ఎంతమంది భార్యల పుస్తెలు తెగిపోవాలి?* ఎన్ని కుటుంబాలు  మద్యంతో  భర్తల కోల్పోయి వీధిన పడాలి.?

Jan 24, 2025 - 19:34
Jan 24, 2025 - 19:35
 0  1

ఉచితాలు రాయితీల పేరుతో  నగదు పంచడానికి  ఆరాటపడుతున్న పాలకులు,

రాజకీయ పార్టీలకు ఆదాయం గురించిన ఆలోచనే తప్ప పేదల బతుకుల గురించి  ఉండకూడదా ?

---వడ్డేపల్లి మల్లేశం

అవకాశవాద రాజకీయాలకు  చిరునామాగా మారిన నేటి రాజకీయ నాయకులు, పార్టీ ఏదైతేనేమి  మద్యం మత్తు పానీయాలు ధూమపానం  మత్తు పదార్థాలను అమ్మడం ద్వారా వస్తున్న ఆదాయంతో  పరిపాలన చేయాలని,  ప్రజల గూర్చి సోయి  లేని పాలకులకు  కనువిప్పు కలిగించడానికి ఆరోజే రాజ్యాంగ రచన కాలంలో  మద్యపానం మత్తు పదార్థాల గూర్చిన  47 వ అధికరణాన్ని రాజ్యాంగంలో పొందుపరచి  జ్ఞానోదయం కలిగించే ప్రయత్నం జరిగింది.అయినప్పటికీ  చూచి చూడనట్లు వ్యవహరించే ప్రభుత్వాలు  ప్రజలను బలి పశువులను చేసి అయినా  ఆదాయాన్ని సంపాదించాలి, పరిపాలనకు వినియోగించాలి, అక్రమ వ్యవహారాలు నడపాలి, భూ కబ్జాలు, భూదందాలకు పాల్పడాలి,  ప్రజలను ప్రలోభాలకు బానిసలను చేయాలి అనే ఆలోచనతో  భారతదేశంలో నడుస్తున్న పాలన  లక్షలాది కుటుంబాలను వీధిపాలు చేస్తుంటే  భర్తలు  మృత్యుపాలై  కుటుంబాలు వీధిన పడుచుంటే  ఎంతోమంది నొసట బొట్టు  చెరిపేసి  పుస్తెలతాడులు తెగిపోతుంటే కూడా  ఇదేదీ పట్టనట్లు వ్యవహరించడం  నిజంగా దేశ పాలకులకు తగదు.  రాజ్యాంగంలోని 47 వ అధికరణం ప్రకారం  మద్యం మత్తు పానీయాలను  ఔషధ ప్రయోజనాలకు  ఇతర అనివార్యమైనటువంటి  సందర్భాలకు మినహాయిస్తే  వినియోగించకూడదు  ఆ స్వేచ్ఛ రాష్ట్రాలకు పాలకులకు ఉంది అని  స్పష్టంగా పేర్కొన్నది. అంటే దాని అర్థం  ఆదాయం కోసం మధ్యాన్ని  అనుమతించమని కాదు  ఔషధ విలువలు ఏవైనా ఉండి అనివార్యమైతే ఉపయోగించమని మాత్రమే దాని అర్థం.

