మహిళ లోకాన్ని కించపరిచే మాయగాల్ల పట్ల  ఉక్కు పాదం మోపాలి

Nov 1, 2024 - 18:56
Nov 7, 2024 - 20:26
 0  2
మహిళ లోకాన్ని కించపరిచే మాయగాల్ల పట్ల  ఉక్కు పాదం మోపాలి

మార్కెట్ వస్తువుగా చూసే సంస్కృతిని,  మద్దతిస్తున్న ప్రభుత్వాలను  మహిళా సంఘాలు అడ్డుకోవాలి .

ఇది స్త్రీలకు  సంబంధించినదే  కాదు  పౌర సమాజం కూడా  ఘాటుగా స్పందించాలి.

--- వడ్డేపల్లి మల్లేశం

గతంలో ఎందరో మంత్రులు  స్వామీజీలతోపాటు ఇటీవల ప. బెంగాల్ హైకోర్టు  స్త్రీల పట్ల  స్త్రీల అత్యాచారాల పట్ల సున్నితమైన అంశంలో కలుగచేసుకున్నందుకు  నిందల పాలు కావలసి  వచ్చిన పరిస్థితిని గమనిస్తే  ఈ విషయంలో  మహిళా సంఘాలే కలుగ చేసుకుని  మహిళా లోకానికి  అవసరమైన మార్గదర్శనం చేస్తే  బాగుంటుంది . కార్మిక , యువజన,  ఉద్యోగ, వృత్తి సంఘాల మాదిరిగా  మహిళా లోకానికి సంబంధించిన అంశాల పట్ల  భద్రత  చైతన్యం హక్కులు బాధ్యతల విషయంలో  స్పష్టమైన  సూచనలు చేస్తే మరింత  అర్థవంతంగా ఉంటుంది.  ఒకవైపు సాహిత్య సాంస్కృతిక సంస్థలు కవులు రచయితలు, కళాకారులు  మహిళా లోకానికి సంబంధించినటువంటి  విషయాల పట్ల ఎప్పటికప్పుడు  చైతన్యం చేస్తూ తమ మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే  మాయగాళ్లున్న లోకంలో  ఈ చైతన్యం  సరిపోవడం లేదు.  మీడియా దుష్ప్రభావం  భారీగా ప్రజల మీద ప్రభావితం  చేస్తున్న తరుణంలో  టీవీ ప్రసారాలు సినిమాలు ఇతర మాధ్యమాలు సెల్ఫోన్ వ్యవస్థలో  క్లబ్బులు పబ్బులు ఈవెంట్ల వంటి  సంస్కృతిని కట్టడి చేయకుండా  మహిళల స్వావలంబన  ఆత్మ గౌరవాన్ని సాధించడం అసాధ్యమే.  ఇదే సందర్భంలో  ఇలాంటి  సన్నివేశాలు సందర్భాలకు  మద్దతు ప్రకటిస్తూ  వ్యతిరేకించకుండా ఉన్నటువంటి కొద్దిమంది స్త్రీల వల్ల  మహిళా లోకం తలదించుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి  ఉపాధి కోసం,  ఉద్యోగ అవకాశాల కోసం,  బ్రతుకు తెరువు కోసం  కూడా ఇలాంటి రొంపిలోకి దిగక తప్పడం లేదని అనేక సందర్భాలను బట్టి తెలుస్తున్నది. అంతెందుకు  కొంతమంది మహిళలే బాలికలను  అక్రమ రవాణా చేయడమే కాదు  వారిని వ్యభిచార రొంపిలోకి దించుతున్న సందర్భాలను గమనిస్తే  స్త్రీలకు స్టీలే శత్రువులా? అని  అనిపించక మానదు. ఇలాంటి  భయంకర సన్నివేశాలను  చూస్తూ  మహిళా సంఘాలు ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నాయి అని  ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్న విషయాన్ని  సమాజం యావత్తు  పరిశీలించవలసిన అవసరం ఉన్నది .
     ఇటీవలి కాలంలో వస్తున్నటువంటి సినిమాలు, టీవీ ప్రసారాలలో  స్త్రీని  అంగడి సరుకుగా ఆట బొమ్మగా ప్రచార వస్తువుగా  ఏ రకంగా కంపెనీలు పారిశ్రామిక సంస్థలు ఉపయోగించుకుంటున్నాయో  గమనిస్తే  అంతకుమించిన స్థాయిలో సీరియల్ మిగతా టీవీ ప్రసారాలలో  స్త్రీ పాత్రలను  అసభ్యకర రీతిలో  చూపిస్తున్న విషయం అందరికీ తెలుసు . నిర్మాతలు లేదా నిర్వాహకులు  తమ లబ్ధి కోసం  పిడికెడు మంది నటీనటుల ప్రయోజనం కోసం  స్త్రీ లోకాన్ని నయవంచనకు గురి చేస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకోవాల్సిందేనా?  ఎందుకు ప్రశ్నించడం లేదు?  మహిళా లోక0 ఇలాంటి సందర్భంలో ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది కదా! కనీసమైన ప్రతిఘటన కూడా లేకపోవడం,  సమాజం నుండి కూడా ఊహించిన స్థాయిలో  అడ్డుకోకపోవడం,  కొద్దిమంది సాహిత్య సంస్కృతి రంగాల వాళ్ళు మాత్రమే  పరిమితంగా పనిచేయడంతో  అన్ని రకాలుగా స్త్రీని వాడుకోవడం చట్టబద్ధమైన నేరమైనప్పటికీ  దానికి శిక్ష పడడం లేదు.  అది నేరమని న్యాయస్థానాలలో రుజువు చేయలేకపోతున్నాం,  ప్రత్యక్షంగా చూస్తున్న న్యాయస్థానాలు కూడా ఏనాడు కూడా సుమోటోగా స్వీకరించి  ప్రభుత్వాలకు పారిశ్రామిక సంస్థలకు వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేసిన సందర్భం ఈ దేశంలో అసలే లేదు.  అంటే ఎక్కడికక్కడ అన్ని వర్గాలు కూడా తమ బాధ్యతను విస్మరిస్తూ ఉంటే   పాత్రల లో నటించడానికి, వ్యాపార వస్తువుగా ప్రచార కార్యక్రమంలో  కొనసాగడానికి  వ్యతిరేకించిన సందర్భాలు లేకపోవడంతో  వాళ్లు చేస్తున్న పని చట్టబద్ధంగా మారిపోతున్నది.  లాభాపేక్షతో ప్రైవేట్ సంస్థలు నడుపుతుంటే  ఆర్థిక  ప్రయోజనo ఇతర బలహీనతలు ఆసరాగా  కొంతమంది భాగస్వాములు కావడంతో  మహిళలోకం  అవమాణించబడుతున్నది.  ఇక్కడ కచ్చితంగా ఆ పాత్రలో నటించే వాళ్లను ప్రచార   కార్యక్రమంలో పాల్గొనే వాళ్లను  అడ్డుకోవడo,  దానికి మద్దతిస్తున్న ప్రభుత్వాల పట్ల  ప్రతిఘటన కొనసాగించడమే  మహిళా గౌరవాన్నీ పెంచడానికి ఆత్మగౌరవంతో బతకడానికి స్వావలంబన సాధించడానికి  గల ఏకైక మార్గం.
        మహిళా సంఘాలు   మహిళల ఆత్మగౌరవం కోల్పోతున్న సందర్భాలు సన్నివేశాలను ప్రధానంగా  సమావేశాలలో చర్చించి  తగిన ఆదేశాలను జారీ చేస్తే మంచిది.  సాంస్కృతిక సంస్థలు  కళా సంస్థలు  మహిళా స్వావలంబన ఆత్మగౌరవం  అశ్లీల కార్యక్రమాల పట్ల వ్యతిరేకతగా  ప్రత్యేక కార్యక్రమాలను తీసుకోవడం ద్వారా  స్త్రీలను చైతన్య పరచాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉన్నది.  అంతేకాదు ముఖ్యంగా  పేదరికం  ప్రధానమైన కారణంగా  అనేక కుటుంబాలు  తమ ఇంటి మహిళలను  ఇలాంటి అసభ్యకరమైనటువంటి పనులకు పురమాయించడమే కాదు  అక్రమ రవాణాకు వ్యభిచారానికి  పంపుతున్న కారణంగా కూడా  ఈ పరిస్థితిని  నిరోధించడం కష్టమవుతున్నది.  