రాజకీయ నేరగాళ్లపై ఉక్కు పాదం మోపాలి.

Mar 9, 2024 - 23:06
Mar 10, 2024 - 02:08
 0  2

న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, ప్రజా సంఘాలు  మానవ హక్కుల కమిషన్లు  నిఘా వేసి ఉంచాలి.

చట్టసభల్లోకి రాకుండా అడ్డుకోవడమే ప్రజాస్వామ్య పునరుద్ధరణకు  కీలక అంశం.

రాజకీయ పార్టీలు నేరస్తులను పక్కనపెట్టి నిజాయితీకి పట్టం కట్టాలి.

--వడ్డేపల్లి మల్లేశం 

24...01..2024

ప్రజల హక్కులను కాపాడి  ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడంలో  ప్రజల భాగస్వామ్యాన్ని  పొందడం రాజకీయ పార్టీల యొక్క కనీస బాధ్యత.  ఆ క్రమంలో  ఓటర్లను ప్రభావితం చేసే విషయంలో  నేరమయ రాజకీయాలకు పూనుకుంటూ  ప్రజలను బలి పశువులను చేస్తున్న కారణంగా  ఆధునిక కాలంలో ప్రజాస్వామ్యం నిరంతరం అపహాస్యం అవుతున్నది.  న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం,    మానవ హక్కుల కమిషన్ వంటి  బాధ్యతాయుత  రాజ్యాంగబద్ధ సంస్థలు  రాజకీయ పార్టీల  అవినీతి  అభ్యర్థుల నేరచరిత్రపై  ఉక్కు పాదం మోపి  నిజాయితీపరులకు మాత్రమే రాజకీయాల్లోకి  అవకాశం ఇవ్వగలిగితే   తప్ప భారత రాజ్యాంగం  స్వార్థ రాజకీయాలను అదుపు   చేయలేని దుస్థితి దాపరించినది . పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరినో ఒకరిని ఎంపిక చేసుకోవడం తప్ప ఓటరులకు ప్రత్యామ్నాయం లేని  దయనీయ స్థితి దాపురించినది.  చట్టాలను ఉల్లంఘించే వారికీ,  అవినీతికి పట్టం కట్టే వారికీ,  రాజకీయాలను నేరపూరితంగా  చేసేవారికి  ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లోకి అడుగుపెట్టే అవకాశం  కల్పించకూడదు.  నేరస్తులైన  వాళ్లు చట్టసభల ప్రతినిధులుగా  ప్రజల  తలరాతను జీవన విధానాన్ని  నిర్దేశిస్తున్నారంటే  ప్రజాస్వామ్య గమనం ఎటువైపో అర్థమవుతున్నది. నేరమయ గణాoకాలు -- కొన్ని సంస్థల ఆదేశాలు సూచనలు 

 ప్రజాస్వామ్య సంస్కరణల కమిటీ గత సంవత్సరం

763 మంది రాజ్యసభ లోక్సభ ఎంపీల ఎన్నికల ప్రమాణ పత్రాలను పరిశీలించగా  3o 6 మంది అంటే 40 శాతం సభ్యులపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు తేలింది.  అందులో 194 మంది పైన హేయమైన   నేరాభియోగాలు ఉన్నట్లు తెలుస్తున్నది.  2019  ఎన్నికల తర్వాత లోక్సభలో  83 శాతం మంది సభ్యులకు నే రచరిత్ర ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తే  2004లో 128 మంది నేరస్తులు లోక్సభ సభ్యులైనట్లు,2019ఎన్నికల్లో  అదేవిధంగా దేశవ్యాప్తంగా 4 వేలకు పైబడిన శాసనసభ్యుల  చరిత్ర నేరాల మురికి కూ పంతో నిండినట్లు అర్థమవుతుంది.  హత్యలు, అత్యాచారాలు, అపహరణలు,  అవినీతి బాగోతాల కేసులు,  భూ కబ్జాలు ,అక్రమార్జన  వంటి బలమైన కేసులను  మోస్తున్న వారే కావడం అంతులేని విషాదగాత. అలాంటి వాళ్లు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా  చట్టసభల్లో ఆసీనులవుతున్నారంటే ఆ సభలు అందించే ప్రజాస్వామ్యం  ఎంత అరాచకంగా ఉంటుందో  సామాన్యులకు రక్షణ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

2023 నవంబర్ డిసెంబర్  మాసాలలో జరిగిన తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,ఛత్తీస్గడ్, మిజోరాం  శాసనసభ ఎన్నికలను  స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తిచేసేందుకు  ఎన్నికల సంఘం కట్టుబడి ఉన్నట్టు ప్రకటించి  ఎన్నికల బరిలో దిగేవారు తమ నేర చరిత్రను పత్రికా ప్రకటనల ద్వారా ప్రజలకు తెలియజేసి  ప్రజల సమక్షంలో అంగీకరించాలని  కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్  చేసిన హెచ్చరికను సభ్యులు  పాటించినట్లు అనిపించలేదు. నేరస్తులు, నేరం ఆరోపించబడిన వారిని  చట్టసభల్లో సభ్యులుగా  రాజకీయ పార్టీలు ఎంపిక చేస్తున్న  సందర్భంలో  వారి ఎంపికకు గల కారణాలను  రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వెల్లడించాలని కూడా ఎన్నికల సంఘం  చేసిన ఏ సూచన కూడా పార్టీలు  అమలు చేయలేదు.

1992- 96 మధ్యన ఎన్నికల ప్రధాన కమిషనర్ గా ఉన్న టీ .ఎన్. శేషన్  అందుబాటులో ఉన్న  అధికారాలను ఉపయోగించి  రాజకీయ  నేరాలను,  ఎన్నికల్లో ఆ డంబరాలు అక్రమాలను  కట్టడి చేసిన విషయం మనందరికీ తెలుసు.  ఇటీవల ఎన్నికల సంఘం అనేక ప్రజాస్వామ్య సంస్థలు కూడా  చట్టసభల్లో  నైతిక విలువలు పెంపొందించడానికి సమర్ధులు నీతివంతులైన సభ్యులను  పాలకులుగా నియమించడానికి సంబంధించి  తగు చట్టాలను తయారు చేయవలసిందిగా పార్లమెంటును ప్రభుత్వాన్ని కోరిన విషయం కూడా తెలుసు.  పార్లమెంటు  ప్రధానమైన అంశాలపై చర్చ లేకుండా,  ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా,  కీలకమైన అంశాలను కూడా మొక్కుబడిగా ఆమోదించి చట్టాలు చేసిన సందర్భంలో సర్వోన్నత  న్యాయస్థానం  పార్లమెంటును, ప్రధానిని, ప్రభుత్వాన్ని  అనేక సందర్భాల్లో తప్పు పట్టిన విషయం కూడా మనందరికీ తెలుసు.  కంచే చేను మేసినట్లు  పార్లమెంటు, ప్రధానమంత్రి, మంత్రివర్గం ఏ  సూచనలను పాటించకపోవడంతో పాటు  సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరికలను ఖాతరు చేయకపోవడం వలన కూడా  చట్టసభలు నేరస్తులతో నిండిపోవడం అనివార్య మైనది.

 ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్న చట్టసభలు:-

  అవినీతిపరులైన సభ్యుల కారణంగా చట్టసభల గౌరవ ప్రతిష్టలు మంట గలవడంతో ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లే  ప్రమాదం ఉన్నది.  ఆ కారణంగా అరాచకత్వానికి , నిరంకుశత్వానికి  చట్టసభలు వేదికగా మారి  నే రమయ రాజకీయాల నేపథ్యంలోంచి ఎదిగిన నాయకులు అధికార భోగాలను అనుభవించడంతో పాటు  ప్రజలను బానిసలు యాచకులుగా భావించి  అధికారం శాశ్వతం అని శాసించే స్థాయికి రావడం శోచనీయం.  నేరాలు అభియోగాలు  శిక్షలు పడిన  వారు కొందరైతే   చట్టానికి అతీతంగా వ్యవహరిస్తు చట్టం నుండి తప్పించుకుంటున్నవా రు మరికొందరు. ఈ రెండు వర్గాల వారు కూడా  ప్రభుత్వ అండదండలతో  చట్టానికి అతీతంగా ప్రజాకంటకులుగా మారుతున్న వారే.  చట్టము, న్యాయము, రాజకీయ పార్టీలు, ప్రజాఒ త్తిడి  శక్తులు ఏమైతేనేమి నేరచరితులను చట్టసభలకు  అనర్హులుగా ప్రకటించాలి. రాజకీయాల్లోకి రాకుండా శాశ్వతంగా శిక్షించాలి.  నేరగ్రస్త రాజకీయాలతో పాటు ఎన్నికలను  ఓటర్లను  బలి పశువులుగా మారుస్తున్న రాజకీయ పార్టీల  ధనస్వామ్య  సంస్కృతి పైన ఎన్నికల కమిషన్ ఉక్కు పాదం మోపకపోవడం  ఆందోళన కలిగిస్తున్నది. డబ్బులతో ఓ ట్లను కొనుగోలు చేయడంలో  పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ  సంస్థలు  ఈ అపరాధా నికి  పూనుకోవడం  నల్లధనం ముసుగులో  దండుకుంటున్న ఓట్లు  ప్రజలకు సక్రమ పాలన అందించకపోగా  అనేక రెట్లు తిరిగి డబ్బును సంపాదించడానికి నేటి రాజకీయాలు   వేదిక  కావడం  మరింత సిగ్గుచేటు దేశ భవిష్యత్తు , ప్రజా ప్రయోజనాలు,  సామాన్య ప్రజలకు అందవలసిన హక్కులు,  మానవాభివృద్ధి పైన రాజకీయ పక్షాలకు ఏమాత్రం  నిబద్ధత గౌరవం ఉంటే  నల్లధనాన్ని నిరోధించి  మద్యం  ఇతర  అవినీతి మార్గాలను  మూసివేసి  నిజాయితీ రాజకీయాలకు  చేతులు కలిపి  ప్రజలకు పూర్తి భరోసా ఇవ్వగలగాలి . అక్షరాస్యత, విలువలు,  సంస్కారంతో సంబంధం లేకుండా  సంపన్నులు పెట్టుబడిదారులు మాత్రమే  ప్రజా ప్రతినిధులు కాగలిగే  అదమ సంస్కృతికి చరమగీతం పాడి  సామాన్యులు కూడా ఈ దేశాన్ని ఏలగలిగే  సాహసవంతులను తయారు చేసే క్రమంలో  విలువలకు ప్రాధాన్యత ఇవ్వడమే మన ముందున్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం.

లంచాలు, మద్యం,  అనుచిత విధానాలు, తాయిలాలు, ఉచిథా ల మాయలో  జనాన్ని ప్రభావితం చేసే కుటిల రాజకీయాలకు  ఈ దేశం బలి కాకూడదు.   అలాంటి కార్యకర్తలు నేతల పైన  అభియోగాలు రుజువైన సమక్షంలో అనర్హత వేటు ప్రకటించి  కోట్ల రూపాయలజరిమానా విధించాలి.  ఎన్నికల కమిషన్  ఇ o దుకు చేసినటువంటి ప్రతిపాదనను  సా కారం చేయాలంటే  ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించడానికి పార్లమెంటు,  మంత్రివర్గం,  దేశాధినేత రాష్ట్రపతి చొరవ కూడా  కీలకమైనది.  ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు, ప్రకటించిన మేనిఫెస్టోలు,  సందర్భోచితంగా చేసే ప్రకటనలకు  రాజ్యాంగబద్ధతను కల్పించి  అమలుచేయనీ నాడు న్యాయస్థానం ద్వారా  సాధించుకునే చట్టబద్ధతను తీసుకురావాలి . ఇచ్చిన హామీలను  ఎంత కాలంలో ఎలా నెరవేరుస్తారో  చెప్పాలని ఎన్నికల సంఘం గతంలో  అనేకసార్లు రాజకీయ పార్టీలకు చేసిన హెచ్చరిక ఏనాడు కూడా రాజకీయ పార్టీలను   కదిలించలేకపోవడం  విషాదకరం . తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు

అనుత్పాదక రంగాలలో ఖర్చు చేసి చేసిన కోటాను కోట్ల రూపాల అప్పును కూడా  ఆ ప్రభుత్వమే తీర్చే విధంగా చట్టం చేస్తే  రాబోయే ప్రభుత్వాలపైన  తెలంగాణలో మాదిరిగా పెనుబారం పడే అవకాశం ఉండదు.  హామీలు ఇచ్చి అమలు చేయలేకపోయినా,  ఒప్పుకున్న వాగ్దానాలను సకాలంలో నెరవేర్చకపోయినా  చెల్లుతుంది అనుకునే  మూర్ఖపు ఆలోచన నుండి రాజకీయ పార్టీలు బయటపడి  నైతిక బాధ్యత వహించి గద్దె దిగిపోయే  గడియలు   రా వాలి చట్టం, న్యాయం, ప్రజా ఒత్తిడి,  రాజ్యాంగబద్ధ సంస్థల చో రవతో  ప్రజలను నమ్మించి  గొంతు కోసి వంచనకు గురి చేస్తున్న రాజకీయాలకు  అడ్డుకట్ట వేయడానికి  ఆస్కారం ఉన్నది.  అప్పుడు మాత్రమే అంబేద్కర్ రాజ్యాంగం ఆశించిన ప్రజాస్వామ్యం  కనీసం గానైనా మనుగడలో కొనసాగుతుంది. "పాలకులు విస్మరించినా,  నిరంకుశత్వం నిండా ప్రజలను ముంచినా,  సామాన్య ప్రజల హక్కులను హరించినా, ఎన్నికల సంఘం న్యాయ వ్యవస్థ నిస్సహాయత కు గురైనా అనివార్యమైన పరిస్థితులలో  ఉన్న పాలనా వ్యవస్థను  చి దిమివేసి ప్రత్యామ్నాయ రాజకీయ యంత్రాంగాన్ని రూపొందించుకుంటారు" అని అంబేద్కర్ చేసిన హెచ్చరిక  ఏనాటికైనా నిజం కావచ్చునేమో!  అప్పుడు బాధ్యత వహించవలసింది రాజ్యాంగము రాజ్యాంగ నిర్మాతలు కాదు.... పాలకవర్గాలు,  నైతికత లేని రాజకీయ పార్టీలు,  బాధ్యతారాహిత్యంలో మునిగి తేలిన చట్టసభలు, ప్రభుత్వాలు అని గుర్తిస్తే మంచిది.  ఐదేళ్లకు మించి శిక్ష పడే  కేసులలో నేరాభియోగాలు నమోదు చేసే దశలోనే  నాయకుల పైన అనర్హత వేటు పడాలని లా కమిషన్ గతంలో చేసిన సూచన తప్పనిసరిగా  అమలులోకి వచ్చే విధంగా కృషి చేస్తే నేరగ్రస్త రాజకీయాలకు కొంతవరకు ముగింపు పలకవచ్చు.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉపాధ్యాయ ఉద్యమనేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333