వైద్యం, ఆరోగ్యం సామాజిక బాధ్యత అని తెల్వదా ?
తెలిసే నిర్లక్ష్యం అంటే అది ప్రజలకు చేస్తున్న మోసమే కదా!* సంక్షేమ రాజ్యంలో ఆరోగ్యానికి మించినది ఏమున్నది ?ప్రైవేటుకు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నవి అంటే రాజ్యాంగ బాధ్యత విస్మరించినట్లే కదా!* సమాధానం చెప్పాల్సి ఉంది.*
*****************************************
---వడ్డేపల్లి మల్లేశం 90142 06412
---14....03....2025*******************-
భారత ప్రభుత్వము స్వాతంత్ర్య అనంతరం నుండి కూడా విద్యా వైద్య రంగాలను క్రమంగా నిర్వీర్యం చేస్తూ నిధులను కేటాయించక ప్రైవేట్ రంగం పైన ఆధారపడి కావాలని ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడాన్ని మనం గమనించవచ్చు. ప్రైవేట్ రంగం యొక్క ఒత్తిడియా? పాలకుల యొక్క అసమర్ధనా? ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ప్రతిఘటించకపోవడంవల్లనా? బాధ్యతలు నుండి తప్పుకుంటే రాజకీయం ఎంతైనా చేసుకోవచ్చు అనే దురాశనా? కారణాలు ఏవైనా ఈ దేశంలో విద్యా వైద్యం సంక్షేమ పరిధిని దాటి వాణిజ్య రంగంలోకి వెళ్ళిపోయింది. ఈ దుస్థితి ముందే గమనించినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు " విద్యా వైద్యం సామాజిక న్యాయం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. అప్పుడే పేద వర్గాలకు పూర్తి న్యాయం జరుగుతుంది. కానీ పాలకులు రాను రాను భవిష్యత్తులో ఆ పని చేయరు, ఎందుకంటే విద్యతో చైతన్యం వికసిస్తుంది, వైద్యంతో ఆరోగ్యం పరిడ విల్లుతుంది కనుక ప్రజలు పాలకులను ప్రశ్నిస్తారు ఆ మార్పును ప్రతిఘటనను ఏ ప్రభుత్వం కూడా అంగీకరించదు" అని చేసిన హెచ్చరిక నాటికి నేటికి బహుశా ఏనాటికైనా ఈ దేశంలో అమలవుతుందేమో? భారతదేశన్ని సంక్షేమ రాజ్యాంగా నిర్వచించుకున్న మనం కనీస మైనటువంటి మానవ అవసరాలు అయినటువంటి విద్యా వైద్యం పట్ల ప్రభుత్వాలు ఇంత ఉదాసీనంగా వ్యవహరించడం క్రమంగా, ప్రైవేటుకు అప్పజెప్పి పాలకులే ప్రైవేటు వర్గాల కాల్ల భేరానికి దిగజారడం అంటే అంతకుమించిన దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ప్రైవేటు వైద్యశా శాలల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీలో నగదు రహిత వైద్య అవసరాలను తీర్చడానికి సిద్ధంగా లేమని నిరాకరిస్తున్నట్లు, వేల కోట్ల రూపాయలు బకాయి ఉన్నందున పూర్తిగా నిరసన తెలుపడం ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం అంటే ఇవాళ ప్రభుత్వాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ దుస్థితి కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది.గతంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్న కాలంలో విద్య వైద్యం ప్రత్యేక తరహాలో పాఠశాలల్లోనూ సామాన్య ప్రజానీకానికి అందించిన తీరు మనకు తెలుసు కానీ అలాంటి పాలకులను ఈ దేశంలో శాశ్వతంగా ఉండనివ్వగలరా? అలాంటి పార్టీలను ప్రజలు ఆదరిస్తారా? ఇప్పటికీ సందేహమే!
