ఏ పార్టీ వాడు కాదు ఏ పాటి వాడు అనేది ముఖ్యం
ఏ పార్టీ వాడు కాదు ఏ పాటి వాడు అనేది ముఖ్యం.* సామాజిక న్యాయం నేపథ్యంలో వ్యక్తిత్వo చట్టసభల సభ్యులకు కొలమానం.* నేరస్తులు, దొంగలు, అవినీతిపరులకు చట్టసభలు నిలయం అయితే ఎలా.?* విద్యా వ్యాపారులు కాదు విద్యావేత్తలు M L C లు గా శాసనమండలిలో రాణించాలి.*
***********************************
--- వడ్డేపల్లి మల్లేశం 9014206412
----12...02...2025******************
చట్టసభలలో శాసనసభతో పాటు శాసనమండలి కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని ప్రజలకు సంబంధించిన అంశాలతో పాటు విద్య ఉద్యోగులు నిరుద్యోగులు, ఉపాధి అవకాశాల పైన చట్టసభలలో ముఖ్యంగా శాసనమండలిలో క్రియాశీలక చర్చ జరగాలనే నేపథ్యంలో ప్రధానంగా పట్టభద్రులకు ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోతున్నదని, రాజకీయ పార్టీల నాయకులకు ఉపాధి కోసం పనిచేస్తున్నదనే విమర్శతో దీనిని రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఇది పునరుద్ధరించబడినది 2014లో రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో తెలంగాణలో తిరిగి శాసనమండలి కొనసాగుతున్న విషయం మనందరికీ తెలుసు .ప్రైవేటు రంగానికి అతీతమైనది ప్రభుత్వం అని నిర్వచించుకుంటే ప్రభుత్వం ఆధ్వర్యంలోపల అన్ని కార్యక్రమాలు కొనసాగే బదులు తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ, ప్రజలను అభద్రతకు గురి చేస్తూ, విద్యా ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలను వైద్యాన్ని కూడా ప్రైవేటు పరం చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్న సందర్భంలో ముఖ్యంగా విద్యా వైద్యం ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు నిరుద్యోగులకు సంబంధించిన సమస్యల పైన సుదీర్ఘమైన చర్చ చేసి పరిష్కరించడానికి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను పొందుపరచడం జరిగిన విషయం మనందరికి తెలుసు. రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రంగా కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పట్టభద్రుల స్థానం నుండి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు క్రియాశీలక పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలుసు. ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏ పార్టీ వారు అనేది కాకుండా వారు సమర్ధులా? అసమర్ధులా? విద్యా వ్యాపారాలతో సంబంధం ఉన్నదా? లేదా ప్రజాక్షేత్రంలో పనిచేసిన నేపథ్యం ఉన్నదా? తెలుసుకోవలసిన బాధ్యత ఉపాధ్యాయులు పట్టభద్రుల పైన ఉన్నది. విద్యా వ్యాపారం చేసే ప్రైవేటు రంగంలోని ఒక పెట్టుబడిదారుడు చట్టసభల్లోకి రావడానికి యత్నిస్తే ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 17వ లోక్సభ లోపల 83 శాతం మంది నేరస్తులు లేదా నేరచరిత్ర కలిగిన వాళ్లు ఉన్నారని ప్రభుత్వమే స్వయంగా చెప్పినప్పుడు ఆ చట్టసభల ద్వారా ప్రజలకు మేలు జరగలేదని మనకు తెలుసు. కాబట్టి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సామాజిక సమీకరణాలలో భాగంగా కూడా ఇంతవరకు చట్టసభల గడప దాటని వాళ్లను ఎంపిక చేసుకోవడం ద్వారా అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టే ప్రక్రియను ప్రారంభించవలసినటువంటి తరణం ఆసన్నమైనదని భావించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ శాసనమండలి సభ్యుల యొక్క ఎన్నికలు ఫిబ్రవరి 27 నాడు జరగనున్న నేపథ్యంలో ఈ అంశాలపై చర్చించుకోవడం సమంజసం ముదావహం.
తెలంగాణ రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో పాటు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ స్థానానికి పట్టభద్రుల ఎన్నిక కొనసాగుతున్న సందర్భంగా నమోదు చేసుకున్నటువంటి పట్టబద్రులు తమ ప్రతినిధిని చట్టసభలకు పంపించే క్రమంలో సుదీర్ఘంగా ఆలోచించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.ఈ నేపథ్యంలో శాసనమండలి సభ్యుల యొక్క బాధ్యతలను ఒక్కసారి మననం చేసుకుందాం.
--- ఉపాధ్యాయ నియామకాలు ఉద్యోగ భద్రత వెట్టి చాకిరి ప్రయోజనాలు పాత పెన్షన్ పునరుద్ధరణ వంటి అంశాలను కూడా ఛాలెంజ్ గా చర్చించవలసి ఉంటుంది.
-- రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మందికి పైగా నిరుద్యోగుల యొక్క సమస్య పైన చర్చించడం ప్రభుత్వాన్ని ప్రశ్నించి అవసరమైతే ప్రతిఘటించి గత ప్రభుత్వ ద్రోహాన్ని కూడా విశ్లేషించి ఉద్యోగాలు సాధించుకోవడానికి కృషి చేయవలసినటువంటి నిబద్ధత కూడా చాలా అవసరం.
--- విద్యా వైద్యము వంటి అంశాలు ప్రధానంగా ప్రభుత్వ రంగంలో కొనసాగాలి. అంతేకాదు కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలి కొఠారి సూచనల ప్రకారంగా రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులను కేటాయించాలి. ఈ అంశాల పైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు కూడా మొక్కుబడిగా వ్యవహరిస్తున్న విషయం తెలుసు. 30% నిధులను కేటాయించే విధంగా కామన్ స్కూలు వ్యవస్థను అమలు చేసే విధంగా ప్రోత్సహించడంతోపాటు ప్రైవేటు విద్యా వ్యవస్థను మొత్తం కూలదోసి ప్రభుత్వ రంగంలోనే విద్యను కొనసాగించడానికి ప్రభుత్వాన్ని ఒప్పించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధిగా పాటించినప్పుడు మాత్రమే ప్రజలకు చేరువ అయ్యే అవకాశం ఉంటుంది.
-- ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని కోరడం శాసనమండలి సభ్యుల యొక్క ప్రధాన కర్తవ్యమైనప్పుడు విద్యా వ్యాపారి, పెట్టుబడిదారుడు, రియల్ ఎస్టేట్ వర్గాలు, నేరగాళ్లు, సంపన్నులు ఏ రకంగా ఎమ్మెల్సీ స్థానానికి అర్హులవుతారు? ఓటర్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
-- టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి ప్రభుత్వం 5 ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి ఇప్పటికే విద్యార్థులకు తీరని ద్రోహం తలపెట్టింది. మరో 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం చిత్తశుద్ధి గలది అయితే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలను వెంటనే స్వాధీనం చేసుకొని ప్రైవేట్ రంగాన్ని కూలదోయాలి. భవిష్యత్తులో ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రాకుండా కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. అలాంటప్పుడు ప్రైవేట్ రంగంలో విద్యా వ్యాపారం చేసినటువంటి యాజమాన్యం నుండి ఎమ్మెల్సీ ప్రతినిధిగా ఎన్నుకోబడితే ఏ వర్గ ప్రయోజనం కోసం పనిచేస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యక్తి అధికార పార్టీ కానీ ఇతర పార్టీలకు చెందినవాడైన ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు.
-- ప్రైవేటు విద్యా వ్యాపారి ఎమ్మెల్సీగా ఎన్నికైతే బడ్జెట్ను 30% కేటాయించాలని, కామన్ స్కూల్ ప్రవేశపెట్టాలని, ప్రైవేటు విద్యాసంస్థలను మొత్తం కూలదోసి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని చట్టసభలో నిలదీయగలడా? లేనప్పుడు అలాంటి వారి వల్ల ప్రభుత్వానికి ప్రజలకు వనగోరేది ఏమిటి ?అందుకే విద్యావంతులను మేధావులను బుద్ధి జీవులను ప్రజాస్వామిక వాదులను
ప్రభుత్వ రంగంలో విద్య కొనసాగాలని ఆశించేటువంటి విద్యారంగా నిపుణులను చూసి ఏరుకొని ఎన్నుకోవలసినటువంటి అవసరం ఉంటుంది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా నిరంతరము ఆధిపత్య కులాలకు చెందిన వాళ్లే ఎన్నుకోబడుతున్నారు ఎందుకంటే ఆయా రాజకీయ పార్టీలు ఆధిపత్య కులాల చేతిలో ఉన్నప్పుడు టిక్కెట్ కేటాయించేది కూడా డబ్బున్న వాళ్ల వర్గానికి చెందిన వాళ్లకే అనేది నగ్న సత్యం. రాష్ట్రంలో 2.4 శాతం ఉన్నటువంటి రెడ్లకు 43 సీట్లు అసెంబ్లీలో ఉంటే, 