ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికలలో రాజకీయ పార్టీల జోక్యం అవసరమా ?*

Feb 18, 2025 - 11:31
 0  1

పట్టబదృలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికలలో రాజకీయ పార్టీల జోక్యం అవసరమా ?* అభ్యర్థులు రాజకీయ పార్టీలను ఆశ్రయించడం అంటే అవినీతిని పెంచి పోషించడమే.* సమర్థత, వ్యక్తిత్వం, సామాజిక చింతన అభ్యుదయాలోచనలు గీటురాయి కావాలి.

*******************************

--- వడ్డేపల్లి మల్లేశం 90142206412 

----14...02...2025*************

దేశములోని వివిధ రాష్ట్రాలలో పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్సీల ఎన్నిక సందర్భంలో రాజకీయ పార్టీలు అతిగా జోక్యం చేసుకోవడం అభ్యర్థులుగా పోటీ చేసే వాళ్లు కూడా రాజకీయ పార్టీలను ఆశ్రయించడం అంటే పరస్పర సహకారంతో అవినీతిని పెంచి పోషించడంతోపాటు ప్రైవేటీకరణను చట్టబద్ధం చేయడమే అని అర్థమవుతున్నది. కేంద్ర ప్రభుత్వంతో సహా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా విద్య వైద్యాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తూ ప్రజల కొనుగోలు శక్తిని పెంచిన దాఖలా ఎక్కడైనా ఉందా? అంటే ప్రభుత్వాలు సంపన్న వర్గాల కోసం మాత్రమే పనిచేస్తూ ఆ క్రమంలో సంపన్న వర్గాలను అభ్యర్థులుగా ఎంపిక చేసి వారి నుండి లబ్ధి పొందడంతో పాటు అక్రమ సంపాదనకు తప్ప పోటీ పడుతున్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వము సామాజిక చింతన, సమర్థత, అభ్యుదయ ధోరణులు ప్రభుత్వాలకు ఇతర రాజకీయ పార్టీలకు ఏనాడు పట్టింపు లేదు. అంటే వ్యవస్థ మారాలని, పేదరికం లేని, అసమానతలు కానరాని, విద్యా వైద్యం ఉచితంగా నాణ్యమైన స్థాయిలో ప్రజలకు ఇవ్వగలిగినటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించడం అనేది ఏ రాజకీయ పార్టీకి ఇష్టం లేకపోవడమే కదా! .

        స్వతంత్రం వచ్చిన తొలినాల్ల లో రాజకీయ రంగంలో కొన్ని విలువలు కనపడినవి కానీ ప్రస్తుతం అవి మచ్చుకు కూడా లేకపోగా రాజకీయ నాయకులే స్వయంగా అవినీతిని పెంచి పోషిస్తూ అధికార యంత్రాంగంలో అవినీతి పెరగడానికి దోహదపడుతూ స్వయంగా నేరస్తులు నేర చరిత్ర కలిగిన వాళ్ళై, మరికొందరు అత్యాచారాలు, హత్యలు చేసిన వాళ్లుగా చట్టసభల్లో కొనసాగుతున్నారంటే ఈ దేశంలోని రాజకీయ వ్యవస్థ సామాన్యుని ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతుంది? అందుకే నేరస్తులతో ఏలబడే ప్రభుత్వం ప్రజల కోసం కాదు పెట్టుబడిదారుల కోసం అని ప్రజలు ఓటర్లు పట్టబద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి స్థానాలకు ఓటు వేసే అభ్యర్థులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీల యొక్క ప్రలోభాలతో ఆకర్షణతో తమ వ్యక్తిత్వాన్ని ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరం సభ్యులకు లేదు. మరొక విషయం సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా ఆధిపత్య వర్గాలకు మాత్రమే అనాదిగా అధికారంలో కొనసాగుతూ ఉంటే ఎలాంటి రిజర్వేషన్ సౌకర్యం లేనటువంటి బీసీ వర్గాలు పార్టీ నాయకత్వం యొక్క దయాదాక్షిన్యం పైన ఆధారపడిన కారణంగా చట్టసభలలో నామాత్రంగానే ఉండడం విచారకరం. ఇలాంటి పరిస్థితి లోపల కూడా ఇటీవల కాలంలో ముఖ్యంగా బీసీ స్పృహ బాగా పెరిగిపోవడం వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు కార్యకర్తలు కూడా ఆత్మా వ లోకనం చేసుకుంటున్న కారణంగా పార్టీలను ధిక్కరించి బీసీ ఉద్యమ వైపు వస్తున్న సందర్భాలను చూడవచ్చు. మరొకవైపు బీసీ ఉద్యమకారులు వేసే ప్రశ్నలకు అనేకమంది ఆధిపత్య కులాలకు చెందిన వాళ్లు సమాధానమిచ్చిన సందర్భంలో మీ బీసీ వర్గాలకు చెందిన వాళ్లు ఓట్లేస్తేనే కదా మేము గెలిచేది మీ స్పృహ ఉంటే మీ ఓట్లు మీకే వేసుకుంటే మేము కాదన్నామా? మమ్ములను నిందించడం దేనికి? అని జవాబిస్తున్న విషయాన్ని గమనిస్తే నిజంగా బీసీ వర్గాలకు సోయి స్పృహ లేదు అని తెలిసిపోతున్నది. దానికి కావాల్సింది చైతన్యం, ధిక్కారస్వరం, ప్రతిఘటన తత్వం, నాయకత్వ లక్షణాలు, అధికారం పైన కాంక్ష ప్రధానమైనవి అని బీసీ లోకం గుర్తించాలి.

        రాజకీయ పార్టీల జోక్యం అనవసరం 

******************-*---**

ఇప్పటికే కుళ్ళి కంపు కొడుతున్నటువంటి అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ చట్రంలోని వాళ్ళు త మను తాము ప్రక్షాళన చేసుకోవడం ద్వారా జనజీవన స్రవంతిలో చేరవలసిన బదులు పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో కూడా రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం తమ తరఫున అభ్యర్థులను నిలబెట్టడానికి గెలిపించుకోవడానికి పాకులాడడం స్వచ్ఛందంగా వృత్తిపరమైన సమర్థత తో పాటు విద్యావేత్తలను ఎన్నుకోవలసిన సందర్భంలో రాజకీయాలతో ముడిపెడితే గెలిచేవారు ఏ వర్గ ప్రయోజనం కోసం పని చేస్తారో అర్థం చేసుకోవచ్చు.ముఖ్యంగా శాసనమండలికి ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు విద్యావంతులు మేధావులు ఉపాధ్యాయులు సమాజం గూర్చి పూర్తి అవగాహనతో పాటు అసమానతలు అంతరాలపైన స్పష్టమైనఅవగాహన కలిగి ఉండాలి కానీ రాజకీయ పార్టీ రంగు అద్దడం అవివేకం..స్వతంత్రంగా మేధావులుగా సమర్థులైన ఉపాధ్యాయ ప్రతినిధిగా ఉన్నప్పుడు సాధారణ పాలన అంశాలతో పాటు విద్య, ఉద్యోగము, ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ నిర్మూలన ,యువజన విధానము, అంతరాలు లేని సమానత్వం, ప్రభుత్వ రంగంలో విద్య, విద్య కై హెచ్చు బడ్జెట్, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం లాంటి అంశాల పైన ప్రధానంగా చర్చించడానికి అవకాశం ఉంటుంది. సమాజాన్ని అన్ని కోణాలలో అధ్యయనం చేయడం ద్వారా పెట్టుబడిదారీ విధానాన్ని కూడా ప్రశ్నించడంతోపాటు క్రమంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను సామ్యవాద తరహా ప్రభుత్వ ఏర్పాటుకు అనుగుణంగా తీసుకురావడానికి కృషి చేసే క్రమంలో ఈ ఎమ్మెల్సీలు మిగతా ఎమ్మెల్సీలకు చట్టసభల్లోని శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండవలసి ఉంటుంది. అలాంటప్పుడు రాజకీయ పార్టీలతో సంబంధం ఉంటే మనసు విప్పి మాట్లాడగలరా? ప్రభుత్వాన్ని ప్రశ్నించగలరా? ధిక్కారస్వరాన్ని వినిపించగలరా? ఆలోచించుకోవాలి. అన్ని సామాజిక సమీకరణాలను పరిశీలించి రాజ్యాధికారానికి అందరూ సమాన అర్హులేననే ఉద్దేశంతో రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి మేరకు చట్టసభల గడప దాటని వాళ్లను ఇలాంటి ఎన్నికల్లో గెలిపించుకోవడానికి ఆ వర్గాలకు చెందిన వాళ్లు విద్యావంతులు ఉద్యోగులు, ప్రజలు ప్రజాస్వామ్యవాదులు స్పష్టమైన ఆలోచన చేయాలి. సభలు సమావేశాలలో చర్చించాలి తమ పట్టును నిలబెట్టుకోవాలి.బీసీలు 60 శాతం ఉండి కూడా కొన్ని సభలలో నామమాత్రo కూడా లేకపోవడం చూస్తే సిగ్గుపడాల్సి వస్తుంది. ఇలాంటి విషయాల పైన సామాజిక అవగాహన గల వాళ్లు సమాజాన్ని చైతన్యవంతం చేయడం ద్వారా ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీలను ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. అభ్యర్థులు కూడా స్వతంత్రంగా పోటీ చేయడానికి ఇష్టపడ్డప్పుడు నిజమైన పోటీ ఉంటుంది అప్పుడు సమర్ధులైన వాళ్ళు ఎన్నుకోబడడానికి ఆస్కారం కలదని గుర్తించడం చాలా అవసరం.అందుకే రాజకీయ పార్టీలు ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది నిజమైన సమర్థులైన వాళ్ళు ఎన్నుకోబడడానికి ఆస్కారం ఉంటుంది గనుక.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333