రచనకు ప్రాతిపదిక ఏమిటి?* రచయితలకు ఉండాల్సిన లక్షణాలు  వాటి తీరుతెన్నులు.

Jan 24, 2025 - 16:56
Jan 25, 2025 - 00:55
 0  1

రచన నిలదొక్కుకోవడానికి అవసరం అయిన ప్రామానికత.

రచయితలు సామాజిక మార్పును ఆశించడంతో పాటు శాసించగలగాలి కూడా.

---- వడ్డేపల్లి మల్లేశం

సామాన్యుల నుండి అసామాన్యుల వరకు తెలిసిన విషయం కావచ్చు తెలియని విషయం కావచ్చు కానీ ముందుగా స్పందించి  జనానికి అందించేవాడే రచయిత అయినప్పుడు  సామాజిక ప్రయోజనాన్ని  ఆశించి చేసేది రచన అని  స్పష్టంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు  పలు  lసందర్భాలలో ప్రస్తావిస్తూ  ప్రజలకు  అనుసంధానమై ఉన్నప్పటికీ  దానిని ముందుగా గుర్తించి  దాని పూర్వాపరాలను విప్పి చెప్పేవాడే నిజమైన రచయిత అని  ఇచ్చిన తీర్పు తదనంతర కాలంలో  సర్వజన ఆమోదం పొందినది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక రచయిత  కేవలం ఇంటికి పరిమితమై  మాట్లాడి రాసేవాడు అయితే నిష్ప్రయోజనం.  ఎందుకంటే  వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం అని మహాకవి శ్రీశ్రీ  చేసిన వ్యాఖ్యానం  మేరకు  రచయిత అనే వాడు కూడా పబ్లిక్ లో నిలబడగాలిగాలి. అంటే తన  ప్రవర్తన, ఆచరణ,  పోరాట స్ఫూర్తి, జీవన   విలువలు అన్నింటినీ కూడా సమాజం నిరంతరం పరిశీలిస్తుంది అవసరమైతే ప్రశ్నిస్తుంది అని తెలుసుకోవడం రచయితలకు చాలా అవసరం ."రచన అనేది  దాచబడినది,  విప్పి చెప్పబడినది, కష్టాలు కన్నీళ్ళతో  ప్రదర్శించబడినది,  పీడనకు సంబంధించింది ఏదైనా కావచ్చు  దానిని చూసే కోణం ఆలోచించే తత్వం  ప్రజల ముందు ప్రదర్శించే నైపుణ్యం  ప్రజా చైతన్యానికి బాటలు పరిచే సామర్థ్యం  రచయితకు ఉండాలి కానీ". మహాకవి శ్రీశ్రీ అన్నట్టు  అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ  కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా  ప్రతి సందర్భము సన్నివేశము సంఘటన  వస్తువు  అన్నీ కూడా కథా కవిత రచన వస్తువులే,.అంటే స్పందింప చేసే  అంశం రచనకు  ప్రాతిపదిక అవుతుంది  అప్పుడు మాత్రమే  పరిశీలించడం, పరిశోధించడం, అన్వేషించడం, మార్గాలను వెతకడం,పరిష్కారాలను చూపడం,  ముందు జాగ్రత్తలను  హెచ్చరించడం  ద్వారా  ఒక కొలిక్కి రావడానికి  ఉపయోగపడగలగాలి  కదా!  " కొందరికి కన్నీళ్లు అయితే మరికొందరికి పన్నీరు కూడా  రచనకు ప్రాతిపదిక అవుతున్నది. రచయితల మనోభావాలు,  సైద్ధాంతిక ధోరణులు,  సామాజిక స్పృహలోని స్థాయిలు,  సామాజిక ప్రయోజనాన్ని ఆశించకుండా  కాల్పనికతకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమం కూడా  రచన యొక్క ప్రామాణికతను నిర్ణయిస్తున్న సందర్భంలో  భావ కవిత్వం,  భౌతిక కవిత్వము,  కాల్ పనిక కవిత్వము,  యదార్థ కవిత్వము  అంటూ అనేక రూపాలలో సంతరించుకుంటున్న వేల  దాని ప్రయోజనాన్ని బట్టి ప్రజలు  పాట కులే ఆ సాహిత్యం యొక్క  ప్రమాణాన్ని నిర్ణయిస్తారు. అయితే భిన్న రకాలుగా ఆలోచించే పాఠకులు ఉన్నప్పుడు  కేవలం సామాజిక ప్రయోజనమే గీటు రాయి అవుతుందనుకోవడం కూడా కష్టమే.  సామాజిక మార్పును పెద్ద మొత్తంలో ఆశించినప్పుడు ఆ వైపుగా ఆలోచించే పాఠకులు ఉన్నప్పుడే కదా సాధ్యమయ్యేది.  అది కావాలంటే కూడా సామాజిక మార్పును సవాలుగా స్వీకరించే రచయితలు రచనలు సృష్టించినప్పుడే   అది నిజమయ్యేది.

ప్రజా రచయితలకు  ఉండాల్సిన  కొన్ని లక్షణాలు

ప్రజల హితాన్ని కోరేదే సాహిత్యమని గతంలో నిర్వచించుకున్నాం కానీ  కేవలం హితాన్ని కోరుకోవడం తోనే సరిపోదు ,  ఆ క్రమంలో వస్తున్న అనేక ఆటంకాలు సంఘర్షణలను నివారించాలంటే  రచయితలు మరింత  కట్టుదిట్టంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.   ప్రజల హితాన్ని సా కారం చేసే  కోణంలో  అవసరమైతే పోరాటానికి   కూడా రచయితలు సిద్ధపడాలి. అందుకు  సమాజం లోని  భిన్న వర్గాల నుండి వచ్చి సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అంతటి త్యాగశీలత, నేర్పు, ఓర్పు, పట్టుదల,  జీవిత ఆశయం ప్రతి రచయితకు చాలా అవసరం....  వాళ్లు మాత్రమే రచయితలుగా నిలదోక్కుకుంటారు, ప్రజల గుండెల్లో నిలిచిపోతారు, ప్రజల హృదయాలను చూరగొంటారు,  అప్పుడే   ఆ రచన ప్రజల కోసం పది కాలాలపాటు నిలిచి ఉంటుంది. రచయితలు లేకపోవచ్చు  కానీ రచనలు కలకాలం నిలిచిన సంఘటనలు అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే

ఇప్పటికీ ప్రజల కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి సాహిత్య గ్రంథాలు అనేకం.  దానికి కారణం అందులో ఉన్న ప్రజా జీవితం,  పరిష్కారాలు,సమస్యలు, బాధ్యతలు,  హక్కులు, పోరాట రూపం, జీవిత విలువలను నేర్పిన తీరు,  ఒక ప్రయోజనకరమైన ముగింపు  క్రియాశీలక భూమిక పోషిస్తున్నాయి.  తపన ఆరాటం   పోరాటంతో పాటు   జరుగుతున్న ఒక సంఘటన పట్ల  సంఘర్షణకు గురి కావడం కూడా అవసరమే.  తేలికగా తీసుకుంటే, నాకేమిటి అనుకుంటే,  తాత్కాలిక ప్రయోజనాన్ని మాత్రమే ఆశిస్తే, తనకు రచన  కౌశల్యము ఉన్నప్పటికీ కూడా  అక్కడ రూపొందే  రచన నిష్ప్రయోజనమే. నిజాన్ని నిగ్గదీసి ప్రశ్నించాలి, ప్రతిఘటించే స్వభావాన్ని పెంపొందించుకోవాలి,  ప్రతీకారము కాదు  పరోపకారం,  హింస కాదు సహన తత్వాన్ని పెంపొందించే క్రమంలో రచయిత తన మనోభావాలను పదిలపరచుకోవాలి,  ఎప్పటికప్పుడు తన ఆలోచనలకు సాన పెట్టాలి. ఆంగ్లేయులతో జరిగిన  రౌండ్ టేబుల్ సమావేశాల సమయంలో  అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ఆలోచనలో నిమగ్నమై పరిశీలనలో  తన నిద్రను కూడా పక్కనపెట్టి  అట్టడుగు జాతులు  సామాన్య భారత ప్రజానీకం కోసం  ఏ అంశాలు సమావేశంలో ప్రస్తావించాలి?  నోరులేని మూగవాళ్ళ కోసం  ఏ ప్రతిపాదనలు చేయాలి?  వాళ్ల హక్కులను సాధించడానికి నా శక్తిని ఉపయోగించాలి కదా! అని అనుకున్న సందర్భం  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను విశ్వ  మానవున్ని  చేసింది.  నిద్దుర లేని రాత్రులు  ఎన్నో ఎన్నెన్నో,  తన కుటుంబ సభ్యుల అనారోగ్యాన్ని పట్టించుకోని  రోజులు,  చనిపోయిన  ముఖాన్ని కనీసం చూడలేక   అంతకుమించినటువంటి  సామాజిక బాధ్యతతో  జాతి జనుల కోసం దేశం పక్షాన నిలబడి  ఒకరకంగా పోరాటం చేసినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  పోరాట స్ఫూర్తిని నిజమైన రచయితలు పెంపొందించుకోవాలి.  "హక్కులు కోల్పోయిన వాళ్లు, బానిసలుగా బతుకుతున్న వాళ్ళు, పీడన దోపిడీకి గురవుతున్న వాళ్ళ పక్షాన ప్రతినిధిగా నిలబడాలి నిజమైన   రచయిత.  భగత్ సింగ్ తెగింపు,  చంద్రశేఖర్ ఆజాద్ యొక్క ఆత్మగౌరవం,  గాంధీ మహాత్ముని అహింస,  రాజగురు సుఖదేవ్ లాంటి శౌర్య  సాహసాలు,  భారత చరిత్రలో జరిగిన అనేక పోరాటాలలో నేలకొరిగిన లక్షలాదిమంది వీరుల సాక్షిగా  తెగింపుతో అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధపడగలగాలి ప్రస్తుత పరిస్థితుల్లో  నిజమైన రచయిత."

