వర్షాల పాలైన పంటలు ...రైతుల కన్నీరు
తిరుమలగిరి 05 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గత కొన్ని రోజుల నుండి నుండి కురుస్తున్న మోస్తరు వర్షాలు రైతులను మరోసారి తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఇటీవలే సంభవించిన మోంథా తుఫాన్ ప్రభావంతో వరి ధాన్యం, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మళ్లీ వర్షాలు పడటం వారిని మరింతగా ఇబ్బందులకు నెట్టింది.
‘మూలిగే నక్క పై తాటి పండు’ .......
ఈ సంవత్సరం వర్షాలు తమను పూర్తిగా ముంచేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూలిగే నక్క పై తాటి పండు అన్నట్లు ఈ సంవత్సరం వర్షాలు తమను పూర్తిగా ముంచేశాయి. కోతకు వచ్చిన పంటలు పొలాల్లోనే తడిసి పాడవుతున్నాయని వారు వాపోతున్నారు. కోత పనులు నిలిచిపోవడంతో చైన్ మిషన్లు కూడా వర్షం తగ్గకపోవడంతో పెట్రోల్ బంకుల వద్దే నిలిపి వేచి ఉన్నాయని రైతులు తెలిపారు. పంటను ఇంటికి చేర్చుకోలేని పరిస్థితితో తీవ్ర నష్టం వాటిల్లుతోందని వారు ఆందోళన చెందుతున్నారు.
కొనుగోలు కేంద్రాలు ఖాళీ...
వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాలు కూడా ఖాళీగా మారాయి.పత్తి ఏరడం కష్టంగా మారడంతో, చేలోనే పత్తి తడిసి ముద్ద అవుతుందేమోనని పత్తి రైతులు భయపడుతున్నారు. వర్షాల వల్ల ధాన్యంలో తేమ శాతం పెరిగిపోవడంతో, ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.రైతులు తమ ధాన్యపు రాశులపై టార్పాలిన్ కప్పి వర్షం ఆగే వరకు వేచి చూడటమే తప్ప, తమ చేతుల్లో ఏమీ లేదని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.ఈ వర్షాల ప్రభావంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు కూడా కొనుగోలు నిలిచిపోయినందున ఏమి చేయలేని పరిస్థితి. ఈ సీజన్‌లో వరుస వర్షాలతో తిరుమలగిరి మండల వ్యాప్తంగా ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, ప్రభుత్వం నుంచి తగిన సహాయం మరియు నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నారు..