విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలి
- చదువే జీవితంలో అభివృద్ధికి సమస్యలకు పరిష్కారం
ఇమాంపేట మోడల్ స్కూల్, కేజీబీవీ విద్యార్థినిలకు
బెడ్ షీట్లు అందజేసిన రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట 14 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలని చదువే జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ అభివృద్ధి బాటలో పయనింప చేస్తుందని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన భూక్య దామోదర్ తన తల్లి భూక్య లక్ష్మి జ్ఞాపకార్థం ఇమాంపేట మోడల్ స్కూల్, కేజీబీవీ విద్యార్థినిలకు అందజేసిన బెడ్ షీట్స్ ను విద్యార్థులకు పంపిణీ చేసి మాట్లాడారు. తాను పాఠశాలను దత్తత తీసుకొని ఇప్పటికే 10 లక్షల విలువ చేసే పరుపులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే మూడు లక్షల రూపాయలతో తలుపులు కిటికీలను రిపేరు చేయించడంతో పాటు బెంచీలకు రంగులు వేయించినట్లు వివరించారు. మోడల్ స్కూల్ సమస్యలపై కలెక్టర్కు విన్నవించగా ఆయన ఏడు లక్షలు కేటాయించడం హర్షినియమన్నారు. విద్యార్థులు చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని సమాజం అభివృద్ధి చెందితే దేశం బాగుంటుందన్నారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు. తాను మోడల్ స్కూల్ కు కంప్యూటర్ లు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మోడల్ స్కూల్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంబిబిఎస్ లో సీట్లు సాధిస్తారని ప్రిన్సిపల్ చెప్పడం అభినందనీయమన్నారు. పాఠశాలకు మంచి ప్లేగ్రౌండ్, సిసి రోడ్డు, బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డిసిడిఓ పూలమ్మ, ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్, దాత భూక్య దామోదర్, ప్రిన్సిపల్ శంకర్ నాయక్, కేజీబీవీ ప్రిన్సిపల్ హుక్సేన బేగం, నాయకులు వల్దాస్ దేవేందర్, ప్రభాకర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.