సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి

-నివాళులర్పించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
హైదరాబాద్, జూన్ 01:సీనియర్ జర్నలిస్టు,పాత్రికేయం దినపత్రిక ఎడిటర్ పెంటూకర్ శ్రీనివాస్ అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాదాపు పాతికేళ్ళుగా జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో పని చేసిన శ్రీనివాస్ గత కొంతకాలంగా సొంత పత్రికను నడుపుతున్నారు. శ్రీనివాస్ వయసు 54 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు. శ్రీనివాస్ కు మృతికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య సంతాపం తెలియజేస్తూ నివాళులర్పించారు. ఆదివారం మల్కాజిగిరిలోని గౌతం నగర్ గల ఆయన నివాసం వద్ద శ్రీనివాస్ బౌతిక కాయంపై పుష్ప గుచ్ఛం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య శ్రీనివాస్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. జర్నలిస్టుగా ఎంతో నైపుణ్యంతో చురుగ్గా పనిచేస్తున్న శ్రీనివాస్ ఆరు నెలల క్రితం హఠాత్తుగా స్పృహ కోల్పోయి పడిపోయారు. రక్తహీనత కరణంగా శ్రీనివాస్ అనారోగ్యం క్షణించిందని, వైద్య చికిత్సలు చేయించినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదని,నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి చనిపోయారని కుటుంబసభ్యులు చెప్పారు. జర్నలిజమే ఊపిరిగా అదే వృత్తిని నమ్ముకుని దాదాపు పాతిళ్లుగా వివిధ పత్రికల్లో పని చేసి, ప్రస్తుతం తన సొంత పత్రిక 'పాత్రికేయం' దిన పత్రికను నడుపుతున్నారు. శ్రీనివాస్ అనారోగ్యానికి గురై చనిపోవడం బాధాకరమని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య పేర్కొన్నారు. పాతికేళ్ళుగా కలాన్ని నమ్ముకొని జర్నలిస్టుగానే కొనసాగిన శ్రీనివాస్ జీవితంల అనేక కష్టాలమయం. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తన వృత్తిని, సొంత పత్రికను నిరంతరంగా కొనసాగిస్తూ సమాజానికి సేవలందించారని మామిడి సోమయ్య తెలిపారు. శ్రీనివాస్ అకాల మరణం చాలా బాధాకరని పేర్కొంటూ, ఆయన మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మామిడి సోమయ్యతో పాటు జర్నలిస్టులు పద్మారావు,యువశక్తి కృష్ణారెడ్డి, న్యూస్ భూమ్ మూర్తి, తెలుగు భావుట సత్యం, జగదీశ్వర్ రెడ్డి తదితరులు శ్రీనివాస్ బౌతిక కాయానికి నివాళులర్పించారు.
శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
పాతికేళ్ళుగా జర్నలిస్టుగా పని చేసి అనారోగ్యంతో చనిపోయిన శ్రీనివాస్ కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయమని, అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య కోరారు. చాలాకాలం వివిధ పత్రికల్లో పని చేసి సొంత పత్రికను నడుపుతున్న శ్రీనివాస్ ఇన్నేళ్ళు ఏమీ సంపాదించుకోలేదని, పైగా పత్రిక నిర్వహణ కోసం తన సొంతింటిని అమ్ముకుని అద్దె ఇంట్లో ఉంటున్నారని తెలిపారు. సమాజం కోసం జర్నలిస్టుగా అంకిత భావంతో పని చేసిన శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన కోరారు.