అసభ్య పదజాలంతో పార్టీల ప్రచారాలు.*  సంస్కారం లేని నాయకత్వాలు

Feb 29, 2024 - 12:22
Mar 1, 2024 - 17:39
 0  6
అసభ్య పదజాలంతో పార్టీల ప్రచారాలు.*  సంస్కారం లేని నాయకత్వాలు

గెలుపు కోసమే తప్ప  ప్రజల జీవన ప్రమాణాలను ఆలోచించని  ప్రభుత్వాలు. 

అహంకారపూరిత మాటలు,  ఆధిపత్య  ధోరణులు.

తెలంగాణలో దిగజారుతున్న రాజకీయ ముఖ చిత్రమిది.నేరస్థులకు తగు శిక్షలు విధించాలి.

ఎన్నికల ప్రచారం  ఎన్నికలు ప్రకటించిన తర్వాత కానీ  చేయకూడదు గతంలో అలాంటి సాంప్రదాయమే గణనీయంగా కొనసాగినది.  ప్రస్తుత కాలంలో  ముఖ్యంగా అధికార పార్టీలు  ప్రభుత్వ పాలన ముసుగులో రోజు ప్రచారాలనే కొనసాగించడాన్నీ గమనిస్తే  అవకాశవాద రాజకీయాలకు చిరునామాగా అధికార పార్టీని చెప్పడంలో అభ్యంతరం లేదు అతిశయోక్తి కూడా కాదు.  ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో గనుక ప్రత్యేకంగా గమనిస్తే  రెండు రాష్ట్రాల్లోనూ అధికారానికి వచ్చినటువంటి పార్టీలు వైయస్సార్సీపి, బారాస  రాష్ట్రాలు ప్రాంతాలు వేరు కానీ పరిపాలన విధానం ఒకే రకంగా కనబడుతుంది.  లబ్ధిదారుల అకౌంట్లో అక్కడ ఇక్కడ  నగదు బదిలీ చేయడమే.  పేర్లు వేరు   కానీ పథకాలు ప్రయోజనాలు ఒకటే  ప్రజలను  తమ కాళ్ళ మీద తాము నిలబడే లాగా తయారు చేయలేని అసమర్ధ పాలకులు  ప్రజలందరి ఉమ్మడి ధనాన్ని  కొన్ని వర్గాల ప్రయోజనం కోసం తాకట్టు పెట్టడాన్ని నగదు రూపంలో అకౌంట్లో వేయడాన్నీ గమనిస్తే  ఈ అధికారం ప్రభుత్వాలకు ఎవరు ఇచ్చినారు అని నిలదీయాలి. అలాంటి గడ్డు పరిస్థితులు ఆసన్నమైన తరుణంలో  రాబోయే ఎన్నికల్లో రెండు రాష్ట్రాలలోనూ కచ్చితంగా పాలకులను ప్రజలు నిలదీస్తారు చేసిన అప్పులకు  తగిన అభివృద్ధి చూపించు మని  ప్రశ్నించడానికి  సిద్ధంగా ఉన్నారు.  ఇక ప్రతిపక్షాలతో వ్యవహరించే తీరును గమనిస్తే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం,  బూతు అసభ్య పదజాలంతో ప్రతిపక్షాలను దూషించి నిందించి ఏడిపించి చట్టసభల్లో  అధికార దుర్వినియోగా నికి పాల్పడడాన్ని మనం గమనించవచ్చు  .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో  ఆనాటి ప్రభుత్వం కనీసం 90 రోజులు సంవత్సరానికి చట్టసభలు పనిచేయాలని తీర్మానిస్తే  ఆచరణలో 50 రోజులు జరిగిన సందర్భాలను మనం చరిత్ర ద్వారా గమనించవచ్చు . కానీ ఇటీవల చట్టసభల పనితీరు గమనిస్తే 20 ,30 రోజులు కూడా దాటడం లేదంటే  ప్రభుత్వాలు దేనికి  ప్రాధాన్యత ఇస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

అనునిత్యం ప్రచారమే అసభ్య పదజాలమే:-

ముఖ్యంగా ప్రభుత్వాలు  పూర్వకాలంలో  ఎన్నికల కోలాహలం ముగిసిన తర్వాత  ప్రజల అవసరాల గురించి బాగోగుల గురించి స్థానిక డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని  ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అఖిలపక్షాలతో చర్చించి ప్రణాళికలు రూపొందించేవారు.  కానీ ప్రస్తుతం అలాంటి సాంప్రదాయాలకు గండి కొట్టి  ప్రతిపక్షాలతో మాట్లాడడానికి  సిద్ధంగా లేని ప్రభుత్వాలు ఒంటెద్దు పోకడతో వ్యవహరించడాన్నీ గమనిస్తే కొనసాగేది నిత్యం జరిగేది తమను గూర్చిన    ప్రచారం మాత్రమే.  ప్రభుత్వ కార్యాలయాలు కలెక్టర్,  ఎస్పీ  ప్రారంభోత్సవం పేరుతో  ముఖ్యమంత్రి మంత్రులు  హాజరవుతారు.  అదే సందర్భంలో బహిరంగ సభలను ఏర్పాటు చేసి పార్టీ సభలుగా మార్చి  ప్రభుత్వ యంత్రాంగం మధ్యన అధికార  ప్రచార అర్బాటాలను  ప్రకటించుకోవడాన్ని గమనిస్తే  ఇది అధికార దుర్వినియోగం కాదా!  ముఖ్యంగా తెలంగాణ ప్రజలు  దశాబ్దాల పాటు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకొoటె  దాని వెనుక ప్రజా సంఘాలు అఖిలపక్షాలు అనే  అనేక స్వచ్ఛంద సంస్థలు  ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు సబ్బండ వర్గాలు పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది .కానీ  తెరాస పార్టీ తన ఖాతాలో వేసుకోవడం  ప్రజల పోరాటాన్ని  ఉద్యమ చైతన్యానికి ద్రోహం చేయడమే అవుతుంది . ఇక   సందర్భోచితంగా అప్పుడప్పుడు జరిగే ఉప ఎన్నికలలో కూడా  అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ  మంత్రులను నెలల పాటు అక్కడే మకాము వేయించి  పార్టీ ప్రచారానికి మాత్రమే పరిమితం చేస్తే  వాళ్లకు వేతనం తీసుకునే నైతిక హక్కు ఎక్కడిది? అని సామాజిక రాజకీయ విశ్లేషకులు మేధావులు ప్రశ్నిస్తున్న ప్రభుత్వం నుండి సమాధానం రాలేదు.  ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వ యంత్రాంగమంతా ఉప ఎన్నిక పైన దృష్టి సారించినప్పుడు  రాష్ట్ర పరిపాలన కుంటుపడుతుంది అనే ఆలోచన లేకుంటే  కనీసం ఎన్నికల సంఘం  న్యాయ వ్యవస్థ కూడా  పాలకపక్షాలకే వంత పాడిన సందర్భాలను గమనించినప్పుడు  ఒక దుష్ట పరిపాలన అన్ని ప్రభుత్వ  రాజ్యాంగబద్ధ సంస్థలను ఏ రకంగా ప్రభావితం చేయగలదో అర్థం చేసుకోవచ్చు.
       ప్రస్తుతం డిసెంబర్ 3o,2023వ రోజున జరుగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  నోటిఫికేషన్ వెలువడి  నామినేషన్ల పర్వం ముగిసి  ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నుండి  వివిధ రకాల పార్టీల నాయకులు  భారీ బహిరంగల సభల పేరున రోజుకు నాలుగైదు చోట్ల  ప్రసంగిస్తూ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ అంతకు మించిన స్థాయిలో పరస్పరం దూషించుకోవడాన్నీ గమనిస్తే  వీరి సంస్కారం 
  సభ్యత ఏపాటిదొ అర్థమవుతున్నది.  సన్నాసులు , ఆవుల పోశిగాల్లు,  దద్దమ్మలు, వాడు వీడు,  గుండు గాడు,  బండోడు, తెలివితక్కువో ల్లు  అంటూ వివిధ రకాలుగా వెటకారంగా ఏక వచన సంబోధనతో మనిషిని మనిషిగా చూడకుండా అవమానించే పద్ధతిలో మాట్లాడుతున్న విధానం  అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలకు కూడా పాకడాన్ని గమనిస్తే  ఉద్యమ పార్టీ పేరుతో కొనసాగుతున్న బారాసా   మిగతా రాజకీయ పార్టీలకు  అసభ్యత విషయంలో  ఆదర్శం కావడాన్నీ చూస్తే  సాధించిన తెలంగాణలో ఎంత అచేతనత్వం నిండు కున్నదో అర్థమవుతున్నది. స్వ  ప్రయోజనాలు,  కుటుంబ పాలన  ,అధికారం శాస్వతం చేసుకోవడానికి ఉన్న తపన ప్రజల సమస్యల పైన లేకపోవడంతో  పదేళ్లు పరిపాలన చేసినప్పటికీ  తిరిగి గతం లో కంటే మిన్నగా కోట్ల రూపాయల ఖర్చుతో ప్రచారాన్ని ముమ్మరం చేయడంలో అర్థం ఏమున్నది?.  ఎక్కడకు వెళ్లిన ఒకటే విధంగా  మూసలో పోసిన ప్రసంగాలతో  కాంగ్రెస్ వస్తే నాశనం అవుతుంది  మళ్లీ మమ్ములను గెలిపించండి అంటూ  కాపీ కొట్టిన విధంగా ప్రసంగాలు కొనసాగడాన్నీ గమనిస్తే  అసలు తెలంగాణలో గత 10ఏల్లుగా పరిపాలించింది బారాస పార్టీ అయినప్పుడు,  ఇతర ప్రభుత్వాలు లేనే లేనప్పుడు  పని చేయలేదు అనడానికి అర్థం లేదు . అది సందర్భం కూడా కాదు.  ఒకవేళ తెలంగాణలో అభివృద్ధి జరిగినా  అంతకు మించిన స్థాయిలో ప్రజలు వంచించబడినా దానికి బారాస పార్టీ  మాత్రమే   బాధ్యత వహించవలసి ఉంటుంది .

అవును ప్రజలు నిరంతరం మార్పును కోరుకుంటారు,  ఒకే వ్యవస్థను కొనసాగించడానికి సిద్ధంగా ఉండరు, మరింత మెరుగైన వ్యవస్థ కావాలని కూడా ఆశిస్తారు. ఆ క్రమంలో ప్రత్యామ్నాయ శక్తుల వైపు ప్రజలు మొగ్గుచూపుతుండవచ్చు  కానీ  రాబోయే ప్రభుత్వాలను గురించి గెలవబోయే సీట్లను గురించి కరాకండిగా చెబుతూ  తమదే రాజ్యమని , థా ము మాత్రమే అర్హులమని  నిర్ణయించడానికి ఏ రాజకీయ పార్టీకి కూడా అర్హత లేదు.  ఏ పార్టీనీ గెలిపించాలి?  ఏ వ్యక్తిని చట్టసభల్లోకి పంపాలి ? వాళ్ల వ్యక్తిత్వం ఆశయాలు  ప్రజలకు అనుగుణంగా రావలసిన మార్పు గురించి నిర్ణయం తీసుకునే సత్తా  సమయస్ఫూర్తి ఓటర్లకు ఉన్నది.  ఓటర్లను బానిసలుగా, బలి పశువులుగా ,యాచకులుగా చేస్తూ  తాయిలాలు ప్రకటిస్తున్నటువంటి రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం  నిరోధించాలి.  వారి మేనిఫెస్టోను రద్దు చేయాలి.    ప్రభుత్వ విధానాలు  ప్రజల సమస్యలకు సంబంధించినటువంటి  పరిష్కారాలను  చూపగలిగే పార్టీలకు మాత్రమే ఎన్నికల్లో పోటీని అనుమతించాలి.  ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి  సమర్థత లేనటువంటి ప్రభుత్వం ఇతర రాజకీయ పార్టీలు  తమ జేబు నుండి ఇచ్చినట్లుగా ప్రకటించుకుంటూ డబ్బును పంపిణీ చేయడమే పరిపాలన అంటే ప్రజలు సిగ్గుపడుతున్నారు. ప్రభుత్వాన్నీ నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే రాబోయే కాలంలో కాంగ్రెస్ బిజెపి బీఎస్పీ వంటి రాజకీయ పార్టీలు కూడా అధికారానికి రావడానికి ఎదురుచూస్తున్న క్రమంలో ఆ పార్టీలకు కూడా ప్రజలు ఇదే డిమాండ్ చేస్తున్నారు  .ఇదే సందర్భంలో ఎన్నికల సంఘం   ప్రలోభాలు  పక్కన పెట్టి  వివిధ అంశాల పైన ప్రభుత్వ విధానాన్ని మాత్రమే ప్రకటించే ముసాయిదాను అంగీకరించినప్పుడు  ఇలాంటి ప్రలోభాలకు ఆస్కారం ఉండదు.  అప్పుడు ప్రజలు  ప్రభుత్వ విధానాన్ని , వ్యక్తుల వ్యక్తిత్వాలను  పరిశీలించి స్వతంత్రంగా ఓటు వేసే అవకాశం ఉంటుంది.  ఇక నగదు మద్యం పంపిణీ వంటి సందర్భాలు ఎన్నికల సంఘం దృష్టికి వస్తే  ఉక్కు పాదంతో అణిచివేయాలి . ఆ అభ్యర్థిని ఎన్నికల నుండి తొలగించాలి.  ముఖ్యంగా అధికార పార్టీ ఇలాంటి అక్రమాలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో  అక్రమ సంపాదనను  ఈ రకంగా పంచి పెట్టడానికి సిద్ధపడిన వ్యక్తులను  కటకటాల్లోకి తోయాలి . ముఖ్యమంత్రితో సహా నాయకులు వాడిన అసభ్య పదజాలాన్ని, ఉపయోగించిన నిందాపూర్వకమైన   దూషణలను  పరిగణనలోకి తీసుకొని  వారికి తగిన శిక్షలు  విధించాలి .ప్రజల చైతన్యం,అప్రమత్తత కూడా కీలకం.

---  వడ్డేపల్లి మల్లేశం
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమనేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333