"నిరంతరం సంఘర్షణకు గురి కావచ్చు,  అనేక మందికి  శత్రువుగా  మిగిలిపోవచ్చు,  బావా వేషం కారణంగా అభద్రతకు అనారోగ్యానికి గురి కావచ్చు కూడా. కానీ  దాని వెనుక ఒక లక్ష్యం, ఒక మహోన్నతమైన ప్రయోజనం, పరోపకారం,  ప్రజల మేలు కోరే ఆకాంక్ష ఉన్నదనే  విషయాన్ని మాత్రం రచయిత ఎప్పుడూ మర్చిపోవద్దు. నిద్రలో కలవరింతలో  అర్ధరాత్రి  ఆలోచన రాగానే మేల్కొని  ఆ అంశాన్ని అందిపుచ్చుకొని నిక్షిప్తం చేసి  నిజజీవితంలో ప్రజలకు అందించగలిగినవాడే నిజమైనటువంటి సాహసోపీతమైన రచయిత. రచయితలకు ఆలోచన  బావ ప్రకటన మాత్రమే సరిపోదు  తెగువ   పోరాట స్ఫూర్తి కూడా  అనివార్యం. కాలానుగుణంగా మారుతున్న క్రమంలో రచయితల యొక్క లక్ష్యాలు లక్షణాలు  రచన యొక్క సామాజిక ప్రయోజనాలు మారుతుంటాయని గుర్తించడం చాలా అవసరం..

ఆశించడంతో పాటు శాసించడానికి వెనుకాడకూడదు:-

 విద్యా   లక్ష్యాలు, ఉపాధ్యాయులతో  విద్యార్థుల ద్వారా సమాజానికి అందే    ప్రయోజనం, పంచవర్ష ప్రణాళికల లక్ష్యం,  సాహిత్యం యొక్క మహా ప్రయోజనం,  సుపరిపాలన యొక్క అంతిమ గమ్యం  అన్నీ కూడా సమసమాజ స్థాపన.  కనుక ఆ సుదీర్ఘమైనటువంటి లక్ష్యాన్ని సాధించే క్రమంలో  ప్రజల పక్షాన ఆశించడంతోపాటు  ప్రజలకు ద్రోహం  తలపెట్టే  అన్ని వర్గాలను రచయితలు శాసించగలగాలి.  రచయితలు ఎప్పుడూ ప్రజల పక్షమే అనే సామాజిక  సహజ న్యాయాన్ని  పాలకులచే ఒప్పించగలగాలి కూడా. రచయితలు చేసేది నిజంగా ఆయుధాలు లేని యుద్ధమే. యుద్ధం అనివార్యమైనా  దాని వెనుక  శాంతిని ఆశించినట్లు, పండుటాకు రాలిపోతుంటే దాని వెనుక చిగురాకు వచ్చిన ట్లు  రచయితలు  లక్ష్యసాధనలో   అనునిత్యం సమాజ పునరుద్ధరణకు  అంతరాలు అసమానతలు లేని  వ్యవస్థ కోసం  పనిచేయవలసి ఉంటుంది. "నోరుండి  నిర్బంధించబడిన   హక్కుల కార్యకర్తలు  చిత్రవధలకు గురవుతుంటే, ప్రజాస్వామ్యం  అపహాస్యమైనచోట  ఆ వర్గాల ప్రతినిధిగా,  చట్టసభల్లోని నేరస్తులు దోపిడీగాళ్లు  పాలనచలాయిస్తుంటే  వాళ్ల  నేరాన్ని బట్ట బయలు చేయడానికి,  కిక్కిరిసిన జైల్లలో విచారణ ఖైదీలుగా నేరం చేయకుండానే శిక్షలు అనుభవిస్తున్నటువంటి  అమాయకుల  గొంతు గా భిన్న రూపాలలో రచయితలు  పని చేయాల్సి ఉంటుంది. సంస్కరణ కోసం ఆశించిన జైల్లో  కులం పేరుతో కొనసాగుతున్న వివక్షత పైన కూడా ఉక్కు పాదం మోపాల్సిన బాధ్యత కూడా రచయితలదే.  రైతులు, కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు,  వలస జీవులు, రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు....  వీరందరిని  పాలకవర్గాలు ప్రలోభాలు వాగ్దానాలతో  మోసం చేస్తుంటే వాళ్ళ నిజరూపాన్ని  చట్టసభల ముందు పెట్టి ప్రశ్నించేది కూడా ప్రజా రచయితలే.  అందుకే వాళ్లు ఆశించే వాళ్ళు మాత్రమే కాదు శాసించే వాళ్ళుగా ఎదగాలి. శాసనకర్తలుగా నిలబడాలి  పాలకుల కుళ్ళను  ప్రజల పక్షాన ప్రక్షాలన చేయాలి.

(ఈవ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333