ప్రభుత్వాలు కూడా పేదరికాన్ని తొలగించడంతోపాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం మహిళల సాధికారతను  ప్రధాన ఆశయంగా తీసుకొని కార్యక్రమాలు నిర్వహించడం  వ్యాపార సంస్థలు  ఇతర  అకృత్యాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థలను  నిషేధించి వాటిపైన కేసులు బనాయించి కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా కూడా  చట్ట పరిధిలో వీటిని అడ్డుకోవడానికి అవకాశం ఉంది.  సాంస్కృతికంగా, చైతన్యపరంగా, ప్రభుత్వం చట్టపరంగా,  సమాజం నుండి   తగిన మద్దతును అందించడం ద్వారా కూడా  ఈ ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది.  ప్రతిరోజు టీవీ ప్రసారాలను  మహిళలు పెద్ద మొత్తంలో వీక్షిస్తున్నారు,  వ్యాపార  సరుకుగా  టీవీలలో మహిళలను చూస్తున్నారు,  అనేక సందర్భాలలో అత్యాచారాలకు గురవుతున్న సన్నివేశాలను గమనిస్తూ ఉన్నారు,  వ్యభిచారమును  నిర్వహిస్తున్న సంస్థల  గురించి వింటూ ఉన్నారు  కానీ ఎక్కడైనా వ్యతిరేకత  మహిళల పక్షాన పెద్ద మొత్తంలో వచ్చినట్లు మనం గమనించినామా?లేదే!  ఏ వర్గ ప్రయోజనాలను ఆ వర్గమే  పోరాటం ద్వారా సాధించుకోవాలి మిగతా సమాజం మద్దతును పొందాలి ఇది కనీసమైన  సూత్రం  ఈ విషయంలో మహిళలోకం  మాయగాళ్లపట్ల  జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక  మహిళల పట్ల జరుగుతున్నటువంటి కొన్ని అకృత్యాల విషయంలో  పరిచయం ఉన్న కుటుంబాలే ఎక్కువగా పాల్గొనడం  ఆ తర్వాత పెళ్లికి నిరాకరించినదని నేపముతో  హత్య చేయడం ఇతర  ఆ కృత్యాలకు పాల్పడడాన్ని గమనించినప్పుడు  అలాంటి సందర్భాలలో మహిళలు చాలా జాగ్రత్తగా వ్యవహ రించవలసిన అవసరం ఉంటుంది.  అంతేకాదు మహిళా సంఘాలకు, పోలీసులకు , శీ టీమ్స్ కు తెలియజేయడం ద్వారా  తమ ఆత్మ స్థైర్యాన్ని ప్రదర్శించి   రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ  ఎక్కడికక్కడే నమ్మి చివరికి మోసపోయిన తర్వాత  బహిర్గతం చేయడం  ప్రాణాల మీదికి తెచ్చుకోవడం కూడా వాంఛనీయం కాదు.  ఆకాశంలో సగం అయినటువంటి మహిళ రక్షణ భద్రత పట్ల ప్రభుత్వాలు కూడా భరోసా కల్పించాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది.  ఇటీవల పని పరిస్థితుల దగ్గర  ప్రతిచోట  లైంగిక దాడులు వేధింపులకు  గురైన సందర్భాలు  అనేకంగా  కొనసాగుతున్న నేపథ్యంలో  ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం ద్వారా    అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది.  ఏది ఏమైనా  ప్రతిఘటించడంతోపాటు  ఇలాంటి ఆకృత్యాలకు సందర్భాలకు సన్నివేశాలకు కార్యక్రమాలకు సహకరించకుండా ఉన్నప్పుడు మాత్రమే  వీటిని ధృడ హస్తంతో అణచివేయవచ్చు .
( వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం  రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ).

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333