రాజకీయ, ఉద్యోగరంగాలలో అవినీతిని అధికార ప్రతిపక్షాల కతీతంగా విచారించాలి.
శ్రమకు తగ్గ ప్రతిఫలం మినహా ఏ రకంగానూ ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనక
అవినీతిపై ఉక్కు పాదం మోపాలి న్యాయవ్యవస్థ ప్రజా తీర్పును గౌరవించాలి.
--- వడ్డేపల్లి మల్లేశం
ప్రజాధనానికి పాలకులు కాపలాదారులు. ప్రజల కష్టార్జితం, చెల్లించే పన్నులు, ఉత్పత్తిలో భాగస్వాములు కావడం ద్వారా సృష్టించే సంపదనే మరొక రూపంలో ప్రజలందరికీ పంచబడుతుంది. అంటే సంపదను సృష్టించకుండా పంపిణీ చేయడానికి ఆస్కారం లేదు. మరొకవైపు రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వాలు మాత్రం ఉన్న ప్రజా సంపదను కొద్ది మందికి దోచిపెట్టడానికి, సామాన్యులకు ప్రలోభాల పేరుతో పంచడానికి ప్రయత్నిస్తూ ప్రచారంలో ఉన్న విషయం మనందరికీ తెలుసు. ఈ క్రమంలో పరిపాలించే దశలో అధికారంలో కొనసాగినన్ని రోజులు మంత్రులు ముఖ్యమంత్రి ప్రధాని కేంద్ర మంత్రులు ఎవరైనా నిబంధనలకు నీళ్లు వదిలి తీర్మానాలు క్యాబినెట్ ఆమోదాలు లేకుండా కూడా ఆయా శాఖలకు ఖర్చు చేసినట్లు కొందరిపై అవినీతి ఆరోపణలు వస్తే మరికొందరు అక్రమంగా సొమ్మును కాజేసినట్లుగా ఆరోపణలు రావడం నిత్యకుత్య మైపోయింది. ఇక పోలీసు డిపార్ట్మెంట్ తో సహా ఇతర శాఖల అధికారులు కూడా అవినీతికి పాల్పడి తమ అధికారాన్ని ఉపయోగించి అధికార దుర్వినియో గానికి తలపడిన సందర్భాలు అనేకం. ఆ ప్రభుత్వాలు కుప్పకూలి కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత విచారణను ఎదుర్కొనే సందర్భంలో పల ఆరోపణలతో ప్రజలతో చీత్కరించబడాన్ని కూడా మనం గమనించవచ్చు. రాజకీయ అవినీతిని అంతం చేయకుండా పరిపాలన రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్వామ్యంలో అవినీతిని అరికట్టలేము ఎందుకంటే కార్య నిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ అనుసంధానమై ఉంటాయి కనుక ఒకరికి ఒకరు అండగా గొడుగువలె ఉండే ఆస్కారం ఉంటుంది. అధికార ములో కొనసాగిన కాలంలో శాసనకర్తలు శాసనసభ్యులు మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు ప్రజాధనానికి సేవకులుగా కాపలాదారులుగా వ్యవహరించవలసినది పోయి అధికార యావతో సంపదను దోచుకోవడానికి అక్రమార్జనకు భూ కబ్జాలకు భూ దందాలకు పాల్పడుతూ తమ సంపదను చాలా తరాల వరకు కూడా సరిపోయే స్థాయిలో కూడా పెట్టుకునే ధోరణి ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది.ఇక ఆ కుటుంబంలో ఒకరికి అధికార పదవి ఉంటే ఆ కుటుంబ సభ్యులందరికీ, బంధువులకు కూడా పదవులను కట్టబెట్టే ధోరణి మామూలు అయిపోయింది కానీ తాము పాలిస్తున్నటువంటి ప్రజలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలను మాత్రం మరిచిపోతున్న తీరు నిజంగా సిగ్గుచేటు. ప్రజలను ప్రభువులుగా చూడవలసినటువంటి రాజకీయ యంత్రాంగం యాచకులుగా బానిసలుగా మారుస్తూ ప్రలోభాలను వారి పైన ప్రయోగిస్తూ స్వతంత్రంగా జీవించకుండా ప్రభుత్వం మీద ఆధారపడే విధంగా వారిని పరాన్న జీవులుగా చిత్రీకరించడం అంటే