రాజేశ్వరపురం శాసనం సాక్షిగా
దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతం...?
వ్యవసాయ భూములు విలువైన భూములు కబ్జాల కోరల్లో...?
నేలకొండపల్లి ఘన చరిత్రను భూములను ఆస్తులను పట్టించుకోని" దేవాదాయ శాఖ"...?
సంబంధిత శాఖ భూములు విలువైన స్థలాలు కబంధ హస్తాల్లో చిక్కుకుంటే అసలు పట్టించుకోరేందుకు...?
గత కొన్ని సంవత్సరాల నుండి కమ్ముకున్న నీలి నీడలు..?
*ఇంతకీ ఈసారైనా దేవాదాయ శాఖ ఉదాసీనతను వీడేనా...?
*నేలకొండపల్లి దేవాలయ భూములు అన్యాక్రాంతం పై భక్తుల్లో తలెత్తుతున్న మిలియన్ డాలర్ల సంకోచాలు...?
*కఠిన చర్యలు తీసుకుంటే తప్ప.. భవిష్యత్తులో దేవాలయ భూములు కంటికి మాత్రం కూడా కనిపించవా...?
చర్యలు తీసుకునేందుకు దేవాదాయ శాఖకు అడ్డంకులు సృష్టిస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు...?
తెలంగాణ వార్త ప్రత్యేక కథనం..!
పాలేరు ప్రతినిధి/తెలంగాణవార్త ఆగస్టు 26 సోమవారం:- ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని గ్రామం రాజేశ్వరపురం. ఇక్కడ వీరగోపాలస్వామి దేవాలయంలో నిలబెట్టివున్న 15 అడుగుల ఎత్తు, 3అడుగుల వెడల్పు 6అంగుళాల మందమున్న రాతిబండ(పలక,సలప)మీద రెండువైపులా శాసనం చెక్కివుంది. ఈ శాసనంలో 12మంది వ్యక్తుల పేర్లు పేర్కొనబడ్డాయి. వీరిలో మొదటిపేరు కోటకేతన. కోట వంశస్తులు కాకతీయుల సామంతులే కాదు వారి బంధువులు కూడా. వీరి రాజధాని ధరణికోట. పట్టణం పేరే వారి ఇంటిపేరయింది. వీరికి పరబలసాధక, ప్రతాప లంకేశ్వర, కళిగళ మొగడకై, గండరగండ, గండభేరుండ, జగమెచ్చుగండ వంటి బిరుదులున్నాయని వేల్పూరులోని రామలింగేశ్వరాలయంలోని శాసనంలో పేర్కొనబడ్డాయి. కృష్ణానదికి దక్షిణాన వున్న 6వేల గ్రామాలకు ప్రభువులని(షట్సహస్రావని వల్లభ) పేరుపొందారని పరబ్రహ్మశాస్త్రి ‘కాకతీయులు’లో రాయబడివుంది. వీరిలో బయ్యల మహాదేవి (బయ్యాంబ) కాకతీయ గణపతిదేవుని చెల్లెలు మైలాంబ, భర్త నతవాడి రుద్రుని కుమార్తె. కోటవంశంలో ముగ్గురు కేతనలు, 4గురు భీములు వున్నారు. 1250లో యనమదలలో గణపాంబ వేయించిన శాసనంలో పేర్కొనబడిన మొదటి, రెండవ కేతనలు, మొదటి, రెండవ భీములే రాజేశ్వరపురం శాసనంలో పేర్కొనబడిన కేతన, భీములు అవుతారు. కేతనలకు మారుపేర్లు వుంటే వారు కేశవ, మాధవ భూపతులవుతారు. కోట వంశం వారికున్న బిరుదులలో పర(బల)సాధక, (గండ)భేరుండ కేతనలుండడం ఆధారంగా ఈ శాసనం కోట వారిదేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. రాజేశ్వరపురం గ్రామాన్ని కోట కేతన నిర్మించివుంటాడు. గ్రామంలో శివాలయం, గోఫాలస్వామి దేవాలయాలకు దక్షిణంగా పురాతన కాలంనాటి రాతికోట ఒకటి శిథిలమై వుంది.
రాజేశ్వరపుర శాసనంలో విష్ణుమూర్తి నాభిపద్మం నుంచి పుట్టిన బ్రహ్మపాదాల నుంచి పుట్టిన కోట కేతన వంశీకులు నిర్మించిన రాజేశ్వరపురం గ్రామంలోని వీరగోపాలస్వామి(మీసాల గోపాలస్వామి) దేవాలయానికి చేసిన భూదానాన్ని వివరిస్తున్నది ఈ శాసనం. కోట వంశంలో పుట్టిన కేతన, భీముడు, కేశవ భూపతి, బయ్యమాంబ పుత్రుడు మాధవ భూపతి. భేరుండ కేతన అతని భృత్యుడు కామిరెడ్డి, వెర్రమ, కాట్రెడ్డి మాచిరెడ్డి, ధీరుడు గోపాలవర్ధనుడు, ప్రోలాంబిక పుత్రుడు మందడి ప్రోలుడు కల్పవృక్షము లక్ష్మితో పాటు పుట్టినట్లుగా, సోమాంబతో కలిసి పుట్టాడని వివరిస్తున్నది శాసనం.
ఈ శాసనం శకాబ్దాలు రూప,బాణ,క్షితి,శశి మాధవ శుక్లపక్ష కావ్యవారం దశమి నాడు ద్విజవరులచేత ప్రతిష్ట చేయబడింది.
శకసం. రూప=1,బాణ=5,క్షితి=1, శిశి=1 వామాంకగతిలో చదివితే శక సం.1151, మాధవ(మాస) అంటే వైశాఖమాసం శుక్లపక్షం కావ్య(శుక్ర)వారం, దశమినాడు ఈ శాసనం వేయించబడింది. అనగా క్రీ.శ. 1229 మే 4న.
వీరగోపాలస్వామి దేవునికి అంగ, రంగ, భోగాలకు, బ్రాహ్మణులకు ధారవోయించి యిచ్చిన వ్రిత్తులు (శాశ్వతముగా అనుభవించు దానాలు)గా కట్టంగూరి చెరువు పడమట, తాటితోట తూర్పున 8, తూర్పు తాటితోట వద్ద 4, (నేల)కొండపల్లి చెరువు ఉత్తరాన 1, తోటన 1, ముకిందపాయ చెరువుతూర్పు మామిడితోటన 4, పడుమట 1, సూరాదేవిపల్లి పొలాన4, బొల్లికుంట తూర్పున 5, ఇప్పల ఎరగుంట ఉత్తరాన 16, నల్లచెరువు ఉత్తరాన 10, దొంతు చెరువు ముందట నీరునేల(తరిభూమి), రాజనపు కాలువ రాటనపు నూతి తూర్పున ప.(ప అంటే పట్టు అని అర్థం. పట్టు అనేది పుట్టికి వాడినదై వుండొచ్చు. పుట్టి పండే భూమిని ఖండుక అని కూడా అంటారు.) , గండకాలువను ప, దంతుల చెరువు మేడికొమ్మున ప, జుమలూరి గణయ మోగడ్ల చెరువు వెనక కాలువ పడుమట ప దానముగా ఇవ్వబడినవని శాసనం వివరిస్తున్నది.
రాటనపు నూయిః రాజేశ్వరపురం గోపాలస్వామి గుడికి వాయవ్యదిశలో మంచినీటి బావి వుంది. దానిపక్కన 20 అడుగుల ఎత్తున్న ఒక రాతిపలకస్తంభం వుంది. దానిపైన గాడి వుంది.గాడికి రెండువైపుల లోపలి అంచులలో రంధ్రాలున్నాయి. ఇవి గిలక లేక కదురువంటిది అమర్చడానికి అవసరమైనవి. దీనిమీద పొడుగాటి కర్రకు ఒకవైపు బొక్కెన మరోవైపున మనిషి నిలబడి,కర్రను తొక్కుతూ నీళ్ళు తోడేవాడు. దీనిని రాటనంబాయి అంటారు. ఇది గుడిబాయి. దానిలోని నీరు వ్యవసాయం సాగుకు వాడుకున్న ప్రజలు రాటనం పన్ను కడుతుండేవారు. దీనిమీద ‘నీరడి’ అని రాసివుంది. నీరడి అంటే నీటికట్టుబాటు, ఏర్పాటు, నిర్వహణలు.
ఈ శాసనం కోటనాయకుల గురించి తెలియజేసే శాసనాలలో కొత్తగా చేర్చతగినది.శాసనలిపి కూడా కాకతీయశాసనాలలోని లిపిని పోలినప్పటికి కొన్ని అక్షరాల లేఖనము శాసనలేఖకుని కారణంగా భిన్నరూపంలో అగుపించాయి. శాసనానికి వాడిన రాయికూడా స్తంభరూపంలో లేదు.ఫలకం వలె ఉన్నది.
రాజ్యం: కాకతీయ
రాజు: గణపతిదేవ మహారాజు సామంతులు కోట వంశం వారు
రాజవంశం: కోట
కాలం: శక సం.1151, మాధవ(మాస) అంటే వైశాఖమాసం శుక్లపక్షం కావ్య(శుక్ర)వారం, దశమినాడు ఈ శాసనం వేయించబడిందని చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. నేలకొండపల్లి మండలంలో దేవాలయ భూములు అన్యాక్రాంతం కబ్జాలపై న్యూస్ తెలంగాణ ఈ ఏడాది వరస కథనాలు ప్రచురించిన సంగతి ఖమ్మం జిల్లా ప్రజలకు తెలిసిందే. పేపర్లో వార్త కథనాలు వచ్చినప్పుడు హడావుడి చేసే దేవాదాయ శాఖ ఆ తర్వాత యధావిధిగా వివరిస్తుందని ఆరోపణ సైతం వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల ధర్మాదాయ దేవాదాయ భూములను కబ్జా చేసి దర్జాగా సాగు చేస్తున్న కానీ సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు మండల వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాము నుండి నేటి వరకు కూడా కబ్జాల పరంపర కొనసాగుతూ ఉన్నదని మండల భక్తులు ఆరోపిస్తున్నారు. కోనేరు ఆంజనేయస్వామి బైరాగిగుట్ట దేవాలయాలు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో బందీలై దేవాలయాల అలనా పాలన కూడా ప్రైవేటు వ్యక్తులే నేటికి నిర్వహించటం అధికారుల పనితీరును స్పష్టం చేస్తోంది. ఉండి లెక్కలు మొదలు దేవాలయాలలో జరిగే కార్యక్రమాలు సైతం ప్రైవేటు వ్యక్తుల కనుసైగలలో నిర్వహించడం దేవాదాయ ధర్మాదాయ శాఖ పనితీరుకు ఉదాహరణలు గా ఇస్తున్నాయి. కాదా భైరవి గుట్ట ఆంజనేయస్వామి గుడి దగ్గర విలువైన గ్రానైట్ నిక్షపాలపై కన్నేసిన కొందరు వ్యక్తులు కొంత తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బైరాగి గుట్ట దేవాలయం ఆలనా పాలన చూసిన ఓ భక్తుడు బహిరంగంగా పత్రికాముఖంగా గ్రానైట్ నిక్షేపాల గురించి గుప్త నిధులు (లంకెల బిందెలు) అంశంపై వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బైరాగి గుట్ట ఆంజనేయస్వామి కోనేరు ఆంజనేయస్వామి దేవాలయాలలోని హుండీలలో సొమ్మును సైతం ప్రైవేటు వ్యక్తులు వడ్డీకి తీసుకొని పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాము నుండి నేటి వరకు కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్న కనీసం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంజిల్లా స్థాయి మండల స్థాయి అధికారులకు తెలిసినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆరోపణలు బలంగా ఉన్నాయి. కాక తెలంగాణ వార్త సేకరించిన సమాచారం మేరకు బుధవారం బైరాగి గుట్ట కోనేరు ఆంజనేయ స్వామి దేవాలయాలను దేవాదాయ శాఖ మండల రజిల్లాస్థాయి అధికారులు పరిశీలించి పర్యవేక్షించే అవకాశం ఉన్నదని విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. నేలకొండపల్లి బౌద్ధ స్తూపం భక్త రామదాసు జన్మస్థలంలో జరుగుతున్న కబ్జాల పరంపరపై జిల్లా మండల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఒక వైపు నెలకొండపల్లిని టూరిస్ట్ హబ్బుగా ప్రకటించి నిధులు మంజూరు చేసేందుకు అడుగులు పడుతున్న వేళ ప్రభుత్వ లక్ష్యం మేరకు పని చేయాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరించడం వెనుక అదృశ్య శక్తుల ప్రభావం ఉన్నదని పలువురు బహిరంగంగా అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాష్ట్రస్థాయి అధికారులు దృష్టి కేంద్రీకరించి దేవాలయ భూములను అన్యక్రాంతం చేసి కబ్జాలకు గురవుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోని కబ్జాదారుల కబంధహస్తాల నుండి విలువైన భూములను కాపాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిస్ట్ ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్న సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు దేవాదాయ భూములను ప్రభుత్వ రికార్డుల ప్రకారం స్వాధీనం చేసుకొని తమ సిద్దసుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మండల భక్తులు అంటున్నారు.