హైదరాబాదులో అందాల పోటీలు నిర్వహించడాన్ని ప్రజా మేధావి బుద్ధి జీవులు ఖండించాలి.*
స్త్రీని అంగడి సరుకు, ఆట బొమ్మ, మార్కెట్ వస్తువుగా చూడడానికి ఉద్దేశించిన పోటీలు అవసరమా? ఈ పోటీల నిర్వహణతో ప్రభుత్వానికి ఏం ప్రయోజనo?
************
----వడ్డేపల్లి మల్లేశం
బాధ్యత కలిగిన వ్యక్తులు లేదా శక్తులు ప్రభుత్వాలు ప్రయోజనం లబ్ధి జనానికి సమాజానికి మేలు కలిగే కార్యక్రమాలను మాత్రమే చేపట్టడం ఆనవాయితీగా వచ్చే అవకాశం. అంతెందుకు ఏమాత్రం సమాజం మీద అవగాహన లేని వ్యక్తి అయినా చదువు రానివాళ్లు అయినా కూడా తాము చేపట్టబోయే పనుల వలన కుటుంబానికి ప్రయోజనం ఉందా లేదా అని చూసుకుంటారు లేకపోతే ఇతరులను అడిగి తెలుసుకుంటారు. కానీ ప్రపంచ అందాల పోటీలు నిర్వహించడానికి భారతదేశాన్ని ఎంపిక చేసుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం 72వ మిస్ వరల్డ్ పోటీలను 2025 మే 7వ తేదీ నుండి 31 వరకు నిర్వహించడం దీనిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అంటే నిజంగా సిగ్గుచేటు అనక తప్పదు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని వేయడం కొంతమంది మంత్రుల ఆధ్వర్యంలో నిర్వహణ బాధ్యతలు అప్పగించడం గతంలో మిస్ వరల్డ్ గా ఎంపికైన కొందరికి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను చూపించడం వాళ్ళ అంద చందాలను సమాజానికి అంకితం చేసే పని అది ప్రయోజనకరమైనది కాకపోగా రెచ్చగొట్టేదిగా సమాజాన్ని మరింత బ్రష్టు పట్టేదిగా ఉంటుందనడంలో సందేహం లేదు.అలాంటప్పుడు బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైన బాధ్యతను ఎందుకు తీసుకున్నట్లు? ప్రజలకు ప్రజాస్వామ్య వాదులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.
దీని వెనుక దాగిన కొన్ని రహస్యాలు
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం ప్రధానమైనటువంటి ఎజెండాగా ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు తాము తయారు చేసే వస్తువులు వస్త్రాలు వినియోగ సంబంధమైన అన్ని అంశాలను కూడా ప్రజలతో ముఖ్యంగా కొనుగోలు చేయించడానికి మార్కెట్లో ప్రచారం మీద ఆధారపడినటువంటి ఒక నిస్సహాయ స్థితి మనందరికీ తెలుసు. దానికి ముఖ్యంగా మహిళలను ఎంపిక చేసుకోవడం మార్కెట్ వస్తువులుగా అంగడి సరుకుగా ఆట బొమ్మగా వీలైతే ఎన్ని రకాల అయినా అర్థ నగ్నంగా నగ్నంగా కూడా చూపించడానికి మార్కెట్ శక్తులు వెనుకాడడం లేదంటే అందుకు మహిళలు కూడా అంగీకరించడం అంటే నిజంగా మనం
సమాజంలో జీవించవలసిన వాళ్లం కాదు అని అనిపిస్తున్నది. ప్రస్తుతమున్నటువంటి టీవీ ప్రసారాలు సీరియల్ సినిమాలలో చూపిస్తున్నటువంటి అనేక అసాంఘిక అనాగరిక అశ్లీల చిత్రాలు సన్నివేశాలు సందర్భాలు ఒకవైపు ఇప్పటికే సమాజాన్ని నిర్వీర్యం చేస్తూ బ్రష్టు పట్టిస్తున్న సందర్భంలో మిస్ ఇండియా మిస్ వరల్డ్ పేరుతో ఇక ప్రపంచంలోని అన్ని దేశాల పేర్లతో కూడా అందాల భామల పోటీలను నిర్వహించడానికి ఆయా దేశాలు పోటీ పడడం దీనిని ఐక్యరాజ్యసమితి కూడా అడ్డుకోకపోవడం విచారకరమే. ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం మేధావులు ప్రజాసంఘాలు అంతర్జాతీయ న్యాయస్థానం ఇలాంటి దుర్మార్గమైనటువంటి పద్ధతులకు స్వస్తి పలికే విధంగా కట్టడి చేయవలసినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది.
ముఖ్యంగా ఈ అనాగరిక చర్యకు 1951లో ఇంగ్లాండులోని మోర్లే అనే ఒక పెట్టుబడిదారుడు వ్యాపారవేత్త బీజం వేసినట్లుగా తెలుస్తున్నది. వ్యాపారాన్ని ముమ్మరం చేయడానికి ఉత్పత్తి వస్తువులను ముఖ్యంగా స్త్రీలతో ఎక్కువగా కొనిపించడానికి స్త్రీల అంద చందాలకు సంబంధించినటువంటి కాస్మెటిక్ సబ్బులు వగైరా వస్తువులన్నింటిని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి స్త్రీల చర్మాన్ని, ముఖాన్ని, సౌష్టవాన్ని, శరీరాన్ని మొత్తం వినియోగించుకునే విధంగా ఇప్పటికే ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ రకంగా తయారైనటువంటి ఆ సంస్కృతిని కొనసాగించడానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ వర్గం సిద్ధపడిన కారణంగానే మిస్ వరల్డ్ మిస్ ఇండియా మిస్ అనే పేరుతో ఇతర దేశాలలో ఈ వ్యవస్థ నిర్మాణం ప్రారంభమైనట్లుగా తెలుస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్లకు గిరాకీ రావడానికి మిస్ వరల్డ్ తోడ్పడాలని ఉద్దేశంతో కొంతకాలం కొన్ని దేశాలకు మరికొంత కాలం మరికొన్ని దేశాలకు ఈ కిరీటాన్ని అప్పజెప్పిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా ప్రపంచీకరణ నేపథ్యంలో భారతదేశానికి 1990 తర్వాత వరుసగా ఆరుసార్లు మిస్ ఇండియా కిరీటం దక్కినట్లుగా తెలుస్తూ ఉంటే ఆ తర్వాత ఆఫ్రికా ఖండం నల్లవారికి కూడా మిస్ వరల్డ్ ను కట్టబెట్టి ప్రపంచ పోటీలో ఆయా దేశాలు పాల్గొని సరుకుల కొనుగోలులో ప్రజలను రెచ్చగొట్టడానికి ఈ భూమిక పనిచేసినట్లుగా తెలుస్తున్నది. ఇవాళ ప్రతి వస్తువు కూడా ప్రచారం లేకుండా మార్కెట్లోకి రావడం లేదనే విషయం మనందరికీ తెలుసు. టీవీ ప్రసారాల ద్వారా పరిచయం అవుతూ ఉంటే సెల్ఫోన్ వ్యవస్థ సినిమాలు ఇతర రంగాల ద్వారా కూడా వస్తువులు ప్రజలను చేరుతున్నవి. ఈ సందర్భంలోనే మిస్ వరల్డ్ లాంటి పోటీలను నిర్వహించడం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లయితే పోటీ నిర్వహించే దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా ను ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి సాకుతో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అయితే భారత కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆధునిక పోకడలను వ్యతిరేకిస్తున్నట్టుగా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తున్నట్లుగా చెబుతూనే తమ ఆర్థిక ప్రయోజనాల కోసం మాట మరిచి ఇలాంటి పోటీలను ఈ దేశంలో అనుమతించడానికి ప్రయత్నించడం అంటే ప్రతి ప్రభుత్వానికి కూడా కొన్ని వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని అంగీకరించక తప్పదు.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో మే నెలలో నిర్వహించబోయే 72వ మిస్ వరల్డ్ పోటీలు సుమారు నెల రోజులపాటు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం 27 కోట్లకు పైగా ఇందుకు ఖర్చును పెట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమం సంస్కృతికి సంబంధించినదా? ప్రజల ప్రయోజనాలకు సంబంధించినదా? ప్రజల కలలకు సంబంధించినగా? లేదా ఉపాధి ఉద్యోగ అవకాశాలకు సంబంధించినదా? ముందు ఈ రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంటుంది .సుమారు మూడు మాసాలకు ముందుగానే ప్రభుత్వం ప్రకటించినప్పటికీ బుద్ధి జీవులు మేధావులు, మహిళా సంఘాలు మహిళా రచయితలు ఈ విషయం పైన ఎందుకు ప్రతిఘటన కార్యక్రమాలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. సంస్కృతి సాంప్రదాయాలకు మానవ అస్తిత్వానికి, నాగరికతకు పెను సవాల్గా నిలిచినటువంటి ఈ మిస్ ఇండియా పోటీలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి ప్రభుత్వం పూనుకున్నప్పుడు ప్రజల నుండి మహిళా సంఘాల నుండి పెద్ద ఎత్తున ప్రతిఘటన రావాల్సిన అవసరం ఉన్నది. కానీ మహిళా సంఘాలు కూడా తమ లక్ష్యాన్ని, ఆదర్శాన్ని,బాధ్యతను, సామాజిక చింతనను మరిచిపోయి అదే ప్రవాహంలో కొట్టుకుపోవడానికి ప్రయత్నిస్తే మహిళా లోకాన్ని కాపాడేవారు ఎవరు ఉండరు. ఇప్పటికే మద్యం మత్తుపదార్థాలు క్లబ్బులు, పబ్బులు ఈవెంట్లు వంటి అసాంఘిక కార్యక్రమాల వలన హత్యాచారాలు హత్యలు ఆకృత్యాలు జరుగుతూ స్త్రీలు బలి అవుతూ ఉంటే పట్టించుకోనటువంటి ప్రభుత్వాలు మహిళా సంఘాలు ఇంత దుర్మార్గమైనటువంటి ఛాలెంజ్గా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అసాంఘిక కార్యక్రమం అందర్నీ రెచ్చగొట్టే ప్రోగ్రామును వ్యతిరేకించడానికి ముందు రాకపోవడానికి కారణం ఏమిటి?
ఏది అయినా సాగినంత కాలం నా అంత వారు లేరందురు. సాగకపోయిననాడు చతికిలబడి పోదురు. అని ఒక గేయం మనకు అనుభవంలో ఉంది అలాగే మిస్ వరల్డ్ మిస్ ఇండియా లాంటి పోటీలను కార్యక్రమాలను అసాంఘిక అశ్లీల ఆకృత్యాలను ఎక్కడో ఒక దగ్గర కట్టడి చేయడానికి ప్రారంభం కాకపోతే అవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి.ఆ సంస్కృతే నిజమైన సంస్కృతి అని చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు. అలాంటప్పుడు మనిషి ఉనికి ప్రశ్నార్థకమవుతుంది మహిళా లోకం లేవాలి, కలిసి వచ్చే వాళ్లతో కదలాలి, ఉద్యమ బాట పట్టాలి, ప్రతిఘటన కార్యక్రమాలను రాష్ట్రంలో ప్రకటించాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అల్టిమేట్ జారీ చేయాలి. ఆ వైపుగా ఉద్యమ ప్రస్థానం కొనసాగాలని మనసారా కోరుకుంటూ మహిళలోకానికి మరొక మారు ఉద్యమ అభివందనాలు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )