ఈవిఎం యంత్రాల పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలలి:జిల్లా అదనపు కలెక్టర్
జోగులాంబ గద్వాల 1ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈవిఎం యంత్రాల పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అపూర్వ చౌహాన్ ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక ఎంఏయల్డి కళాశాలలో ప్రిసైడింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన మొదటి రోజు శిక్షణ కార్యక్రమంలో అయన పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికలలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని, ఎన్నికల సంఘం సూచనల మేరకు అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నియమాలను పాటిస్తూ ఎన్నికల సంఘం జారీ చేస్తున్న నూతన నిబంధనల ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని, పోలింగ్ సందర్బంగా నిర్వహించాల్సిన విధుల పట్ల పూర్తి అవగాహన ఉండాలన్నారు. శిక్షణ పొందిన రోజు నుండి పోలింగ్ ముగిసే వరకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల పట్ల పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు. ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులు, సిబ్బంది ఎలాంటి పార్టీలకు అభ్యర్థులకు అనుబంధంగా ఉండకూడదని, ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయబడుతున్నందున జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, పోలింగ్ రోజు, పోలింగ్ ముందు రోజు చేయాల్సిన పనులను చెక్ లిస్ట్ తయారు చేసుకుని, అందుకు అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ నాడు ఉదయం 6:00 గంటలకు మాక్ పోల్ నిర్వహించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఎన్నికల విధులలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు ఫారం - 12 అందజేయాలన్నారు. ఈ సందర్భంగా పి ఓ లకు మాస్టర్ ట్రైనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారులు , మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు...