప్పటికీ  ఎన్నికల సంఘం వారిని  అనుమతించడం ఆయా పార్టీలకు చెందినటువంటి నాయకత్వం అభ్యర్థులుగా ప్రకటించడం రెండు కూడా  తప్పుడు విధానాలు . ఎన్నికల సంఘానికి ప్రభుత్వాలకు పార్టీలకు ఈ దేశ ప్రయోజనాలు ఏనాడు కూడా  కనిపించలేదు వాళ్ల స్వార్థ ప్రయోజనాలు తప్ప  అలాంటి నేరగాళ్లకు చట్టసభల్లో అవకాశం కల్పిస్తే  బడా నేరాలతో పాటు మహిళలను కూడా చిత్రవధకు గురిచేసి లైంగిక వేధింపులతో నేర సామ్రాజ్యాన్ని ఏలిన అనేకమంది  ఇటీవల కాలంలో  మీడియాలో అనేకసార్లు ప్రచారమైన  వాస్తవాన్ని అంగీకరించలేదు. తప్పును ఒప్పుకోలేదు.  అందుకే కదా ప్రముఖ రచయిత్రి కిరణ్ దేశాయ్ వ్యాఖ్యలు  కోళ్ల దొంగలు పిడికెడు మెతుకుల కోసం  తప్పుడు పనులు చేసిన వాళ్ళని దొంగలుగా చిత్రీకరించి జైలు పాలు చేసి దశాబ్దాలు  విచారణ ఖైదీలుగా  శిక్షించడమే ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి వికృత  న్యాయం.
        నేరస్తులను సంస్కరించడానికి ఉద్దేశించినటువంటి జైల్లో కనీస సౌకర్యాలు లేకపోగా  నాలుగు లక్షల 36 వేల మందికి మాత్రమే  సరిపోయే జైల్లో  కిక్కిరిసిన స్థితిలో  5,73,000 మంది  విచారణ ఖైదీలుగా చేయని నేరానికి శిక్షలు అనుభవిస్తూ ఈ దేశంలో అసాధారణమైనటువంటి  అన్యాయ వ్యవస్థ కొనసాగడం బాధాకరం కాథా?    మొత్తము ఖైదీలలో  70 శాతానికి పైగా విచారణ ఖైదీలు మాత్రమేనని ప్రభుత్వ గణాంకాలు తెలియ చేస్తుంటే  ప్రభుత్వ వ్యవస్థాగతమైన లోపాలు, సిబ్బంది కొరత , తగిన సాక్షాలను  ప్రవేశ పెట్టకపోవడం,  మభ్య పెట్టే ప్రయత్నం చేయడం వంటి అనేక కారణాల వలన  లక్షలాదిమంది  చేయని నేరాలకు ఆ ప్రకటిత జైలు శిక్షణ అనుభవిస్తూ విచారణ ఖైదీలుగా  దశాబ్దాలు తమ  జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.  ఇందులో తాము ఎందుకు అరెస్ట్ అయినామో తెలియని వాళ్ళు,  చట్టం గురించి తెలియకపోవడం,  పరిచయం లేకపోవడం,  బయటికి రావడానికి అవకాశాల పట్ల అవగాహన లేక  దశాబ్దాల తరబడి కూడా శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారంటే  ప్రపంచంలోనే  అతి పెద్ద లిఖిత రాజ్యాంగము అమల్లో ఉన్న భారతదేశంలో  న్యాయ వ్యవస్థకు పట్టిన  దుర్గతి అంటే అతిశయోక్తి కాదేమో  !
అనేక సందర్భాలలో భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా పాలకుల యొక్క లోపాలను, పార్లమెంటు యొక్క బాధ్యత రాహిత్యాన్ని,  చట్ట సభలో చర్చించకుండా ఆమోదిస్తున్న బిల్లుల  విషయాన్ని హెచ్చరించినప్పటికీ  పాలకుల లోపం నిర్లక్ష్యం కారణంగానే ఈ వ్యవస్థ కొనసాగుతుందని మనం  అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
  దేశద్రోహులుగా  కట కటాలలో ఉండవలసిన వాళ్ళు చట్టసభల్లో ఉండి  లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉంటే  కాయకష్టం చేసి రెక్కాడితే  కానీ డొక్కాడని నిరుపేదలు తమ ఉనికి కోసం ఉత్పత్తిలో భాగస్వాములై  ఈ దేశ సంపదను  పెంచి పోషిస్తున్న సాధారణ ప్రజలు చేయని లేదా చిన్న నేరాలకు  శిక్షించబడి  ఇబ్బంది పడితే  న్యాయ వ్యవస్థలోని ఈ అసమతుల్యతను ఎలా అర్థం చేసుకోవాలి?  ఇంత అగమ్య గోచరమైన పరిస్థితులు ఉన్న కారణంగానే  కిరణ్ దేశాయ్ ప్రముఖ రచయిత్రి గారు  ఆ వ్యాఖ్య చేసినట్లు మనం అర్థం చేసుకోవాలి. అదే సందర్భంలో  నిజమైన నేరస్తులకు శిక్ష పడాలని,  ఖైదీల పేరుతో  శిక్షించబడుతున్నటువంటి వాళ్లకు న్యాయం జరగాలని  ఈ దేశంలో  ప్రజా పోరాటాలు రావా ల్సిన అవసరం ఉన్నది . న్యాయ వ్యవస్థ కూడా ఈ విషయంలో పాలకవర్గాల యొక్క ఆకృత్యాలను  రాజకీయ నాయకుల బడా నేరాలను  వి చారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం ద్వారా  నేరానికి తగిన శిక్షను విధించి  భారత రాజకీయాలను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే సామాన్య ప్రజలకు  మనుగడ ఉంటుంది.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333