0.4వున్న వెలమలకు 13 ఉన్నాయo టే ఈ దోపిడీని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బీసీ వాదం బలంగా చెలరేగుతు కుల గణన నివేదికను ప్రవేశపెట్టిన నేపథ్యంలో తప్పుల తడక అని బీసీ సంఘాలు విమర్శిస్తున్న కారణంగా జరుగుతున్నటువంటి శాసనమండలి సభ్యుల ఎన్నికలలో బీసీ వాదాన్ని గెలిపించుకోవడం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకే రాజ్యాధికారాన్ని కట్టబెట్టడానికి అవకాశం ఉంటుందని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిర్బంధంగా పిల్లల నుండి ప్రైవేటు వ్యవస్థలో ఫీజులను వసూలు చేసి రక్త మాంసాలను పీల్చిన వారు సంపన్న వర్గాలకు చెందిన వాళ్లు పేద వర్గాలను అవమానించిన వాళ్లు చట్టసభలకు పోటీ చేస్తున్న తరుణంలో పట్టబదృ లు ఉపాధ్యాయులు ఎన్నికల సందర్భంగా తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగి ప్రైవేటు రంగాన్ని నిర్మూలించి ప్రభుత్వ రంగాన్ని కొనసాగించడానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే వాళ్ళు ఇవ్వాలా శాసనమండలి సభ్యులుగా ఎన్నిక కావలసిన అవసరం ఉన్నది. అధికార పార్టీకి చెందిన వాళ్లే కనుక ఎన్నికైతే వాళ్ళ నోరు మూగబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే శాసనమండలిలో అధికార పార్టీకి ఎంతో గొప్పగా ఎన్నికైనటువంటి ఉద్యమకారులని చెప్పుకునే వాళ్ళు ప్రజల పక్షాన మాట్లాడిన సందర్భం లేకపోవడం విచారకరం విడ్డూరం.
అభ్యర్థులను ఎంపిక చేసుకునే క్రమంలో వాళ్ల యొక్క పుట్టుక, సామాజిక నేపథ్యంతో పాటు సేవా తత్పరత, విద్యారంగ అర్హతలు,సామాజిక చింతన, విద్యా రంగానికి చేసిన సేవ,నిరుద్యోగులు ఇతర వర్గాలకు తన యొక్క కంట్రిబ్యూషన్ ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, మరొకవైపు ఇంతవరకు చట్టసభల గడప దాటని వాళ్లను కూడా ఎన్నుకోవడం ద్వారా నిజమైన సామాజిక న్యాయాన్ని నెరవేర్చే అవకాశం ఉంటుంది.నిజంగా చట్టము, రాజ్యాంగము, లేదా ప్రభుత్వాలు సామాజిక న్యాయాన్ని సమకూర్చవలసిన అవసరం ఉంది కానీ అధికారంలో ఉన్న ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ వర్గానికి చెందిన వాళ్లనే సభ్యులుగా నియమిస్తున్న కారణంగా అనివార్యమైన పరిస్థితి లోపల తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించడం ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించుకోవడానికి మార్గాంతరం లేని పరిస్థితిలో మెజారిటీగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు, కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు కూడా ఒక్కటై మెజారిటీ ప్రజల పక్షాన ప్రతినిధులను ఎన్నుకోవడానికి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. పట్టబదృలు, ఉపాధ్యాయులు కూడా ఏ పార్టీకి అనుబంధం అని కాకుండా వారి యొక్క సమర్థత, కార్యశీలత, సామాజిక చింతన, స్నేహ హస్తం, సామాజిక సేవా తత్పరత, సామాజిక వర్గాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని గెలిపించుకోవడం ద్వారా అట్టడుగు వర్గాలకు కూడా చట్టసభల్లో అధికారాన్ని సవాల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వైపుగా రాజ్యాంగము పాలకులు చేయలేనటువంటి సామాజిక న్యాయాన్ని మన ఓట్ల ద్వారా మనమే సాధించుకోవాల్సిన అవసరం అనివార్యంగా ఏర్పడింది. రాబోయే కాలం లోపల ఈ ఉద్యమం మరింత విస్తృతమై మేమెంతో మాకంత వాటా కావాలి అనే నేపథ్యంలో విస్తృత స్థాయిలో పోరాటానికి మార్గం సుగమమవుతుందని ఆశిద్దాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల ద్వారానే ఆ నూతన ఉద్యమం ప్రారంభం కావాలని మనసారా కోరుకుందాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)