1960 ప్రాంతంలోనే గుజరాత్  రాష్ట్రం తొలిసారిగా  మద్యపానాన్ని నిషేధించి  తన ఆదర్శాన్ని చాటుకున్నది. కానీ  ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు  రాష్ట్రంలో నిఘా పెంచలేక,  ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి అక్రమ మద్యాన్ని ఆపలేక,  కొంతమంది స్వార్థ ప్రయోజనాలకు  ఆ నిషేధం  మొక్కుబడిగా మిగిలిపోయిన విషయం  అనేకసార్లు గుజరాత్లో అక్రమ మద్యం ద్వారా మృత్యువాత పడిన సంఘటనలు మనకు  జ్ఞానోదయం కలిగిస్తున్నాయి. శ్రామికులు ఎక్కువగా ఉండి శ్రమకు అలవాటు పడి  మానసిక ప్రశాంతత కోసం ఈ మద్యం వైపు దృష్టి సారించితే  ఇదే అదనగా భావించిన పక్క రాష్ట్రాలు  అక్రమ రవాణా ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేయడం  నిషేధించిన తొలి రాష్ట్రమైన ఆనాటి స్ఫూర్తిని మర్చిపోవడంతో  నేడు భారతదేశంలో  మద్యపాన నిషేధం అనేది కేవలం నామమాత్రంగా, కలగా  మిగిలిపోయింది .గుజరాత్ రాష్ట్రం తర్వాత మిజోరాం, నాగాలాండ్  గత రెండు మూడు సంవత్సరాల క్రితం బీహార్ రాష్ట్రం కూడా మద్యపానాన్ని నిషేధించి  శాయ శక్తుల అమలు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ  దేశమంతా అమలు కాని కారణంగా  పక్క రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యాన్ని సరఫరా చేస్తూ లబ్ధి పొందే మాఫియా ముఠాల వల్ల  నిషేధం అనేటువంటి ఒక స్ఫూర్తి నీరు గారి పోవడమే కాదు  లక్షలాది మంది పుస్తెలు తెగిపోతున్నాయి, వేలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయి,  అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాల సంఖ్యకు లెక్కేలేదు. ఇటీవల బీహార్ రాష్ట్రం  మద్యపాన నిషేధాన్ని ఎంతో స్ఫూర్తితో   అమలు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు  కొంత సమాచారం ఉన్నప్పటికీ  రాష్ట్రాల మధ్యన కొరవడిన సమన్వయం  దేశ పాలకులకు కేంద్ర ప్రభుత్వానికి  నిషేధం పట్ల సామాజిక బాధ్యత లేకపోవడం వంటి కారణాల వలన  నిషేదాన్ని   సమగ్రంగా ఈ దేశంలో చూడలేకపోతున్నాము.

తొలిసారిగా నిషేధించబడిన గుజరాత్ రాష్ట్రానికి చెందిన మోడీ గారు ప్రస్తుతం  ప్రధానమంత్రిగా గత 11 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ  ఉచిత విద్య వైద్యం తో పాటు మద్యపాన నిషేధం అనే మూడు అంశాలను  ఏనాడు కూడా ప్రస్తావించలేదు.  కుటుంబాలు వీధిపాలవుతుంటే  అనారోగ్యం బారిన పడి  పేదరికంలోకి నెట్టివేయబడి  లక్షలాదిమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే కూడా  ప్రధాని ఏనాడు ఆ అంశం ముఖ్యమంత్రులతో  చర్చించలేదు. అలాంటప్పుడు ఈ దేశంలో పకడ్బందీగా అమలు అయ్యే అవకాశం ఉందా?  ఇదే అవకాశాన్ని అదనుగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు  ఈ అధికారం రాష్ట్రాల జాబితాలో ఉన్నదనే  నెపంతో  మరింత పకడ్బందీగా మద్యపానాన్ని అమలు చేస్తూ దుకాణాల సంఖ్యను గణనీయంగా పెంచడంతోపాటు బెల్టు షాపుల సంఖ్యను కూడా ఇష్టారాజ్యంగా అనుమతించి  నీళ్లు లేని ఎడారిలో  కూడా మద్యం మాత్రం ఏరులై పారే  దౌర్భాగ్య పరిస్థితులను  కల్పిస్తున్నటువంటి పాలకవర్గాలకు ప్రభుత్వాలకు  అందుకు బానిసలై  తలలూపుతున్నటువంటి    తాగుడుకు అలవాటు పడిన వాళ్ళు  రాజీ  పడినంత కాలం  ఈ నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉంటాయి.  1994లో  నెల్లూరు జిల్లా దూబగుంటలో  సారా నిషేధం ప్రారంభమైనప్పటికీ  అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మద్యపాన నిషేధానికి దారి తీసిన విషయం తెలుసు. కానీ  అక్రమార్కుల అండతో, పెట్టుబడిదారుల ప్రోత్సాహంతో,  అందుకు తాగుబోతుల మద్దతు తోడైతే  నిషేధం అమలు కాలేదు విజయవంతం కాకపోవడంతో  తిరిగి కొనసాగడం  ఇతర రాష్ట్రాల నుండి ఆ కొద్ది రోజులైనా అక్రమ మార్గాల ద్వారా  రవాణా చేయబడడ మే కాదు  కొంతకాలం ప్రభుత్వాలే పోలీస్ స్టేషన్ల ముందు  వారునీ వాహిని పేరుతో  అమ్మకాలు జరిపినటువంటి  నేర చరిత్ర ఈ పాలకులకు లేదా?  అలాంటప్పుడు ప్రజలను స్వచ్ఛందంగా  విరమించుకోవాలని  కోరడం అత్యాశే  అవుతుంది .

నిషేధం అమలు ఎలా సాధ్యం?

మహిళా ఉద్యమాలు బలంగా రావాలి,  తాగుడుకు బానిసలై కుటుంబాలను నిర్లక్ష్యం చేసే భర్తలను  ఊరి పొలిమేరలు దాకా తరిమి వేయాలి.  కుటుంబాలను పట్టించుకోకుండా అనారోగ్యం పాలై  హింస ప్రవృత్తితో  నేరాలకు పాల్పడినటువంటి వాళ్లకు  బహిష్కరణ వేటు తప్పనిసరి.అంతేకాదు  సమాజం చే చీత్కరించబడినప్పుడు,  దుష్ట పరిణామాలను  అంచనా వేసినప్పుడు,  కుటుంబ సభ్యులు పిల్లలు కూడా  ప్రశ్నించి తిరుగుబాటు చేసినప్పుడు,  మగవాళ్ళలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.  ఇక రెండవ దశలో పాలకులకు ప్రజల హెచ్చరికలు, ప్రజలు మేధావులు, ప్రజాస్వామ్యవాదుల యొక్క అల్టిమేటo,  ఆ తర్వాత దుకాణాల పైన  ప్రజల నిరసన  ప్రజా ఉద్యమాలు  దేశవ్యాప్తంగా ఏకకాలంలో సాధ్యమైతే తప్ప ఈ నిషేధం సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం  ఈ మహత్కార్యానికి    నాయకత్వం వహించి, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి,  ఒప్పించి  మత్తులేని  జ్ఞానవంతమైన సమాజాన్ని ఆవిష్కరించే క్రమంలో ప్రపంచంతో పోటీ పడాలని  ఆదాయాన్ని కోల్పోయినా   అరిష్టాలు జరగకుండా  మద్యం మత్తులో  అనేక కుటుంబాలు కడతేరకుండా  సామాజిక బాధ్యతతో  సారధ్యం వహిస్తే,  అన్ని రాష్ట్రాలు సహకరిస్తే  దేశవ్యాప్త మద్యపాన నిషేధం  కష్టమేమీ కాదు. జ్ఞాపకశక్తి హరించి వేయబడుతున్నది, బాధ్యతలను విస్మరిస్తున్నారు, కుటుంబాలు  చెల్లా చెదిరవుతున్నవి,  క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాల బారిన పడి  ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు,  కుటుంబాలు పేదరికంలోకి నెట్టి  వేయబడుతుంటే  కుటుంబ సభ్యుల ఆర్తనారాలు  అంతా అంతా కాదు. మద్యం మత్తు డామినేటి చేసినప్పుడు  ఉత్పత్తిలో భాగస్వాములు కాలేక, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు సరిగా పాల్గొనలేక,  ప్రాథమిక విధులను సరిగా నిర్వర్తించలేక,  శారీరక మానసిక  వైకల్యంతో  తాగుబోతులు మాత్రమే కాదు ఈ దేశం కూడా  అవిటిది అయ్యే ప్రమాదం ఉన్నది.

(ఈవ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333