పాలకుల యొక్క అవినీతి, బంధుప్రీతి, దురాగతాలు, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించకుండా ఉండడానికి చేస్తున్న కుట్రలో భాగమే. . ఒక ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఆ ప్రభుత్వం అధికారం నుండి తొలగిన తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం తన విచారణలో భాగంగా విచారణకు ఆదేశించిన సందర్భంలో ప్రతీకార చర్యగా భావించడం పరిపాటయిపోయింది కానీ ఆ రకంగా భావించకూడదు అట్లని ప్రజాధనాన్ని కాపాడవలసినటువంటి పాలకులు ఏ వర్గామైనా నేరస్థులను విడిచిపెట్టకూడదు.అవినీతికి సంబంధించి విచారణ యంత్రాంగం సిబిఐ, ఈడి, ఎసిబి వంటి ప్రత్యేక సంస్థలు కొనసాగుతున్న నేపథ్యంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ పరిధిలో మరిన్ని విభాగాలను కూడా ఏర్పరచినట్లయితేనే నిజమైన విచారణ సాగి ప్రజలకు న్యాయం జరుగుతుంది. లేకుంటే వాళ్ళ ప్రభావాన్ని పలుకుబడిని ఉపయోగించి విచారణను తప్పుదోవ పట్టించే ప్రమాదం కూడా లేకపోలేదు.
పాలకుల అవినీతిపై ప్రజల నిఘా మరింత పెరగాలి,:-
కావలి కుక్కలమని చెప్పుకునే పాలకులు ప్రజా సంపదను దోచుకోవడానికి పిచ్చికుక్కల మాదిరిగా ఎగబడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నప్పుడు ఈ దుర్మార్గాన్ని అరికట్టడానికి ప్రాంతాలు దేశాలకతీతంగా ప్రజలు పాలకుల అవినీతిపైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అంటే నిరంతరం నిఘా వేసి ఉంచడం ద్వారా చట్టాలు న్యాయ వ్యవస్థ పరిధిలో అవినీతిని సూటిగా ప్రశ్నించడం, అధికారులు ప్రజాప్రతినిధులను చట్టానికి అప్పజెప్పడం , చట్టం ముందు దోషులుగా అవసరమైతే ప్రజాక్షేత్రంలో నేరస్తులుగా ప్రజా బోనులో నిలబెట్టడం ద్వారా కూడా ప్రజల ఆగ్రహాన్ని పాలకులు ప్రతిపక్షాలకు చెందినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే నేమి అధికార దుర్వినియోగానికి ఎగబడిన ప్రతి ఒక్కరి పైన కూడా ఉక్కు పాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది. చట్టం తన పని తాను చేసుకోపోతుందని మాట వరసకు చెప్పడమే కానీ చట్టానికి అతీతంగా న్యాయం నత్త నడక నడుస్తుంటే పేదల ప్రజాధనాన్ని దోచుకుతిని పాలకులుగా, పెద్ద మనుషులుగా చలామనవుతున్న వాళ్లు ఇప్పటికీ చట్టసభల్లో ఉన్నారంటే ఆ లోపం నిజంగా చూస్తూ ఊరుకున్న ప్రజలదే కదా! 17వ లోక్సభలో 80 శాతానికి పైగా నేరస్తులు నేరచరిత్ర కలిగిన వాళ్లు చట్టసభలో ఉన్నారని ప్రభుత్వ గణాంకాలే చెప్పినాయి. ఇక ప్రస్తుత రాజ్యసభలో కూడా 34 శాతం మంది సభ్యులు నేరాలకు పాల్పడిన వాళ్లు అందులో మహిళల పైన ఆగడాలు అకృత్యాలకు తలపడిన వాళ్లు కూడా ఉన్నటువంటి ఈ దశలో చూస్తూ ఊరుకోవడం అంటే వాళ్ల నేరాన్ని మనం పెంచి పోషించడమే, నేర చరిత్రకు చట్టబద్ధతను కల్పించడమే అవుతుంది. ఎక్కడికక్కడ విచారణ, న్యాయస్థానాల తీర్పులు, శిక్ష అమలు,అవసరమైతే ప్రజా కోర్టు ద్వారా కూడా శిక్షించినా తప్పులేదు. ఎందుకంటే ప్రజల సొమ్మును మెక్కడానికి సిద్ధపడ్డ ద్రోహులకు ఈ దేశంలో జీవించే హక్కు లేదు అలాంటప్పుడు పాలకులుగా మనం అంగీకరించడం ఎలా? ఇక అధికారం నుండి తొలగిన తర్వాత ప్రతిపక్షంలో కొనసాగుతున్న సందర్భంలో కూడా నేరానికి తల పడినటువంటి వాళ్లపైన సమగ్రమైన విచారణ జరిపించాలి, విచారణకు సంబంధించి ప్రతిపక్ష అధికారపక్షం అనే భేదాభిప్రాయం అవసరం లేదు. అట్లని ప్రతీకారంతో ప్రతిపక్షాల పైన నిందలు మోపి నేరస్తులుగా చిత్రీకరించడం కూడా సమంజసం కాదు. "న్యాయ శాస్త్ర పరిభాషలో నేరానికి శిక్ష, చట్టం ముందు అందరూ సమానులే, అధికారాన్ని దుర్వినియోగం చేసే అధికారం ఎవరికి లేదు అనే అంశాల ప్రాతిపదికన సమగ్రమైన విచారణ జరగాలి. విచారణ జరిగే క్రమంలో రాజకీయ పలుకుబడిని ఉపయోగించకుండా న్యాయవిభాగం జాగ్రత్త వహించాలి రాజకీయ పార్టీల నాయకులు నేరానికి పాల్పడినట్లు తెలిసి అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధపడితే పెద్ద ఎత్తున గుమ్మిగుడి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ప్రచారాలకు పాల్పడి అడ్డుకుంటున్న తీరును కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ రకంగా రాజకీయ పార్టీల దుందుడుకు చర్యలకు కళ్లెం వేయవలసిన బాధ్యత కూడా సర్వోన్నత న్యాయస్థానం న్యాయ విభాగం పైన స్పష్టంగా ఉన్నది." చర్చలు లేకుండా ఒంటెద్దు పోకడతో చట్టాలను తయారు చేయడం, ప్రతిపక్షాల పైన అధికారాన్ని రుద్దడం, ప్రశ్నించి ప్రతిఘటిస్తే మార్షల్ తో బలవంతంగా బయటికి నెట్టడం వంటి అనాగరిక నిర్బంధ చర్యలను కూడా నేరాలు గానే పరిగణించి ఆ పాలకులకు సంబంధిత బాధ్యులకు శిక్షలు విధించవలసిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే" ప్రశ్నకు, చర్చకు తావు లేనటువంటిది ప్రజాస్వామ్య దేశం కానే కాదు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే చూస్తూ ఊరుకోవడం కూడా దేశంలో న్యాయ వ్యవస్థకు భావ్యం కాదు. అందుకే స్వయం ప్రతిపత్తితో కూడుకున్న స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఈ దేశంలో రాజ్యాంగo ద్వారా సంక్రమించినప్పుడు నేరస్తులను ప్రకటించడం, శిక్షించడం, నష్టపరిహారాన్ని వసూలు చేయడం, ప్రభుత్వ ఖాతాకు జమ చేయడం,అధికార దుర్వినియోగానికి పాల్పడిన సన్నివేశాలు సందర్భాలలో కొల్లగొట్టిన ధనాన్ని లేదా భూ కబ్జాలకు పాల్పడినటువంటి ఆస్తులను ప్రభుత్వానికి దారా దత్తం చేసే పని కూడా న్యాయవ్యవస్థ నేతృత్వంలో జరగాలి. " న్యాయ వ్యవస్థకు ప్రజలు ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు మేధావులు బాసటగా నిలబడి ప్రజావాణి వినిపించిన సందర్భంలో అవినీతిని మరింత కట్టడి చేయడానికి, నిష్పక్షపాతమైన విచారణ జరగడానికి, నిజమైన దోషులకు శిక్ష పడడానికి, ప్రజాధనాన్ని దుర్నియోగానికి ఆస్కారం లేకుండా ప్రజలందరికీ పంచడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో బలోపేతం చేసుకుందాం ఆ వైపుగా ప్రజల భాగస్వామ్యం, నిరంతర జాగరూకత చాలా అవసరం.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అ రసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)