సొమ్ము చేసుకోవడమే
**************************
ప్రైవేటు వ్యవస్థ లాభార్జన కోసం పనిచేస్తుంది కానీ ప్రభుత్వాలు కూడా లాభార్జన కోసం స్వప్రయోజనాల కోసం లేదా కొన్ని వర్గాల ప్రయోజనం కోసం తమ బాధ్యతలను విస్మరించడం అంటే బాధ్యత మరిచి అవకాశవాదాన్ని సొమ్ము చేసుకోవడమే కదా! ప్రభుత్వ వైద్యశాలలను క్రమంగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు వైద్యశాలలకు అనుమతిస్తూ ప్రభుత్వ వైద్యశాలల్లో అరకొర సౌకర్యాలతో పాటు చాలా జూనియర్ వైద్యులను నియామకం చేయడంతో పాటు ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేయడం వలన అక్కడ ఎలాంటి సేవలు కూడా ప్రజలకు అందడం లేదు. ఉదాహరణకు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి వెల్నెస్ సెంటర్లలో జిల్లా కేంద్రంలో గల దంతాల పరీక్ష గనుక పరిశీలించినట్లయితే కేవలం దంతాన్ని తీయడం వరకే తప్ప దంతానికి సంబంధించిన చికిత్స గాని కొత్త దంతాలు అమర్చడం సౌకర్యాలు లేకపోవడానికి గమనించవచ్చు. ఈ అన్ని రకాల చికిత్స కోసం ఉద్యోగస్తులు లేదా రిటైర్డ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వం ఆమోదించిన ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లడం వలన కోట్లాది రూపాయలు ప్రజాధనం ప్రైవేటు ఆసుపత్రుల పాలవుతున్న విషయం ప్రభుత్వాలకు తెలియదా? ఉద్యోగులు పెన్షనర్లకు ఈ సౌకర్యం ఉంది కనుక ప్రభుత్వ సొమ్మును ఒక రకంగా కొల్లగొడుతున్నట్లే కానీ పేదవాళ్లకు సామాన్య ప్రజానీకానికి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఈ సేవలు ఉండవు. ప్రైవేట్ ఆస్పత్రిలో పోతే అక్కడ ఆరోగ్యశ్రీలో కొన్ని రోగాలు లేవని తిప్పి పంపడం వలన తప్పని పరిస్థితిలో ఇల్లు స్థలాలను అమ్ముకొని వైద్యం చేయించుకుంటున్నారు.ఈ ఆలోచన కూడా పాలకులకు లేదంటే సిగ్గుచేటు కాదా? ప్రైవేటు వైద్యశాలలకు కోటానుకోట్ల రూపాయలను అప్పగించడం ఏమిటి? ప్రభుత్వ వైద్యశాలను నిర్వీర్యం చేయడమేమిటి? అర్థం కాని ఒక సంఘర్షణ పూర్వక వాతావరణం .పరికరాలు ఉండవు సిబ్బంది ఉండరు ఉంటే చాలా జూనియర్ వైద్యులను(చాలీచాలని వేతనాలు) నియమించడం లేదా స్పెషలిస్ట్లు లేకపోవడం వలన కనీసం అయినటువంటి వైద్యం కూడా అందదు.ప్రభుత్వ వైద్యాశాలాల్లో నిబద్ధత కలిగినటువంటి సిబ్బంది ఉండవచ్చు నైపుణ్యం అనుభవం ఉన్నటువంటి వారు లేకపోవడం వలన కూడా ప్రజలకు అందవలసిన సేవలు అందడం లేదు. ఇదంతా కూడా ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్ధంగా ప్రైవేటు రంగాన్ని పెంచి పోషించడానికి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగిన చందంగా వ్యవహరించడం తప్ప మరొకటి కాదు.
ఫందా మార్చుకోవాలి పాలకులు:
********************************
మనిషి ఉనికికే ఆధారమైనటువంటి ఆరోగ్యాన్ని పక్కనపెట్టి కోరనటువంటి కోరికలను అమలు చేయడానికి ప్రభుత్వాలు పూనుకోవడం అంటే నిజంగా సామాజిక బాధ్యత నుండి తప్పుకోవడమే ప్రాథమిక ధర్మాన్ని విస్మరించడమే. కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి భయంకరమైనటువంటి రోగాల బారిన పడుతున్నటువంటి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి కూడా పౌష్టికాహారాన్ని అందించే క్రమంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.గతంలో కొన్ని రకాల పదార్థాలను రేషన్ షాపుల ద్వారా అందించినారు కానీ ఈ మధ్యకాలంలో కేవలం మామూలు బియ్యం తప్ప ఎలాంటి ఆహార పదార్థాలను అందించడం లేదు. ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి గనుక ఉంటే పౌష్టికాహారం, పప్పులు, నూనెలు, సిరి ధాన్యాలు,గోధుమలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలను అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కృషి చేయవచ్చు. ఆయా రైతులకు పని కల్పించవచ్చు. కానీ ఆ వైపుగా కన్నెత్తి చూడని ప్రభుత్వాలు కేవలం ప్రచార అర్బాటంలో మాత్రం ముందుంటున్నాయి ఎన్నికలంటే సయ్య అంటున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ అవగాహన గనుక కలిగి ఉంటే ఆరోగ్యాన్ని పెంచి పోషించే ఆహార పదార్థాలు ఒకవైపు అందించడం ద్వారా రోగాల బారిన పడకుండా ఉండడానికి సరైనటువంటి మందులు చికిత్సలు అమలు చేయడం అంతా కూడా పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి .
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి అనుభవజ్ఞులైన వైద్యులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా సరైన వేతనాలను ఇవ్వడం ద్వారా ప్రజలకు వారితో చికిత్సలు సేవలను అందించవచ్చు. కూలిపోతున్నటువంటి దవాఖానలు, కనీసం మరుగుదొడ్లు మూత్రశాలు లేనటువంటి ఆస్పత్రులు, రిపేరుతో ఇటీవల కట్టినటువంటి భవనాలను పూర్తిగా కూల్చివేతలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జిల్లా కేంద్రాలకు సరైనటువంటి మందు ల సరఫరా చేయకపోవడం, వైద్యులు రాసినటువంటి మందులు ఆసుపత్రుల్లో లేక బయట కొనుగోలు చేసుకోమని ఆదేశించడం వంటి అవరోధాలను ఇకనైనా ప్రభుత్వాలు మానుకోవాలి. ప్రభుత్వం విద్యా వైద్యం సామాజిక న్యాయమే తమ ధర్మం అని సవాలు విసిరే స్థాయిలో ఉన్ననాడు మాత్రమే ప్రజలు ఆ ప్రభుత్వాలను ఆదరిస్తారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు అపారమైన ప్రేమ ఉంది కానీ సరైన వైద్యం అందకపోవడం, సరైనటువంటి చికిత్స దొరకకపోవడం, ఆపై చికిత్సకు అందుబాటులో లేక జిల్లా కేంద్రాల లోపల కూడా ఏం చేయాలో తెలియక ప్రైవేటు ఆసుపత్రి వలలో చిక్కి పేదలు మరింత నిరుపేదలవుతున్నారు. ప్రభుత్వాలు పేదరికం తొలగించే ప్రయత్నం ఏనాడూ చేయడం లేదు ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చిన దాఖల అంతకూ లేదు. కానీ విద్యా వైద్యం పేరుతో తమ సంపాదించిన సంపద ఎంతో కొలగొట్టబడుతూ ఉంటే కనీసం ఆ రెండింటిని ఖర్చు కాకుండా చూడడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి అయినా ప్రభుత్వాలు పనిచేయాలి కదా! ఆ రకమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం ప్రజల కొనుగోలు శక్తిని పెంచకపోవడం ప్రజల ఆస్తిపాస్తులను కొల్లగొట్టే చర్యలకు పాల్పడడం వలన నేటి ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యాలు కాదు సంక్షోభంలోకి నెట్టబడుతున్న రాజ్యాలుగా తయారవుతున్న విషయాన్ని గమనించాలి.
రాజ్యాంగంలో రాసుకున్నటువంటి సంక్షేమ వ్యవస్థను మెరుగుపరచడానికి పాలకులు గనుక పూనుకోకుంటే అంబేద్కర్ హెచ్చరించినట్లుగా ప్రజలు తమకు నచ్చినటువంటి ప్రభుత్వం కోసం ప్రతిఘటిస్తారని, పోరాడుతారని, సాధించుకుంటారని చెప్పడం జరిగింది. కానీ పాలకులు తమ ఆధిపత్యాన్ని పోలీసుచర్యను, అణచివేతను ముమ్మరం చేయడం ద్వారా ప్రజల నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అంతెందుకు అనేకమంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులనే చ ట్టసభల్లో మాట్లాడకుండా గెంటివేసిన సందర్భాలున్నటువంటి ఈ దేశంలో ఇక సామాన్య ప్రజలకు వారి హక్కులకు రక్షణ ఉంటుందని ఊహించగలమా? అయితే ఒకటి మాత్రం సత్యం ప్రజల యొక్క అసహనం, ఆగ్రహం, పాలకుల నిర్లక్ష్యం అణచివేత దోపిడీ పీడన ప్రజల్లో చైతన్యాన్ని దానంతట అదే తీసుకురావడానికి దోహదపడుతుంది. అప్పుడు పాలకులను మార్చడానికి ప్రజా ఉద్యమాలు వాటికవే రూపుదాలు స్తాయి. ఇటీవల కాలంలో శ్రీలంక నేపాల్ బంగ్లాదేశ్ వంటి అనేక దేశాలలో పాలకులనే ఇతర దేశాలకు తరిమికొట్టినటువంటి ఘన చరిత్ర ప్రజలకు ఉన్నది. ప్రజల చరిత్రను ప్రజల శక్తిని ఏనాడు కూడా పాలకులు తక్కువగా అంచనా వేయకూడదు. ప్రజల కోరికలు వాగ్దానాలు తీర్చడం ద్వారా మాత్రమే తమ ఉనికి ఉంటుందనుకోవడం పొరపాటు.విద్యా వైద్యాన్ని పక్కగా నిర్వహించి ఇతర కోరికలను పక్కనపెట్టి సమర్థవంతమైన పాలన అందించడానికి కృషి చేస్తేనే ఆ ప్రభుత్వం పది కాలాలపాటు కొనసాగుతుంది. ఆ వైపు ఆలోచించే వారిదే భవిష్యత్తు ప్రభుత్వాలు సమాధానం తో సిద్ధంగా వుండాల్సిందే.!!!!
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడుఅరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )